నాలోని నవరసాలు - హాస్యం
మా 'చింటు గాడు ' ఎవరో మీకు తెలియదు కదూ! మా పనమ్మాయి సుజాత కొడుకు వీడు. అందరు వాడ్ని నా దత్తపుత్రుడంటూ ఉంటారు. అడుగడుగునా ఎప్పుడూ నా వెంటే ఉంటాడు వాడు. వాడి అమ్మా, నాన్నా, అక్కా, వీడు మాదగ్గిరే ఉంటారు. వాళ్ళ నాన్న మా డ్రైవర్. వీడికి ఆరేళ్ళు వొచ్హినా పేరు పెట్టలేదు. మొగపిల్లాడికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలన్నీ ఇచ్హుకుంటు 'చింటూ ' అని పిలిచుకుంటూ, మురిపెంగా పెంచుకుంటున్నారు. మా ఇంటి దగ్గిర పార్క్ లో ఇరవైనాలుఘంటలు ఎగరటమే వాడి పని. వాడి అక్క ని స్కూళ్ళో చేర్పించాను. చాలా శ్రద్ధగా చదువు కుంటుంది. వీడే పక్కా 'హకల్ బెరీఫిన్ ' అయిపోయాడు. వీడినెలగైనా మార్చాలి అనుకున్నాను. వాళ్ళ అమ్మ, నాన్నని ఒక రోజు పిలిచి ఈ రోజుల్లో చదువుకోని పిల్లలెవరూ లేరు, వాడికొక పేరు పెట్టి వాడ్ని స్కూళ్ళో వేయండి అన్నాను. వాడి నాన్న మంచిదమ్మా అని 'భాస్కర్ ' అనే పేరు పెట్టాడు. మా ఇంటి దగ్గిరే ఒక స్కూల్లో వాడిని చేర్పించాను. ఆ అక్కా, తమ్ముళ్ళిద్దరికీ రోజూ సాయంత్రం నా దగ్గిర ట్యూషన్.
ఇక్కడినుంచే మొదలైనై వాడికీ, నాకు కష్టాలు. వాడికి ఫస్ట్ క్లాస్ లో అడ్మిషన్ ఇచ్హారు. కాబట్టి చాలా కష్టపడి చదవాలి. ఏదోవిధంగా వాడికి నచ్హచెప్పి మెల్లిగా నా దారిలోకి తెచ్హుకున్నాను. నేను చెప్పినవన్నీ శ్రద్ధగా చదవటం మొదలు పెట్టాడు. ఆ అక్కా, తమ్ముళ్ళకి కొంత వర్క్ ఇచ్హి నేను సుడోకు చేసుకుంటూ ఉంటాను. నాకు సుడోకు చాలా ఇష్టం. దాని కొసం బుక్స్ కూడా కొనుక్కోని కంప్లీట్ చేసుకుంటు ఉంటాను. న్యూస్ పేపెర్స్ లో ఒక్క సుడోకు కూడా వొదిలిపెట్టను. అంతెందుకు సుడోకు దొరికిందంటే లోకమే మర్చిపోతాను. ఒక రోజు ఇలాగే సుడోకు చేసుకుంటు లీనమై పోయాను. కొంచెంసేపటికి వెలుతురు రాకుండా నా పేపర్ మీద నీడలు పడటం మొదలైంది. నా ఏకాగ్రత భంగమై, ఏంజరిగిందా! అని తలెత్తి చూసాను. మా చింటు గాడు శ్రద్ధగా నా పక్కన నిలబడి, నా సుడోకు లోకే ఏక దీక్షగా చూస్తున్నాడు.
ఏమయిందిరా, నీ హోం వర్క్ అయిపోయిందా అని అడిగాను. వాడు నేనడిగింది అస్సలినిపించుకోకుండా 'అమ్మా, నీకు లెక్కలు రావా! ' అన్నాడు. ఇదేంటి, సడన్ గా వీడిట్లా అంటున్నాడని, ఎందుకురా అలా అడుగుతున్నావ్, అన్నాను.
'అవునమ్మా, నీకు లెక్కలస్సల్ రావ్, చూడు అన్నీ తప్పులు రాస్తున్నావ్, ఎనిమిది పక్కన రెండు ఏసినవ్, మళ్ళ పక్కన అయిదేసినవ్. నీకు ఒకటి, రెండ్ళు రావా! అన్నాడు. నాకు ఒక్క సారే షాక్ కొట్టినట్లైంది. ఇది ఒక ఆటరా దీనిలో అట్లానే ఒస్తాయి. వరుసగా రావు అన్నాను. ఎంత నచ్హ చెప్పినా వాడు వినలేదు. అప్పటినుంచి వాడి ద్రుష్టిలో నేను లెక్కలు రాని మొద్దుని. పొరపాటున కూడా వాడు నాతో లెక్కలు చెప్పించుకోటానికి ఇష్టపడడు.
ఒకసారి కిచన్ లో మా అబ్బాయికి ఇష్టమైన టిఫిన్ చేస్తున్నాను. డ్రాయింగ్ రూం నుంచి పెద్ద ఏడుపు వినిపించి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. వాళ్ళ పిన్ని కూతురు నాలుగేళ్ళ పిల్ల, అదికూడా ఆ రోజు మా ఇంట్లో ఉంది. ఆ పిల్ల వాడి జుట్టు పీకిందట, నొప్పి పుడుతోందని, మళ్ళీ ఏడుపు మొదలు పెట్టాడు. అది చిన్న పిల్ల రా దానికి తెలియదు జుట్టు పీకితే నొప్పిపుడుతుందని, ఏడవకు అన్నాను నేను. ఇందాక నేను జుట్టు పీకితే ఏడిచింది, దానికి తెలుసు నొప్పిపుడుతుందని, అని మళ్ళీ ఏడుపు.
ఇట్లా లాభం లేదు, వీడికి లోక జ్ఞానం కలిగించాలి అని అప్పటినుంచి తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించాను. రకరకాల కథలు చెప్పేదాన్ని. ఒక సారి నెపోలియన్ గురించి కూడా చెప్పాను. నెపోలియన్ తన జీవితంలో ఎక్కువ కాలం యుద్ధభూమిలో గడిపాడని, నీరసమనిపించినప్పుడల్లా శక్తిని పుంజుకోటానికి చాక్లెట్లు తినేవాడని చెప్పాను. ఆ తరువాత తెలిసింది నేనెంత తప్పుచేసానో. అప్పటినుంచి వాడు రెండు పేజీలు చదివి, అమ్మా! నాకు నీరసంగా ఉంది, శక్తి కావాలి, చాక్లెట్స్ ఇస్తావా అని అడగటం మొదలు పెట్టాడు. పెరిగిన వాడి ఈ జ్ఞాన సంపదకి ఏడ్వాలో, నవ్వాలో అర్ధం గాని అజ్ఞానానికి నేను లోనయ్యాను.
నువ్వు రోజు పాలు తాగు, మంచిగా బలమొస్తుంది, చదివినవన్నీ తొందరగా అర్ధం చేసుకుంటావ్ అని చెప్పాను వాడికి. ఒక గ్లాస్ లో కొన్ని పాలు పోసి ఇచ్హి తాగమన్నాను. అట్లా తాగితే వాడు చింటు గాడెందుకవుతాడు. పాలు తెల్ల గున్నయమ్మా, ఇవి ఎక్కడినుంచొస్తై అని అడిగాడు. పాలు మనకి బర్రెల్లోనుంచి వొస్తాయి అని చెప్పాను. వెంటనే గ్లాస్ కింద పెట్టేసాడు. నువ్వు అబద్దం చెప్పుతున్నావ్. అంత నల్ల బర్రెలోనుంచి ఈ తెల్ల పాలెట్ల వొస్తై అన్నాడు. నేను నా శక్తి కొలది "బర్రెలు-పాలు"- గురించి వివరంగా చెప్పాను. వాడికి అర్ధమైనట్లే ఉంది. ఇంక తాగుతాడులే అనుకున్నాను. ఊహు, ససేమిరా తాగలేదు. ఎందుకంటే, ఆ పాలు తాగితే వాడు కూడా బర్రె లాగానే నల్లగా అయిపోతాడుట. ఇంకేం చెప్పను వాడికి! పోరా! ఇప్పుడు మహా అందంగా వెలిగి పోతున్నావ్! అని తిట్టుకున్నాను ఒళ్ళుమండిపోయి.
పట్టువదలని విక్రమార్కిణి లాగా నా ప్రయత్నాలు ఇంకా తీవ్రం చేసాను. వాడికి ఇంగ్లీష్ బాగా నేర్పిస్తే వాడంతట వాడు చాలా విషయాలు నేర్చుకుంటాడులే అని ఇంగ్లీష్ గ్రామర్ నేర్పించటం మొదలు పెట్టాను. సింగిల్ పదాలకు ప్లూరల్ పదాలు నేర్పించి, ఎంతవరకు నేర్చుకున్నాడా అని పరీక్షించటం ప్రారంభించాను. రెండింతలుంటే ఏమంటారు అని అడిగాను. వాడు వెంటనే డబుల్ అన్నాడు. నేను చాలా పొంగి పోయాను. వీడికి నేను నేర్పించ గలిగాను కదా అని ఒక నిమిషం ఆనంద పడిపోయి నా వీపు నేనే చరుచుకున్నాను. వెంటనే నా ఉత్సాహం పెరిగిపోయి మూడింతలుంటే ఏమంటారురా అనడిగాను. వాడు అంత కంటే మరింత ఉత్సాహంతో ట్రబుల్ అన్నాడు. ఒక్కసారే గుడ్లు తేలేసాను. అసలు వీడికి ఈ పదం ఎట్లా తెలుసా అని అనుమానం వొచ్హింది. మెల్లగా కనుక్కుంటే వాడే చెప్పాడు. వాళ్ళ నాన్న 'వాడితోటి ఎప్పుడూ ట్రబుల్ ' అంటూ ఉంటాడట, అదే వాడికి గుర్తుకొచ్హినట్లుంది.
ఇట్లా కాదులే గాని, వీడిని బయటికి తీసుకు పోయి లోక జ్ఞానం కలిగిద్దామన్న బ్రమ్హాండమైన అలోచన ఒచ్హింది నాకు. ఈ అక్కా తమ్ముళ్ళిద్దరినీ తీసుకొని పబ్లిక్ గార్డెన్స్, సాలార్జంగ్ మ్యూజియం చూపిద్దామని ఒక హాలిడే రోజు బయలు దేరాను. ముందుగా సాలార్జంగ్ మ్యూజియం వెళ్ళాం. మూడంతస్థుల బ్యిల్డింగ్ బాగా హుషారుగా తిరిగి చూసారు. హాయిగా అవీ ఇవీ కొనుక్కొని తిన్నారు. ఇంక గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గంటలు కొట్టే గడియారం పన్నెండుగంటలప్పుడు చూపిస్తే చాలా సేపు చూస్తారు అని ఆ టైం కల్లా అక్కడికి చేరుకున్నాము. వాడికి ఆ గడియారం గురించి తెలియదుకదా వాడికి తెలియ చేద్దామని, ఇప్పుడు అందులోనుంచి ఒకాయన ఒచ్హి పన్నెండు కొడతాడు అన్నాను. అంతే వాడు ఒక్క సారిగా చేయి వొదిలించుకొని, బయటికి పారిపోతున్నాడు. నాకేం అర్ధం కాలేదు. అందరు మమ్మల్నే చూడటం మొదలైంది. ఎంతో కష్టం మీద వాడిని దొరికించుకొని, ఏమైందిరా! అన్నాను. వాడికి నన్నుకొట్టద్దని చెప్పు, నువ్వు చెప్పినవన్నీ చదువుకుంటా అని పెద్దగా ఏడుపు లంకించుకున్నాడు. వాడు గడియారం లో గంటలు కొడుతాడు, నిన్ను కాదురా అని వాడికి నచ్హ చెప్పేటప్పటికి మా తాతలు దిగొచ్హారు.
వాళ్ళకి కాసేపు అక్కడే ఉన్న మూసీ నది, ఆపైన ప్రసిద్ది చెందిన పురానా పూల్ చూపించి మెల్లగా పబ్లిక్ గార్డెన్స్ చేరుకున్నాం. కాసేపు అక్కడా, ఇక్కడా తిరిగి మ్యూజియం దగ్గరికొచ్హాం. అక్కడ ప్రసిద్ధి చెందిన 'మమ్మీ ' ని చూపించాలని నా ప్రయత్నం. కాని మొదట్లోనే గండి కొట్టింది. లోపలికి పోగానే అన్నిటికన్నా ముందే 'మమ్మీ ' (ఈమధ్యనే, పాడైపోతోందని, దాని స్థానం లోపలి ఏ.సి. రూం లోకి మార్చారు) ఉంటుంది. ఇది మమ్మీ అని దాని గురించి చెప్పటం మొదలు పెట్టాను. కాని వాడు నేను చెప్పేదేమి వినిపించుకోకుండా పెద్దగా ఏడుపు మొదలు పెట్టాడు. వాడికేదొ అయిందని నేను ఠారెత్తి పోయాను. తొందరగా మా డ్రైవర్ ని (వాళ్ళ నాన్న) పిలుద్దామని కదిలాను. కాని, వాడు నన్ను కదలనియ్యకుండా, మా మమ్మీని ఎందుకట్లా కట్టేసారు, చంపేసారా! మా మమ్మీ కావాలి, ఇని గోలగోలగా ఏడుపు పెంచేసాడు. ఇంతవరకు నిశ్శబ్దంగా అన్ని చూసిన వాడి అక్క కూడా ఏడుపు లంకించుకుంది. లోకజ్ఞానం సంగతి తరువాత చూద్దాం లెమ్మని వాళ్ళను తీసుకొని ఇంటికొచ్హిపడ్డాను. వాళ్ళ మమ్మీని చూసేవరకు వాడి ఏడుపు ఆగితే ఒట్టు.
ఎంతోమంది పిల్లలకి ప్రతి రోజు పాఠాలు చెప్పే నేను వీడి ముందు మాత్రం అట్టర్ ఫ్లాప్. వీడి "జ్ఞానాన్ని" మార్చే పద్ధతులు ఇంక నాకేమి తట్టటం లేదు. మీరే ఎవరన్నా నాకు మార్గం చూపించి ఇంత పుణ్యం మూట కట్టుకోవాలి. అప్పుడే వాడు మంచిగా చదువుకొని, పెరిగి పెద్దై నాలుగు రాళ్ళు వెనకేసుకో గలుగుతాడు.
*************************************************************************************
3, అక్టోబర్ 2009, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
12 కామెంట్లు:
'అష్టకష్టాలు' ని 'నవకష్టాలు' గా మార్చి తొమ్మిదోదానికి 'చింటుకష్టాలు' అని పేరు పెట్టాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది !!! చాలా బాగుందండి టపా... అన్నట్టు ఫాంట్ సైజు కొంచం పెంచరూ...
జయ గారూ,
తెగ నవ్వించేశాడండీ మీ చింటూ.. ట్రబుల్, గడియారం, మమ్మీ :) :)
ఇంతకుముందు తరాల్లో పిల్లలు పెద్దోళ్ళు ఏది చెపితే అది నమ్మేసి ఊరుకునేవారు. ఇప్పుడు పిల్లలకి బుర్రపదును ఎక్కువే. వాళ్ళడిగే యక్ష ప్రశ్నలకి సమాధానం కోసం మనం వెతుక్కోవలసిందే...అసలు మనకేమాత్రమూ ఊహకందని కోణాల్లో ఆలోచిస్తుంటారు వాళ్ళ అమాయకత్వం మూలానా..ఒకోసారి ఎంత క్రియేటివిటీ అనిపిస్తుంటుంది నాకు :)
మురళీ గారన్నట్టు ఫాంట్ సైజు కొంచెం పెంచితే బాగుంటుందండీ.
@మురళీ గారూ,
ఒక చిన్న చిట్కా: మనకి ఏ వెబ్ పేజి అయినా ఫాంట్ పెద్దగా కావాలనిపిస్తే ctrl +(plus) కీస్ వాడండి. ఫాంట్ సైజు పెరుగుతూ వెళ్తుంది. అలాగే ctrl -(మైనస్) తో ఫాంట్ సైజు తగ్గిస్తూ వెళ్ళచ్చు.
మురళీ గారు, థాంక్యూ వెరీ మచ్. ఏనాటికైనా మంచి టెంప్లేట్ పెట్టుకోవలాన్న నా కోరిక చివరికి ఈ 'అందమైన తెల్లని రోజా పువ్వు ' తీర్చింది. ఇంక ఫాంట్ గురించి లేఔట్ లో చాలా ట్రై చేసాను. ఎలాగైనా మారుస్తానులెండి.
మధురవాణి గారు ముందుగా మీకు స్వాగతం తరువాత ధన్యవాదాలు. మా చింటు గాడి తో అన్ని కష్టాలకన్నా, నాకు లెఖ్ఖలు రావని నన్ను తిరస్కరించటమే నాకు పెద్ద అవమానంగా ఉంది. ఇంత బతుకు బతికీ ....... అన్నట్లుగా అయిపోయింది నా పని. ఫాంట్ సైజ్ మారుస్తానండి.
జయ గారు, చాలా బాగుంది మీ మానస పుత్రిక మనస్వి. మనసుకు ఎంత ఆహ్లాదమనిపించిందో తెల్ల గులాబి చూడగానే... ముందు గా శుభాకాంక్షలు.
మీ చింటూ బాధలు పాపం, మమ్ములను మాత్రం బాగా నవ్వించాయి, మొత్తానికి లెక్కలు రాని టీచరమ్మ ఐపోయారన్నమాట. ;-)
భావన గారు ధన్య వాదాలు. మీరందరు నా కష్టాలకి ఏదన్నా మార్గం చెప్పక పోతారా అని నా అశ. నా స్వచ్హమైన తెల్లగులాబి మీ కోసం ఎప్పుడూ ఎదురుచూస్తూనే ఉంటుంది.
చింటూగాడు దొరికాడు కదా అని వాడిని రుబ్బేస్తున్నావన్నమాట ! పాపం చింటూగాడు !
బాగున్నాయి మీ చింటూ గాడితో మీ కష్టాలు, వాటిని మీరు చెప్పిన తీరు ఇంకా బాగుంది. ఈ రోజులలో పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నామండీ బాబు. మీ కొత్త టెంప్లేటు కూడా బాగుంది. ఇక ప్రశాంతంగా టపాలు వ్రాసేయండి. అన్నట్టు మీరు మాలా గారి చెల్లెలా?
సేమ్ టు సేమ్
మాటలు వచ్చినప్పటినుండి నా కష్టాలు షురు.
మా అమ్మాయి కి మాటలు వచ్చినప్పటినుండి మొదలయినయి. అదృష్టమేమంటే ఈ డ్యూటీ ఆయనిది.
ఒక సారి మూడో సం.రం.లోఅనుకుంటాను..నాన్నగారు లైటెందుకు వెలుగుతుంది.అని. ఇక ఆయన నేను కలిసి వివరించేసరికి...విచిత్రమేమంటే మా అమ్మాయి if we answer one..she asks hundred..
The only remedy we found that we started asking her questions..i.e. we selected such a questions that we have answers with us. Try.
చాలా బాగా రాస్తున్నారు. మా ఇంట్లో
ఈ దసరా ఢమాకా తెలియాలంటే నా టపా 'ఈ శెలవులు మాకొద్దు' చదవాల్సిందే..
చాలా బాగా రాస్తున్నారు..keep it up
@సరిగమలు గారు, చాలా థాంక్స్. "రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి" సప్తపదిలోని ఈ పాట నాకు చాలా ఇష్టం. ఇలాగే మంచి మంచి సరిగమల మీ బ్లాగ్ చాలా బాగుంటుంది. మంచి సమాచారం ఇస్తూ ఉంటారు. మీ ప్రశ్న కి సమాధానం కింద ఉంది.
@ అక్కా, ఏదో వాడిని "అభివ్రుద్ధి" చేయాలని నా వీర ప్రయత్నం. నువ్వుకూడా చూశావ్ కదా, వాడెలా బిహేవ్ చేస్తాడో. మా ఫ్రెండ్స్ ఎవరన్నా వొస్తే వాడే ముందు రోడ్ మీదకి వెళ్ళి పోయి నేను ఉన్నది, లేనిది సమాచారం ఇచ్హేస్తు ఉంటాడు. నేను లేక పోతే అనవసరంగా లోపలికి ఒచ్హే కష్టం వాళ్ళకి ఇవ్వడు.
@ శ్రీనిక గారు, మీ ఈ శెలవులు మాకొద్దు చదివాను. చాలా బాగుంది. అన్నట్లు శెలవలు పొడిగించి నట్లున్నారు. మీ కష్టాలు తొందరగా తీరుగాకా.
@ నేస్తం గారు, మీకు నా హ్రుదయ పూర్వక స్వాగతం. నేను చేసిందేమి లేదు, మా చింటుగాడే అట్లాంటి వాడు. ధన్యవాదాలు. జాజిపూలు గురించి మా అక్క చెప్పుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఒస్తుంటాయి కాని చాలా మంచి పోస్టులు అని. నేను కూడా చదవటం మొదలు పెట్టాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి