17, జులై 2010, శనివారం

గాజులు-శఠగోపం!!!




నాకో అలవాటు ఉంది. ఏంలేదు, సాయంత్రం ఇంటికి రాగానే, చేతిగాజులు, మెడలోవి(మంగళసూత్రం తప్ప), చేతిలోవి, చెవివి ఆభరణాలు అన్నీ తీసిపెట్టేస్తానన్నమాట. మళ్ళీ మర్నాడు బయటికి వెళ్ళేప్పుడే అవి తిరిగి నా ఒంటిమీదకి చేరుతాయి. ఈ లోపల ఎటైనా బయటికి వెళ్ళినా హాయిగా అలాగే వెళ్ళిపోతాను. అవన్నీ తీసేసినాక నాకెంతో ఫ్రీ గా ఉంటుందిమరి.

రోజూ సాయంత్రం పార్క్ కెళ్ళి కాసేపు వాకింగ్ చేసి అక్కడి ఫ్రెండ్స్ తో కాసేపు హస్క్ వేసుకునే అలవాటు కూడా నాకుంది. పార్క్ కెళ్ళి ఓ నాలుగైదు రౌండ్స్ నడిచాక, నాకోసం చూస్తున్న నా ఫ్రెండ్ దగ్గరికెళ్ళి కూచున్నాను. రోజూ ఈ రోడ్డు దాటి వచ్చేటప్పటికి నా తలప్రాణం తోక కొస్తోంది తల్లీ, ఈ సర్కస్ ఇంక నేను చేయలేను... మా ఇంటి చుట్టే రౌండ్స్ కొట్టుకుంటానమ్మ, ఇంక నేను పార్క్ కి రాను గాక రాను అని అన్నాను మా ఫ్రెండ్ తో. తను నాగోడు ఏమాత్రం వినిపించుకోకుండా, నీ ధైర్యసాహసాలు తెలియందెవరికి గాని గుడికిపోదాం కొంచెం తోడురా అంది. మొత్తం మనిషినైతే రాగలనమ్మ, కొంచెం మనిషినెలా వస్తాను...అయినా ఈ రాత్రిపూట ఇప్పుడు గుడికెందుకు అనడిగాను. అబ్బా, యక్షిణి ప్రశ్నలేయకుండా ఏ పని చేయవు కదా నువ్వు. మాట్లాడకుండా రా అంది. యక్షిణి ప్రశ్నలు అన్నది యక్షప్రశ్నలకు స్త్రీలింగం కాదనుకుంటా, అని నా అనుమానం వ్యక్తం చేశాను. ఇంక కామెంట్స్ మాని ఉరిమి చూడ్డం మొదలుపెట్టింది. బాబోయ్, నీ ఉరుములు మెరుపులతో మళ్ళీ వర్షం వచ్చేట్లుంది, పద తొందరగా పోయొచ్చేద్దాం. ఇప్పటికే చాలా చీకటి పడింది, అని బయిలు దేరాను. అబ్బో నిన్నెవ్వరెత్తుకెళ్ళరులే ఈ చీకట్లొ అని తనూ నడక మొదలుపెట్టింది. అక్కడే దగ్గిర్లో ఉన్న ఆంజనేయస్వామి గుడికెళ్ళాం.

హనుమాన్ చాలీసా మనసులో చదువుకుంటూ, భక్తిగా తనతోపాటే నేను కూడా ప్రదక్షిణలు చేశాను. ఓ పదకొండు ప్రదక్షిణాలు చేసాక ఆగింది. తీర్థప్రసాదాలు కూడా తీసుకున్నాం. గుడిలో అయ్యగారు, శ్రద్ధగా కళ్ళుమూసుకొని, రెండు చేతులూ కలిపి దండాలు పెట్టుకుంటున్న మాకు శఠగోపం పెట్టటానికి వచ్చారు. మా ఫ్రెండ్ కి శఠగోపం పెట్టారు. ఇంక నా వంతు. నేనింకా చేతులెత్తి దేవుడివైపే పరవశంగా, మైమరచి చూస్తూ దండాలు పెట్టుకుంటున్నాను. అయ్యవారు ఎంత సేపైనా నాకు శఠగోపం పెట్టకపోవటం తో అయ్యగారి వైపు తిరిగి చూశాను. నా నెత్తిన శఠగోపం తగలగానే కోరుకునే కోరికతో నేను సిద్ధమయ్యాను. అయినా అయ్యగారు శఠగోపం పెట్టలేదు. నా రెండు కళ్ళూ దేవుడి నుంచి మరల్చి అయ్యగారి వైపు తిప్పి ప్రశ్నార్ధకంగా, ఇంకా పెట్టరేం అన్నట్లు చూశాను. ఆయనెందుకో నా వైపు పరమ కోపంగా చూస్తున్నారు. నాకస్సలర్ధం కాలేదు. ఏంటమ్మా, ఇది ముత్తైదు పిల్ల గాజులు లేకుండా గుడికి వస్తారా. ఇంటికెళ్ళి గాజులేసుకురా! అన్నారు. అయ్యోరామా! గాజులకోసమా, ఈ కోపమంతా..ఇప్పుడేం చేయాలి. ముత్తైదు పిల్లో...పండు ముత్తైదువో, ఇప్పుడెలాగా? ఇంటికెళ్ళి గాజులేసుకొని నేనెప్పుడు రావాలి.

ఆంజనేయస్వామి దగ్గిర గాజులు లేకపోతే ఏంటట, పోనీ అమ్మవారైనా కాదుగా అనటానికి. లాభంలేదు. గుడికొచ్చి శఠగోపం లేకుండా ఎలా పోవాలి? అందునా నా ఫ్రెండ్ కి పెట్టి నాకు పెట్టక పోతే ఎంతవమానం. ఏమైనా సరే, నేను శఠగోపం పెట్టించుకోవాల్సిందేనని, ఆ నిముషమే...భీష్మణి ప్రతిజ్ఞ, మంగమ్మ శపధం లాంటివి దబదబా చేసేసుకున్నాను. ఈ అయ్యగారేమో వినిపించుకునేటట్లు లేరు. అదేంటి అయ్యగారు, గుడి కి ఎన్నో రకాల వాళ్ళు వస్తారుకదా! నన్నలా అంటే ఎలా? అన్నాను. ఉహూ.. నా పప్పులేమి ఉడకలేదు, కాదుకదా కనీసం నాననైనా లేదు. చూడమ్మా నీకు గాజుల అర్హత ఉందని నాకు తెలుసు కదా! ఈ గుడికి నువ్వు చాలాసార్లే వచ్చావు కదా! అన్నారు. ఇంతమాటన్నాక ఇంకేం మాట్లాడాలి నేను. ఎవరైనా ఆంజనేయస్వామికి గాజులివ్వకపోతారా!!! అవి ఓ రెండేసుకుందాం అని చుట్టూ చూశాను. ఎక్కడా ఒక్క గాజు కూడా కనిపించలేదు. బహుశా: ఆంజనేయస్వామికి గాజులివ్వరనుకుంట. అయినా ఘోటక బ్రహ్మచారి గుళ్ళో గాజులెతకటం నాదే తప్పు. లాభంలేదని అయ్యగార్ని బతిమిలాట్టం మొదలుపెట్టాను. ఎప్పుడూ పొద్దున్నే ఫ్రెష్ గా తయారయి గుడికి వెళ్ళేదాన్ని. ఇవాళ రాత్రిపూట ఇలా వెళ్ళాను ఏంచేస్తాం...ప్లీజ్ అయ్యగారు, ఇంకెప్పుడిలా రాను. ఈ ఒక్క సారికి క్షమించేయండి, అని ఏడుపుమొహం పెట్టాను.

ఇహ, నేను ఇంతగా కాళ్ళా వేళ్ళా గోళ్ళా పడ్డాక తప్పదనుకున్నట్లున్నారు. నా నెత్తిమీద శఠగోపం ఠఫీ మని పెట్టారు. అంత ఘాట్టి దీవెనకి తట్టుకోలేక నెత్తిమీద బరాబరా రాసుకుంటూ, మా ఫ్రెండ్ ని, వీలైనంత కోపం గా చూసుకుంటూ బయట పడ్డాను. తనకేమో నన్ను చూస్తున్నా కొద్దీ ముసిముసి నవ్వులొస్తున్నాయి. గుళ్ళో కూచోవాలిగా మరి. అక్కడ ఒక అయిదు నిముషాలు కూర్చోని ఇంటి దారి పట్టాం. "కరముల పైడి కంకణములతో నిను కొలిచెదమమ్మా! తల్లీ, మము కాపాడగ రావమ్మా" అని అమ్మవారి కీర్తన రాగాలాపన మొదలుపెట్టింది మా ఫ్రెండ్. నాకు ఇంకా పుండు మీద ఖారం, ఇంకా ఏవో ఏవో కెమికల్స్ పోసినట్లనిపించింది. ఇప్పుడర్దమయ్యిందనుకుంటా, గాజుల్లేకుండా ఇంకెప్పుడు గుడికి రాకు, అని మా ఫ్రెండ్ నాకు హితోపదేశం మొదలుపెట్టింది. ఔనౌను, నిజమే! నా కర్ధమైందేమిటయ్యా అంటే వేళా పాళా లేకుండా ఫ్రెండ్ మాట వినకూడదని. చాలా ఉక్రోషంతో, కసిగా అనేసాను తనతో....

అంతేనంటారా? గాజులేసుకోకుండా గుడికెళ్ళకూడదా!!!! ఈ అయ్యగారు నన్నెప్పుడూ చూస్తూనే ఉంటారుగా, అందుకనే అలా అనిఉంటారులే. అందర్నీ అనరు. అని సర్దిచెప్పుకుని....నన్ను నేనే ఓదార్చుకున్నాను.....





****************************************************************************

17 కామెంట్‌లు:

sunita చెప్పారు...

hahaha!ghaTTi SaTagoepamae peTTinchukunnaaranna maaTa:-)

శిశిర చెప్పారు...

అమ్మా.. నేనొప్పుకోను.. ఈ పోస్ట్ నాది. సేం ఎక్స్పీరియన్స్ నాకు కూడా. :) మీ మొదటి పేరా నాకు కూడా డిటో డిటో. నాకూ అదే అలవాటు. నాకు మంగళసూత్రం గొడవ కూడా లేదుగా ఇంకా. :) ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటాను. రేపు పెళ్ళయితే మంగళసూత్రం ఉంచుకోవాలి కదా. అప్పుడప్పుడు గొలుసైనా ఉంచుకుని ప్రాక్టీస్ చేస్తే అప్పటికి అలవాటవుతుందేమో అని. ;)

జయ చెప్పారు...

అవును సునిత గారు, ఇక జన్మలో మర్చిపోలేనంత ఘాఠిగా:)



శిశిరా! హమ్మయ్యా, నాకు తోడున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరి తొందరగా ఇప్పటినుంచే ఫ్రాక్టీస్ మొదలుపెట్టకపోతే తర్వాత కష్ఠం. Common make it fast ammaayi:)

A K Sastry చెప్పారు...

ఆ పూజారయ్యవారి వూరు ఖచ్చితం గా వెలం పాలెం అయ్యివుంటుంది!

రాధిక(నాని ) చెప్పారు...

నాకు గాజుల విషయంలో కాదుకాని ,చుట్లు విషయంలో ఇలాగే జరిగింది .

జయ చెప్పారు...

కృష్ణశ్రీ గారు ధన్యవాదాలు. వెలంపాలెం ఎక్కడుంది? దాని విశేషమేమిటండి.


రాధిక గారు మీకు కూడా తప్పలేదన్నమాట గుళ్ళోతిప్పలు:)

శ్రీలలిత చెప్పారు...

అయినా ఆడపిల్ల అన్నాక ఆమాత్రం మొహాన బొట్టూ, చేతులకు గాజులూ లేకపోతే ఎలా మరీ సుకుమారం కాకపోతేనూ...(కాసేపు నేనే ఆ పూజారిగారి ననుకోండి. హహ.) (మనలో మన మాట...నేను కాళ్ళకు మట్టెలు పెట్టుకోను. వెండి పడదు. అలర్జీ లా వచ్చేస్తుంది. అందరూ నన్ను మహాపరాధం చేసేసినట్టు చూసేవారే..మీ లాంటి అనుభవాలే.. ) బాగా రాసారు.
అవునూ, ఫొటో మార్చేసారే.. ఇది కూడా బాగుంది..

సుజాత వేల్పూరి చెప్పారు...

మొత్తానికి మీరు గాజుల్లేకుండా వచ్చారన్న కోపంతో శఠగోపం మరీ గాఠ్ఠిగా పెట్టేశారన్నమాట పూజారి గారు. మా బామ్మ ఇలాగే పెళ్ళయ్యాక మట్టి ఎన్ని బంగారు గాజులున్నా, మట్టి గాజులేసుకోవాలి అని క్లాసు తీసుకుంటూ ఉంటుంది. ఆ గలగలలు ఆఫీసులో ఇబ్బందిగా ఉంటాయని చెప్తే వినిపించుకోదు.పెద్దతనం కొంత,చాదస్తం కొంతా అని సరిపెట్టుకోవలసిందే .

మంగళ సూత్రం గొలుసుకు సేఫ్టీ పిన్స్ ఉండకూడదని..ఇలాగే ఏవేవో!

అయినా మీరు మరీ, ఆంజనేయ స్వామి గుళ్ళో గాజులు వెదికారా? హ హ!

శివరంజని చెప్పారు...

జయ గారు నాకస్సలు తెలియదు ఈ విషయాలన్ని..... మంచి విషయాలు చెప్పారు

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

జయ గారూ మీ మట్టిగాజుల పోస్టింగ్ చాలా వెరైటీగా వుంది.
మీ ఎక్స్పీరియన్స్ చెబుతూనే మట్టి గాజుల ప్రాముఖ్యతను చక్కగా చెప్పారు.

ఫొటో బాగుంది.

జయ చెప్పారు...

@ పర్లేదండి, శ్రీలలిత గారు చెప్పినా నేను వింటాను. ఇప్పుడు ఒక్కొక్కరి అనుభవాలు నాకు తెలిసి వస్తున్నాయి. సో, నేను ఒంటరి దాన్ని కాదన్నమాట. అవునండి, ఫొటో మార్చాలనిపించింది. ఇప్పుడు పెట్టిన పిల్ల, ఫొటో ముద్దుగా ఉంది కదూ!!!


@ అవునండి సుజాత గారు, ఆ పూజారిగారు పెట్టిన శఠగోపానికి నాకు ’ఏడేడు ముల్లోకాలు’ కనిపించాయి?:))) ఏడేడు ముల్లోకాలు ఏమిటి అని అడగకండి:) అలా ఈ పదాలను వాడాలనిపించింది. అంటే నా కళ్ళు గింగిరాలు తిరిగిపోయాయన్నమాట:) మంగళ సూత్రానికి అవీ ఇవీ పెట్టే అలవాటైతే నాకు లేదులెండి. కాని ఇది మాత్రం కొత్త విషయమే. ఆంజనేయ స్వామివారి గుళ్ళో గాజులెతకాల్సిన పరిస్థితి తెచ్చారు ఆ పూజారిగారు నాకు.

జయ చెప్పారు...

@ శివరంజని గారు, ఇలాంటివి మీరు ఇంకా ఎన్నెన్ని నేర్చుకోవాలో. మన ఫ్రెండ్స్ చెప్పిన ఈ విషయాలన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి మరి. ఎంతసేపు క్రీడాకారిణి అయిపోతా అంటే సరిపోతుందా:)



@కొత్తపెళ్ళికూతురు రాజి గారు, మరి జాగ్రత్తగా అన్నీ ఫాలో అయిపొండి మరి:)

Bhãskar Rãmarãju చెప్పారు...

ఆ పుటో ఎవుర్దోగాని మాంచి నికార్సైన తమిళంలా ఉంద్యే

జయ చెప్పారు...

నాకూ తెల్వద్ సార్!!! నెట్ల కెల్లి ఎత్తుకొచ్చిన:(

మురళి చెప్పారు...

ఆంజనేయస్వామి గుళ్ళో గాజులు వెతకడం ;-) :-) :-) ...ఇంకా నవ్వుతూనే ఉన్నానండీ.. కోపగించుకోవద్దు ప్లీజ్..

జయ చెప్పారు...

మురళి గారు మీరు వచ్చాక నిజంగా ఎంత ఆనందంగా ఉందో! అయ్యో రామా, నేను చేసిన పనికి మీ మీద నాకు కోపమేమిటి.

జయ చెప్పారు...

మురళి గారు మీరు వచ్చాక నిజంగా ఎంత ఆనందంగా ఉందో! అయ్యో రామా, నేను చేసిన పనికి మీ మీద నాకు కోపమేమిటి.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner