అనాదిగా ఆడది అబల గానే చూడబడుతుంది.
కార్యేషు దాసి, భోజ్యేషు మాత, కరణేషు మంత్రి, శయనేశు రంభ...ఇలా స్త్రీ గురించి ఎంత చెప్పినా ఆమె స్థానం మాత్రం అట్టడుగునే. సహనం అణకువ పేరుతో స్త్రీ తనకుతానే పురుషునికి లొంగి ఉంటుంది.
అగ్నిప్రవేశం చేయమని సీతని రాముడు ఆజ్ఞాపించినప్పుడు నీ శీలాన్ని కూడా నిరూపించుకో అని ఆనాడే సీత అడిగి ఉంటే....జూదంలో ఓడింది నీవే, నాకెందుకీ శిక్ష అని ద్రౌపది ఎవరినో ధర్మసందేహాలడిగే బదులు, ఆనాడే ధర్మరాజుని నిలదీసి ఉంటే, ... సత్యాన్ని నిరూపించుకోవలసింది నీవు, కనుక నీవే అమ్ముడుపో, నన్నెందుకు అమ్ముతున్నావని ఆనాడే చంద్రమతి ఎదిరించి ఉంటే ....ఇప్పుడెలాఉండేది?
ఆ స్త్రీలను ఆదర్శంగా పెట్టుకున్న నేటి స్త్రీలకు ఈ దుస్థితి పట్టేదికాదు.
భర్త ప్రాణాల కోసం యముణ్ణే ప్రాధేయపడిన సావిత్రి ఉంది కాని....భార్యకోసం పోరాడిన ఒక్క పురుషుడున్నాడా?
కురూపి అయిన భర్తను నెత్తిన పెట్టుకొని తిరిగిన సుమతి ఉందిగాని అనాకారి అయిన భార్యకు సేవలుచేసే భర్త ఎక్కడున్నాడు?
సతికి పతియే ప్రత్యక్ష దైవమైనప్పుడు పతికి సతి ప్రత్యక్ష దేవత కాదా?
పురుషుని అవసరం స్త్రీకెంతో...స్త్రీ అవసరం పురుషునికీ అంతే కదా!!!!
ఇంత చూసినా, స్త్రీ తనను తక్కువగానే అంచనా వేసుకుంటుంది. పురుషునికి ప్రత్యేకతను ఆపాదించి పెడుతుంది.
భర్తల కోసం మనసులనే చంపుకున్న సీత, ద్రౌపది, చంద్రమతులను ఆదర్శంగా పెట్టుకున్నారెందుకో....
నరకాసురున్ని వధించిన సత్యభామ, ధీరుల్ని ఎదిరించిన పల్నాటి నాగమ్మ, రాణీ రుద్రమలను ఎందుకు స్త్రీలు ఆదర్శంగా చేసుకోరు.
పురుషులకు ఆధిక్యతను మనమే ఇస్తూ స్త్రీలను పురుషులు చిన్నచూపు చూస్తున్నారని వారిని నిందించడమెందుకు? ఒకరకంగా ఆస్థితిని వారికి మనమే కల్పిస్తున్నాం. మగవారిని అందలమెక్కిస్తున్నాం.
స్త్రీకి స్త్రీయే శతృవైనప్పుడు, ఎదుటి స్త్రీయొక్క ఆదిక్యతను ఓర్చుకోలేని స్త్రీలున్నప్పుడు...కట్నం కోసం కోడల్ని చంపే అత్తలున్నప్పుడు, స్త్రీని స్త్రీయే చిన్నచూపు చూస్తున్నప్పుడు... పురుషులు మాత్రం చిన్న చూపు ఎందుకుచూడరు? ఇంట్లో సమస్యలు స్త్రీల ద్వారా ఏర్పడవచ్చు....కాని, బయట స్త్రీకి సమస్యలేర్పడినప్పుడు, స్త్రీలే ముందడుగేస్తున్నారు. ఆ స్త్రీకి రక్షణ ఏర్పరుస్తున్నారు.
అందుకే రావాలి మార్పు. అది ఎలా ఉండాలి? ఇటువంటి ధర్మోపన్యాసాలు వాసనలేని పూలు. మనసు అహంకారంతో నిండి ఉంటే అసూయ హింసిస్తుంది. నేటి వైఫల్యాన్ని రేపటి గుణపాఠంగా భావించాలి. కేవలం పుస్తకాలే చదువకుండా, మనుషులని చదవాలి. మనల్ని మనం చదువుకోవాలి. సరి అయిన ఆశయాన్ని ఏర్పరుచుకోవాలి. మన ఆశయమే మన విలువను తెలియజేస్తుంది. కృషితో నాస్తి దుర్భిక్షం. మహిళా ప్రపంచానికే మకుటాయమానమైన విశ్వమాత మదర్ థెరిసా లాంటి మహనీయులను అనుసరిస్తే ....ఇటువంటి మానవతా మూర్తులను యుగయుగాలు స్మరించుకుంటారు.
ఇది స్త్రీ వాదం కాదు ...ఆడామగ పోటీ అసలే కాదు. వితండవాదం కాదు కావాల్సింది. ప్రపంచానికే మకుటాయమానమైన ఆ స్త్రీమూర్తుల విజ్ఞత తెలుసుకోవాలి. మనలో వ్యక్తిత్వం పరిమళించాలి. పరిపూర్ణత సంపాదించుకోవాలి. ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరూ ధృవతారలుగా వెలిగే అవకాశం లేదా? రామాయణ, భారతాలేగా సంఘానికి పునాది వేసింది. ప్రపంచంలోనే భారత స్త్రీకి ప్రత్యేకస్థానం ఉందంటే...ఒక గౌరవ స్థానం సంపాదించుకుంది అంటే కారణం, మనం నిత్యం కొలుచుకుంటున్నఈ దేవతా మూర్తులు కాదా!!!
కృత, త్రేతా, ద్వాపర, కలి యుగాల చతుస్పాదాలుగా గల ధర్మదేవత నేటి కలియుగమందు అంగవికలమయింది, కుంటి నడక సాగిస్తోంది. ఇంకా అప్పటి ఇప్పటి పోలికలెందుకు? అయినా...ఇంకా పెరిగిపోతున్న అంతరాలను ఎలా తొలగించాలి? ఎన్నో రంగాలలో అభివృద్ధి సాధించిన స్త్రీ ఎందుకు చులకనగా చూడబడుతోంది? ఎన్నో బాధ్యతలను నిర్వర్తిస్తున్న స్త్రీ గౌరవాన్ని ఎందుకు కాపాడుకోలేకపోతోంది? ఎన్నో విషయాల్లో పురుషులకన్నా స్త్రీలే ముందజలో ఉన్నా...సంఘంలో అణగదొక్కబడుతున్న స్త్రీలే ఇంకా ఎందుకు ఎక్కువగా ఉన్నారు? స్త్రీ అబల కాదు సబల...అని ఎలా నిరూపించాలి? ఎందుకు...ఎన్నో విధాలుగా ఇంకా బలి అవుతూనే ఉన్నారు? ఇవి నాకు కలుగుతున్న అనుమానాలు. ప్రతి రోజూ చూస్తున్న వింటున్న సంఘటనలు....నా బాధని పెంచుతున్నాయే కాని నా ప్రశ్నలకు సమాధానాలు దొరకటంలేదు. ఇంక పరిష్కారం అన్నదే లేదా!!!!
ఈనాటి స్రీల సమస్యలకు ముగింపు లేదా!!! అలా పెరిగిపోతూనే ఉండాలా!!!! సమస్యలను తీర్చుకోలేనివారు గతకాలాన్ని విమర్శించాల్సిందేనా?
(ఈ మధ్య మాలో మాకు జరిగిన ఇటువంటి వాదోపవాదాలు విన్నాక వ్రాయాలనిపించి, ఈ విధంగా మీ ముందు ఉంచుతున్నాను)
"All Nations have attained greatness, by
paying proper respect to women. That country
and nation which does not respect women
has never become great, nor will ever be in future".... Swami Vivekananda
***********************************************************************************************
2, జూన్ 2011, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
8 కామెంట్లు:
"భర్త ప్రాణాల కోసం యముణ్ణే ప్రాధేయపడిన సావిత్రి ఉంది కాని....భార్యకోసం పోరాడిన ఒక్క పురుషుడున్నాడా?"
చాలా బాగా చెప్పారు జయగారు.
ఇది స్త్రీ వాదం కాదు ఆలోచించే ప్రతి మనసులోను వుండే ఆలోచనలే..
ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. తెలుగు బ్లాగర్లకి గమనిక. మా అగ్రెగేటర్ తెలుగు వెబ్ మీడియా - కెలుకుడు బ్లాగులు గానీ బూతు బ్లాగులు గానీ లేని ఏకైక సకుటుంబ సపరివార సమేత అగ్రెగేటర్ http://telugumedia.asia యొక్క సర్వర్ ఇండియన్ డేటా సెంటర్లోకి మార్చబడినది. ఈ సైట్ ఇతర దేశాల కంటే ఇండియాలో మూడు రెట్లు వేగంగా ఓపెన్ అవుతుంది. భారతీయుల కోసమే ఈ సౌలభ్యం. మీ సైట్‌ని మా అగ్గ్రెగేటర్‌లో కలపడానికి administrator@telugumedia.asia అనే చిరునామాకి మెయిల్ చెయ్యండి.
ఇట్లు నిర్వాహకులు
హ్మ్.. మీకు అనుమానం వచ్చిందా, కోపం వచ్చిందా జయ. :-) నిజమే స్త్రీ పరిస్తితి పెద్ద గా మారింది ఏమి లేదు. ఈ కాలం లో స్త్రీ లు బాగా దూసుకుని వెళి పోతున్నారు అని ఏదో అంటారు కాని పెద్ద గా ఏమి అనిపించటం లేదు నాకైతే. అమెరికాలోనూ అంతే. మనవాళ్ళే కాదు, తెల్ల ఆడవాళ్ళు కూడా. అవే అత్తాకోడళ్ళ అర్ధంలేని తగాదాలు, మీరు అన్నట్లు వ్యక్తిత్వం పరిమళించే దిశ గా, ఆలోచనతో జీవితాన్ని పదును పెట్టుకునే దిశగా మాత్రం తక్కువ మందే నడుస్తున్నారు. రాబోయే తరమన్నా అలా నడవాలని ఆశిద్దాం.
---సహనం అణకువ పేరుతో స్త్రీ తనకుతానే పురుషునికి లొంగి ఉంటుంది.
---స్త్రీ తనను తక్కువగానే అంచనా వేసుకుంటుంది.
---పురుషులకు ఆధిక్యతను మనమే ఇస్తూ స్త్రీలను పురుషులు చిన్నచూపు చూస్తున్నారని వారిని నిందించడమెందుకు? ఒకరకంగా ఆస్థితిని వారికి మనమే కల్పిస్తున్నాం.
---మనుషులని చదవాలి. మనల్ని మనం చదువుకోవాలి.
---మనలో వ్యక్తిత్వం పరిమళించాలి. పరిపూర్ణత సంపాదించుకోవాలి.
మీ ప్రశ్నలకి జవాబులు కూడా మీరే ఇచ్చేశారు జయగారు. చాలా మంచి విషయాలు చెప్పారు.
meeru cheppindi nijame friend...sasi
@ అవును రాజీ, ఇంకా ఎంతకాలం ఈ ఆలోచనలు అన్నదే నా బాధ.
@ ప్రవీణ్ శర్మ గారు థాంక్సండి.
@ అవును భావనా, ఇంత ఆధునిక ప్రపంచంలో అసలైన 'ఆధునిక స్రీ' కోసం ఎదురుచూస్తున్నాను.
@ శిశిరా, పరిస్థితి ఇంకా ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూస్తున్నట్లుగానే కనిపిస్తోంది నాకు. కనీసం ఎవరో ఒకరు, ఎపుడో అపుడు ముందుకు సరి అయిన మార్గం చూపిస్తారని నా ఆశ.
@ శశి గారు థాంక్యూ. ఇవన్నీ ఉత్తమాటలే కదా!!!
జయ గారు బాగా చెప్పారు. అమ్మాయి పుడితే ముందుగాఅత్తగారు అమ్మాయి పుట్టిందా! అంటున్నారు. కానీ ,అమ్మాయి పుట్టింది అని గర్వంగా చూసే రోజు ముందు రావాలి.
అవును రత్నమాల గారు, ఆ రోజు ఎంతో దూరం లేదు. చూస్తూ ఉండండి. థాంక్యూ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి