3, అక్టోబర్ 2010, ఆదివారం

"నీ ఉజ్వల భవిష్యత్తు కోరుతున్నానురా కన్నా!!! "

బుజ్జులు,

నిన్న, అదే అక్టోబర్ 2 న నీ పుట్టినరోజు. యాపీ యాపీ బర్త్ డే కన్నయ్యా....

స్కూల్ వాన్ దిగుతుంటే నేను ఎదురు రాకపోయినా, పక్కింటి ఆంటీ తో మాట్లాడుతూ ఒక్క నిముషం నిన్నుచూడక పోయినా ఎంత అలిగే వాడివో. స్కూల్ వాన్ తలుపులో నీ చేయి వేలు పడిందని, మన చుట్టు పక్కల వాళ్ళంతా వొచ్చి చేరేలా నువ్వేడ్చినా, నేను బయటికి రాలేదని, అసలు ఇంట్లోనే లేనని ఎన్ని రోజులు గొడవ పెట్టావో. నేనొచ్చేవరకూ, చేతిలో గడ్డి పరకలు, ఇంకా ఏవేవో పట్టుకొని, హకల్బెరీఫిన్ లాగా నీలోనువ్వే ఏవేవో మాట్లాడుకుంటూ ఆక్ట్ చేస్తూ ఉండే వాడివి. ఇంట్లో కూడా నీరూంలో నువ్వు చదివిన బుక్స్ అన్నింటిలో రకరకాల డైలాగ్స్ గట్టిగా మాట్లాడుతూ ఫైటింగ్స్ కూడా చేస్తూ ఉండే వాడివి. నీ గదిలోంచి రకరకాల శబ్దాలు వినిపించేవి. ఒకసారి ఎవరో మీకెంతమంది పిల్లలండీ చాలా గోలగా ఉంటుంది అని కూడా అడిగారు. ఒక్కడే అంటే వాళ్ళు నమ్మనేలేదు.

గాంధీ పుట్టినరోజే నువ్వూ పుట్టావు శాంతంగా ఉండాలి, నువ్వు పేరుకి మాత్రమే శాంతం అంటే...నేను గాంధీ కాదుకదమ్మా అని నవ్వేస్తావు.

నీ పుట్టిన రోజని హారతిచ్చి, తాతయ్యకు, నానికీ కాళ్ళకు దండం పెడితే నీ కాళ్ళక్కూడా దండం పెట్టాలని ఎంత గొడవ చేసే వాడివో గుర్తుందా.

చిన్నప్పుడు నీ పుట్టిన రోజంటే చాలా హడవిడి చేసే వాడివి. అందరూ రావాల్సిందే. ఇంటినిండా బలూన్లు నీ ఫ్రెండ్స్ తో కట్టించే వాడివి. చివరికి పనమ్మాయి కూతురు రాకపోయినా వాళ్ళ ఇంటిముందే నిలబడి, ఏడ్చి రాగాలు పెట్టి, బతిమలాడుకొని మరీ తీసుకొచ్చే వాడివి. ఆ పిల్లేమో భయంతో బిక్కమొహం వేసేది. మీ అందరికీ ఎన్నో రకాల గేంస్ పెట్టి రకరకాల బహుమతులిస్తే చాలా గొప్పగా ఫీలయ్యే వాడివి.

కిరీటాలు, రకరకాల పెద్ద పెద్ద రాజుగారి నగలు, ఆయుధాలు ఎన్ని కొనిపించేవాడివో. ఇంటి నిండా అవే.

పిలిచిన పేరుతో పిలవకుండా, రకరకాల పేర్లతో పిలుస్తావమ్మా, నా మొత్తం పేరుతో పిలిచావంటే మాత్రం నా మీద నీకు కోపం వచ్చినట్లు లెఖ్ఖ, అని ఇప్పటికీ నవ్వుతావ్.

నాతో కావాల్సిన లెసెన్స్ అన్నీ చెప్పించుకొని...నేనేమన్నా నీ స్టూడెంట్నా నా మీద అరుస్తున్నావు ...అనుకుంటూ దర్జాగా వెళ్ళిపోయేవాడివి.

నీ బర్త్ డే కి ప్రతిసారి హాలిడే వస్తుందని, స్కూల్లో శలవివ్వద్దని చెప్పమని ఎంత రభస చేసే వాడివో. చివరికి ఎసెంబ్లీ లో అనౌన్స్ చేయిస్తే, ఒక రోజు ముందుగానే అందరి విషెస్ తో, మహా ఆనందంగా ఇంటికొచ్చే వాడివి. అంతేనా! మర్నాడు స్వీట్స్ కూడా తీసుకెళ్ళే వాడివి. మొత్తానికి ప్రతిసారి నీ పుట్టిన రోజు రెండేసి రోజులు చేయించే వాడివి. గుర్తుందా, బేటా.

ఇప్పుడు పుట్టినరోజుకి ఇంట్లో పార్టీలు కాకుండా, నీ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నావు. కేక్ కటింగ్, అర్ధరాత్రి ఫ్రెండ్స్ విషెస్ మొదలయ్యాయి. హొటల్ కొద్దురా మటన్ కలుస్తుంది అంటే, మటన్ ముక్కలు మా ఫ్రెండ్ తో తీసేయిస్తాలే అంటావు. మోపెడ్ ఎక్కుతా అంటావు. కిందపడ్తావురా అంటే అస్సలు వినిపించుకోవు. ఇంటికొచ్చే వరకు ఎంత భయమేస్తుందో తెలుసా. మోపెడ్ కొనివ్వలేదని ఇంకా అలుగుతూనే ఉన్నావు. మోటర్ సైకిల్ మీద పోతున్న స్టూడెంట్స్, వాళ్ళ స్పీడ్ చూస్తే ఎంత భయమేస్తుందో, అదెంత డేంజరో చెప్తె వినవు. అన్నిటికీ ఇట్లా భయపడితే ఎట్లా అంటావు గాని, రోజూ చూస్తున్న ఆక్సిడెంట్స్ తో నా మనస్సు ఒప్పుకోటంలేదురా బాబులూ.

నువ్వు ఎదిగి ఎదిగి ఎంతో పెద్దవాడివై, నిండునూరేళ్ళు, సుఖశ్శాంతులతో, ఆనందమయ జీవితం గడపాలిరా, బంగారుతండ్రి..

చింటుగాడా, నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా:) నీ పుట్టిన రోజునే నా "మనస్వి"లో కూడా రాయటం మొదలు పెట్టాను.

నీవు ధనరాశులు సంపాదించకపోయినా...మంచిపేరు సంపాదించుకో బాబా. నువ్వెంత అల్లరివాడివైనా, అమ్మ మాట నీకు ప్రాణమని నాకు తెలుసురా చిన్నా! వింటావు కదురా, అమ్మలూ!!!

ప్రేమతో అమ్మ.


***************************************************************

22 కామెంట్‌లు:

sunita చెప్పారు...

Many many happy returns of the day ChinTu.( I am sorry I don't know his name jaya gaaroo)

jaggampeta చెప్పారు...

ujvalangaa undaalani koruthoo

భాను చెప్పారు...

జయ గారు మీ చింటూ భవిష్యత్తు మీరు కోరుకున్నట్లు ఉండాలని ఆశిస్తూ

అజ్ఞాత చెప్పారు...

Many Many Happy Returns of the DAY to ur son, Jayagaaru!

శిశిర చెప్పారు...

మీ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు జయగారు.

anveshi చెప్పారు...

"నీవు ధనరాశులు సంపాదించకపోయినా...మంచిపేరు సంపాదించుకో"

దీనికి మించిన ఆశీర్వచనం ఉండదనుకుంటా :)
Many happy returns of the day

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

మీ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు

జ్యోతి చెప్పారు...

మీ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు

మురళి చెప్పారు...

నా శుభాకాంక్షలు కూడా అందజేయండి జయ గారూ..
అలాగే మనస్వి కి కూడా...

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

జయ గారూ మీ కన్నయ్యకు మీరు కోరినట్లుగానే భగవంతుడు ఉజ్వలమైన భవిష్యత్తు ప్రసాదించాలని కోరుకుంటూ
మీ అబ్బాయికి జన్మదిన శుభాకాంక్షలు..

మాలా కుమార్ చెప్పారు...

నీ పుత్రుని కి ,
నీ మానస పుత్రిక మనస్వి కి ,
పుట్టిన రోజు శుభాకాంక్షలు .

శివరంజని చెప్పారు...

మీ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు జయగారు. మీరు కోరుకున్నట్టే మీ అబ్బాయి భవిష్యత్ గొప్పగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

భావన చెప్పారు...

మీ అబ్బాయికి పుట్టిన రోజు శుభాకాంక్షలు జయ గారు. మీ మనస్వి కి కూడా. మన భయాలు వాళ్ళకు అలానే నవ్వులాట గా వుంటాయి. ముద్దు గా వున్నాడు చింటు. Many Many Happy returns of the day dear Chintu. Wishing you all the best in all the endeavors you take up my dear -- Uma Aunty.

రాధిక(నాని ) చెప్పారు...

లేటుగా చెబుతున్నందుకు ఎమీ అనుకోకండి.మీ చిన్టు,బుజ్జులు,మీ బాబుకి నా పుట్టినరోజు శుభాకాంక్షలుతెలపండి .అలాగే మీ మనస్వికి కుడా

జయ చెప్పారు...

సునిత గారు
జగ్గంపేట్ గారు
భాను
R.S. రెడ్డి గారు
శిశిర
అన్వేషి గారు
చిలుమకూరు విజయమోహన్ గారు
జ్యోతి గారు
రాజి
మురళి గారు
అక్కా
శివరంజని
భావన
రాధిక(నాని)

ఎంతో విలువైన మీ ప్రతీ ఒక్కరి ఆశీర్వచనాలకు హృదయపూర్వక ధన్యవాదాలు......జయ

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

జయగారు ,కొంచెం లేటయిందేమో అయినా సరే
మీరు కోరినట్లుగానే మీ అబ్బాయికి ఉజ్వలమైన భవిష్యత్తు కలగాలని కోరుకుంటూ
మీ అబ్బాయికి జన్మదిన శుభాకాంక్షలు .

జయ చెప్పారు...

భాస్కర రామి రెడ్డి గారు, అశీర్వచనాలన్నవి ఎప్పటికీ అవసరమే. ఇందులో ఆలస్యమేముందండి. నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీకు నా మనస్పూర్వక ధన్యవాదాలు.

కొత్త పాళీ చెప్పారు...

మీ బాబుగురించి మీరు చెప్పినవన్నీ నేనూ మా అమ్మా మాట్లాడుకున్నట్టుగా ఉన్నయ్యి .. రాజులు కిరీటాలు భలే!
బాబుకి అనేకానేక ఆశీస్సులు.

తృష్ణ చెప్పారు...

belated birthday wishes to ur kanna and i wish him a very bright future.

జయ చెప్పారు...

అవునా కొత్తపాళీ గారు. అయితే మీరు కూడా మీ అమ్మగారిని ఇలాగే ముప్పతిప్పలు పెట్టి మూడుచెరువుల నీళ్ళు తాగించే వారన్నమాట:) మా కిరీటాలు, సిమ్హాసనాలు, కత్తులూ కఠారులకైతే ఓ పెద్ద మ్యూజియం మే పెట్టేయొచ్చు. మీ అంతులేని ఈ ఆశీస్సులు ఎంతో సంబరాన్ని కలిగిస్తున్నాయి. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.


Thank you Trishna.

కొత్త పాళీ చెప్పారు...

@జయ .. ఔను నిజం. చాలా కష్టాలే పెట్టాను. కానీ నా జీవితంలో అతి బలమైన ప్రభావం మా అమ్మదే. అమ్మని గురించి రాయమని కొందరు మిత్రులు ప్రోత్సహించారు గానీ మరీ మన అస్తిత్వంలో భాగమైన దాన్ని గురించి రాయలేం. అందుకే ఇలా వేగుంట మాటల్లో అమ్మకి హారతి పట్టాను.

జయ చెప్పారు...

కొత్తపాళీ గారు, అమ్మ గురించి చెప్పకనే చెప్పిన మీ భావాలు చాలా ఉన్నతమైనవండి. మీరు చాలా అదృష్టవంతులు. చాలా విషయాలు తెలుసుకో గలిగాను. ధన్యవాదాలు.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner