మజార్ భాయ్ కి తెలియకుండా మా కాలేజ్ లోకి ఎవరూ పోలేరు. అప్పటి పద్మవ్యూహాన్ని కాపలా కాసిన సైంధవుడిలాంటివాడు, మా మాజార్. ఎవరో కాదండి, మా వాచ్ మాన్. మా అందరికి కూడా హితుడు. ఆయన సెల్యూట్ తీసుకోకుండా మేము ఎవ్వరం ఏనాడు కాలేజ్ లోకి పోగలిగే అవకాశమే లేదు. ఎనిమిదిన్నరకే కాలేజ్ గేట్ దగ్గరికి ఒచ్హేస్తాడు. గేట్ పక్కనే గార్డ్ రూం ఉంది. అక్కడ యూనిఫోర్మ్ మార్చేసుకొని, చేతిలొ ఒక లాఠీ తీసుకొని, గేట్ దగ్గిర తన చైర్ లో కూర్చుంటాడు. అప్పటినుంచి డ్యూటీ మొదలు. చాలా హుషారుగా ఉంటాడు. నేనైతే 'మజా భాయ్' అనే అంటాను. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. కోపమే చూపించడు. ఎవరూ లేనప్పుడూ కుర్చీ మీద ఒక కాలు పైకి పెట్టుకొని లాఠీ ఊపుకుంటూ పాటలు పాడుకుంటాడు. చాలా మంచి మంచి పాత హిందీ పాటలు పాడుకుంటాడు.
నేను కాలేజ్ లోకి పోవాలంటే రోడ్ క్రాస్ చేయాలి. నేను రోడ్ క్రాస్ చేయాలంటే రోడ్ కి రెండువైపులా అటో కిలో మీటర్ ఇటో కిలో మీటర్ దూరం ఖాళీ ఉంటే తప్ప దాటను. నాది అంత ఘాఠి గుండె ధైర్యం. మా కాలేజ్ గేట్ కి ఎదురుగుండా వెళ్ళిన తరువాతే నేను రోడ్ దాటుతాను. ఎందుకంటే అక్కడ మా మజార్ భాయ్ నన్ను రోడ్ దాటిస్తాడన్న మాట. ఎలాగొ తెలుసా! నేను గేట్ ముందు ఎదురుగ్గ రోడ్ మీద నించుంటాను కదా, అప్పుడు మజార్ భాయ్ నన్ను చూస్తాడన్నమాట. వెంఠనే తన లాఠీ తీసుకొని రోడ్ కిటువైపు వొచ్హేస్తాడు. నా పక్కనే నిలబడి, లాఠీ ముందుకు జాపేసి, పెద్ద పోలీస్ ఆఫీసర్ లెవల్ లో అటూ, ఇటూ ట్రాఫిక్ ఆపేస్తాడు. 'అమ్మా, చలో' అని నన్ను రోడ్ దాటించేస్తాడు. పెద్ద హీరోయిన్ లెవెల్ లో, ఎస్కార్ట్ తోటి, ఇంక రోడ్ దాటేయ్యటమే! నేను రోడ్ దాటిన తరువాతనే మళ్ళీ ట్రాఫిక్ కదులుతుందన్న మాట. అదీ మా మజార్ భాయ్ తడాఖా.
మా కాలేజ్ గేట్ దగ్గరికి రాగానే మంచి రకరకాల పూల వాసనలు స్వాగతం చెప్తాయి. అదికూడా మా మజా భాయ్ గొప్పతనమే. తను ఓల్డ్ సిటీలో ఉంటాడు. తనకి ఒక చిన్న పూల తోట కూడా ఉంది. పొద్దున్నే ఆయన భార్యా, పిల్లలు కలిసి అన్ని పూలు కోసి మంచిగా పెద్ద పెద్ద ఆకుల్లో అందంగా పాక్ చేస్తారు. అవన్నీ బాగ్స్ లో వేసుకొని మా కాలేజ్ కి తెస్తాడు. గేట్ పక్కనే తన రూం లో ఉంచుతాడు. అంత చక్కటి సువాసనలకి కారణం అది. ఆ చక్కటి పూల వాసన మన మనసులను మైమరపించి ఏవేవో లోకాలకి తీసుకెళ్ళిపోతాయి. అంత మంచి ఎంట్రన్స్ అన్నమాట మాది. రంగు రంగుల గులాబీలు, జాజులు, లిల్లీలు, చామంతులు, చిన్ని చిన్ని బటన్ చామంతులు, మల్లెలు, ఎన్ని రకాల పూలో..... సీజన్ బట్టి అన్ని రకాలు ఉండేవి. లోపలికి ఒచ్హే ప్రతి లెక్చరర్ కి వాళ్ళ చీరలకు సరిపోయె అందమైన పూలు చేతిలో పెట్టి మరీ లోపలికి పంపుతాడు.
నాకు తెల్లటి రోజా పూలంటే చాలా, చాలా ఇష్టం. ఆ సంగతి మా మజార్ భాయ్ కి తెలుసు. తెల్ల రోజాలు ఉంటే తప్పకుండా నాకోసం ఉంచుతాడు. మా ప్రిన్సిపల్ రూం లో పూలను అందంగా ఫ్లవర్ వాజ్ లో అమరుస్తాడు. ఇంక పండగలు పబ్బాలు వొచ్హయంటే మేమందరం మాజార్ భాయ్ దగ్గిరే పూలు తీసుకొని వెల్తాం. ఏనాడు డబ్బులడగడు. ఎంత ఇస్తే అంతే తీసుకుంటాడు. మాకే కాదు, మా అందరి చుట్టాలకి పక్కాలకీ కూడా ఈయన గురించి తెలుసు. అంత పాపులర్ అన్నమాట. మేమెవ్వరం ఏనాడు పూలు బయట కొనం. పూలు, పండ్లు అన్నట్లుగా, పనిలో పనిగా మా కాలేజ్ ముందు రకరకాల పండ్లతోటి బండి కూడ ఉంచుతాడు. జామకాయలు, మామిడిపండ్లు, తేగలు, రేగిపండ్లు, ఆపిల్స్ లాంటి పండ్లన్నీ మాకు అక్కడే దొరుకు తాయ్. మేము బయటికి ఏ మార్కెట్ కి పోనక్కర్లేదు. వెరే ఏమన్నా అడిగినా తెచ్హి ఉంచుతాడు. అన్నీ కూడా మంచి తాజా పండ్లే ఉంచుతాడు. కాలేజ్ పిల్లలు కూడా ఎంతో తక్కువ ధరకే వాటిని కొనుక్కుంటారు. మొక్క జొన్నల సీజన్ అయితే వాటికోసం వేరే బండి ఉంచుతాడు. మంచిగ కాల్చి ఉప్పూ, ఖారం రాసి మాకు మా స్టాఫ్ రూముల్లోకే తెచ్హి ఇస్తాడు.
ఇంక కాలేజ్ కి ఒచ్హే ముస్లిం స్టూడెంట్స్ అందరూ ఆయన రూం లోనే తమ బురఖాలను తీసి దాచిపెట్టుకుంటారు. వెళ్ళేటప్పుడు మళ్ళీ అక్కడే వేసేసుకొని వెళ్ళిపోతారన్న మాట. పాపం, ఆ పిల్లల్ని ఏనాడు ఏమీ అనడు. వాళ్ళ బురఖాలు పోకుండా భద్రంగా దాచిపెడ్తాడు.
మా లెక్చరర్స్ కి ఎవరికి సంబంధించిన వాళ్ళు వొచ్హిన ఆయనకి అందరూ తెలుసు. వాళ్ళ దగరికి తీసుకెళ్ళిపోతాడు. ఎంత మర్యాద చూపిస్తాడో. పొద్దున పదిగంటలకి కాలేజ్ గేట్ మూసేసిన తరువాత, ఏ పిల్ల అతడ్ని తప్పించుకొని బయటికి పోలేదు. అంతగట్టి కాపలా అన్నమాట. పిల్లలు ఎన్నో రకాలుగా తప్పించుకొనిపోటానికి చూస్తారు. కాని ఆయన దగ్గిర ఒక్కరి ఆటలు కూడా సాగవ్. పిల్లలు ఒకసారి లోపలికి ఒచ్హారంటే మళ్ళీ మూడున్నరకి మజార్ భాయ్ గేట్ తీసే వరకు లోపల ఉండిపోవాల్సిందే. పిల్లలు కోపంతో 'ముషారఫ్ భాయ్' అని 'హిట్లర్ ' అని ముద్దు పేర్లు పెట్టుకున్నారు.
మా కాలేజ్ ప్రతి ఫంక్షన్ లోను మజార్ భాయ్ కాలో, చేయో ఉండాల్సిందే. లేక పోతే ఏ పని ముందుకు జరగదు. మొత్తనికి మా రింగ్ లీడర్ మజార్ భాయ్. సమ్మర్ వెకేషన్ కి ముందు లాస్ట్ వర్కింగ్ డే సాయంత్రం ఇంటికి వెళ్ళే టప్పుడు మళ్ళీ అందరికి రి ఓపనింగ్ డే చెప్పి, అందర్ని జాగ్రత్తగా వెళ్ళి రమ్మని వీడ్కోలు ఇస్తాడు. పెద్దవాడని, అందరం మర్యాదగా చూస్తాం. ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాం.
లాస్ట్ ఇయర్ జూన్ 13త్ న మా కాలేజ్ రిఓపెనింగ్. ఆ రోజు శుక్ర వారం. మాకెందుకో శుక్రవారం, పదమూడవ తారీఖు కాలేజ్ తెరవటం బాగనిపించలేదు. శుక్రవారం, పదమూడో తారీఖు ఏమీ చేయక పోవటం పాశ్చాత్య సంస్కృతి. కాని ఏవిటో మనకి కూడా అది అలవాటై పోయింది కదా! అంతే కాదు, ఆ తరువాతి రోజు రెండవ శనివారం మూలంగా శలవు కూడా వొచ్హింది. అంటే ద్వితీయ విఘ్నం అన్నమాట. రెండో రోజు కాలేజ్ ఉండదు. తప్పని సరియై అందరం కాలేజ్ కి ఒచ్హాం కాని ఎవ్వరం ఏమి చేయలేదు. ఏవిటో, ఈ ఇయర్ ఎలా ఉంటుందో అని చాల దిగులు పడ్డాం. ఆ రోజంత ఏదోలా, అలాగే గడిచి పోయింది.
ఆ రోజు సాయంత్రం ఇంటికి వెల్తుంటే మజార్ భాయ్ కనిపించాడు. అమ్మా ఆజ్ ఆప్కో ఫూల్ నహీ దియా, యే లో, ఆప్కే లియే రఖ్దియా, అంటూ ఒక తెల్ల గులాబి ఇచ్హాడు. నాకోసం పువ్వు ఉంచి ఇచ్హాడు, అని చాలా సంతోషం తో థాంక్స్ మజార్ భాయ్, ఫిర్ సోంవార్ కో మిలేంగే అని వెళ్ళిపోయాను. అమ్మా! సంభాల్కే జానా, అని జాగ్రత్తగా రోడ్ దాటించాడు.
మళ్ళీ సోమ వారం కాలేజ్ కి ఒచ్హాను. రోడ్ కి అవతల నిలబడి మజార్ భాయ్ కోసం చూసాను. మరి నన్ను రోడ్ దాటించాలి కదా! ఎంతసేపటికీ కనిపించలేదు. ఇవాళ ఏమయిందబ్బా అని ఎలాగో నేనే కష్టపడి రోడ్ దాటి లోపలికి ఒచ్హాను. అక్కడా లేడు. సరెలే ఏమన్న హాస్టల్ వైపు వెళ్ళాడేమొ అనుకొని, పంచ్ చేయటానికి ప్రిన్సిపల్ రూం కి వెళ్ళాను. అక్కడ అందరు ఆయాలు గోల గోల గా మాట్లాడు కుంటున్నారు. ఏమయింది నర్సమ్మా, అని అక్కడ ఒక ఆయాను అడిగాను. ఈ లోపల మా ప్రిన్సిపల్ లోపలికి వొచ్హారు. కళ్ళనిండా నీళ్ళు. ఏదోలా ఉన్నారు. మిగతా లెక్చరర్స్ రూం లోకి చేరుతున్నారు.
అమ్మా! మజార్ అన్న సచ్హిపోయిండంట అంది నర్సమ్మ. నాకు ఒక్కసారిగా ఏమి అర్ధం కాలేదు. మా ప్రిన్సిపల్ కూడా ఏడవటం మొదలు పెట్టారు. మజార్ కొడుకు ఫోన్ చేసి చెప్పాడట, పొద్దున్నే వాకింగ్ కి వెళ్ళి, హార్ట్ అటాక్ తో అక్కడే పడిపోయాడని. మేమెవరం చాలా సేపు నమ్మ లేక పోయాం.
అంతకు ముందు ఇంటికి వెల్తున్నప్పుడు మజార్ భాయ్ ఇచ్హిన తెల్లగులాబి గుర్తుకొచ్హింది. అంతటి స్వచమైన మనసున్నవాడు మా మజార్ భాయ్. ఇప్పుడు ఆ మనసు మూగబోయింది. నమ్మాల్సిందేనా! ఇలా ఎలా జరుగుతుంది అనిపించింది. మనిషి ఒక్కసారిగా మయమైపోతే ఎలా!
అందరం గుండే చిక్కబట్టుకొని ఎక్కడో ఓల్డ్ సిటీలో మారుమూల ఉన్న మజార్ భాయ్ ఇంటికి వెళ్ళాం.
అతని భార్యని చూశాను, నేనిచ్హిన చీరే కట్టుకొని ఉంది. ఆ కొంగుతోటే మొహం కప్పుకోని హృదయవిదారకంగా ఏడుస్తోంది...నాకు కళ్ళు చీకట్లు కమ్ముకున్నై...ఏమీ కనిపించటం లేదు.. వినిపించటం లేదు...గుండె గొంతులో అడ్డు పడిపోయింది.
ఇంత తెల్లవారినా ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు... ఇంక ఎప్పటికీ లేవనంత మొద్దు నిద్ర...
అయ్యో, అదేంటి, మాకు ఎప్పుడూ ఎంతో అందమైన పూలు నవ్వుతూ ఇచ్హే నీకు ఇప్పుడు ఒక్క పూవు కూడా లేదా!
చుట్టుపక్కల ఒక్కపువ్వు కూడా కనిపించలేదు. అవును మరి ఇవాళ పూలు ఎవరూ కోయలేదు కదూ!
ఈ లోకం లోని నీ చివరి రోజున నీ కోసం మేము తెచ్హిన గులాబి మాలా తీసుకో భాయ్!!!
ఆ నవ్వు చెదరనే లేదు. ఎంత ప్రశాంతంగా ఉన్నావ్ భాయ్!..... ఆ రోజెలా గడచిపోయిందో గడచిపోయింది....ఇంక అంతే!
ఇప్పుడు నన్నెవ్వరూ రోడ్ దాటించే వారు లేరు. మా గేట్ దగ్గిర పూల సువాసనలు అసలే లేవు.
పిల్లల బురఖాలు కూడా అక్కడ లేవు.
కొత్త వాచ్ మాన్ వొచ్హాడు. గార్డ్ రూం లో ఇప్పుడు సిగరెట్ వాసనలే తప్ప పూల వాసనలేవి!
పండగొస్తే పూలెక్కడో కొనుక్కుంటున్నాం. నా కిష్టమైన తెల్ల గులాబి ఇప్పుడక్కడ కనిపించటం లేదు.
నవ్వుతూ స్వాగతం చెప్పి, జాగ్రత్తగా ఇంటికి పొమ్మని చెప్పే మా మాజార్ భాయ్ మాకు చెప్పకుండానే, మేము ఏమి చెప్పుతామో వినకుండానే, వెళ్ళిపోయాడు.
ఇది అన్యాయం కదూ! ఎందుకు నీకంత తొందర. మా గేట్ కళే పోయింది. అక్కడి పూల, పండ్ల తోరణాలు మాయమైపోయినై.
సుఖం: రెండక్షరాలు
బాధ: రెండక్షరాలు
అక్షరాలు రెండే అయినా భావాలు కోటి రాగాల తీరు...
అంతా మాయ.. పుట్టుకే మాయ... చావు మాయ... లోకమే మాయ...
"చుక్కల్లో కెక్కినాడు చక్కనోడు"... ఇది మాత్రం కరెక్టే.
*******************************************************************************
14 కామెంట్లు:
ekkadO tagilindi.......mazar gaari atmaku shanti kalagaalani......
చాలా బాగుంది.
మంచి వాళ్ళనెపుడూ భగవంతుడు తన దగ్గరే ఉంచుకుంటాడు. మీ శైలి చాలా బాగుంది.
కళ్ళనుంచి అప్రయత్నం గా నీళ్ళు వచ్చాయి. ఏమిటో అయ్యో అనిపిస్తోంది.. ప్చ్హ్... చాలా బాగా రాస్తున్నారు జయ...
నీకే కాదు నాకు,అమ్మకు కూడా మీ మజార్ భాయ్ పూలు గుర్తుకువస్తాయి . పండగలకి అతనిచ్చాడని నువ్వు తెచ్చేపూలు ఇప్పుడులేవే అనుకుంటాము.
మజార్ భాయ్ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
జయ అక్క ఏడుపొచ్చేసిందండి.....
నాకూ మా అమ్మకు కూడ.....
మజార్ భాయ్ మీ రాతలలో చిరంజీవి అయ్యాడు....
ఇది జరిగి ఎన్నాళ్ళయ్యిందండి?
మనసుని కదిలించారు మీ మజర్ భాయ్..అలాంటివారు చాలా అరుదు.. may his soul rest in peace..
@వినయ్ చక్రవర్తి గారు మీకు నా కృతజ్ఞతలు.
@శ్రీనిక గారు, నిజమే మంచివాళ్ళను తొందరగా దేవుడు తనదగ్గరికి తీసుకెళ్ళిపోతాడు. దేవుడికెంత స్వార్ధమో!
@ భావన గారు, ఇప్పటికీ తలచుకున్నప్పుడల్లా, కళ్ళుచెమరుస్తూనే ఉంటాయి.
@అక్కా! ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకున్న మజార్ భాయ్ ఆత్మ తప్పకుండా శాంతిస్తుంది.
@అవును తమ్ముడూ, తొందరగా మరచిపోవటం కష్టమే. అమ్మకి నా నమస్కారాలు చెప్పండి.
@తృష్ణా, ఇది జరిగి సంవత్సరం దాటింది. అయినా ఇప్పటికీ పచ్హి పుండే...
ఫస్ట్ అఫ్ ఆల్ అతని మంచి మనసుకు, వ్యక్తిత్వానికి హేట్సాఫ్ చెప్పాలని ఉంది నాకు...ఏంటో నిజంగా అలాంటి మంచివారే అలా అర్ధాంతరంగా చెప్పాపెట్టకుండా మనల్ని విడిచిపోతుంటారు...
మంచి కధనంతో బాగా రాసారు జయగారు...
శేఖర్ గారు ఇలాంటి వాళ్ళను మరచిపోలేము. అందుకే అప్పుడప్పుడు ఇలా తలచుకోవటం.
మరో "మజార్ భాయ్" మా రాయప్ప! నిజమే ఇలాంటి వాళ్ళని మనం మరవలేము.
బాగా చెప్పారండి ఉషా గారు. ఇలాంటి వాళ్ళను అసలు మరచిపోగలమా!
చాలా చాలా బాధనిపించిందండి.. చదివిన మా పరిస్థితే ఇలా ఉంటె, అతనితో అనుబంధం ఉన్న మీకు ఎలా ఉంటుందో ఊహించగలను...
మురళి గారు, ఎప్పటికీ మా మాజార్ భాయ్ ని మర్చిపోవటమే ఉండదండీ. ఇంత అభిమానం చూపించే వాళ్ళు చాలా తక్కువ. నా బాధ పంచుకున్నందుకు కృతజ్ఞతలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి