
ధనమేరా అన్నిటికి మూలం. ధనం లేక పోతే మనుగడే లేదు. మరి ఈ ధనం ఎలా సంపాదించాలి. ఈ రోజుల్లో మారిపోతున్న అనేక పరిస్థితుల్లో, పెరిగిపోతున్న ధనపు విలువల్తో, కావాల్సినంత ధనం ఎలా సంపాదించాలి మరి?
ఏ చదువులు చదవాలి? ఏ వృత్తులు చేయాలి? ఏ వృత్తిలో ఎక్కువ ధనం సంపాదించి, కాలిమీద కాలేసుకొని తృప్తిగా జీవించగలం? ధనమిచ్చే ధైర్యం ఏ వృత్తిలో లభిస్తుంది?
ప్రస్తుతం వెయ్యి డాలర్ల ప్రశ్న ఇది. ఏ వృత్తిలో ఉన్నా, స్థిరత్వం లేదు. రక్షణ లేదు. కలకాలం అదే కొనసాగించగలమన్న ధీమా లేదు.
ప్రభుత్వ ఉద్యోగాల వైపు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. జీతభత్యాలు సక్రమంగా ఉంటాయని, ఉద్యోగ భద్రత ఉంటుందని, టైం కి పోయి టైం కి రావటమే అని, హాయిగా తన కుటుంబంతో చీకూ చింతా లేకుండా జీవితం సంతోషంగా గడపొచ్చని వారి ఆశ. కాని ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతున్నారు. ప్రస్తుతం గవర్న్మెంట్ రిక్రూట్మెంట్స్ అన్నది లేనే లేదు. క్రమంగా అంతా ప్రైవటేజేషనే కదా! ఎన్.టి.ఆర్. కాలంలోనే ఆపేశారు. ఇక్కడొక చిన్న విషయం గుర్తుకొస్తుంది. 1994 లో అప్పుడే ఉద్యోగాల్లో పార్ట్ టైం లెక్చరర్లు గా చేరిన మేము మా జాబ్స్ రెగ్యులరైజేషన్ కోసం స్ట్రైకులు, నిరాహార దీక్షలు మొదలు పెట్టాం. అప్పుడు ఎన్.టి.ఆర్. అపోజిషన్ పార్టీ లీడర్. అసెంబ్లీ లో మా ఇస్స్యూ ఉందంటే మేము కూడా కొంతమందిమి ఆ సెషన్స్ కి వెళ్ళాం. అనుకున్నట్లుగానే మా ఇస్స్యూ రైజ్ అయ్యింది. ఎన్.టి.ఆరే మాట్లాడారు.
ఏమీ...ఆ పార్ట్ టైం లెక్చరర్లూ...
ఏమీ...ఆ టెంటులు....
ఏమీ ...ఆ నిరాహార దీక్షలు...
ఈ అసమర్ధ నిరర్ధక ప్రభుత్వమేమి చేయుచున్నది...
ఉద్యోగులతో ఆటలాడుట మీకు ధర్మమేనా?... అని ఇంకా ఏదో తన ధొరణిలో ప్రభుత్వాన్ని ఆవేశంగా ఏదో అడగ బోతున్నారు. కాని అంతలోనే పక్కనే కూచున్న చంద్రబాబు గారు ఆయన చేతి మీద గోకుతూ, లాగి, గుంజి, కూచోపెట్టారు. అప్పటి విద్యాశాఖ మంత్రి జనార్ధనరెడ్డిగారు మాత్రం ఊరుకున్నారా? లేదు. వెంఠనే లేచి 1982 లో మీ ప్రభుత్వమే కదండి రిక్రూట్మెంట్స్ బాన్ చేసింది. ఇప్పుడు మేమేం చేయగలం. మీ తప్పులు సవరించటంతోటే మాకు సరిపోతోంది అన్నారు. సరే, మమ్మల్ని ఎన్నో తీవ్ర ప్రయత్నాల తరువాత, అతికష్టం మీద 1998 లో రెగులరైజ్ చేశారు. ఇప్పుడు ఆ అవకాశాలు కూడా లేవే?
అదండీ సంగతి. ఈనాటి వరకు ప్రభుత్వ ఉద్యోగాలే లేవే? మరి ఎలాగా? ఎన్నో నోటిఫికేషన్స్ ఒస్తాయే తప్ప రిక్రూట్మెంట్స్ లేవే? ప్రభుత్వ ఉద్యోగాల మీద ఏమని ఆశలు పెట్టుకోవాలి? ఓ.కే...ఒకవేళ సంపాదించుకున్నా, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో, ఏ కారణంతో ఊస్ట్ అయిపోతారో, సస్పెండ్ అవుతారో చెప్పటం కష్టం. ఏ ల౦చాలో తీసుకున్నార౦టారు. ఇంక జాబ్ సెక్యూరిటీ ఎక్కడ? ఇప్పటి చాలా ఉద్యమాలకి కారణాలు ఉద్యోగాలే కదా!!! ఐ.టి. ఉద్యోగాల్లో మొదలైన ఒడుదుడుకులూ తెలిసినవే! అ౦దరూ వలసపోయిన వారేగా!!! ఇక్కడి భద్రత మాత్ర౦ ఎ౦త?
పోనీ వ్యాపారాలు చేసి కోటీశ్వరులైపోదామన్నా, వ్యాపారాలు చేయగలిగే సామాన్యులు ఎంతమంది ఉన్నారు? వ్యాపారస్థులు ఎన్నో టెన్షన్స్ తో పగలూరేయి కష్టపడుతూ చివరికి కుటుంబాలకి దూరమై, తీవ్రమైన మనస్తాపంతో యాంత్రిక జీవితం గడుపుతారని, ఎన్నో విమర్శలు ఉన్నాయ్. వాళ్ళ జీవితాల్లో డబ్బు మానవ సంబంధాలకే విలువ లేకుండా చేస్తుందని ఒక నమ్మకం. ఎప్పుడు ఏ నష్టాన్ని ఎదుర్కొంటారో, ఓడలు బండ్లే అవుతాయో చెప్పలేరు. చిన్న వ్యాపారస్థులకు ఇ౦తకన్నా అస్థిరమైన జీవితమేగా? మరెలా!!!
పోనీ హాయిగా, అందమైన పల్లెటూళ్ళల్లో, తృప్తిగా, నీడపట్టున చక్కటి వ్యవసాయం చేసుకుంటూ, ఆనందమయమైన రైతన్న జీవితంతో, స్వతంత్ర్యంగా దేశాన్నే పోషిస్తూ రాజులాగా బతికితే ...ఏమో!!! అవీ కలలే అవుతున్నాయి. పట్టణాల్లో కన్నా పల్లెల్లోనే కరెంట్ ఉండటంలేదు. గొప్ప గొప్ప ప్రాజెక్టుల నుండి ప్రవహించే కెనాల్స్ తో వారికి ఒచ్చే నీటి సౌకర్యమెంత. ఆధునిక పద్ధతులతో చక్కటి వ్యవసాయం నిర్వహించే వసతులు ఎంతమంది కి అందుబాటులో ఉన్నాయి. ఊళ్ళకు ఊళ్ళే ఎండి పోతున్నాయి. ఎంతమంది అన్నదాతలు ఉన్న ఆస్థులను తెగనమ్మి వలసపోయి దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారో...గమనిస్తుంటే కంటినీరు ఆగదు. పల్లెటూళ్ళు ఖాళీ అవుతున్నాయట.
ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా, చక్కటి లలిత కళల మీద ఆధారపడి ఓ అద్భుతమైన జీవితం గడిపేస్తే...ఎలా ఉంటుంది. తరాల తరబడి ఎంతోమంది ప్రసిధ్ధ కళాకారులు ఉన్నారుగా!!! నృత్యమో, సంగీతమో, చిత్రలేఖనమో, సాహిత్యమో, ఇతర ఏ కళనో చక్కటి సంపాదన ఇస్తే, కీర్తి ప్రతిష్టలతో దర్జాగా బ్రతికేయొచ్చు. అయ్యో! ఆయా ర౦గాలలో, పోటీ కన్నా అణగదొక్కే ఈర్ష్యాధ్వేషాలే ఎక్కువుగా ఉన్నాయే. ఎంత పరిపక్వత సాధించిన వారికైనా కేవలం వారి శక్తిసామర్ద్యాల మీద ఆధారపడి అవకాశాలు లభించవే... మరెలా!!!
భార్యా భర్తలిద్దరూ కష్టపడితే బాగుంటుందంటారా! అబ్బా...ఒద్దండీ...హాయిగా భర్త సంపాదిస్తే, భార్య ఇంట్లో ఉండి, పెద్దలను, పిల్లలనూ చూసుకుంటూ, అన్ని సౌకర్యాలతో...ఈ జీవితమే సఫలమూ.. అని పాడుకుంటుంటే...బాగుంటుందండి... హూష్...య్యా.....అ౦తా భ్రా౦తియేనా!!!
అసలు...డబ్బన్నదే లేని లోకము౦టే.... పోనీ కావాల్సినవన్నీ ఇచ్చే అక్షయపాత్ర దొరికితే!!!
చీకటిని చూసి భయపడుతూ ఉ౦టాము. ఎ౦దుక౦టే అక్కడ ఏము౦దో కనిపి౦చదు కాబట్టి. అదే ఒక చిన్న దీప౦ వెలిగి౦చుకు౦టే!!!
ఏమి సేతురా లింగా! ఏమీ సేతురా!!! అన్న తత్వమే పాడుకోవాలా?
గెలవాలన్న తపన బలీయంగా ఉన్న చోట ఓటమి కాలైనా పెట్టలేదు!!!!....

******************************************************************************