28, ఫిబ్రవరి 2010, ఆదివారం

ఏమి సేతురా లింగా! ఏమీ సేతురా!!!





ధనమేరా అన్నిటికి మూలం. ధనం లేక పోతే మనుగడే లేదు. మరి ఈ ధనం ఎలా సంపాదించాలి. ఈ రోజుల్లో మారిపోతున్న అనేక పరిస్థితుల్లో, పెరిగిపోతున్న ధనపు విలువల్తో, కావాల్సినంత ధనం ఎలా సంపాదించాలి మరి?

ఏ చదువులు చదవాలి? ఏ వృత్తులు చేయాలి? ఏ వృత్తిలో ఎక్కువ ధనం సంపాదించి, కాలిమీద కాలేసుకొని తృప్తిగా జీవించగలం? ధనమిచ్చే ధైర్యం ఏ వృత్తిలో లభిస్తుంది?

ప్రస్తుతం వెయ్యి డాలర్ల ప్రశ్న ఇది. ఏ వృత్తిలో ఉన్నా, స్థిరత్వం లేదు. రక్షణ లేదు. కలకాలం అదే కొనసాగించగలమన్న ధీమా లేదు.

ప్రభుత్వ ఉద్యోగాల వైపు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. జీతభత్యాలు సక్రమంగా ఉంటాయని, ఉద్యోగ భద్రత ఉంటుందని, టైం కి పోయి టైం కి రావటమే అని, హాయిగా తన కుటుంబంతో చీకూ చింతా లేకుండా జీవితం సంతోషంగా గడపొచ్చని వారి ఆశ. కాని ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతున్నారు. ప్రస్తుతం గవర్న్మెంట్ రిక్రూట్మెంట్స్ అన్నది లేనే లేదు. క్రమంగా అంతా ప్రైవటేజేషనే కదా! ఎన్.టి.ఆర్. కాలంలోనే ఆపేశారు. ఇక్కడొక చిన్న విషయం గుర్తుకొస్తుంది. 1994 లో అప్పుడే ఉద్యోగాల్లో పార్ట్ టైం లెక్చరర్లు గా చేరిన మేము మా జాబ్స్ రెగ్యులరైజేషన్ కోసం స్ట్రైకులు, నిరాహార దీక్షలు మొదలు పెట్టాం. అప్పుడు ఎన్.టి.ఆర్. అపోజిషన్ పార్టీ లీడర్. అసెంబ్లీ లో మా ఇస్స్యూ ఉందంటే మేము కూడా కొంతమందిమి ఆ సెషన్స్ కి వెళ్ళాం. అనుకున్నట్లుగానే మా ఇస్స్యూ రైజ్ అయ్యింది. ఎన్.టి.ఆరే మాట్లాడారు.
ఏమీ...ఆ పార్ట్ టైం లెక్చరర్లూ...
ఏమీ...ఆ టెంటులు....
ఏమీ ...ఆ నిరాహార దీక్షలు...
ఈ అసమర్ధ నిరర్ధక ప్రభుత్వమేమి చేయుచున్నది...
ఉద్యోగులతో ఆటలాడుట మీకు ధర్మమేనా?... అని ఇంకా ఏదో తన ధొరణిలో ప్రభుత్వాన్ని ఆవేశంగా ఏదో అడగ బోతున్నారు. కాని అంతలోనే పక్కనే కూచున్న చంద్రబాబు గారు ఆయన చేతి మీద గోకుతూ, లాగి, గుంజి, కూచోపెట్టారు. అప్పటి విద్యాశాఖ మంత్రి జనార్ధనరెడ్డిగారు మాత్రం ఊరుకున్నారా? లేదు. వెంఠనే లేచి 1982 లో మీ ప్రభుత్వమే కదండి రిక్రూట్మెంట్స్ బాన్ చేసింది. ఇప్పుడు మేమేం చేయగలం. మీ తప్పులు సవరించటంతోటే మాకు సరిపోతోంది అన్నారు. సరే, మమ్మల్ని ఎన్నో తీవ్ర ప్రయత్నాల తరువాత, అతికష్టం మీద 1998 లో రెగులరైజ్ చేశారు. ఇప్పుడు ఆ అవకాశాలు కూడా లేవే?

అదండీ సంగతి. ఈనాటి వరకు ప్రభుత్వ ఉద్యోగాలే లేవే? మరి ఎలాగా? ఎన్నో నోటిఫికేషన్స్ ఒస్తాయే తప్ప రిక్రూట్మెంట్స్ లేవే? ప్రభుత్వ ఉద్యోగాల మీద ఏమని ఆశలు పెట్టుకోవాలి? ఓ.కే...ఒకవేళ సంపాదించుకున్నా, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో, ఏ కారణంతో ఊస్ట్ అయిపోతారో, సస్పెండ్ అవుతారో చెప్పటం కష్టం. ఏ ల౦చాలో తీసుకున్నార౦టారు. ఇంక జాబ్ సెక్యూరిటీ ఎక్కడ? ఇప్పటి చాలా ఉద్యమాలకి కారణాలు ఉద్యోగాలే కదా!!! ఐ.టి. ఉద్యోగాల్లో మొదలైన ఒడుదుడుకులూ తెలిసినవే! అ౦దరూ వలసపోయిన వారేగా!!! ఇక్కడి భద్రత మాత్ర౦ ఎ౦త?

పోనీ వ్యాపారాలు చేసి కోటీశ్వరులైపోదామన్నా, వ్యాపారాలు చేయగలిగే సామాన్యులు ఎంతమంది ఉన్నారు? వ్యాపారస్థులు ఎన్నో టెన్షన్స్ తో పగలూరేయి కష్టపడుతూ చివరికి కుటుంబాలకి దూరమై, తీవ్రమైన మనస్తాపంతో యాంత్రిక జీవితం గడుపుతారని, ఎన్నో విమర్శలు ఉన్నాయ్. వాళ్ళ జీవితాల్లో డబ్బు మానవ సంబంధాలకే విలువ లేకుండా చేస్తుందని ఒక నమ్మకం. ఎప్పుడు ఏ నష్టాన్ని ఎదుర్కొంటారో, ఓడలు బండ్లే అవుతాయో చెప్పలేరు. చిన్న వ్యాపారస్థులకు ఇ౦తకన్నా అస్థిరమైన జీవితమేగా? మరెలా!!!

పోనీ హాయిగా, అందమైన పల్లెటూళ్ళల్లో, తృప్తిగా, నీడపట్టున చక్కటి వ్యవసాయం చేసుకుంటూ, ఆనందమయమైన రైతన్న జీవితంతో, స్వతంత్ర్యంగా దేశాన్నే పోషిస్తూ రాజులాగా బతికితే ...ఏమో!!! అవీ కలలే అవుతున్నాయి. పట్టణాల్లో కన్నా పల్లెల్లోనే కరెంట్ ఉండటంలేదు. గొప్ప గొప్ప ప్రాజెక్టుల నుండి ప్రవహించే కెనాల్స్ తో వారికి ఒచ్చే నీటి సౌకర్యమెంత. ఆధునిక పద్ధతులతో చక్కటి వ్యవసాయం నిర్వహించే వసతులు ఎంతమంది కి అందుబాటులో ఉన్నాయి. ఊళ్ళకు ఊళ్ళే ఎండి పోతున్నాయి. ఎంతమంది అన్నదాతలు ఉన్న ఆస్థులను తెగనమ్మి వలసపోయి దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారో...గమనిస్తుంటే కంటినీరు ఆగదు. పల్లెటూళ్ళు ఖాళీ అవుతున్నాయట.

ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా, చక్కటి లలిత కళల మీద ఆధారపడి ఓ అద్భుతమైన జీవితం గడిపేస్తే...ఎలా ఉంటుంది. తరాల తరబడి ఎంతోమంది ప్రసిధ్ధ కళాకారులు ఉన్నారుగా!!! నృత్యమో, సంగీతమో, చిత్రలేఖనమో, సాహిత్యమో, ఇతర ఏ కళనో చక్కటి సంపాదన ఇస్తే, కీర్తి ప్రతిష్టలతో దర్జాగా బ్రతికేయొచ్చు. అయ్యో! ఆయా ర౦గాలలో, పోటీ కన్నా అణగదొక్కే ఈర్ష్యాధ్వేషాలే ఎక్కువుగా ఉన్నాయే. ఎంత పరిపక్వత సాధించిన వారికైనా కేవలం వారి శక్తిసామర్ద్యాల మీద ఆధారపడి అవకాశాలు లభించవే... మరెలా!!!

భార్యా భర్తలిద్దరూ కష్టపడితే బాగుంటుందంటారా! అబ్బా...ఒద్దండీ...హాయిగా భర్త సంపాదిస్తే, భార్య ఇంట్లో ఉండి, పెద్దలను, పిల్లలనూ చూసుకుంటూ, అన్ని సౌకర్యాలతో...ఈ జీవితమే సఫలమూ.. అని పాడుకుంటుంటే...బాగుంటుందండి... హూష్...య్యా.....అ౦తా భ్రా౦తియేనా!!!

అసలు...డబ్బన్నదే లేని లోకము౦టే.... పోనీ కావాల్సినవన్నీ ఇచ్చే అక్షయపాత్ర దొరికితే!!!

చీకటిని చూసి భయపడుతూ ఉ౦టాము. ఎ౦దుక౦టే అక్కడ ఏము౦దో కనిపి౦చదు కాబట్టి. అదే ఒక చిన్న దీప౦ వెలిగి౦చుకు౦టే!!!

ఏమి సేతురా లింగా! ఏమీ సేతురా!!! అన్న తత్వమే పాడుకోవాలా?

గెలవాలన్న తపన బలీయంగా ఉన్న చోట ఓటమి కాలైనా పెట్టలేదు!!!!....







******************************************************************************

25, ఫిబ్రవరి 2010, గురువారం

ప్రేమ లేఖ





ప్రేమ లేఖ
(వాక్యాల గారడి)

ఇంతదాక నీ మీద నేను చూపించిన ప్రేమ
కపటమయినదే గాక, నువ్వంటే ఏహ్యభావము
రోజు రోజుకు అధిక మవుతుంది. నీగురించి ఆలోచించి
న కొద్ది నువ్వంటె అసహ్యం ఇనుమడిస్తుంది నాలో.
చివరికి నేను ఓ చక్కని నిర్ణయానికి వచ్చేసాను.
నీకు దూరమై పోవాలని. నేనెన్నడు అనుకో లేదు
నిన్నుపెళ్ళిచేసుకోవాలని. నిన్నటిదాక మన సంభాషణ
నీ మీద నాకున్న ధ్వేషాన్ని ఎక్కువ చేసింది. ఏవిధంగాను
నీ మీద నాకు సదభిప్రాయము, ఆరధన, ప్రేమ భావము
కలిగించలేదు సరికదా, నువ్వంటే గగుర్పాటు
ఎక్కువ చేసింది. నిన్ను ఇప్పుడు చూసిన నా మీద
జుగుప్స, చాలా పొరపాటు చేసానన్న చింత అ
యిష్టం ఏర్పడి స్థిరపడిపోయింది. అంతేకాదు
నిన్ను నేను ఇప్పుడు ఎంతమాత్రం కోరడంలేదు.
నువ్వే నా జీవితం. నువ్వు లేకపోతే బ్రతుకలేను
అనుకుంటున్నాననే భ్రమలో పడవద్దు.
నువ్వు నాకో చిన్న ఉపకారం చేయాలనుకుంటే
ఈ ఉత్తరం చదివి చింపేయి, దాచకుండా
ఈ ఉత్తరానికి చక్కని సమాధానం వ్రాసే ప్రయత్నం
చేయక నన్ను ఎప్పటికి మర్చిపోయె ప్రయత్నం
చేయి. నీ కన్నా గుణవంతులు, సహ్రుదయులు లోకంలో
కోకొల్లలు. కాని నీలాంటి అవినీతి పరులు
ఉండరనే నా నమ్మకం. అందుకే నా మదిని నీకు
అర్పించలేను. దానిని మరెవరైనా యోగ్యులకు
అంకితం చేసి ఈ జీవితాన్ని చక్కదిద్దుకుంటాను.


గమనిక: పై ఉత్తరాన్ని పూర్తిగా చదివారుగా? ఇప్పుడు మళ్ళీ మొదటినుంచి లైను విడచి లైను చదవండి. తేడా గమనించండి. సరేనా!



************************************************************************

19, ఫిబ్రవరి 2010, శుక్రవారం

చిత్రలేఖనాలు-2

మీకు మళ్ళీ కొన్ని చిత్రలేఖనాలు చూపించబోతున్నాను. శక్తి కొలది మీరు భయపడకుండా ఉండాలని నా విన్నపం. ఇవన్నీ నేను చాలా చిన్నప్పుడు వేసినవి కాబట్టి, అందులో ఘోరమైన తప్పులన్నీ కూడా 'చిన్న తప్పులు ' గా భావించగలరని నా కోరిక. ఎందుకోనండి మరి, ఇవంటే నాకు చాలా ఇష్టమే:) అవున్లెండి, కాకి పిల్ల కాకికి ముద్దు, మాకేంటంట అంటారా! అదీ నిజమే.

ఇందులో నేను ఈ మధ్యే వేసిన రెండు చిత్రాలు కూడా ఉన్నాయి. అవేవో చాలా సులభంగానే కనుక్కోవచ్చులెండి. పెద్ద ఇబ్బందేమి ఉండదు. ఇందులో గనుక తప్పులుంటే మాత్రం అవి 'పెద్ద తప్పులన్న ' మాట.

కొంచెం గుండె చిక్కబట్టుకొని కళ్ళుమూసుకొని చూసేయండేం!!!...














*************************************************************************

13, ఫిబ్రవరి 2010, శనివారం

"అచ్చిపోయిండు"...




ప్రతి రోజు సాయంత్రం పార్క్ లోకి వెళ్ళి కాసేపు వాకింగ్, టాకింగ్ చేయటం నాకలవాటు. అక్కడ బోల్డు మంది ఫ్రెండ్స్. ఒకపట్టాన ఇంటికి పోబుద్ధి కాదు. ఈ మధ్యనే ఆంధ్రా నుంచి కొత్తగా పెళ్ళి చేసుకొని ఇక్కడికొచ్చిన ఒక అమ్మాయి ఇక్కడి భాషతో చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్తోంది. ఏంటబ్బా అంత ఇబ్బంది, అని ఆగలేక ఏమయిందేంటి అన్నాను.

ఆ మధ్య ఎప్పుడో ఆఫీస్ కెళ్ళే హడావుడిలో వాళ్ళాయన షూస్ కనిపించలేదట. ఈ అమ్మాయికి కొత్తకదా, పాపం...హడావుడిగా ఇల్లంతా వెతికేస్తోందిట. అయినా ఎక్కడా కనిపించలేదు. వాళ్ళాయనేమొ టైమయిపోయిందని ఏవో ఒకటి వేసేసుకొని వెళ్ళిపోయాట్ట. వాళ్ళత్తగారు ఆమె కొడుకు చికాగ్గా వెళ్ళిపోయేప్పటికి మనసు నొచ్చుకున్నారట. "అందుకే నేనెప్పుడు సెప్తనే ఉంట. ఏడనో దూరం నుండి పిల్లను తోలుకురావద్దు. నా బిడ్డ బిడ్డని చేసుకొమ్మని ఎంత లొల్లిపెట్టినా ఇనలేదు.ఆడేమో, ఊకె నువ్వూకో, నువ్వూకో అంటడు. అదైతే, మంచిగ ఆర్చుకునేది. అన్నీ జల్ది సేయకుంటె ఎట్లైతది. ఏడున్నాయో సరిగ్గా దేవులాడు...అన్నారట."

ఆ మాటలన్నీ విన్నాక ఆ అమ్మాయికి అయోమయంతో ఇంకా గాభరా పెరిగిపోయిందిట. ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు ఎలాగండీ...అని దిగులు పడిపోయింది. అది విని అక్కడి వాళ్ళంతా ఒకటే నవ్వటం. ఆ నిమిషం లో నవ్వొచ్చినా, తరువాత ఆయ్యో, పాపం అనిపించింది. అనేక ప్రాంతాల్లో రకరకాల భాషలు కదా! అంతా తెలుగే...కాని ఎంత తేడానో!!! అందరూ ఆ అమ్మాయికి ఏవేవో సలహాలు చెప్తున్నారు. మెల్లగా నా మనసు మాత్రం గతం లోని నా అనుభవాన్ని తలచుకోటం మొదలు పెట్టింది.

నేను అప్పుడే నా రిసెర్చ్ అయిపోయి, థీసిస్ సబ్మిట్ చేసి హైద్రాబాద్ లో మా అత్తగారింటి కొచ్చాను. అప్పుడే నేనెంతో ఇష్టపడే ఉద్యోగం కూడా దొరికింది. ఒక పక్క ఇంట్లో కొత్త బాధ్యతలు.ఆ టైం లో ఇంట్లో ఎవరూ లేరు. హాయిగా, నా ఉద్యోగం లో నా కలలెలా నేరవేర్చుకోవాలో ఆలోచించుకుంటూ ఊహాలోకంలో కెళ్ళిపోయాను.

ఇంతలో టక్...టక్...టక్...మని తలుపు చప్పుడినిపించింది. ఎవరా అని ఆలోచిస్తూ తలుపు తీసాను. శ్రీ కృష్ణ పరమాత్ముడి స్టైల్లో దీవిస్తున్నట్లుగా చేయెత్తి మళ్ళీ తలుపు మీద కొట్టబోతున్నాడొకాయన. అక్కడున్నాయనెవరో నాకు తెలీదు. ఎవరు కావాలండీ అని మెల్లగా అడిగాను.

ఆ వొచ్చినాయన "పెద్దయ్యున్నడా?" అనడిగాడు. లేరండి ఏదో పనిమీదెళ్ళారు అన్నాన్నేను.
"అరె, బయటకు పోయిండా! మల్ల నన్ను గిప్పుడే రమ్మన్నడు గందా! అయితె మానె, దొరొచ్చినంక గిట్లా అయితోలు సర్పంచి అచ్చిపోయిండని సెప్పుండ్రి. మళ్ళ ఒకటే ఒర్లుతడు. ఆడ బస్సుల కాడేమో పొద్దుగాల నుండె నూకుతుంటరు. నేను దబ్బున పోకుంటే ఊర్ల లొల్లి పెడ్తరు. ఊకె జబ్బర్దస్తి చేస్తుండ్రు. పుర్సత్ లేకుండైంది." అనేసి గబగబా వెళ్ళిపోయాడు.

తలుపు మూసి లోపలికి ఒస్తున్న నాకు ఇంతకీ ఆ వొచ్చిన వ్యక్తి ఎవరో ఏమిటో, అడగలేదే? ఎక్కడినుంచి ఒచ్చాడో ఏవిటో...ఇప్పుడేం చెప్పాలి నేను. అసలే ఆయన మాట్లాడింది గందరగోళంగా నాకేమి అర్ధం కాలేదు.

మా మామగారు రాగానే, మధ్యాన్నం ఒకాయన ఒచ్చారు. అయితోలు సర్పంచి చచ్చిపోయాడని చెప్పమన్నారు. అని జాగ్రత్తగా విన్న మాటలను గుర్తు చేసుకుంటూ చెప్పాను.

మా మామగారు ఒక్క సారిగా గాభరా పడిపోయారు. మా అత్తగారితో అదే మాట చెప్పారు. "అయ్యయ్యో! చాలా మంచి వ్యక్తి. కపటం లేనివాడు. నేనంటే ఎంతో గౌరవం. నేనక్కడ లేకపోయినా పొలాలన్నీ చాలా శ్రద్ధగా చూసుకుంటాడు. ఏదో నాలుగు మంచి పనులు చేద్దామని, మంచి పేరు సంపాదించుకుందామని అంటూ ఉంటాడు. వయసు కూడా ఎక్కువ లేదు. అప్పుడే పోయాడా! చూట్టానికి బాగానే ఉంటాడే? ఏ జబ్బులు గట్రా ఉన్నట్లు లేవు" అన్నారు. అని నిజంగానే చాలా బాధపడ్డారు. మా అత్తగారితో బయలు దేరండి. మనం తొందరగా వెళ్ళాలి. అబ్బాయి ఊర్లో లేడుగా, తరువాత చెప్పొచ్చులే. అమ్మాయ్, నువ్వు కూడా పదా. అందరం పోకపోతే బాగుండదు, అన్నారు. నాకు చాలా భయమేసింది. అప్పటివరకు నేను చనిపోయిన వాళ్ళను చూడలేదు. అయినా తప్పదుగా! అందరం బయలు దేరాం.

ఊరికి చేరేటప్పటికి తెల్లగా తెల్లారిపోయింది. సర్పంచి గారి ఇంటిముందు ఎటువంటి హడావుడి కనిపించలేదు. చక్కగా కళ్ళాపి చల్లి పెద్ద పెద్ద ముగ్గులు పెట్టిఉన్నాయి. మేము వాళ్ళ ఇంటిముందు కారు ఆపేటప్పటికి, అప్పటివరకు మా కార్ వెనకాలే పరిగెత్తుకొస్తున్న ఊరిపిల్లలంతా కార్ పట్టుకొని వేళ్ళాట్ట౦ మొదలుపెట్టారు. మా డ్రైవర్ కి౦దున్నకట్టెపుల్లల్ని ఏరి వాళ్ళమీద బాణాల్లాగా ప్రయోగి౦చట౦తో వాళ్ళు కాస్తా పారిపోయారు. అందరం మెల్లిగా కార్ దిగాం. వె౦టనే చల్లటి పిల్లగాలి పలకరించింది. ఇంటిలోపలినుంచి చక్కటి పల్లెపదాలినిపిస్తున్నాయి. వంటల ఘుమఘుమలు కూడా మమ్మల్ని పలకరించాయి. ఇంతటి మామూలు వాతావరణం చూసి మాకు చాలా అశ్చర్యమేసింది. మెల్లిగా ఇంట్లోకి అడుగుపెట్టాం.

లోపలికి వెళ్ళాం. అక్కడ కుర్చీలో కాళ్ళుచాపుకొని, కళ్ళు అరమోడ్పుతో, బారెడు పొడుగున్న లావుపాటి చుట్ట కాల్చుకుంటు,తన్మయత్వం లో,చేత్తో కుర్చీ మీద దరువేస్తూ, ముసిముసి నవ్వులతో పరవశమౌతు నిన్న మాయింటికొచ్చినాయన కూర్చోని ఉన్నాడు.

ఆయన్ని చూసిన మా అత్తగారు, మామగారు బిత్తరపోయారు. ఒక్కసారిగా మమ్మల్ని చూసిన ఆయన కూడా బిత్తరపోయాడు. అలా ఒకరినొకరు బిత్తరచూపులు చూసుకుంటూ చాలా సేపే ఉన్నారు. ముందుగా ఆయనే బిత్తరచూపులు ఆపి, అయ్యో, మీరే వొచ్చిండ్రా దొరా. నిన్ననే మీ ఇంటికాడకొచ్చిన. చిన్నమ్మను కూడా తోలుకొచ్చిండ్రా. నేనే మళ్ళ అస్తుంటి గందా! అన్నాడు.

మా మామగారు వెంటనే తేరుకున్నారు. ఏమయ్యా సర్పంచి ఎలా ఉన్నావ్. మనూరు ఒకసారి చూద్దామని మేమందరం ఒచ్చాం, అన్నారు. వెంటనే నా కర్ధమైంది. మా ఇంటికొచ్చినాయనే సర్పంచి అని. ఒక్కసారిగా ప్రప౦చమ౦తా గిరగిరా తిరగిపోతో౦ది. దిక్కులు మరిచిపోయిన నా కళ్ళు టుయ్ టుయ్ మని ఆడుతూ నిట్టనిలువుగా నిలిచి పోయాయి. మా అత్తగారే, చల్లబడిన నా చేయి గు౦జి కుర్చీలో కూలేసారు. ఆవిడకి అర్ధమైపోయి౦ది, నేను ఎక్కడోపప్పులో కాలేసానని, అ౦దుకే ఆ ఊరి ను౦చి జుయ్యిన జారి ఈ ఊరికొచ్చామని.

ఇంతకీ, ఆ సర్పంచి తను ఒచ్చి వెళ్ళినట్లుగా చెప్పమన్న "అచ్చిపోయిండని" చెప్పమన్న మాట నాకు "చచ్చిపోయాడని" అర్ధమవటంతో వొచ్చిన తిప్పలివన్నీ. హతవిధీ! ఇదంతా నా భాషా పరిజ్ణానం వల్ల ఒచ్చిన ప్రమాదమే కదా! ఈ "తారే జమీన్ పర్" గ౦దరగోళ౦ ను౦చి ఎలా బయట పడాలి? అప్పటినుంచి ఆశావాదినై, నిరుత్సాహ పడక ఎంతో పట్టుదలతో శ్రమించి భాషమీద పట్టు సంపాదించాను.హు...ఏం లాభం...ఇంత కష్ట పడ్డా ఇప్పటికీ ఉన్నాయనుకోండి కొన్ని సమస్యలు.

నెహ్రూ గారు చెప్పినట్లు ఆశావాది గులాబీని చూస్తే, నిరాశావాది దానికింద ముల్లుని చూస్తాడట. ఇదే సంగతి మా పార్క్ లో ఆ అమ్మాయికి కూడా చెప్పాను. చూడాలి, ఆ అమ్మాయి ఎలా నిలదొక్కుకు౦టు౦దో మరి!!!...



.....తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది.....


*************************************************************************

3, ఫిబ్రవరి 2010, బుధవారం

ఎక్కుపెట్టిన ప్రశ్నార్థకం...






వినీలాకశమా! అనంతకోటి నక్షత్రాలూ
గాలీ, నీరూ, భూమీ, సమస్త ప్రకృతీ!
మీలో భాగంగా పేరు పడ్డ
ఆ అనామిక ఎవరో?

నిరంతరాయంగా ఏటికి ఎదురీదే
ఆ అభాగిని ఎవరైతే నేం...నా జాతికి ప్రతీక...
మానవత్వం మంటకలిసిన వేళ
ప్రకృతి ఎదురుతిరగడం అనివార్యం
మనం ఎన్నుకున్న కర్తవ్యాల దారుల్లో
గుంతలు పూడ్చెయాల్సేఉన్నది.

ముళ్ళూ, గోతులూ, కొండలూ, గుట్టలూ
ఏ చోటా మన అడుగు వెనక్కి తీసికోకుండా ఉండాలే గాని,
సుదూర తీరాలలోని అందమైన గమ్యం
కాళ్ళ దగ్గరే ఉంటుంది.

నీ కాలి ముల్లును ఎవరో వొచ్చి తీస్తారని ఎదురుచూడకు!
కాలం ఎంత విలువయినదో,
ఇప్పటికి నువు కోల్పోయిన వెతుకులాటలుగాక,
కళ్ళముందున్న అనుభవాలను పంచుకో
ఎవరో నీ చుట్టూ గీసిన నిషేధ నియమాల గిరిలో
నీకు నువ్వే పరిమితుల కచ్చడాలు కట్టుకోకు.

నువ్వే ఏర్పరచుకున్న ప్రపంచంలో ఉష్టృపక్షివైపోతే...
మన స్వప్నాల మరో ప్రపంచం సంగతేంటి?
నీలో చైతన్యాన్ని నింపుకో.

స్వప్నం వాస్తవమై చైతన్యమయం కావాలేగానీ,
ఎక్కుపెట్టిన ప్రశ్నార్ధకమవుతావు నువ్వు
తిరగబడ్డభూమివౌతావు నువ్వు
స్వప్నాలు సిద్ధించే పోరాటమౌతావు నువ్వు...


**********************************************************
 

మనస్వి © 2008. Template Design By: SkinCorner