26, మే 2010, బుధవారం

అమ్మ చెప్పిన కథ...."ఏడు గడియల రాజు"



కల్పనా రెంటాల గారి పోస్ట్ చూసాక నాక్కూడా చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన కథ రాయాలనిపించింది. రామాయణం, భారతం, ఎన్నో జానపద కథలతో పాటు మామూలు కథలు నేను చాలా పెద్దగయ్యే వరకూ వింటూనే ఉన్నాను. పదేళ్ళ వయసులో పథేర్ పాంచాలి చదివాను. ఆ తరువాత చందమామ, బాలమిత్రలు అలవాటయ్యాయి. నాకు ఇప్పటికీ నచ్చిన కథ ఒకటుంది. అదే కథ నా ఏడో తరగతి తెలుగు పుస్తకం లో కూడా మళ్ళీ చూసాను. అప్పుడు ఈ కథ చూసి చాలా సంతోషమేసింది. ఆ కథ మా అబ్బాయికి కూడా చెప్పేదాన్ని. అదే ’ఏడు గడియల రాజు” కథ.

*****************************************************************

అనగనగనగా ఒక చిన్న ఊళ్ళో ఒక నిరుపేద కుటుంబం ఎన్నో కష్టాల్లో బ్రతుకుతూ ఉండే వారు. తమకున్న కొంచెం భూమి లో సాగుచేసుకుంటూ జీవితం వెళ్ళబుచ్చేవారు. వాళ్ళబ్బాయే రాజు. ఎన్నో కోరికలతో అవి తీరక నిరాశ తో గడుపుతూ ఉండే వాడు.ఎలాగైనా గొప్ప ధనవంతుడ్ని కావాలని ఆశ పడుతూ ఉంటాడు. కొంచెం పెద్దయ్యాక ఇలా ఈ పల్లెటూల్లో లాభం లేదు, ఏదైనా పెద్ద ఊరికి వెళ్ళిపోతె ధనవంతుడై సుఖంగా ఉండొచ్చు అనుకుంటాడూ. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయలుదేరుతాడు.

దారి మధ్యలో ఒక పెద్ద అడివి ఉంది. అలసిపోయి కాసేపు విశ్రాంతి తీసుకోవాలని ఒక చెట్టుకింద పడుకుంటాడు. చల్లటి గాలికి హాయిగా నిద్రపోతాడు. ఇంతలో ఒక పెద్ద పాము అతని వెనుకగా వచ్చి పడగ విప్పి ఆడుతూ ఉంటుంది. అటువేపే వెల్తున్న కొంతమంది బాటసారులది చూసి అబ్బురంగా రాజుని లేపుతారు. నీకు మహారాజ యోగం ఉంది. చాలా గొప్పవాడివౌతావు. అని చెప్పి ఆ బాటసారులెళ్ళిపోతారు. అది విని రాజు చాలా ఆనందపడి తిరిగి తన ఊరికి వెల్తాడు. తనకు మహారాజ యోగముంది, రాజు నౌతానని అందరికీ చెప్తాడు.

ఇలా అనుకుంటే కాదు, ఎదో ఒక రాజుని ఓడించి వెంటనే రాజైపోవాలనుకుంటాడు. తనకు సైనికులుగా ఉంటే తరువాత మంత్రి పదవులిస్తానని ఆశ పెట్టి పదిమంది స్నేహితులను పోగేస్తాడు. తన పొలం, ఉన్న రెండు పశువులను అమ్మి కొన్ని పెద్ద పెద్ద కత్తులు కొని, పొరుగు రాజుని ఓడించటానికి బయలుదేరుతాడు. అక్కడ కోట ద్వారం దగ్గరున్న కాపలా వారు పదిమందితో వచ్చిన రాజు ఆ కోట ఆక్రమించటానికొచ్చాడని తెలుసుకొని ఆశ్చర్య పోతారు. ఈ వార్త మహారాజు కి తెలియజేస్తారు. అదివిని మహారాజు కూడా ఇతని ధైర్యానికి ఆశ్చర్యపోయి వివరాలు కనుక్కొని రమ్మని తమ మంత్రులని పంపిస్తాడు. మంత్రులు రాజుని కలిసి వివరాలు తెలుసుకుంటారు. మంత్రులతో ఉన్న ఒక జ్యోతిష్కుడు, అవును ఇతనికి ఇప్పటినుంచి ఏడు గడియలు మహారాజ యోగం ఉంది, అతనిని ఎవ్వరూ ఆపలేరు అని చెప్తాడు. అది తెలుసుకొని మహారాజు తన మంత్రులతో అతనిని అడ్డగించవద్దని, మహారాజుని చెయ్యమని చెప్తాడు. తనపని ఇంత సులువుగా అయిపోయినందుకు రాజు కూడా సంతోషిస్తాడు.

అప్పటినుంచి రాజభోగాలనుభవిస్తూఉంటాడు. విందువినోదాలు, నృత్యవిలాసాలు కలలో కూడా కనివినీ ఎరుగని సకల వైభోగాలు అనుభవిస్తాడు. తన అదృష్టానికి ఎంతో సంతోషంతో తన గొప్పతనానికి ఆనంద పడిపోతూఉంటాడు. తన అభివృద్ధికి ఎంతగానో గర్వపడతాడు.

ఏడు గడియలు గడవగానే మహారాజు, రాజు ని అక్కడినుంచి తరిమేస్తాడు. రాజు ఏమీ చేయలేకపోతాడు. కోట బయటకు తరిమివేయబడ్డ తనను తానే చూసుకొని నమ్మలేకపోతాడు. ఇంతసేపు అనుభవించిన సంతోషం, సంపదా వైభోగాలు ఏమైపోయాయో అర్ధం కాదు. తిరిగి నిరాశ లో మునిగిపోతాడు. కాని, క్రమంగా తనున్న పరిస్థితికి కారణం తెలుసుకుంటాడు.

తన దురాశే తన దు:ఖానికి కారణం అని తెలుసుకుంటాడు. రాశే ఫలి కాదు, కష్టే ఫలి అని అర్ధం చేసుకుంటాడు. కష్టపడి సంపాదించిన దానిలోనే శాశ్వత ఆనందం, తృప్తి లభిస్తుంది కాని అడ్డదారులలో ఎప్పుడూ పరిపూర్ణత లేదు అని భావిస్తాడు. మన జీవితాలను నిర్దేశించేది మన ప్రయత్నాలే కాని జాతకాలు కాదు. ఈ విధంగా జ్ణానోదయమయిన రాజు తిరిగి తన ఊరికి వెళ్ళి తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ, జీవితం లో తృప్తిని అనుభవిస్తాడు.

*************************************************************************************

10 కామెంట్‌లు:

మధురవాణి చెప్పారు...

జయ గారూ,
బాగుందండీ మీరు చెప్పిన కథ. నాకింతకు ముందు తెలీది ఈ కథ.

భావన చెప్పారు...

బలే వుందే కధ నేను ఇంతకు ముందు వినలేదు.

Kalpana Rentala చెప్పారు...

జయ, ఈ కథ నాకు తెలియదు.చూసారా? ఎన్ని కొత్త కథలు వింటున్నామొ? ఇంకా గుర్తు తెచ్చుకొని రాయండి.

Unknown చెప్పారు...

జయ గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.

SRRao చెప్పారు...

జయ గారూ !
ఇంతకుముందు వినని కథైనా మంచి నీతి కథ వినిపించారు / చదివించారు. సంతోషం.

ప్రణీత స్వాతి చెప్పారు...

బాగుందండీ. మళ్ళీ చందమామ చదువుతున్నఅనుభూతి కలిగింది. ఇంకా మీకు తెలిసినవి వుంటే రాయండి.

అశోక్ పాపాయి చెప్పారు...

చాల చక్కని కథని వినిపించారు....చాల బాగుంది.

జయ చెప్పారు...

మధురవాణి గారు థాంక్యూ

భావన గారు థాంక్యూ

కల్పన గారు థాంక్యూ. తెలియని కథ చెప్పినందుకు నాకూ సంతోషమే:)

జయ చెప్పారు...

రావ్ గారు థాంక్యూ. నీతి కథలు వినటానికి బాగుంటాయి కదండి.

ప్రణీత స్వాతి థాంక్యూ. చందమామ చదివి కొన్నేళ్ళయిపోయింది. మళ్ళీ బాల్యం గుర్తుకు తెచ్చారు కల్పన గారు.

అశోక్ గారు థాంక్యూ.

VENKATESH చెప్పారు...

నేను చిన్నప్పుడు "ఏడు గడియల రాజు"గేయం ఉండేది.చాలా రోజులుగా వెతుకుతున్న చివరికి
ఈ కద దొరికింది. ధన్యవాదాలు.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner