10, అక్టోబర్ 2009, శనివారం

'బిళ్ళల పులుసు '

నేను వంటల గురించి ఏమీ చెప్పక పోవటం బాగాలేదు. నేను కూడా ఏదైనా ఒక వొంటకం చెప్పాలి. ఎలా? ఏదైనా ఒక మంచి పాతకాలపు వొంట రాయాలి. బాగుంటుంది. మరి నాకేమి రావే! మా అత్తగారి దగ్గర కాపీ కొట్టేస్తే సరి. తెలంగాణా వొంటలు బాగా చేస్తారు. ముఖ్యంగా ఆవిడ చేసే రెండు వొంటకాలు నాకు బాగా నచ్హుతాయి. ఒకటి 'బిళ్ళల పులుసు ', రెండోది 'పొట్లాల కూర '.

బిళ్ళల పులుసు గురించి రాయాలనిపిస్తోంది. సరిగ్గా గుర్తులేదు. ఇప్పుడేమొ మా అత్తగారికి ఓపిక లేక ఏమీ చేయటం లేదు. ఇవాళ సెకండ్ సాటర్ డే కాబట్టి మెల్లగా టిఫిన్లయ్యాక మొదలు పెడితే సరి అనుకున్నాను. ఇడ్లీ, చట్నీ చేసేసాను.

మెల్లగా మా అత్తగారి దగ్గరికి పోయి ఇవాళ బిళ్ళల పులుసు చేద్దామా! అని అడిగాను. సరే, చేసేయ్ ... అన్నారు. నా గుండెలో రాళ్ళు పడ్డాయి. నా కెక్కడ గుర్తుండేడిసింది.

నేను కొంచెం బతిమలాడుకుంటే మా అత్తగారు, ఏం అడిగిన వెంటనే చేసేస్తారు. దానికో కారణం ఉంది. మా అత్తగారి ముగ్గురు కొడుకుల్లో మా వారు చివరబ్బాయి. మా బావగార్లిద్దరు మా అత్తగారు ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళమన్న ఇప్పుడు టైం లేదు తరువాత చూద్దంలే అంటూ ఉంటారు. మా తోడి కోడళ్ళు ఇద్దరూ మారుమూల పళ్ళెటూళ్ళనుంచి వొచ్హారు. ఎప్పుడు బయటికి పోవాలన్నా వాళ్ళ, వాళ్ళ ఆయనలతో మాత్రమే వెల్తారు. ఇంక మా అత్తగార్ని ఏం తీసుకెల్తారు. అందరం వేరు వేరు ఇళ్ళల్లోనె ఉంటున్నాం లెండి. ఇంక మా వారు సరే సరి, ఎప్పుడు కంటికే కనిపించరు. ఎటొచ్హి మిగిలింది నేనే. ఆవిడ ఎక్కడికి పోతానన్న, ఎప్పుడూ కాదనకుండా ఇద్దరం హాయిగా చెట్టా పట్టాల్ వెసుకొని వెళ్ళిపోతాం. మా అత్తగారు కూడా 'భానుమతి అత్తగారంత ' హుషార్. అందుకే, అందరి మీదా ఆమెకి ప్రేమ సమానమే, కాని, నా మీద మాత్రం కొంచెం ఎక్కువ సమానం ప్రేమ అన్నమాట.

ఇద్దరం కలిసి చేద్దాం రండి అని కిచెన్ లోకి తీసుకెళ్ళాను.మాట్లాడకుండా నా వెనకాలే వొచ్హేసారు. మీరు చెప్పండి, నేను చేసేస్తూ ఉంటాను అన్నాను. ఇంతకి చింతపండు నానబెట్టావా లేదా! అన్నారు. వెంటనే నాలిక్కరచుకొని, లేదు..లేదు.. అని వెంటనే ఒక గుప్పెడు చింతపండు నానబెట్టేసాను. బేసన్ పౌడర్ (శనగ పిండి) కావాలి కదా అన్నారు. ఇక్కడ మా అత్తగారి గురించి కొంచెం చెప్పాలి. మా అత్త గారికి ఇంగ్లీష్ మీద ప్రేమ ఎక్కువ. వాళ్ళ నాన్నగారు లాయర్. ఆ రోజుల్లోనే తనని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించారని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఏదో విధంగా, ఎక్కడో అక్కడ ఇంగ్లీష్ పదాలు ప్రయోగిస్తూ ఉంటారు. వాళ్ళ నాన్నగారు మంచి ఫ్రాక్స్ తెప్పించేవారని, వాటి తో ఉన్న ఫొటోలు కూడా చూపిస్తూ ఉంటారు. తాను చాలా మోడ్రన్ అని మా అత్తగారి అభిప్రాయం. వాళ్ళ అత్తగారు చాలా కాలం వరకు తనని కిచన్ లోకే రానివ్వలేదట. వాళ్ళకి చాలా మడీ, ఆచారమని చెప్తూ ఉంటారు. తనకి ఎనిమిదవ ఏటే పెళ్ళి చేసారని, లేక పోతే ఇంకా చాలా చదివి ఎంతో గొప్పదాన్ని అయిఉండే దాన్నని అంటూ ఉంటారు.

సరె..సరే.. మన వంట లోకొచ్హేద్దాం. స్టౌ మీద వెజల్ (బాండీ) పెట్టూ అన్నారు. పెట్టాను. ఘీ (నెయ్యి) వెయ్యీ అన్నారు. ఈ రోజుల్లో అన్ని వంటల్లో ను నెయ్యి ఎక్కడ వాడుతున్నాం. సరేలే అని కొంచెం నెయ్యి వేసి, ఇప్పుడు పోపు చేయాలి కదా అన్నాను. కాదు శనగపిండి లో కొంచెం ఉప్పూ, ఖారం వేసి లిక్విడ్ చేయి అన్నారు. ఖారం కొంచెం తక్కువ వేయ్, అసలే మీ వారికి (వాళ్ళ అబ్బయికన్నమాట) ముక్కుమీద కోపం ఎక్కువ అన్నారు. మహా మీ వారికి ( మా మామ గారికి) కోపం తక్కువైనట్లు, అనుకొని, ఖారం కొంచెం తక్కువే వేసాను. మొత్తం కలిపేసి కొంచెం నీళ్ళ లాగా చేసాను . ఇప్పుడు దీన్ని బాండిలో వేయాలి అని నాకు తెలుసు. ఆ పని చేసి, కొంచెం గట్టిగా ముద్దలాగా అయ్యేవరకు కలుపుతూ ఉన్నాను. ఇంతలో మా అత్తగారు నా చేయి పట్టి ఆపేసారు. ఇంక చాల్లే మరీ గట్టిపడిపోతుంది అన్నారు. ఇప్పుడొక ప్లేట్ తీసుకొని, దాని కి మంచిగా నెయ్యి పట్టించి ఇది అందులో వేసెయ్యి అన్నారు. ప్లేట్ లో వేయగానే, మా అత్తగారు, నా చేతిలోనుంచి అట్లకాడ తీసుకొని, మొత్తం సమంగా పరిచారు. ప్లేట్ లో మొత్తం ఈక్వల్ గా ఇలా చేయాలి. ఇప్పుడు మైసూర్ పాక్ ముక్కల్లాగా కట్ చేయి అన్నారు. అన్నీ ఈవన్ గా, చిన్న చిన్న ముక్కలు డైమండ్ షేప్ లో కట్ చేయ్ అన్నారు. అలాగే చేసాను. ఇంక ఆ ప్లేట్ పక్కన పెట్టేయ్ అన్నారు.

ఈ లోపల మా అబ్బాయ్ వాడి టిఫిన్ ప్లేట్ తీసుకొచ్హి నా కళ్ళముందు ఆడిస్తూ అమ్మా! నాక్కొంచెం సుగర్ వెయ్ అన్నాడు. మా మామగారి ఒంట్లో పెద్ద సుగర్ ఫాక్టరీ యే ఉంది. అందుకని మాకు సుగర్ ఎక్కువ కొనే అవసరం లేదు. వాడి ప్లేట్లో ఉన్నది ఇడ్లీ. ఇందులో సుగర్ ఏంటిరా! అన్నాను. ఇంతలో సడన్ గా నాకు మురళిగారు గుర్తొచ్హారు. తను చిన్నప్పుడు ఒక ఇడ్లీ కి ఇంకో ఇడ్లీ అంత సుగర్ వేసుకొనే వారని రాసుకున్నారు. నాకు అదే గుర్తుకొచ్హింది. కాక పోతే నేను ఉప్మా మీద సుగర్ వేసుకొని తింటాను. ఇలా చాలా మందే తింటారను కుంటా. నేను ఆలోచన్లో పడిపోవటంతో మా వాడు, బామ్మా! నాకు సుగర్ వేయి అని వేయించుకొని మరీ వెళ్ళాడు.

ఇంతలో నేనూ, మా అత్తగారూ, కలిసి బిళ్ళల పులుసు చేస్తున్నామని గుర్తుకొచ్హింది. వెంటనే, ఆ చెప్పండి, చెప్పండి.. . తర్వాత ఏం చేయాలి అన్నాను. మిక్సీ లో మసాలా పౌడర్ చేసుకోవాలిగా అన్నారు. మిక్సీ బౌల్ ఏది అని అడిగారు. వెంటనే అందించాను. ఇందులో కొంచెం సాజీరా, జింజర్, ధనియా(ధనియాలు), కోకొనట్ పౌడర్, రెడ్ చిల్లీస్, లవంగాలు (ఆవిడకి దీనికి ఇంగ్లీష్ పదం తెలియదు) వేయాలి అన్నారు. కొంచెం దాల్చిన్ చెక్క,(దీనికి కూడా ఆవిడకి ఇంగ్లీష్ పదం తెలియదు) ఇది కాస్త ఎక్కువే వేయాలి. ఇవన్నీ కూడా అలాగే వేసేయ్ అన్నారు. అప్పుడే బాగుంటుంది అన్నారు. సరే... అన్నీ వేసేసాం. ఇంక గ్రైండ్ చేయి అన్నారు. మెత్తగా పేస్ట్ చేస్తూ కొంచెం వాటర్ ఎక్కువ పోయి అన్నారు. మెత్తగా జారుగా చేసేసాను. ఇంక ఇప్పుడేం చేయాలి! అన్నాను.

ఇంకో వెజల్ (ఈ సారి గిన్న అన్నమాట) తీసుకొచ్హి స్టౌ మీద పెట్టు అన్నారు. అలాగే పెట్టాను. టెఫ్లాన్ వెజల్ ఉందిగా, అది పెట్టు ... బాగుంటుంది... అన్నారు. సరే! అని గిన్న మార్చేసాను. ఇప్పుడు ఆయిల్ కొంచెం బాయిల్ చేసి పోపు వేయి అన్నారు. పోపు కొంచెం స్ట్రాంగ్ గా, ఇంగువ వేసి ఘుమ ఘుమ లాడేట్లు చేయి అన్నారు. తరువాత, తనే చింతపండు చిక్కగా రసం చేసి ఆ పోపు లో పోసారు. నేను ఇంకొంచెం నీళ్ళు పోసాను అందులో. ఆ పేస్ట్ అంతా ఇందులో వేసి బాగా మరగనియ్యి అన్నారు. ఆ కట్ చేసిన బిళ్ళలు కూడా ఇందులో వేసెయ్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ వెజల్ లో కొంచెం ఆయిల్ వేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ గోలించి పెట్టు అన్నారు.

ఇక్కడో సంగతి చెప్పాలి. మా పెళ్ళైన కొత్తలో మా వారు కొన్ని వేఫర్స్ తీసుకొని మా అక్కా వాళ్ళ ఇంటికి వెళ్ళి, " వదినగారు, కొంచెం ఇవి గోలించి పెట్టరా!" అన్నారుట. మా అక్క కి ఏం అర్ధం కాలేదు. ఈ గోలించటాలు, గోలీలాడటాలు ఏవిటబ్బా! అనుకుందట. మా అక్క అదే విషయం తిరిగి అడిగింది. ఏం చేయాలండీ, అని. దానికాయన ఏమి సమధానం చెప్పలేదు. దానికి పర్యాయ పదం ఆయనకీ తెలీదు మరి. వెంటనే కిచన్ లోకి వెళ్ళి, స్టౌ మీద బాండీ పెట్టి, ఆయిల్ వేసి తరువాత వాటిని "వేయించార" ట . అప్పుడర్ధమయింది మా అక్కకి గోలించటమంటే, వేయించటమని. కొన్ని ఆయన తిని, కొన్ని మా అక్క కిచ్హి వెళ్ళిపోయారట.

ఇప్పుడు నాకు గోలించటమంటే ఏవిటో బాగా తెలుసు కాబట్టి, అలాగే బాండీ లో కొంచెం నూనె పోసి, జీడి పప్పులు మాత్రమే కొంచెం వేయించి, తరువాత బాదం వంటి కొన్ని ఇతర డ్రై ఫ్రూట్స్ సన్నగా ముక్కలు చేసి ఉంచాను. ఇంక చాల్లే, ఎక్కువ బాయిల్ అయితే మాడు వాసన వొస్తుంది, తీసేయ్ అన్నారు. గోలించిన డ్రై ఫ్రూట్స్ అందులో కలిపేసి, కొంచెంగా కొత్తిమీర సన్నగా కట్ చేసి దానిమీద చల్లి ఒక హాట్పాక్ లోకి తీసి పెట్టేసాను. కొంచెం మా అమ్మాయికి పంపించు, మా అల్లుడికి చాలా ఇష్టం అన్నారు. మా ఆడపడుచు మా ఇంటికి దగ్గిర లోనే ఉంటుంది. అలాగే పంపిస్తానన్నాను.

హమ్మయ్యా! మొత్తానికి 'నేను సైతం ' ఒక వొంటకం చెప్పేసాను. చాలా, చాలా బాగుంటుంది. చేసేసుకొని తినేయండి. బాగలేకపోతే మాత్రం నన్ననకండే! ఎందుకంటే ఇది, ఎంతైనా కాపీ కొట్టేసిన వొంటకం కదా!.... కాని, ముచ్హటగా పాతకాలం వంటకాలు ఇష్టపడే వాళ్ళకి మాత్రం తప్పకుండా ఇది నచ్హి తీరుతుంది. నలుడో, భీముడో ఎప్పుడో దీన్ని చేసే ఉంటారు. ప్రవాసాంధ్రులు కూడా దీన్ని ప్రత్యేక వంటకంగా అక్కడి ఫ్రెండ్స్ కి వడ్డించుకోవచ్హు. (కొత్తపాళీ గారు, ఉషా గారు, భావన గారు, మంచుపల్లకీ గారు, etc., లాంటి వాళ్ళు)

***************************************************************************

16 కామెంట్‌లు:

Padmarpita చెప్పారు...

మీరు చేస్తూ వంట గురించి వ్రాసిన విధానం బాగుంది అంటే తప్పక వంటకం కూడా బాగుంటుందన్నమాట!
ట్రై చేయాల్సిందే మరి:)

అజ్ఞాత చెప్పారు...

dhaniyalu = coriander seeds

lavaMgaalu = cloves

daalchinachekka = cinnamon

nice recipe..!!

మాలా కుమార్ చెప్పారు...

అబ్బో ఆ గోలించటమేమిటో ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్ధమై తేనా ? అడుగుదామంటే కాబోయే మరిదిగారు ! చివరికి ఆయనే లోపలికొచ్చి చూసి పరిస్తితి అర్ధం చేసుకొని , చెపుదామంటే ఎలా చెప్పాలో ఆయనకు తెలీక , చేసి చూపుదామంటే మూకుడును ఏమంటారో తెలీక పాపం ఎన్ని తిప్పలు పడ్డారో ! చివరికి ఎలాగో గోలించుడు చేసి చూపారు ! ఇంతా చేసి ఓస్ వేయించటానికి కొచ్చిన తిప్పలా ఇవి అనుకున్నాను !

మురళి చెప్పారు...

అంతా బాగుందండి.. చిన్న మిస్టేకేమిటంటే 'నెమలికన్ను' మురళి అనబడు నాకింకా సుగర్రాలేదు :):)

జయ చెప్పారు...

పద్మర్పిత గారు, ఒట్టు...ఇది నిజంగా బాగుంటుంది. తిని చూడండి.
తృష్ణ గారు, అక్కా థాంక్యు.
మురళిగారు, సారి అండి. It is cancelled. o.k.

కార్తీక్ చెప్పారు...

జయ అక్క ? అలా అందం తప్పైతే క్షమించండి ...
మీవంటని నేను కూడ ట్రై చేస్తానండి నాకూ వంటలు చెయ్యదమంటే భలే సరధా ....
అప్పుడప్పుడు అమ్మ దగ్గర నేర్చుకున్నాలెండి....

ఇంక మీరు చెప్పిన విదానముంది చూదండి నాకు భలే భలే నచ్చెసింది......

జయ చెప్పారు...

హాయిగా పిలవొచ్హు. ఎటువంటి అభ్యంతరం లేదు. నాకు ఈ బ్లాగ్ లోకంలో ఒక తమ్ముడు దొరికినందుకు సంతోషంగానే ఉంది. అవున్రా! తమ్ముడూ, ఇంతకీ వాణీ ఎవరు?

నేస్తం చెప్పారు...

ఏం రాసారండి..సూపర్..ఇప్పుడు నేనొక మాట చెప్పాలి మీరు మయూఖ బ్లాగ్ పేరు మార్చి మనస్వి కి మారిన దగ్గర నుండి బ్రహ్మాండమైన పోస్ట్లు..అనుకోని అనుబంధాలు (అదే మీ తమ్ముడు) :)..మీ బ్లాగ్ వాస్తు బాగుంది :)

psm.lakshmi చెప్పారు...

నా బ్లాగులో మీ కామెంటు ద్వారా మీ బ్లాగుకి వచ్చాను. చాలా బాగుంది. బిళ్ళల పులుసు చదువుతుంటే వంటంటేనే విసుగొచ్చే నాకే చెయ్యాలనిపించింది. దానికి కారణం మీరు చెప్పిన విధానం. అవునూ, మాలా కుమార్ గారు మీ అక్కా
psmlakshmi
4psmlakshmi.blogspot.com

జయ చెప్పారు...

నేస్తం గారికి ఈ మనస్వి నచ్హినందుకు చాలా థాంక్స్. మీరు ఇక్కడికి రావటం కూడా వాస్తు ప్రభావమెనేమొ! నాకు మీ అనుబంధం కూడా కావాలి.

లక్ష్మీ గారు మీకు స్వాగతమండి. మీరు మాతోటి యాత్రలే చేయిస్తున్నారు. ఇంక నేను చెప్పే వంటకాలదేముందండి. మీ కొత్త యాత్రా విశేషాల కోసం ఎదురుచూస్తూఉంటాను. అవునండి, తను మా అక్కే. నాకు పెద్ద గైడ్ లైన్ తనే. ఎంతో బలవంతాన నాతోటి బ్లాగ్ స్టార్ట్ చేయించింది.

కొత్త పాళీ చెప్పారు...

fantastic.
For making fun of your MIL like this, I give you an assignment of writing a minimum of 10 posts about her!!! :)

భావన చెప్పారు...

జయ బలే రాసేరు రెసిపీ, నాది లక్ష్మి గారి మాటే వంట అంటే మొహం చిట్లించే నాబోటి వాళ్ళకు కూడా బానే వుందే ఒక సారి ప్రయత్నిద్దామా అని ఆలోచన లో పడేట్టు చేసేరు.. (ఆలోచనే సుమీ, ఇంకా ఆచరణ లేదు) మీ శైలి లో మంచి ఈజ్ వుంది అలా చదివించేస్తుంది... మొత్తానికి అక్క చెల్లెళ్ళు రాదు రాదు అంటునే చాలా బాగా రాసేస్తున్నారు. :-)

పరిమళం చెప్పారు...

జయగారు , కొత్తరేసిపీ (నాకు)చెప్పారు తప్పకుండా ట్రై చేస్తాను .
మనస్వి కి ఆల్ ది బెస్ట్ !

జయ చెప్పారు...

కొత్తపాళీ గారు చాలా రోజులకి కనిపించారు. బాగున్నారా! మా అత్తగారి గురించేనా, నన్ను పది పోస్టులు రాయమన్నారు. అమ్మో! నా కంత సీన్ లేదు. వొకటో, రెండో రాయటానికి ప్రయత్నిస్తాలెండి. assignment పూర్తి చేయలేను. o.kay! థాంక్యూ.

భావన గారు, నాకు మాత్రం ఏం వొంటొచ్హండి. అయినా ఒక్కసారి, ఇది చేసి చూడండి. మళ్ళీ వొదలరు. మీ దేశం లో తప్పకుండా చేసు కోవాలి.

పరిమళం గారు, మీ విషెస్ కి చాలా థాంక్స్.

మరువం ఉష చెప్పారు...

>> గోలించటాలు ;)

నాకూ ఇదే అనుభవం. సిడ్నీకి వెళ్ళిన క్రొత్తలో అప్పుడే పరిచయం అయిన క్రొత్తవారొకరు [నిజానికి నాకు అప్పటికి వేపటం అనుభవం కూడా చాలా తక్కువ] మా సుబ్బాలు చేసేసేది. "సాయంత్రం వస్తారా పూరీలు గోలించాలి అన్నారు". అంటే తెలియదు, ముందు సరే అనేసి, ఇలా మల్టిపుల్ చాయిస్ వ్రాసుకున్నాను.

.. పాకం పట్టటం [అసలు రాదు]
.. వత్తటం [నాకు ఈ పనితో చెయ్యి వాపు వస్తుంది, కారణం ఇప్పటికీ తెలియదు]
.. పూరి వుండలు చేయటం [గోలి అన్నమాట గోళి కి వికృతి కావచ్చన్న భాషాపరిజ్ఞానం ;) ] ఈ పని అయితే ఓకే.
.. ఇవేమీ కాదు [అయితే అదేమిటీ?]

సరే మరో ఎనిమిది గంటలకి ఆ విషయమూ తెలిసింది, అలా అరవయ్యో డెభ్భయ్యో వేపేసరికి "గోలించటం" అంటే ఠారెత్తీపోయింది. :) కాకపోతే ఆ పని సమయంలో మా గోదావరి భాషతో నేను, తెలంగాణా పదాలతో ఆమె తెగ ఇబ్బంది పడ్డాము. అన్నట్లు "తోక మిరియాలు" అంటే ఏమిటి జయా? ఇద్దరం ఇప్పటికీ తెలియపరుచుకోలేకపోయాము. వీలుని బట్టి ఈ వంట చేస్తాను. అరటి పండుతో నా శెనగకారం ముంచుకుతినే మా కారన్, పాలకూర పప్పు బర్గర్ మీద సాస్ గా వేసుకునే మా ఐవన్ వున్నంతకాలం ఫర్వాలేదు. ఈ మాట ప్రక్కన పెడితే నాకు వంట బాగా వచ్చు, చెయ్యటం అంటే ఇంకా బాగా ఇష్టం...:)

జయ చెప్పారు...

ఉషా గారు, అయితే మీకూ అనుభవమేనన్నమాట. మీ రకరకాల టేస్ట్ లు కూడా చాలా బాగున్నాయండి. తోక మిరియాలు అంటే ప్రత్యేకంగా చిన్న తోకల తోటి ఉంటాయి. వాటిని జలుబు చేసినప్పుడు పొడిగా చేసుకొని కొంచెం ఉప్పు కలుపుకొని వేడి అన్నం మొదటి ముద్దలో కలుపుకొని తింటే తగ్గుతుంది. దగ్గుకి కూడా కషాయంలొ, రసానికి వాడు తారు. వీటి ఘాటు మామూలు మిరియాల కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మా అత్తగారి నడిగి చెప్పాను కాబట్టి, దీని మార్కులు మా అత్తగారికే.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner