1, జనవరి 2012, ఆదివారం
కమ్మని కలలకు ఆహ్వానం
బొమ్మాళీ, నిన్నొదల... అంటున్నాయి నా వెంటనే ఉన్న ఈ చీకటి వెలుగులు....
డైలాగ్ ఇన్ ద డార్క్....చుట్టూ చిమ్మ చీకటి. అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకెళ్తున్న మనకు లారీ శబ్దం వినిపిస్తుంది. మనమీదికే వస్తున్న భయం పెరిగిపోతుంది. గుండె ఆగిపోతుందేమో కూడా....ఆ లారీకి లై ట్స్ కూడా లేవు. ఆ చీకట్లో ఏమీ తెలియటం లేదు.
మనకిష్టమైన మెనూ ఆర్డర్ చేసి టేబుల్ దగ్గర కూచున్నాము. అన్నీ ఎదురుగ్గానే ఉన్నాయి. చిమ్మ చీకటి. ఏమీ కనిపించటం లేదు. కరెంట్ రాదు, అలాగే తినాలి. ఏదో భయం...
డాక్టర్ ఆండ్రియాస్ హెనెక్ అనే జర్మన్ ఎంటర్ ప్రెన్యూర్ ప్రారంభించిన ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రపంచమంతా దాదాపు 110 నగరాల వారు అభిమానించి అనుభవిస్తున్నారు. ఇది మనకి అంధుల పట్ల ఉన్న తక్కువ భావాన్ని పోగొట్టే రీతిలో రూపొందించిన ఫన్, ఎడ్వంచర్, లెర్నింగ్ ఎగ్జిబిషన్. ఇక్కడ మొత్తం నిర్వహించే వారు అంధులే. ఇక్కడ మన కంటికి అంతా చీకటే... ఇక్కడ తమ కళ్ళతో వారి లోకాన్ని మనకు చూపుతారు. ఆ చీకట్లోనే వారి లోని ఆత్మ శక్తిని తెలుసుకో గలుగుతాము. ఇక్కడ వారే మనల్ని రోడ్ దాటిస్తారు. సూపర్ మార్కెట్ కి వెళ్ళి సరకులు గుర్తుపట్టి మనతో కొనిపిస్తారు. చీకటిలోనే వాసన, స్పర్శల ద్వారా వాటిని మనం కనిపెట్టాల్సి ఉంటుంది. ఆ చీకటిలోనే అక్కడే ఉన్న రెస్టారెంట్ లో మనకి కావాల్సినవి ఆర్డర్ ఇచ్చి తినొచ్చు. చీకటిలో నడుస్తుంటే భయపడే మనకు దారి చూపే వెలుగవుతారు. తిరిగి మన గమ్యం చేరుస్తారు. ఎన్నో రకాల ప్రతిభ ఉన్న వీరికి అన్ని ఉద్యోగాలు లభ్యం కావు. వారు అనుభవించి ఆయా అంశాల గురించి తెలుసుకుంటారు. ఆ అనుభూతులనే సాధారణ ప్రజలకు కూడా అందించాలనే ఈ ప్రయత్నమే, మనల్ని ఒక గంట సేపు వారితో పాటు చీకటిలో ప్రయాణించేట్లు చేసింది. వాళ్ళు మనకన్నా బాగా చేయగలరు అనే అభిప్రాయం మనకి తప్పకుండా కలిగిస్తారు.
నాతో వచ్చిన ఆ అమ్మాయి నవ్వుతూ ఎంతో హుషారుగా నాకన్నీ వివరిస్తుంటే, నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో...నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో..అని పాడుకోవాలనిపించింది. ఎప్పటినుంచో ఈ "డైలాగ్ ఇన్ ద డార్క్" చూడాలన్న నా కోరిక ఈ సంవత్సరం తీర్చుకో గలిగాను.
నేనంటే అస్సలిష్టంలేని బుక్: థార్న్ బర్డ్స్ బుక్ ఇప్పటికి మూడు సార్లు కొనుక్కున్నాను.ఎన్నిసార్లు కొన్నా పోతోంది. ఈ ఇయర్ కూడా పోయింది. ఏవిటో నాకిది అచ్చి వచ్చేట్లు లేదు. ఏమీ సేతురా లింగా! ఏమీ సేతురా!!! ఇంక కొనకూడదనే నిర్ణయం తీసుకున్నాను.ఇది మాత్రం చాలా ఘాట్టి తీర్మానమే. ఎవరిదగ్గిరైనా ఉంటే నా కిచ్చేస్తారా!!! ప్లీజ్.
ఒక చిన్న నిర్లక్ష్యం: బుజ్జి గాంధీ....అనుకోకుండా నాకోసారి,ఒంటినిండా తెల్ల రంగు తో మార్కెట్లో గాంధీ వేషం వేసుకొని అడుక్కుంటున్న ఒకబ్బాయి కనిపించాడు.ఎన్నో సార్లు అటువంటి వాళ్ళను చూసాను, ఇప్పుడు దగ్గరలోనే కనిపిస్తున్న ఈ అబ్బాయిని పలకరించాలనిపించింది. బాబూ నీ పేరేమిటి అని అడిగితే గాంధీ అని చెప్పాడు. అది కాదు, అసలు పేరు చెప్పు అన్నాను. కాదు అదే నా అసలు పేరు అన్నాడు. ఆ పేరే పెట్టారట. గాంధీ అంటే వాళ్ళ నాన్నకి చాలా ఇష్టం అన్నాడు. మరి ఎందుకిలా చేస్తున్నావు అన్నాను. వాళ్ళ నాన్నకు పక్షవాతం వచ్చిందని వాళ్ళ అమ్మ కూడా అడుక్కుంటుందని చెప్పాడు.తను చదువుతున్న అయిదో తరగతి మానేసి ఈ పని చేస్తున్నాడుట. వాళ్ళ అమ్మ వద్దందట కాని తనకి గాంధీ జీవిత చరిత్ర చదవాలని ఉందని ఆ బుక్ కొనుక్కున్నాక ఇలా తిరగటం మానేస్తా అని చెప్పాడు.ఇంత చిన్న వయసులో తన చిన్న కోరిక తీర్చుకోటానికి ఎంత ప్రయాస పడుతున్నాడొ...బాధనిపించింది...స్వయంగా కృషి చేస్తున్నందుకు సంతోషమూ అనిపించింది. బాబూ, రేపు నీకు ఈ బుక్ తెస్తాను ఇక్కడే ఉంటావా అని అడిగాను. ఒక్క సారే ఆ మొహం లో వెయ్యిదీపాల కాంతి కనిపించింది. ఓ, ఉంటా అన్నాడు. మర్నాడు వెళ్ళలేక పోయాను. రెండురోజుల తరువాత చూస్తే ఎక్కడా కనిపించలేదు. ఆ తరువాతా వెదికాను...ఊహూ. కనిపించలేదు. నా నిర్లక్ష్యంతో...ఎంత మూల్యం చెల్లించానో...బుజ్జి గాంధితో స్నేహాన్ని కోల్పోయాను. ఇప్పటికీ అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాను. ఏనాడూ కనిపించలేదు.బాధగా లేదా అనకండి. చాలా బాధగా ఉంది. మనసు కాలుస్తూనే ఉంది...రాతిరి వేళ రగిలే ఎండలా... ఓ బుజ్జి స్నేహితుడా, ఎప్పుడు కనిపిస్తావు. నన్ను క్షమించవా...నాతో మాటాడవా...నన్ను మన్నించవా....
వేయిస్తంభాల గుడి- 'నా ' కత్తి: మేము చాల చిన్నప్పుడు వరంగల్ లో ఉన్నాము. అక్కడి మా ఇంటి ఎదురుగ్గానే ఉంది వేయిస్థంభాల గుడి. అక్కడ రోజూ ఎన్నో ఆటలు ఆడుకునే వాళ్ళం. గుడికి ఎదురుగ్గా ఉన్న నాట్య మండపం అంటే నాకు చాలా ఇష్టం. ఆ మండపంలో ఎన్నో ఆటలు ఆడేవాళ్ళం. మధ్యలో డాన్సింగ్ డేస్ మీద నాకు తోచినట్లు ఎన్నో సంప్రదాయ రీతులలో నృత్యం చేసేదాన్ని:) అది ఒక రాజభవనం లాగా, నేను నాట్యకత్తెగా ఊహించుకొని రోజూ డాన్స్ చేయటమే గాక ఆ మండపం మొత్తం కలియతిరిగే దాన్ని.అక్కడే నృత్య భంగిమ లోని ఒక అందమైన శిల్పం కూడా ఉండేది. దాని పక్కనే నుంచుని, అదే భంగిమతో ఏవో ఆలోచనలతో...ఏవేవో లోకాలకి వెళ్ళిపోయేదాన్ని. నృత్యమంటే నాకంత ఇష్టం. ఒక సారి అక్కడ పైన చూరు లో బాగా తుప్పు పట్టిపోయిన కత్తి కనిపించింది. చాలా కష్టం మీద దాన్ని బయటికి లాగి దానితో రోజూ కత్తి యుద్ధాలు చేసే దాన్ని. ఆ కత్తి ఎప్పటిదో, అసలక్కడెందుకుందో నాకప్పుడు తెలియదు. ఆ కత్తి నా ప్రాణమైపోయింది. యుద్ధభూమిలో రాణినై వీర పోరాటాలు చేస్తూ, శతృవులందరిని నరికి పారేసేదాన్ని. రోజూ అక్కడే దాచిపెట్టడం, వెళ్ళినప్పుడల్లా ఆడుకోటం. ఆ గుడి, ఆ మండపం, 'నా'కత్తి నాకు ప్రాణమైపోయాయి. కాని ఏం లాభం...విధి నన్ను అక్కడినుంచి నాగార్జున సాగర్ లో దింపేసింది:) అది ఇంకొక ప్రహసనం.
కాని ఈ నాటికీ నేను తీర్చుకోలేని కోరిక ఆ మండపం దగ్గరికి వెళ్ళాలి, అక్కడ నా కత్తి ఎలా ఉందో చూడాలని. నాకు తెలుసు ఇది తీరే కోరిక కాదు. అసలు ఆ కత్తి ఎవరైనా చూసి ఉంటారా! ఆ మండపం తీసేసారని, ఆ స్థంభాలన్నీ పాడైపోతూ ఉన్నాయని గుర్తొచ్చినప్పుడల్లా మరపురాని ఆ జ్ఞాపకాలే మనసును ఊరడించటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ నాటికైనా, ఎప్పుడో ఆ శిధిలాలో తిరగాలి, ఆ ప్రదేశమంతా నన్ను...ఏ సీమ దానవో, ఎగిరెగిరి వచ్చావు...అలసి ఉంటావో మనసు చెదరి ఉంటావో... అని పలకరిస్తే ఎంత సంతోషమో కదా!!!
కదలే ఊహలకే కన్నులుంటే: సాధారణ జీవితంలో అసాధారణ సౌందర్యం ఉంది. మనసు కళ్ళతో చూడాలి, హృదయ రాగంతో వినాలి. దారపు చివరి అంచులో పతంగమై గగనానికి ఎగరాలి. ఇంద్రధనుస్సులోని వన్నెచిన్నెలందుకోవాలి. ఆ మబ్బుల్లోనే ధగధగ మెరిసే మెరుపుతీగలతో ఊయలలూగితే ఎలా ఉంటుంది!!! మనసున మల్లెల మాల లూగెనే అని పాడుకోవాలా!!! ఏ సంవత్సరంలో అయినా తీరే కోరికేనా ఇది:) సరిగ్గా రాత్రి రెండుగంటల సమయంలో ఒంటరిగా నిశ్శబ్ధ వీధులన్నీ ఏ రాగమో, ఏ తాళమో తెలియని పాట గొంతెత్తి ఆలా అలా అల్లనల్లన పాడుకుంటూ తిరిగేయాలని అదో పిచ్చి కోరిక. పోనీ, బృందావనంలో..అందాల కన్నయ్య కనిపిస్తాడేమో...వెతుక్కుంటూ పోతే.... కనీసం చిరుజల్లులలో ఏ సంపెంగ పూల తోటల్లోనో, నిండుపున్నమి నెలరాజు నవ్వే వేళ... చల్ల చల్లగా నా మీద కురిసే మంచు బిందువులను పాదరసం లా జారిపోకుండా దాచేసుకోవాలని, జగమే మారినది మధురముగా ఈ వేళా అని పాడుకోవాలని...కాని, 'వనసీమలలో హాయిగ ఆడే రాచిలుక నిను రాణిని చేసే...పసిడితీవెలా పంజరమిదిగో పలుక వేమనీ పిలిచే వేళ'....ఏమని పాడాలి !!! ఏనాటికీ అందుకోలేని ఈ ఆనందమే నా ప్రతి సంవత్సరం మళ్ళీ మళ్ళీ తీసుకునే 'రెజొల్యూషన్ '.... అదే గనుక జరిగిందా:) యురేకా!!!
"ఓ సమయమా! ఇక్కడే ఆగిపో...నా హృదయం ప్రేమించటానికి వచ్చింది"...అని ఎలుగెత్తి అడగాలనిపిస్తుంది:(((
వై దిస్ కొలవెరి:))))
ఈ కొత్త ఏడాది లోకమంతా నవ్వులే నిండాలి....కొత్త ఉత్సాహంతో పొంగిపోవాలి....ప్రతి ఒక్కరి ఆశల పువ్వులు విరబూయాలి.....బ్లాగ్ మితృలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో.
************************************************************************************
లేబుళ్లు:
ముచ్చట్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
24 కామెంట్లు:
నీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు .
"ఈ కొత్త ఏడాది లోకమంతా నవ్వులే నిండాలి....కొత్త ఉత్సాహంతో పొంగిపోవాలి..."
Thank You జయ గారు..
మీకు కూడా హృదయపూర్వక నూతనసంవత్సర శుభాకాంక్షలు..
మీకు కూడా హృదయపూర్వక నూతనసంవత్సర శుభాకాంక్షలు.
మీకూ మా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు!
బ్లాగ్ మితృలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు! :)
డైలాగ్ ఇన్ ద డార్క్ - దీన్ని గురుంచి వినడం ఇదే మొదటిసారండి వినడం . మీ మిగిలిన జ్ఞాపకాలు కూడా బావున్నాయ్ !
మీకు కూడా హృదయపూర్వక నూతనసంవత్సర శుభాకాంక్షలు.
జయగారూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మీ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
మీకు కూడా హృదయపూర్వక నూతనసంవత్సర శుభాకాంక్షలు.
డైలాగ్ ఇన్ ద డార్క్ గురించి ఇదే మొదటిసారి వినడం. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నిజంగా వాళ్ళ ఆత్మ విశ్వాసానికి జోహార్లు. ఆ బాబు మీకు ఎక్కడో చోట మళ్ళీ కనిపిస్తాడు. మీరా పుస్తకం అతనికి ఇస్తారు. ఇది తప్పకుండా జరుగుతుంది చూడండి.
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
జయగారూ మీరు వ్రాస్తున్నప్పుడే ఆ అనుభూతులన్నీ పొందేశారు....ఇక మీ చిన్న స్నేహితుడు ఏదో రూపంలో మీకు తప్పక కనిపిస్తాడు. మీ కత్తి, జ్ఞాపకాలలో ఇంతకాలం భద్రంగా దాగి ఉంది..ఈ నూతన సంవత్సరం మీ కోరికలన్నీ తీరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
@ అక్కా, రాజీ, చిన్ని ఆశ గారు, నందు గారు, సిరిసిరిమువ్వ గారు, అనురాధ గారు మీ అందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు & ధన్యవాదాలు.
@ శ్రావ్య గారు డైలాగ్ ఇన్ ద డార్క్ గురించి పేపర్ లో చాలా రాసారండి. హైద్రాబాద్ లో ఇచ్చిన డేట్స్ చూసి,చాలా ప్రయత్నం మీద వెళ్ళగలిగాను. థాంక్సండి.
@ లత గారు మీకు కూడా నా శుభాకాంక్షలు. నా కోరిక తీరుతుందంటారా! తీరే కోరికేనా అది:)) థాంక్యూ.
@ శిశిరా థాంక్యూ. ఆ బాబు ని చూడాలనే ఉంది. కానీ...ఏమో...ఒకవేళ మామూలుగా కనిపిస్తే తనే నన్ను గుర్తు పట్టి మాట్లాడాలి మరి!!! డైలాగ్ ఇన్ ద డార్క్ తప్పకుండా తెలుసుకోవాల్సిన అనుభవం. ఒక్క గంట సేపు ఆ చీకటిని తట్టుకోలేక పోయాను. పాపం వాళ్ళు జీవితమంతా భరించాల్సిందే అనుకుంటే ఎంత బాధగా ఉంటుందో!!!! ఎప్పుడైనా తటష్థపడితే అస్సలు మిస్ అవ్వొద్దు.
@ థాంక్యూ జ్యోతిర్మయి గారు. అవును తప్పకుండా ఇప్పుడైనా ఆ బుజ్జిగాడు కనిపిస్తే బాగుండు. ఏమోనండి, నాకా కత్తి ఇంకా చూడాలనే ఉంది:) తీరుతాయంటారా నా కోరికలన్నీ:)
అసలు మీకు బలె బలె ఊహలు వస్తున్టాయి...
మాకు వచ్చెవి మీరె ముందు రాస్తారా?నెను కూడా వెయి స్తంబాలా గుడి దగ్గర ఉన్నాము....కాని పెద్ద అయినాక
శశికళ గారు, అవునా:)మీరెప్పుడన్నా వెళ్ళి చూశారా? థాంక్యూ.
beautiful post. 2003 లో వేయిస్తంభాల గుడికి వెళ్ళాను. దాన్నంతా శుభ్రపరిచి ఒక పిక్నిక్ స్పాట్‌లాగా చేశారు. నాట్యమండపం ఏరియా సేఫ్ కాదని దాని చుట్టూ ఫెన్సింగ్ పెట్టారు, అక్కడీకి వెళ్ళటానికి లేదు. గుడిలోకి మాత్రమే ప్రవేశం
కొత్తపాళీ గారు, బాగున్నారా. అవునండి. ఆ శిధిలాలు అప్పుడప్పుడు నెట్ లో చూస్తూ ఉంటాను. ఆ 'వైభవం' తిరిగి వచ్చేది కాదుకదా:( థాంక్సండి.
నిద్రలో నేమో నండీ, నేను డైలాగ్ ఇన్ ది డార్క్ చాలా చేస్తుంటా నండీ !
విన్నవి కన్నవి కన్నా తీపి, ఒక ఇంద్రియం కొరత మిగిలినవి తీర్చే ఈ కాయం 'మహాత్మ్యాన్ని ఏమని వర్ణించ వలె !
కనులు చూసి న వి ముద్రలైతే
కర్ణం విన్నవి మిన్నవి !
చీర్స్
జిలేబి.
మా ఇంటికొచ్చిన 'ఫన్ ఆర్ట్' స్పెషల్ గారికి స్వాగతం...సుస్వాగతం....
కమ్మని జిలేబి అన్ని లోపాలనోదార్చు లెండి...ముదమార ఆనందమందించులెండి....:) బహుళ ధన్యవాదములు.
@జయ గారు
సరే మీ మయూఖ బ్లాగ్ చూసాను మీకు పేరు తోనే కదండి కష్టం పేరు మట్టుకు మార్చుకోవచ్చు బ్లాగ్ ని అలానే ఉంచేసి . settings -> basic కి వెళ్ళి బ్లాగ్ పేరు మార్చేసుకోండి. ఎప్పుడు విజ్ఞానానికి హక్కులు వుండవు అంది. ఎవరైనా పంచవచ్చు. ఎవరో ఏదో చెప్పారని అల ఆపేయడం కాదు. ఎండాకాలం సూర్యుడ్ని ఎంత మంది తిట్టుకుంటారో మరి ఆయన అలిగి దాక్కుంటాడా చెప్పండి. చలి మంచును నిప్పుతో తరిమి కొడితే అది మొత్తానికి వదిలిపోతుందా చెప్పండి. అలా జేరిగితే కనుక మీరు ఆపెయవచ్చును.
ఆలోచనకి ఆవేదనకీ
సంతోషానికి సంబరానికి
కష్టాలకు నష్టాలకు
హక్కులెవరివి?
ఎవ్వరివి కాదు అది అనంతమైనది
అందరికి చేరాల్సింది.
మీరు కొనసాగించాలి అంతే . ఆయన ఒక్కరి కోసం అపుతనంటున్నారే. ఇంతమంది కోసం కొనసాగించాలి కదా మరి అడిగినప్పుడు.
కల్యాణ్ గారు, అదంతా గత జల సేతు బంధనం. ఎంత బాగా చెప్పారండి. అయినా నాకిప్పుడు మనస్వినే ఎంతో బాగుంది:) ధన్యవాదాలండి. మరి ఇక్కడికి కూడా వస్తూ ఉంటారు కదూ!!!
mmm aithe sare kottha samvatsaraaniki sari kottha kaanthula manasvi antaaru alage manchidhi ... kachithanga ika vasthuntaanu jaya gaaru :)
Thank you Kalyan gaaru
@జయ గారు ఇప్పుడే ఈ టపాని పూర్తిగా చదివాను. డైలాగ్ ఇన్ ది డార్క్ ఎంతో మంచి ప్రయత్నం. మీకు రాశి లేదు అన్నారే "థార్న్ బర్డ్స్ " బుక్ ఏదోకరోజు అదే మిమ్మల్ని చేరుతుంది అదే ధ్యాసలో ఉండండి. నేనొక శ్లోకం చెప్తాను నిత్యం చెప్పేస్కోండి . ఏదైనా పోయింది తిరిగి దొరకాలంటే చెప్పుకుంటారు ఈ శ్లోకం "ఓం కార్తవీర్యార్జునో నామ ,రాజ బాహు సహస్రవాన్ ,తస్య స్మరణ మాత్రేన ,గతం నష్టం చ లభ్యతే ". ఏమో నేనే బహుమతిగా ఇవ్వచ్చేమో మరి .
తరువాత అ బుజ్జి గాంధి నిజంగా పాపం అండి మరేం పర్లేదు అ పుస్తకాన్ని కచ్చితంగా ఇస్తారు అ గాంధీ కనబడతాడు. మీరు " ది సీక్రెట్ " అనే పుస్తకం చదివారా . అది చదవండి మీలో ఇంకా నమ్మకం బలపడుతుంది.
ఇక కత్తి విషయానికొస్తే అప్పుడప్పుడు చిన్ననాటి జ్ఞాపకాలు అల్లుకుంటాయి కాని మనతోటి రావు అదే పెద్ద చిక్కు. ఇదేవిదంగా నేను మూడో తరగతి లో షిర్డీ కి వెళ్ళాను. టాంగాలో వెళ్తుంటే అందులో రెండు గోలీలు దొరికాయి దాదాపు ఎన్నో రోజులు ఆడుకున్నాను వాటితో. వాటిని ఇప్పటికి మరచిపోలేను కాని అవి లేవు ఎక్కడో పోయాయి.
ఇలా ఎన్నో అండి . మొత్తానికి మీలోమాట చాలా బాగుంది నాలోమాటను పంచుకోడానికి మంచి అవకాశమిచ్చారు ధన్యవాదాలు.
Kalyan garu, it is so nice of you. Thank you.
కామెంట్‌ను పోస్ట్ చేయండి