17, అక్టోబర్ 2009, శనివారం

"కల్లోల కర్నూల్"

నాలోని నవరసాలు - భీభత్సం

ఎలాగైనా కర్నూల్ వెళ్ళాలి అని మేము డిసైడ్ అయిపోయాం. ఒకళ్ళిద్దరు కాకుండా సరిగ్గా ప్లాన్ చేసుకోని ఇష్టమున్న వాళ్ళమంతా కలిసి వెల్తే బాగుంటుంది అనుకున్నాం. ముందు చందాలు వసూల్ చేయాలి, ఆ తరువాత ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి. ముందుగా, కాలేజ్ మొత్తానికి ప్రిన్సిపల్ పేరుతో ఒక సర్క్యులర్ పంపించాం. రాదలచుకున్న వాళ్ళు వాళ్ళ చందాలతో సహా తెలియ చేయాలి. ఇంక మా సర్ పర్మిషన్ కావాలి కాబట్టి అక్కడికి వెళ్ళాం. సర్ కూడా ఒప్పుకొని తనవంతు ఇరవై వేలు ఇచ్హారు. దాని తోటి మా వసూళ్ళు మొదలయ్యాయి. ప్రిన్సిపల్, వైస్-ప్రిన్సిపల్ తో సహా వొస్తామన్నారు. అందరూ శక్తి కొలది డొనేషన్స్ ఇచ్హారు కాని రావటానికి దాదాపుగా ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఎవేవో సమస్యలున్నాయన్నారు. ఎవరినీ ఇబ్బంది పెట్ట దలచుకొలేదు. చివరికి వెళ్ళటానికి ముందుకు ఒచ్హినవాళ్ళు, ప్రిన్సిపల్, వైస్-ప్రిన్సిపల్ ఇంకో ఆరుగురు లెక్చరర్లు అంటే ఎనిమిది మంది మాత్రమే సిద్ధంగా ఉన్నారు. మా సర్ చాలా ఎంకరేజ్ చేసి ఫరువాలేదు మీరే వెళ్ళిరండి అన్నారు. వినోద్, రమేష్ అనే ఇద్దరు అట్టెండర్స్ (బాయ్స్) ని మాతోటి తీసుకు వెళ్ళమన్నారు. మేము కూడా వెళ్ళాలనే నిశ్చయించుకున్నాం.

మా కాలేజ్ మొత్తానికి దాదాపు లక్షన్నర రూపాయలు వసూల్ అయ్యాయి. ప్రిన్సిపల్ రూం లో ప్లాన్ మొదలు పెట్టాం. మేము తయారు చేసిన ప్రణాళిక ఇలా ఉంది: దాని ప్రకారం మొత్తం 200 కిట్స్ తయారు చేయొచ్హు. ఒక్కొక్క కిట్ లో 5 కిలోల బియ్యం, 2 కిలోల పెసరపప్పు. అరకిలో చింతపండు, కిలో ఉల్లిగడ్డలు, లీటర్ నూనె, ఉప్పు, ఖారం పాకెట్స్, రెండు ఒంటి సబ్బులు, రెండు బట్టల సబ్బులు, మూడురకాల సైజుల గిన్నెలు, మూతలు, మూడు చెంచాలు, మూడు కంచాలు, టవల్స్ ఉంటాయి. వాటితో పాటుగా ఒక్కొక్క కిట్ తో ఒక చాప(మాట్), ఒక దుప్పటి కూడా పెట్టాము. బక్కెట్లు, మగ్గులు కూడా తీసుకున్నాం. మా దగ్గిర ఉన్న డబ్బులతో కాలికులేట్ చేస్తే దాదాపుగా 200 ల కిట్స్ ఒచ్హేటట్లుగా అనిపించింది. వీటితో ఒక చిన్న కుటుంబం కనీసం వారం రోజులు గడపొచ్హు. ఈ లోపల వారికి ఏదో ఒక ఉపాధి దొరకక పోదు అని మా ఆశ. ఇలా నిత్యావసర వొస్తువులు ఇస్తేనే బాగుంటుంది అని మా కనిపించింది. రఫ్ ఫిగర్ తయారు చేసుకున్నాం. మేము ఎనిమిది మందిమి మూడు షాపింగ్ సెంటర్స్ కి వెళ్ళి అన్నివొస్తువులు కొనుక్కొచ్హి కాలేజ్ లో పెట్టాం. ఈ వస్తువులు మాత్రమే కాకుండా ఇంకొ 100 కిట్స్ కూడా వేరే విధంగా తయారు చేయించాలనుకున్నాం. అందులో రెండు చపాతీలు, పులిహోర, పెరుగన్నం పాకెట్స్ ఉంటాయి. ఇంక అందరి దగ్గిర రకరకాల పాతబట్టలు వసూలు చేసాం. అప్పటికే మేము చాలా బట్టలు ఇచ్హేయటం మూలంగా ఎక్కువ బట్టలు మాత్రం వసూలు చేయలేక పోయాం. మా కాలేజ్ వెనకాల ఒక పేద కుటుంబం ఉంది. వాళ్ళు చపాతీలు చేసి అమ్ముతూ ఉంటారు. వాళ్ళతోటి ఈ 100 కిట్స్ కనుక తయారు చేయిస్తే వాళ్ళకు కూడా కొంచెం సహాయం చేసినట్లుంటుంది కదా అని వాళ్ళకే ఆ పని అప్పచెప్పాము. ఇవన్నీ కూడా మా కాలేజ్ లో వసూలు చేసిన డబ్బులతో మాత్రమే తయారు చేశాం. కాలేజ్ దాటి బయటకు పోలేదు.

ఇప్పటికీ టి.వి. లల్లో చూపిస్తునే ఉన్నారు. చాలా మంది నిరాశ్రయులయ్యారని. అందరికీ ఎలాగు చెయ్యలేము. అందుకని ఒక ప్రాంతాన్ని మాత్రం ఎంచుకొని అక్కడి వాళ్ళకు ఇద్దాం అనుకున్నాం. మాకు కర్నూల్ గురించి ఎటువంటి అవగాహన లేదు. అయినా ఇది మాకు ఎంతమాత్రం సమస్య కాదు. ఎందుకంటే మా నిర్మల వాళ్ళ తమ్ముడు కర్నూల్ లోనే ఉంటున్నాడు. నిర్మల ఎప్పుడు వెళ్ళివొస్తూనే ఉంటుంది. కర్నూల్ లో "నర్సింగ రావ్ పేట" అనే ప్రాంతం లో చివరికి గొప్పవాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారట. అక్కడికి వెళితే బాగుంటుంది, అక్కడ 150 కిట్స్ వరకు ఇద్దాం అంది. తరువాత "కొండారెడ్డి బురుజు" ప్రాంతంలో ఒక చిన్న లేన్ లో కొంత మంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, కనుక వారికి ఒక 50 కిట్స్ ఇద్దాం అంది. అందరం సరే అన్నాం. ఇంక చపాతీల పాకెట్స్ అప్పటికప్పుడు అవసరమైన వాళ్ళకు ఇద్దామనుకున్నాం.

ఇంక మాకు తెలిసిన శక్తి ట్రావెల్స్ లో 20 సీటర్ స్వరాజ్ మజ్డా ని బుక్ చేసుకున్నాం. 16త్ పొద్దునే ఆరింటికల్లా అందరం కాలేజ్ కి ఒచ్హేయాలి.అక్కడి నుంచి మా ప్రయాణం మొదలు. మరి మాకు కూడా బ్రేక్ ఫాస్ట్ కావాలి కదా. అందుకని మా కల్యాణి మా కోసం ఇడ్లీ ఆర్డర్ చేసింది. నిర్మల వాళ్ళ తమ్ముడి ఇంట్లో మాకు లంచ్ ఏర్పాటు చేసింది. అందరం టైం కి ఏమాత్రం లేట్ చేయ కుండా ఇళ్ళల్లో పనులు పొద్దున్నే లేచి చేసేసుకొని, ఆరుగంట్ల కల్లా కాలేజ్ చేరుకున్నాం. వినోద్ వెళ్ళి మా ఇడ్లీలు పట్టుకొచ్హేసాడు. మిగతా లగ్గేజ్ అంతా మా వాచ్మాన్, రమేష్, వినోద్ కలిసి బస్ లో పెట్టేసారు. మా మజ్డా వెనకాల సగం వరకు కిట్స్ ఆక్రమించేసుకున్నాయ్. కొన్ని స్టవ్ లు కూడా కొన్నాం. వాటి తో పాటు చాపలు కూడా పైన వేయించేసాం.
నూనె పాకెట్స్ అన్నీ సీట్ల కింద పెట్టించేసాం. మా సర్ మాకు సెండాఫ్ ఇవ్వటానికి మాకందరికన్నా ముందే కాలేజ్ చేరుకున్నారు. మా ప్రిన్సిపల్ కాలేజ్ బానర్ కట్టించారు. కర్నూల్ పోతుంటే మూడు టోల్ గేట్స్ ఒస్తాయిట. అక్కడ చాలా పే చేయాల్సి ఉంటుంది. వరద బాధితుల కోసం పోతున్నాం కాబట్టి మా దగ్గిర తీసుకోరట. అందుకే బానర్ కట్టారు. ఊర్లోకి వెళ్ళంగానే తీసేయండి. లేక పోతే చాలా ప్రమాదం అన్నారు మా సర్. మేము అలాగే అన్నాం. అనుకున్న దాని కన్నా అరగంట ఆలష్యంగా బయలు దేరాం. మా రమేష్ గట్టిగా 'జై భజ్రంగ్ భళీ ' అని అరిచాడు. అందరం జై అని బయలుదేరం.

అప్పటికే తెల్లగా తెల్లారిపోయింది. సిటీ కాలేజ్ దాటి కొంచెం దూరం పోగానె బండ్ల మీద ఆపిల్స్ కనిపించాయి. మా ప్రిన్సిపల్ 50 ఆపిల్స్ తీసుకున్నారు, కర్నూల్ లో ఇద్దామని. మెల్లగా నేషనల్ హైవే(NH7)మీదికి చేరుకున్నాం. ఇది దేశం లోనే అన్నింటికన్నా పెద్ద హైవే అట. నాలుగు రోడ్స్ తోటి ఎంతో నీట్ గా, విశాలంగా, అందంగా ఉంది. ఎక్కడా ఎటువంటి రష్ లేకుండా చాలా నిశ్శబ్ధం గా ఉంది. అబ్బ, ఇంతటి నిశ్శబ్ధం చూసి ఎంతకాలమైందో అనుకున్నాను. దారి పక్కనుంచి గొర్రెల మందలు పోతున్నాయి, కాని వాటి వెంబడి ఎవ్వరు మనుషులే లేరు. మేడం ఒక గొర్రె కొంటే ఒక గొర్రె ఫ్రీ అన్నాడు, మా రమేష్. ఇది జోకన్నమాట. ఓహో! బై ఒన్ గెట్ ఒన్ ఫ్రీ, అని అందరం నవ్వుకున్నాం. ఆకలేస్తొందని ఇడ్లీలు తినేసాం. డ్రైవర్ దారిలో ఒక ధాభా దగ్గిర కాఫీ ల కోసం అపాడు. ఆ పని కూడా అయిపోయింది. మెల్లగా అందరం అంత్యాక్షరీ మొదలు పెట్టాం. టైం తెలియకుండానే మా కబుర్లల్లో గడిచి పోతోంది.

మెల్లగా బీచ్ పల్లి చేరుకున్నాము. అక్కడ క్రిష్ణా నది మీదుగా బ్రిడ్జ్ కిందుగా ఆంజనేయ స్వామి గుడి కనిపించాయ్. ఈ గుడి పైన జెండా వరకు నీళ్ళు వొచ్హాయ్ మేడం అన్నడు డ్రైవర్. అక్కడంతా చాలా డర్టీగా కనిపించింది. గుడి ప్రాంగణమంతా చాలా అసహ్యంగా ఉంది. అక్కడక్కడ ఇంకా నీళ్ళు కనిపిస్తూనే ఉన్నాయ్. కొంతమంది జనాలు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ మా బానర్ తీసేసాం.

ఇంకా కొంచెం దూరం పోగానె ఆలంపూర్ డైవర్షన్ వొచ్హింది. మా అన్నపూర్ణా మాడం ఆలంపూర్ గుడి కెల్దామా అన్నారు. కాని అక్కడికి పోయె పరిస్థితి లేదన్నాడు డ్రైవర్. అక్కడి నుంచి రోడ్ వరదల మూలంగా చాలా పాడైపోయింది, గుడి కూడా మునిగి పోయింది. రిపేర్స్ జరుగుతున్నాయ్. చాలా మటుకు రోడ్ కొట్టుకొని పోయింది. ఒచ్హే పోయే బండ్లు అన్నీ కూడా ఒక రోడ్ మీదనుంచే పోతున్నాయి. అప్పటివరకు సరదాగా కాలక్షేపం చేసిన మాకు కొంచెం కొంచెం గా చుట్టుపక్కల పరిస్తితుల పరిశీలన ప్రారంభం అయింది. అక్కడినుంచి ప్రయాణం చాలా మెల్లగా సాగింది. తుంగభద్రా నది ఒచ్హింది. దానిమీద బ్రిడ్జ్ కూడా చాలా భాగం కొట్టుకొని పోయింది. అక్కడంతా సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ఒక్కొక్క వెహికల్ నే పోనిస్తున్నారు. పూర్తిగా ట్రాఫిక్ జాం అయింది. ఒక అరగంట తరువాత మా వంతు వొచ్హింది. మేము మెల్లగా బ్రిడ్జ్ దాటాము. నాకది బ్రిడ్జ్ లాగానే కనిపించలేదు. అంతా చెత్త చెత్త ఉంది. బ్రిడ్జ్ పక్క గోడలు పడిపోయినయ్. అంతా బురదే. అసలు ఈ బ్రిడ్జ్ దాటగలమా అని భయపడ్డాం. అక్కడినుంచి చాలా దుర్గంధం మొదలైంది.

మా సర్ మాకు ఒక పాకెట్ మాస్క్ లు కొనిచ్హారు. కర్నూల్ మొదట్లోనే అందరిని అవి పెట్టుకొమ్మన్నారు. ఆ పాకెట్ నా దగ్గిరే ఉంది. అది బయటికి తీసి అందరికీ తలా ఒక మాస్క్, డ్రైవర్ తో సహా ఇచ్హాను. నేను మాస్క్ కట్టుకోవలసి ఒస్తుంది అని ఎప్పుడనుకోలేదు. ఒకళ్ళకొకళ్ళం కష్టపడి మాస్క్ లు కట్టేసుకున్నాం. మా లక్ష్మి మాడం, ఏవిటో ఇది మంగళసూత్రాల్లాగా ఒకళ్ళకొకళ్ళం ఈ కట్టుకోటాలు అన్నారు. నాకైతే అందరూ ఏదో బందిపోటు దొంగల్లాగా కనిపించి నవ్వొచ్హింది. ఎందుకు నవ్వుతున్నవ్ అంది కల్యాణి. నేను చెప్పను, చెప్పితే నా మీద పడి కొట్టేస్తావ్ అన్నాను. అసలు ఈ మాస్కుల మూలంగా ఎవరి మాట ఎవరికీ అర్ధం కావట్లేదు. ఆ డ్రైవర్ అయితే మరీను, నల్లగా, పక్కా దొంగ లాగానే కనిపించాడు.

ఏమాత్రం బాగా లేని ఆ రోడ్ మీద మా ప్రయాణం చాలా మెల్లగా సాగుతోంది. అప్పుడప్పుడూ ఘాటు వాసనలు ఒస్తూనే ఉన్నాయ్. దారి పొడుగూతునా బుల్డోజర్లు చెత్త ఎత్తి పోస్తున్నాయి. కొన్ని బుల్డోజర్లు చెత్తలోనే కూరుకొని పోయాయి. కొన్ని లారీ లయితే అక్కడక్కడా పడిపోయి కనిపించాయ్. చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. మెల్లగా సిటీ లోకి ప్రవేశించాం. అది నా కసలు ఒక ఊరులాగానే అనిపించలేదు. చాలా ఘోరంగా ఉంది. ఒక్క ఇల్లు సరిగ్గా లేదు. ఒక రోడ్ లేదు. ఊరంతా బురద బురద గా ఉంది. వరద తగ్గి ఇన్ని రోజులైనా పరిస్థితి ఏ మాత్రం మెరుగవలేదు. దాదాపు నడుస్తున్నట్లుగానే పోతోంది మా బస్. అబ్బా! ఎంత రొచ్హుగా ఉందో. ఒక నిముషం భయం వేసింది కూడా. దారి పొడుగునా మెల్లగా కనుక్కుంటూ 'నర్సింగ రావ్ పేట" చేరుకున్నాం. మా తన్వీర్ వాళ్ళ అక్కా వాళ్ళ ఇల్లు అక్కడే ఉంది. వాళ్ళు హైదరాబాద్ ఒచ్హేశారు. తన్వీర్ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళింది. వాళ్ళ ఇల్లు రూఫ్ వరకు మునిగిపోయిందిట. మేము బస్ దిగి ఇంట్లోకి వెళ్ళాం. కాని అంత పెద్ద ఇల్లు కూడా పూర్తిగా పాడైపోయింది. ఇంట్లో అంతా బురదే. అలమారాలు ఇరిగి పోయి ఉన్నాయి. గోడలు నాని పోయి ఉన్నై.

మేము వరద బాధితుల కోసం వొచ్హామనే సరికి అక్కడంతా జనం మూగి పోయారు. మేము ముందుగానే చెప్పిఉంచటం వలన నిర్మల వాళ్ళ తమ్ముడు అక్కడికి ఒచ్హాడు. మేము వాళ్ళందరిని లైన్లో ఉంచి టోకెన్ లు ఇచ్హి, కొంత మందిమి బస్ లో ఉండి ఒక పద్ధతి ప్రకారం వాళ్ళకు ఇద్దామనుకున్నాం. అలాగే కాసేపు చేసాం కూడా. మేము ఇస్తున్న సామాను గమనించి చాలా మంది దూసుకొచ్హేసారు. ఇంక లైన్ లేదు ఏమి లేదు. ఇదేమన్న కాలేజా! మా మాటవింటానికి. తీసుకున్న వాళ్ళే మళ్ళీ వొస్తున్నారు. ఆడవాళ్ళు, మొగవాళ్ళు వేరే నించొపెట్టి ఇద్దామంటే, వరద ఆడవాళ్ళకేనా! మొగ వాళ్ళకి లేదా అని వాళ్ళు ముందుకు దూసుకొచ్హేస్తున్నారు. మాకు ఉక్కిరి బిక్కిరై పోయింది. అక్కడ ఎవరి సహాయం తీసుకునేటట్లే లేదు. అందరు చాలా హీన మైన పరిస్థితిలో ఉన్నారు. మా ఇద్దరు బాయ్స్ కూడా చాల కష్టం మీద బస్ తలుపు దగ్గిరే నిలబడి పాపం, వాళ్ళని చాలా కంట్రోల్ చేసారు. నిర్మల తమ్ముడు, అతని ఫ్రెండ్, అక్కడి వాళ్ళని అదిలిస్తూ చాలా కష్ట పడుతూ మాకు సహాయం చేసారు. ఒక సమయం లో అసలు మేము ఏమి చేయలేక పోయాం.

ఏదో వెళ్ళిపోయి అక్కడ అందరికీ ఇచ్హేయటమేగా అనుకున్నాం. కాని ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్న పరిస్థితి వేరు. టి.వి. ల్లో చూసినదానికన్నా కూడా చాలా ఘోరంగా ఉంది. బట్టలు, రొట్టెలు కూడా ఇక్కడే ఇచ్హేసాం. అసలు ఎవరం ఏమి ఇస్తున్నామో మాకే అర్ధం కాలేదు. మేమే పిచ్హివాళ్ళ లాగ అయిపోయాం. మాస్కులు ఊడిపోయాయ్. జుట్ట్లు రేగి పోయినై. చెమటలు కారిపోతున్నాయ్. చీరల కొంగులు దోపేసాం. నా వాచ్ పడి పోయింది. వనజా మేడం గొలుసు ఎవరో గుంజేసారు. మా ప్రిన్సిపల్ చేతిలోనుంచి బాగ్ ఎవరో లాగేసారు. నా కైతే ఏడుపొచ్హేస్తోంది. ఇంక అక్కడే ఉంటే ఎంత ప్రమాదమో మా కర్ధమై పోయింది. బస్ పైనా లోపల అంతా ఖాళీ అయిపోయింది. ఇంక మేము వెళ్ళిపోదాం అనుకున్నాం. నిర్మల తమ్ముడు బస్ లోకి ఎక్కేసి డోర్ మూసేసాడు. అక్కడి నుంచి వాళ్ళింటికి పోనిమ్మని డ్రైవర్ కి చెప్పాడు. బస్ ముందుకు కదిలేటట్లుగా కూడా లేదు. ప్రభుత్వం మా కేం ఇవ్వటం లేదు, మీ లాంటి వాళ్ళు అందరూ వొస్తున్నారు, పోతున్నారు అని ఒకాయాన గట్టిగా అరుస్తున్నాడు. ఇద్దరు చిన్న పిల్లలైతే మా బస్ పట్టుకొని వేళ్ళాడుతూ మా తోటే రావటానికి ప్రయత్నిస్తున్నారు. డ్రైవర్ చాలా కష్టం మీద అక్కడి నుంచి బయటకు తీసుకొచ్హాడు. అందరూ మా బస్ వెనకాలే చాలా దూరం పరిగెత్తుకుంటూ వొచ్హారు. బస్ పైకి ఎక్కటానికి ప్రయత్నం చేసారు. డ్రైవర్ చాలా చాకచక్యంగా అక్కడి నుంచి పట్టుకొచ్హేసాడు.

అనుకున్న ప్రకారం చేయలేకపోయాం అని చాలా బాధనిపించింది. అందరం ఎలాగొ అయిపోయాం. మీరు బాధపడకండి మేడం, వరద తగ్గి ఇన్నాళ్ళైనా ఇక్కడ పరిస్థితి ఏమి బాగాలేదు. మీరేం చేయగలరు అన్నాడు నిర్మల తమ్ముడు. వాళ్ళ ఇంటికి చేరుకున్నాం. ఆ స్ట్రీట్ కొంచెం బాగానే ఉంది. అక్కడ రోడ్ మీద వరకే గాని ఇళ్ళల్లోకి నీళ్ళు రాలేదట. వాళ్ళ ఇంట్లో పైకి తీసుకొని పోయాడు. అక్కడ రిఫ్రెష్ అయ్యాం. వాళ్ళ మరదలు వేడి వేడి ఒంటకాలు ప్రేమతో ఒడ్డించింది. అవన్నీ చూసాకా నాకర్ధమైంది, మేమెంత ఆకలితో ఉన్నామో. మా కందరికీ కూడా చాలా శ్రద్ధగా వడ్డించింది. మాకు కూడా అన్న దానం చేసింది. అంతే కాదు, అష్టలక్ష్ములు లాగా మీరు మా ఇంటికి ఒచ్హారు అని మా అందరికి పసుపు, కుంకుమా, పూలు ఇచ్హింది. పండ్లతో తాంబూలం ఇచ్హింది. అందరికీ గాజులు ఇచ్హింది. ఓహ్! ఒక పేరంటమే చేసింది. మమ్మల్ని మళ్ళీ ఈ లోకం లోకి తీసుకొచ్హింది. మెల్ల మెల్లగా మామూలు వాతావరణం ఏర్పడింది. మా సువర్చలా మాడం కి ఇచ్హిన గాజులు చిన్నవి. అందుకని నేను నా దగ్గరివి ఆరు గాజులిస్తే తను వేసుకుంది. పసుపు రాయటానికి పనిమనిషి ఒస్తే ఒద్దన్నాను. తను వెళ్ళబోతుంటే, పసుపు,కుంకుమా ఒద్దనద్దు అన్న మా అత్తగారి మాటలు గుర్తుకొచ్హాయి. మళ్ళీ వెనక్కి పిలిచి నాకు రాయమన్నాను. మా వనజా మాడం ఏం, జయా వొద్దన్నావుగా మళ్ళీ పిలిచి రాయించుకుంటున్నావ్ అన్నారు. మా అత్తగారు అన్నమాట చెప్పాను. ఏంటి జయా! సెంటిమెంట్ పెట్టేసావ్, అని అందరూ వరస పెట్టి పసుపు రాయించుకున్నారు. అరగంట తరువాత అందరికి టీ లు కూడా ఇచ్హారు. ఇంక బయలు దేరుదాం. రోడ్ చాలా దూరం వరకు బాగా లేదు. చీకటి పడిపోతే కష్టం అన్నారు ప్రిన్సిపల్. అందరం నిర్మల మరదలికి కృతజ్ఞతలు చెప్పి బయలుదేరాం. మా తిరుగు ప్రయాణం మొదలైంది. ఏవిటో! ఇది మాకు తోచిన చిన్న ప్రయత్నం మాత్రమే.

ఊరంతా కూడా ఈ సారి ఇంకా పరీక్షగా చూసాను.
తుంగభద్రా నది చాలా పలచ బడింది. అసలు నీరే లేదు. ఇంత మంది కన్నీటిని ఎక్కడ దాచేసిందో, నంగనాచి తుంగబుర్ర లాగా!
కర్నూల్ అంతా కూడా ఒక శిధిల భీభత్సమే.
గుండె గుండెకు ఓ కన్నీటి గాధ
గుండె లవిసేలా కన్నీటి ధార!!!
మహొగ్రంగా ఒచ్హిన వరద ఊరిని కసిగా కాటేసి తన దారిన తానెళ్ళిపోయింది.
ఆ ప్రళయం మిగిల్చిన శిధిలాల ఆనవాళ్ళిప్పుడు జనానికి పీడకలలు మిగిల్చాయి.
కోలుకోని స్థితికి వారి బతుకులను దిగజార్చాయి
ఎవరి గుండెలను తట్టినా హృదయ విదారక విషాదమే
ఎక్కడ చూసిన తుంగభద్రమ్మ ఆగ్రహ జ్వాలల శిధిల ఆనవాళ్ళే
ఒక్కో గుండె వెనుక ఒక్కో విషాదం
సర్వం కోల్పోయారు,.... శ్మశాన వైరాగ్యం ....
చెప్పేదేముంది...చేసేదేముంది...
నది చేసిన 'శవ ' తాండవానికి అంతేముంది!
ఎంత ఘోరకలి, ఎంత నరబలి, ఎంత నష్టం, ఎంత కష్టం!
పాడు ప్రవాహం ఆకాశమంత నోరు తెరిచి పాతాళం చూపెట్టింది
నాగరికతలకు నాట్యం నేర్పిన నదులు మహా విషాదాన్ని పారిస్తున్నాయి
ప్రకృతి వైపరీత్యం వికృత రూపమై విరాట్ స్వరూపం చూపించింది
నదిని, నదీమ తల్లి అన్నారు....
తల్లి పొత్తిళ్ళనుంచి ఇప్పుడు బిడ్డలు కింద పడ్డారు
మానవత్వం తోటి ఎలా పోటెత్తాలి!!!!

నాకు నచ్హిన పాట అప్పుడే గుర్తుకొస్తోంది!
' ఎవరో ఒకరు, ఎపుడో అపుడు, నడవరా ముందుగా అటో, ఇటో ... ఎటో వైపు.....'


పండగ పూట శుభాకాంక్షలు చెప్పకుండా ఇదేంటి అనుకుంటున్నారా? కళ్ళారా చూసొచ్హిన వైపరీత్యం మనసుని వదలనంటోంది.
నాకు తెలుసు, మీ హృదయాలు కూడా ద్రవించి పోతున్నాయని! క్షమించండి...

*****************************************************************************

28 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Chala badha ga undi......

amma odi చెప్పారు...

ఆ హృదయవిదారక దృశ్యాలను, సంఘటనలను కళ్ళముందు ఆవిష్కరించారండి! నెనర్లు!
మీకు, మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు, సకల శుభాలు కలగాలని కోరుతూ.....దీపావళి శుభాకాంక్షలు!

jeevani చెప్పారు...

ఇది పూర్తిగా కర్నూల్ జిల్లా అధికార యంత్రాంగం వైఫల్యం.

అజ్ఞాత చెప్పారు...

ఇంట్లో వాళ్ళంతా టపాకాయలు కాల్చుకుంటుంటే...ఎందుకో హుషారనిపించక ఇలా వచ్చి ఇప్పుడే మీ బ్లాగ్ తెరిచాను...గొంతుకలో ఏదో అడ్డు పడినట్లు..కళ్ళల్లోకి నీళ్ళు కుడా రావట్లేదు..మనకసలు హాయిగా నిద్రపోయే అర్హత ఉందా అనిపించింది..

You've done a great job madam...మీరెక్కడో కొండమీద...నేనెక్కడో పాతాళంలో ఉన్నట్లు అనిపిస్తోంది..you are really really great!!

వేణూశ్రీకాంత్ చెప్పారు...

అభినందనలు జయ గారు. నిజంగా చాలా మంచిపని చేసారు. టపా చదువుతుంటే గుండెని మెలిపెట్టినట్లు అనిపించింది. ఇంకా ఇటువంటి పరిస్థితి ఉండటం చాలా బాధాకరం.

అజ్ఞాత చెప్పారు...

ఇన్నిరోజుల తర్వాత కూడా, ఇంతమంది కదిలినా కూడా, ఇంకా పరిస్థితులను సరిచేయని మన యంత్రాంగం, మన నాయకత్వాన్ని తలుచుకొన్నప్పుడు, ఎవరయినా India is a third world country అన్నప్పుడు వచ్చే కోపం కాస్త దాక్కుంటుంది. అక్కడ సామాన్య ప్రజలను తలుచుకొంటుంటే బాధ వేస్తుంది. మనకు సహాయం చేసే వాళ్లు ఉన్నారు, సహాయం కావాల్సిన వాళ్లు ఉన్నారు, దానిని సమన్వయం చేసే వారు లేకపోవటం దురదృష్టకరం. మీరు మాత్రం మీ వంతుగా ఎదో కాస్త ఇచ్చి ఊరుకోకుండా, చాలా మంచి పనిచేసారు. దానికి నా అభినందనలు.

మాలా కుమార్ చెప్పారు...

మొన్న ఎవరో చెప్పారు , వాళ్ళు అందరినీ లైన్లో రమ్మంటే , ఒకావిడ , మేమేమైనా బిచ్చగాళ్ళమా ఆ కనిపిస్తున్న మేడ మాదే ,మా ఖర్మ కాలి ఇలారావలసి వచ్చింది అన్నదట !

Hima bindu చెప్పారు...

జయగారు
మీరు చాల మంచిపని చేసారు ..."మానవ సేవే మాధవ సేవ "...మీ ట్రూప్ అందరికి నా అభినందనలు .

నేస్తం చెప్పారు...

మాకులా కాసింత డబ్బు ఇచ్చి చేతులు దులుపుకోకుండా మీరు చెసిన పని చాలా అభినందనీయమైనది..చదివిన కొద్దీ కన్నీళ్ళు ఊరుతున్నాయి..

జయ చెప్పారు...

అజ్ఞాత గారు ధన్యవాదాలు

అమ్మవొడి గారు, వాళ్ళ కష్టాలు తీరి గట్టెక్కాలని వాళ్ళకోసం ప్రార్ధించండి.

జీవని గారు, మీరు చేసిన ప్రయత్నాలు కూడా చూసాను. మేము నలుగురు మొగవాళ్ళు, ఎనిమిది మంది ఆడవాళ్ళం ఉండి కూడా సరిగ్గా చేయలేక పోయాం. మీ ప్రయత్నాలకు జోహార్లు.

జయ చెప్పారు...

తృష్ణ గారు, కొండా, పాతాళం ఈ పోలికలు మనకొద్దండి. ఎవరికి వీలైనది వాళ్ళం చేస్తున్నాం. ఎన్నో మీరు చేసిన పనులు కూడా ఈ మధ్యనే చెప్పారుగా. మనం వందల మంది చేసినా కూడా వాళ్ళు ఇప్పట్లో గట్టెక్కుతారని నా కనిపించటం లేదు. ఆ దేవుడ్ని ప్రార్ధిద్ధాం, అంతే!

వేణు శ్రీకాంత్ గారు, వాళ్ళ పరిస్థితి చాలా బాధా కరంగా ఉంది. మెలిపెట్టిన గుండెలు, మెలితిరుగుతూనే ఉన్నాయి. వాళ్ళని ఏ దేవుడు ఆదుకుంటాడో!

అజ్ఞాత గారు, ఎంతటి ప్రణాళికలు అక్కడ సరిపోవనిపిస్తుంది. ఈ పరిస్థితి ఎప్పటికి బాగుపడుతుందో!

జయ చెప్పారు...

అక్కా, గొప్పవాళ్ళైనా, ఇప్పుడు పేదవాళ్ళ తోటే వొచ్హారుగా! గొప్పవాళ్ళ లైను, పేదవాళ్ళ లైను అని ఉండదు కదా! ఎంతటి వారికైనా, పరిస్థితుల కనుకూలంగా నడుచుకోక తప్పదు. ఎవరి కోసమని జాలి పడుతాం? అక్కడ చాలా ఘోరంగా ఉంది.

చిన్ని గారు థాంక్స్ అండి. మీరు కూడా డబ్బులో, బట్టలో ఇచ్హేసే ఉంటారుగా. మనలాంటి వాళ్ళు అక్కడ చాలా మందే ఉన్నారు. ఎంతమంది సేవా చేసినా వాళ్ళకు సరిపోదు.

నేస్తం గారు. నిజంగా ఆ బాధ వర్ణనాతీతం అండి. యుద్ధ ప్రాతిపదిక మీద అక్కడి ప్రయత్నాలు తీవ్ర తరం చేయక పోతే, ఒకప్పటి ఆంధ్ర రాజధాని, ఇప్పటి ప్రముఖ వర్తక కేంద్రం ఇంక మనకు దక్కదు. ఇది మాత్రం నిజం.

bharath చెప్పారు...

చాలా మంచి పని చేసారు మేడం

విశ్వ ప్రేమికుడు చెప్పారు...

నేను అనుకోని కారణాల వల్ల వరదలు వచ్చే ముందురోజు నుంచీ నేటి వరకూ పేపర్, టీ.వీ., నెట్ ఏవీ చూడలేక పోయాను. వరదలు వచ్చాయని తెలుసు కానీ ఎందుకో మీ టపా చదివినప్పుడు కలిగినంతగా కలత పడలేదు. చాలా చాలా మంచి పని చేశారు. మీరు వెళ్లి రావటమే కాకుండా అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టి చూపించారు. కదిలి పోయింది నాహృదయం. ధన్యవాదాలు.

sreenika చెప్పారు...

జయగారూ,
కళ్ళకి కట్టినట్లుగా వర్ణించారు.గుండెల్లో ఏదో దిగులు.
సాహితీమిత్రులకు
ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు

జయ చెప్పారు...

జయభారత్ గారు ధన్యవాదాలు.

విశ్వప్రేమికుడు గారు, చాలా రోజులకి కనిపించారు. అది వర్ణనాతీతమైన బాధ. నేను ప్రత్యక్షంగా చూసింది ఇప్పుడే.

శ్రీనిక గారు, థాంక్యూ. మీకు కూడా ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు.

మురళి చెప్పారు...

చాలా మంచి పని చేశారండి.. సాయం పొందడం లో కూడా బలవంతుడిదే పై చేయి.. యెంత ప్లాన్ చేసినా ఇలాంటివి తప్పవు.. మీ బృందానికి అభినందనలు..

CARTHEEK చెప్పారు...

జయక్క ఎంత బాదతో రాసారు
నిజంగా నేనూ ఇప్పుడు కూడా దీపావళి శుభాకాంక్షలు చెప్పలేక పోతున్న ....
నా బ్లాగు లోకి తొంగి చూసినందుకు చాల సంతోషంగా ఉంది.

జయ చెప్పారు...

మురళి గారు థాంక్యూ. పండక్కి ఊరెళ్ళినట్లున్నారే. మీ ఊరి విశేషాలు చెప్పాలి మరి. ఊరి పేరు చెప్పితే ఎప్పుడైనా వీలైతే నేనూ చూస్తాను కదా! ప.గో.జి. నా కంతగా తెలియదు కదా మరి. కోనసీమ అందాలు చూడటానికి తప్పకుండా ఎప్పుడో వెల్తాను చూస్తుండడి.

జయ చెప్పారు...

హల్లో! కార్తీక్ థాంక్యూ. నా బ్లాగ్ లోనుంచి మీ బ్లాగ్ కి చాలా సార్లు ట్రై చేసాను, రాలేదు. అనుకోకుండా మొన్న అన్ని బ్లాగులు చూస్తూ మీది కూడా చూసాను. చాలా మంచి కవితలు. కొంచెం విప్లవాత్మకత తగ్గిస్తే ఏమౌతుంది? సున్నితంగా చెప్పొచ్హుగా!

కెక్యూబ్ వర్మ చెప్పారు...

ఇప్పటికీ బురద కొన్ని వీధులలో శుభ్రం చేయబడక రోజూ ముగ్గురు నలుగురు చనిపోతున్నారని వార్తలలో చూస్తూ మన ప్రభుత్వ అలసత్వానికి బాధ పదుతున్నాం. మీరందించిన సాయానికి వారు ఎంతగానో సంతోషించివుంటారు. మీరు ధన్యులు.

జయ చెప్పారు...

కుమార్ గారు, థాంక్యూ, ప్రభుత్వం ఏదో విధంగా వాళ్ళని ఆదుకుంటే బాగుండు.

anagha చెప్పారు...

మీరు కుడా సాహసమే చేసేరుగా! మీ టీం అందరికి నా అభినందనలు .

జయ చెప్పారు...

అనఘ గారు, థాంక్స్ అండి.

భావన చెప్పారు...

ఎంత బాధ గా అనిపిస్తుందో చదువుతుంటేనే.. చాలా గొప్ప పని చేసేరు జయా.. కదిలే మనసున్న మనిషె దైవం.. god bless you my dear

జయ చెప్పారు...

భావన గారు థాంక్యూ.

మురళీ కృష్ణ చెప్పారు...

మీరు వివరించిన తీరు చాలా బావుంది. కళ్ళు చెమర్చకుండా ఆగవు...
అనుకున్నా, అంత help మీరే(మీ లాంటివాళ్ళే) చేసివుంటారని అనుకున్నా...

ఈ సారి, కొన్ని ప్రాంతాల వారే ముంపునకు గురికావటంతో... మిగతాప్రాంతాల వారి నుండి సహాయం బాగానే లభించింది.
నేను వెళ్ళేసరికి... (అంటే దీపావళికి), కర్నూల్ దాదాపు గా సర్దుకుంది.

మీ ట్రూప్ అందరికి నా అభినందనలు .

జయ చెప్పారు...

థాంక్యూ మురళీకృష్ణ గారు. మీ లాంటి వారి తోడ్పాటు కూడా ఎప్పుడూ ఉండాలి.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner