14, అక్టోబర్ 2009, బుధవారం

ఎంతమాత్రం పనిలేని రోజు!....

పిల్లలకి సెమిస్టర్ పరీక్షలని నాలుగు రోజులు ప్రిపరేటరీ హాలిడేస్ ఇచ్హారు. కాలేజ్ లొ పిల్లలెవరూ లేరు. పెద్దలు మాత్రం అందరూ రావాల్సిందే. చచ్హినట్లు అందరూ కాలేజ్ కి వొచ్హారు. కాని ఎవ్వరికీ ఎటువంటి పని లేదు. అన్ని పన్లు మహా హడావుడిగా ఈ మధ్యనే అవగొట్టించారు. ఇప్పుడేమో గోళ్ళు గిల్లుకుందామన్నా అవికూడా లేని పరిస్తితిలో ఉన్నాం. రోజంతా గడపాలి... ఏం చేయాలి....
ఎవరి రూంలల్లో వాళ్ళం కూర్చోని ఉన్నాం. నాకెందుకో కనీసం పేపర్ కూడా చదవాలనిపించటం లేదు. ఎంత డల్ గా ఉందో! ఏం చేయాలి, ఇంత పనిలేకుండా ఎప్పుడూ లేమే...అనుకున్నాను.

ఇంతలో ఎవరో ఒక సోషల్ వర్కర్ అట, మా రూం లోకి వొచ్హాడు. అమ్మా! మేము కర్నూల్ పోతున్నాం, మీ అందరు ఏమిచ్హినా సరే అక్కడి వాళ్ళకు అందజేస్తాం అన్నాడు. మీ ఇంట్లోవి ఏమిచ్హినా సరే, అన్నాడు. మీరు ఎవరండీ అని నే నడగబోతున్నాను.. ఇంతలోనే మా కొలీగ్ అందుకొని,ఇంట్లో ఉన్నవన్నీ మీ కిచ్హేస్తే ఇంక మేము కూడా మీ బండి ఎక్కేసి రావాల్సిందే.. అంది. చూడండీ మేము ఇవ్వాల్సింది ఇప్పటికే ఇచ్హేసాం, ఇంక మీరు వెళ్ళండి అంది ఇంకో కొలీగ్. అందరూ సంఘసేవ చేసే వాళ్ళే, మీకు అసలు కాలేజ్ లొకి ఎవరు పర్మిషన్ ఇచ్హారండి... అని ఇంకో కొలీగ్ అందుకుంది. పాపం ఆ మనిషి బిక్క చచ్హి పోయి చాలా తొందరగా మా రూం నుంచి వెళ్ళిపోయాడు. అవునూ, మనమే కర్నూల్ పోయి రావొచ్హుకదా ఒకసారి! మనందరం కలసి ఒకసారి పోయి మనకు చాతనయింది చేసొద్దం, ఏమంటారు అన్నాన్నేను. మనం ఎప్పుడూ పోయె కంపెనీ నుంచి బస్ మాట్లాడుకుందాం అన్నాను. అవును ఈ అయిడియా బాగుంది, ప్రిన్సిపల్ తో కలిసి అందరం పోదాం, ప్లాన్ చేసుకుందాం...అనుకున్నాం అందరం.

ఇంతలో బస్ పాస్ సిగ్నేచర్ కోసం ఒక స్టూడెంట్ ఒచ్హింది. అది నా డ్యూటీ. ఏంటమ్మా! ఇవాళ మీకు హాలిడే కదా, దీనికోసం ఇప్పుడెందుకొచ్హావ్, తరువాత తీసుకోవాల్సింది. అన్నాను. దానికి ఆ అమ్మాయ్, ఇవాళ లాస్ట్ డేట్ అందుకే వొచ్హాను, మాడం అంది. మరి ఎందుకులేట్ చేసావ్, ఇప్పుడు చూడు ఒక్క ఈ చిన్న పని కోసం రావాల్సొచింది, అన్నాను నేనూరుకోకుండా. సైన్ చేసేసి, అబ్బో! ఇవాళ చాల పెద్ద పనే చేసాను అనుకున్నాను. ఇంతమంచి అవకాశం వొదులుకోటం ఇష్టం లేని మా కొలీగ్, నువ్వు ఒక్క దానివి ఇవాళ కాలేజ్ కొచ్హావ్ కాబట్టి నీకు ఇప్పుడొక పనిష్మెంట్ అంది.నువ్వు ఇప్పుడొక కవిత్వం చెప్పాలి మాకు అంది. ఆ అమ్మాయ్ భయపడిపోతుందేమొ అనుకున్నాను నేను. పనిష్మెంట్ అనేటప్పకి ముందు ఆ అమ్మాయ్ భయపడ్డా, ఆ శిక్ష ఏవిటో తెలిసిపోయిన తరువాత మాత్రం, అనుకోకుండానే ఆ అమ్మాయి కళ్ళు మెరిసి పోయి బ్రమ్హాండమైన హుషార్ వొచ్హేసింది. ఆ అమ్మయికి కవిత లంటే చాలా ఇష్టమంట, ఈ మధ్యనే 'అమ్మ ' గురించి ఒకటి రాసాను మేడం, చెప్తాను అంది. తన బాగ్ లోనుంచి ఒక పెద్ద నోట్ బుక్ తీసింది. దాని నిండా కవితలే! ఇంక అయిపోయాం అనుకున్నాను.

చదవటం మొదలు పెట్టింది:
అమ్మ అంటే మదర్
చదివించేటప్పుడు టీచర్
నిద్రపుచ్హేటప్పుడు సింగర్
జ్వరం వొచ్హినప్పుడు డాక్టర్
సలహా ఇచ్హేటప్పుడు లాయర్
తప్పు చేసినప్పుడు దండించే లేడీ ఇన్స్పెక్టర్
అమ్మ ప్రేమ ఎవర్
అమ్మకు కోపం నెవ్వర్
జల్లుతుంది ప్రేమ షవర్
అమ్మ ఎంతో క్లెవర్
ఆమెకు ఉంది ఎంతో పవర్
అమ్మా నీకు నా జోహార్!!!.. అని చదివేసింది. ఎవ్వరం ఏమి మాట్లాడ లేదు. నా కెందుకో గాని 'నువ్వు నాకు నచ్హావ్ 'సినిమా లోని ప్రకాష్ రాజ్ అమ్మ మీద కవిత్వం గుర్తుకొచ్హింది. చివ్వరి లైన్ మాత్రమే నాకు గుర్తుంది. "ఎందుకమ్మా! అంత ఎర్లీ గా చచ్హావ్" అని. బాబోయ్! ఇంక ఎక్కువాలొచిస్తే కష్టం అనిపించింది. మా ఫ్రెండ్ ఇంకా ఏదో ఆ అమ్మాయిని అడగబోతుంటే, ఇంక నువెళ్ళమ్మ అని తొందరగా ఆ అమ్మాయిని పంపించేసాను.

ఎందుకలా పంపించేసావ్, కాసేపు టైం పాస్ అయేదిగా అంది మా కొలీగ్. ఫర్వా లేదులే నువ్వే ఏమన్నా కొన్ని జోక్స్ చెప్పు అన్నాను. అవును, బాగుంటుంది, అందరూ తల కో జోక్ చెప్పాలి అంది.

తనే చెప్పింది ఒక జోక్, అదేంటంటే....
టీచర్: సందీప్, పదిరూపాయల నోట్ మీద గాంధీ నవ్వుతూ ఉంటా డెందుకు?
సందీప్: గాంధీ ఏడిస్తే నోట్ తడిసిపోతుంది మేడం
అందరం ఏక గ్రీవంగా నచ్హలేదు పొమ్మన్నాం.

అయితే నేను మంచి జోక్ చెప్తాను అని ఇంకో కొలీగ్ అందుకుంది. అదేంటంటే... మన ఎంగేజ్మెంట్ కి ఒక రింగ్ ఇవ్వాలి అని గోముగా అడిగింది, ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక బాయ్ ఫ్రెండ్ ని. దానికి ఆ బాయ్ ఫ్రెండ్ 'దానికేం భాగ్యం, ఏదీ నీ సెల్ నంబర్ ఇవ్వు ' అని అడుగుతాడు.

ఊహూ! ఈ జోక్ లేవి బాగా లేవు. రిడిల్స్ వేసుకుందాం అన్నాన్నేను. సరే, అయితే నువ్వే ముందు చెప్పు అన్నారు వాళ్ళు. ఏం చెప్పాలబ్బా! అని కాసేపు ఆలోచించాను. సరే, దీనికాన్సర్ చెప్పండి అన్నాను.
అదేంటంటే,"చిమ్మ చీకట్లో నన్నొంటరిగా నిలబెడతారు, ఎంత ఏడుపొస్తుందో" ఎవరో చెప్పుకోండి అన్నాను.
ఆ ఏముందిలే, ఎవరో ఒక పిల్ల చదవక పోతే వాళ్ళ అమ్మ గదిలో పెట్టి తలుపేసేసి ఉంటుంది, అంది మా ఫ్రెండ్.
ఛి, ఏం కాదు, నువ్వు సరిగ్గా కనుక్కోటం లేదు. రాక పోతే చెప్పు ..నేనే చెప్తాను, అన్నాను.
ఎవ్వరూ చెప్పలేదు. అదేంటో తెల్సా "కొవ్వొత్తి" అన్నాన్నేను.
ఓష్! అంతేనా, మరీ ఇంత ఈజీ అనుకోలేదు అంది.

నేనో రిడిల్ చెప్తాను అంది, ఇంకో కొలీగ్.
అదేంటయ్యా అంటే, "తాగటానికి నెయ్యిచ్హారో గుప్పు మంటాను, నీళ్ళిచ్హారో తుస్సు మంటాను, ఇంతకీ నేనెవ్వర్ని, అంది.
ఇదేదో యజ్ఞమో, యాగమో లాగుంది. అంది ఒక ఫ్రెండ్. ఆ, నాకు తెల్సి పోయింది, ఇది "మంట" అంతే కదా! అంది అంతకు ముందే స్టూడెంట్ ని ఏడిపించిన కొలీగ్.
అబ్బా! అంత తొందరగా చెప్పేస్తే ఎలా! అయితే ఇంకోటి అడుగుతాను చెప్పండి అంది.
కాదు,కాదు, నేను అడుగుతాను చెప్పండి అని ఇంకో ఫ్రెండ్ మొదలు పెట్టింది.
"అందరిలాగే నాకు ముందున్నవి రెండు కళ్ళే, వెనుక మాత్రం వేయి కళ్ళు, నా పేరేంటో చెబుతారా!" అంది.
వెంఠనే అందరం ఏక కంఠంగా "నెమలి" అని చెప్పేసాం. తనేమో, మాకు అది అంత ఈజీ అనుకోలేదేమొ పాపం, చిన్నబుచ్హుకుంది.

ఎప్పుడొచ్హారో మా వైస్-ప్రిన్సిపల్, మేమెవ్వరం మా గొడవలో పట్టించుకోనే లేదు. నిశ్శబ్దంగా మమ్మల్ని చూస్తున్నారు. వెంటనే అందుకున్నారు. "ఏ నేరమూ చేయని వాడిని అందరూ పట్టుకొని తంతారు" ఎవ్వరో చెప్పుకొండి అన్నారు. మేమొక నిమిషం బిత్తర పోయినా, వెంటనే తేరుకొని,కూర్చొండి మేడం అన్నాం. దీనికి ఆన్సర్ చెప్పండి, కూర్చుంటాను అన్నారు. ఎవ్వరం చెప్పలేదు. ఎందుకంటే, మా కిప్పుడు విమానం మోత తప్పదన్న పెద్ద నమ్మకం లో పడిపోయాం. నేను ఇప్పుడు కాలేజ్ మొత్తం చూసుకుంటూ వొస్తున్నాను, అందరూ మీ లాంటి 'అవస్థ ' లోనే ఉన్నారు. మీరు ఆన్సర్ చెప్పరు గాని, నేనే చెప్తాను. అది 'బాల్ ' అనుకుంటూ వెళ్ళిపోయారు. అమ్మయ్యా! తుఫాన్ తప్పిపోయింది, అని అందరం సంతోషించాం.

ఏవిటో! ఇక్కడ ఇంత సరదాగా ఉంటామా, ఇంటికి పోగానే పరిస్థితి పూర్తిగా తలకిందులే. ఏవిటో జీవితం, అంది సడన్ గా మా ఫ్రెండ్ ఫిలసఫీ లోకి వెళ్ళిపోతు. తనకి ఇంటినిండా కష్టాలే పాపం. ఒక నిముషం అందరం చాలా మూడీగా అయిపోయాం. వాళ్ళాయన చేతిలో చాలా తిప్పలు పడుతోంది.అప్పుడప్పుడూ చెప్తూ ఉంటుంది. అందరూ వీలైనన్ని సలహాలు ఇస్తూనే ఉంటారు. ఏవిటో, స్త్రీలకు ఎంతో స్వేచ్హ ఇచ్హాం అంటారు, ఉద్ధరించామంటారు. కాని ఏమి మారలేదు. ఆడవాళ్ళకి ఇంట్లో బయట ఎన్నో బాధ్యతలు పెరిగాయె తప్ప , ఏ ఉద్ధరణా లేదు అంది.

అదేం మాట, వాళ్ళు మనని ఉద్ధరించటమేంటి, ఒక పక్క సమానత్వం గురించి మాట్లాడుతూ, ఇంకో పక్క మొగవాళ్ళు ఏదో ఇవ్వాలి అంటారేంటి. మనకు కావాల్సిందేదో మనమే సంపాదించుకోవాలికాని అన్నాను నేను. నాకు నోరుమూసుకొని కష్టాలు భరించటమంటే చాలా కోపం వొస్తూ ఉంటుంది. "ఉద్ధరణ" అందరికీ కావాల్సిందే! బాలకార్మికులకీ, అంగవైకల్యులకి, మానసిక రోగులకి, ఇలా చాలా మందికీ .... అందరికీ కావాలి అన్నాన్నేను.

సీన్ మారిపోయి వాతావరణం చాలా వేడెక్కి పోయిందని అర్ధమైపోయింది. పరిస్థితి చల్ల పరచాలని మా ఫ్రెండ్ "వైఫ్" ల మీద ఎన్ని జోక్ లున్నాయో, నేనొకటి చెప్తాను వినండి అంది. సరే చెప్పు అన్నారంతా.

ఒక హజ్బండ్, వైఫ్ తోటి ఇలా అన్నాడట: అసలు నాకు వైఫ్ అంటే అర్ధం తెలిస్తేగా! నిన్ను పెళ్ళి చేసుకున్నాకే తెలిసింది. అని ఇలా చెప్పాడు. వైఫ్ అంటే....
W: without
I: Information
F: Fighting
E: Everytime... అని ఎంతో కోపంగా చెప్పాడు భర్త.

ఈ జోక్ నాకేం నచ్హలేదు. ఈ మధ్యనే టి.వి.లో "ప్రజావేదిక" చూసాను. అందులో టాపిక్, సంసారాలు కూలిపోటానికి, భార్యా? భర్తా? ఎవరు కారణం అనేదాని మీద చాలా తీవ్రంగా చర్చ జరిగింది. దాదాపు కాపురాలు కూలిపోటానికి భార్యలే కారణం అని ఆ చర్చలో తేల్చారు. నా కెందుకో ఆ చర్చ సక్రమంగా అనిపించలేదు. ఎన్నో పాయింట్స్ ఒదిలేసినట్లుగా అనిపించింది. అందుకే కనీసం ఇప్పుడైనా నా కసి తీర్చుకోవాలనిపించింది.
దీనికి ప్రతిగా నేనొక జోక్ చెప్తాను అని ఇలా చెప్పాను.
ఆ భార్య వెంటనే అతనికి ఇలా సమధానం చెప్పింది:
కానే కాదు వైఫ్ అంటే:
W: With
I: Idiot
F: For
E: Ever...... అని అరిచింది భార్య.

అందరూ ఒకే సారి ఘొల్లున నవ్వటం మొదలు పెట్టారు. దీనితో వాతావరణం చల్ల బడింది. అందరి మనస్సులు శాంతించాయి.

ఇంతలో intercom మోగింది. Semester Exams గురించి meeting ఉందని principal phone. ఇంక మా మీటింగ్ ఆపేసి పెద్ద మేడం మీటింగ్ కి బయలుదేరాం.

*******************************************************************

15 కామెంట్‌లు:

baleandu చెప్పారు...

బాగుందండి మీ టైం పాస్. వైఫ్ మీద రెండు జోక్స్ బాగున్నాయి.

baleandu చెప్పారు...

బాగుందండి మీ టైం పాస్. వైఫ్ మీద రెండు జోక్స్ బాగున్నాయి.

భావన చెప్పారు...

బాగుంది జయ బాతాఖాని. నేను ఇండియా లో లెక్చరర్ గా చేసిన రోజులు గుర్తు వచ్చేయి.. ఒక పోస్ట్ రాయాలన్నంత వుషారు వచ్చింది. ఎంత బాగా ఎన్ని విషయాలు కవర్ చేసేరు.. అవును ఎందుకో ఎప్పుడు ఆడవాళ్ళదే తప్పు అన్నట్లు చూపిస్తారు జీవితాలు కూలిపోవటానికి అదే నిలబడితే ఆమె గొప్ప అనరు ఇద్దరం సమానం అంటారు :-)

తృష్ణ చెప్పారు...

చాలా బాగుంది మీ టైం పాస్...కాని వ్యాఖ్యానించటానికి చాలా అంశాలు ఉన్నాయి...దేని గురించి రాయాలో తెలీట్లేదు...జోక్స్ బాగున్నాయి.

uma blog చెప్పారు...

hi baagundi andi mee jokes

wife naaku chalaa baaaga nachhesindi andi

నేస్తం చెప్పారు...

W: With
I: Idiot
F: For
E: Ever
గుర్తు పెట్టుకోవాలి ముందు ముందు పనికొస్తుందెమొ సెటైర్లు వేసినపుడు :P
బాగుందండి మీ టైం పాస్

మురళి చెప్పారు...

చాలా విషయాలు కవర్ చేశారండీ లీజర్ లో.. ఇంతకీ కర్నూల్ వెళ్ళారా?

జయ చెప్పారు...

బాలేందు గారు, మా క్రియేటెడ్ జోక్స్ నచ్హినందుకు చాలా థాంక్స్.

భావన గారు, లెక్చరర్ గా పనిచేసిన మీకు ఒక 'స్టాఫ్ రూం ' లో మొత్తం ప్రపంచమే కనిపించేస్తుందన్న విషయం బాగా తెలుసుకదా! లెక్చరర్ ఉద్యోగంలో ఉన్న తృప్తి నాకు ఇంక ఎక్కడా కనిపించదు. ఇక్కడి అనుభవాలు, ఎన్నెన్నో, ఎన్ని రకాలో! It gives us complete job satisfaction also. మీ టీచింగ్ అనుభవాలు తెలుసుకోవాలనుంది. ప్లీజ్, నాకోసం ఒక పోస్ట్ రాయరూ.

జయ చెప్పారు...

తృష్ణ గారు థాంక్స్. ఇంకా చాలా అంశాలు ఒదిలేశాను. మరీ పెద్దగా అయిపోతుంది, తిడ్తారని భయమేసింది. అసలు చాలా మంది ఇది చదవరనే అనుకున్నాను. నేను చూసే 'కలర్స్ ' చానల్ సీరియల్స్, బాలికా వధు, ఉతరన్, నా ఆనా ఇస్ దేశ్ మె లాడో, బిగ్ బాస్ 3, వీటన్నింటి గురించి కూడా మాట్లాడాం. ఇంకా ఎన్నో. చెప్పానుగా 'అక్షంతల ' భయం వల్ల అన్నీ రాయలేదు. 'వ్యాఖ్యానించటానికి చాలా అంశాలు ఉన్నై ' అనే బదులు ఒక్కటన్నా వ్యాఖ్యానించొచ్హుగా. Thank you very much.

ఉమా గారు థాంక్స్ అండి.

జయ చెప్పారు...

నేస్తం గారు, మీకు నచ్హినందుకు థాంక్స్. కాని, మీరు ఈ wife సెటైర్స్ ఎక్కడన్న వేస్తే నన్ను తిట్టుకుంటారేమొనండి.

మురళీ గారు, రేపు పొద్దున్నే ఆరు గంటలకు మేము కర్నూల్ వెల్తున్నాం. రాగానే, ఆ 'సుత్తి ' మీకు తప్పకుండా వేస్తాను. అందరూ భరించాల్సిందే! మీరు ఎప్పుడన్నా మీ ఆఫీస్ అనుభవాలు కూడా రాయొచ్హు కదా! తెలుసుకోవాలని నాకు ఎంత ఇదిగా ఉందో చెప్పలేను. మరీ అంత సీక్రెట్ అయితే అన్యాయమండి.

మాలా కుమార్ చెప్పారు...

మీ స్టాఫ్ రూం లో మొత్తం ప్రపంచాన్ని చూస్తారన్నమాట ! .
అంత కష్టపడి కవిత రాసి చదివిన అమ్మాయిని , హడావిడిగా పంపేయక పోతే మెచ్చుకొని పంపచ్చుకదా !
బాగున్నాయి స్టాఫ్ రూం కబురులు .

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

జయ గారు,
అవునూ మీరు మహిళా కళాశాలలో పనిచేస్తున్నారా? నేను ఇది వరకు లెక్చరర్ గా పనిచేసినప్పుడు మా స్టాఫ్ రూంలో లేడీ లెచ్చెరర్లు, మగ లెచ్చెరర్లు కలిసి ఉప్పర్ మీటింగ్స్ పెట్టేవాళ్ళం. ఆ రోజులు గుర్తుకొచ్చాయి నాకు.
ఒకొక్కళ్ళం తిట్టుకునే వాళ్ళం కూడా..మళ్ళీ కలిసిపోయి ఏ డంభ్ షెరాట్స్ ఆడేవాళ్ళం స్టాఫ్ రూంలోనే..అసలు స్టాఫ్ రూం అంటేనే రకరకాల మనస్తత్వాల మనుషుల గుంపు...
బాగున్నాయి మీకబుర్లు..

జయ చెప్పారు...

శేఖర్ గారు మీకు స్వాగతం. మీరెప్పుడు నా బ్లాగ్ కి రారెందుకో అనుకుంటూ ఉండే దాన్ని. ఈ రోజు ఆ లోటు తీరి పోయింది. అంతచక్కటి లెక్చరర్ ఉద్యోగం ఎందుకు మానేసారండి. కొంచెం టైం దొరకాలే కాని రకరకాల ఉప్పరి మీటింగులు పెట్టేస్తాం. కొంచెంగా పోలిటిక్స్ కూడా ఉంటాయనుకోండి. ఏమాత్రం రొటీన్ గా కాకుండా వెరైటీలతో ఈ ఉద్యోగం చాలా లైవ్లీ గా ఉంటుంది కదా.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

జయ గారు,
నాకు ఆఫీస్లో దొరికిన కొద్దిపాటి సమయంలో తెలిసిన బ్లాగులు ముందు చూసేసి ఇంకా సమయం ఉందనిపిస్తే ఇతర బ్లాగుల్లో ఉన్న కమెంట్ల ద్వారా వారి వారి బ్లాగులు చూస్తుంటాను. కొన్నిసార్లు కొన్ని మంచి బ్లాగులు మిస్సయపోతూంటానండీ...అలా మిస్సయిందే మీ బ్లాగూనూ!
నాకు కూడా టీచింగ్ అంటే ఇష్టమండీ...కాకపోతే అప్పుడు సాఫ్ట్ వేర్ బూం బాగా ఊరించి నన్ను ఇటు వైపుకు లాగేసింది. ఇంక పోలిటిక్స్ అంటారా..అసలు స్టాఫ్ రూంలో జరిగే పోలిటిక్స్ గురించి ఓ పెద్ద టపానే రాయొచ్చు :)

జయ చెప్పారు...

శేఖర్ గారు, పర్లేదులెండి. అప్పుడప్పుడూ కొంచెం కనిపిస్తూ ఉండండేం!

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner