29, అక్టోబర్ 2009, గురువారం

విరిసే పువ్వు

ఇంకా విరియనూ లేదు ఈ మొగ్గ
ఏ పురుగు వచ్చి వాలుతుందో నని
తన ఆకుల కౌగిట హత్తుకొంది చెట్టు
కాని అప్పుడప్పుడే వికసిస్తున్న మొగ్గలోని
పరిమళాలను ఎవ్వరాపగలరు?
పట్టులాంటి మెత్తని పూరేకులు
పరిమళంతో పాటు విచ్చుకున్నాయి
తన అందమే తన పాలిట శాపమైనట్లు
అందరి దృష్టి ఈ సుకుమారి పువ్వు పైనే
తన ఇష్టంతో ప్రమేయం లేకుండా
తుమ్మెదలు తనపై వాలాలని ప్రయత్నిస్తున్నాయి
తనకు ఇష్టం లేకుండా ఎవరో వొచ్చి
త్రుంచే ప్రయత్నం చేస్తున్నారు
ఒక రోజు ఎవరి తలమీదనో మెరిసే కన్నా
శాశ్వతంగా తన దేవుని పాదల చెంత
మురిసి పోవడమే ఈ పువ్వు లక్ష్యం.
వాడి పోతానని తెలిసినా
వికసించక మానదు పువ్వు
ఓ అందమైన పూవా!
నీవు అందం...నీ మనస్సు అందం...
నీ మనస్తత్వాన్ని సువాసనలతో వెదజల్లుతావు
నీ వంటి మనస్సు మాకుందా!

************************************************


21 కామెంట్‌లు:

Padmarpita చెప్పారు...

అంత మెత్తని అందమైన మనసు మనకి ఉంటే..
పుష్పానికి మనకి తేడా ఉండదు కదా...ఎంత బాగుంటుందో!

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

పూల సున్నిత మనసుని అంతే సున్నితంగా మీరు అర్ధం చేసుకున్నారు. బాగుంది.

సృజన చెప్పారు...

చాలా బాగా చెప్పారు.

తృష్ణ చెప్పారు...

"పుష్పవిలాపం" గాని చదివారా? (లేక విన్నారా?)
"పూల బాసలు తెలుసు ఎంకికీ...." అని పాడాలేమో ఇప్పుడు...:)
బావుందండీ...నేను గులాబీలు పెంచినప్పుడు ఎవరైనా కోసేస్తారేమో అని తెగ కాపలా కాసేదాన్ని...అమ్మని కూడా కొయ్యనిచ్చేదాన్ని కాదు. కోసేస్తే ఒక్క పూటలో వాడిపోతుంది. చెట్టుకుంటే నాలుగైదు రొజులో,వారమో ఉంటుంది అని నా బావన..

నేస్తం చెప్పారు...

చాలా బాగుంది.

జయ చెప్పారు...

పద్మర్పిత గారు మీరు ఊరికే మెచ్చుకుంటున్నారు కాని, నా కోరికేంటో తెలుసా! మీ లాగా, ఉషా గారి లాగా కనీసం ఒక్క కవితన్నా రాయాలని, అసలు రాయగలనా అని. మీరిలా పలకరించినప్పుడల్లా ఎంతానందంగా ఉంటుందో.

జయ చెప్పారు...

శేఖర్ గారు, ప్రతిమనిషిలోనూ ఉంటుంది సున్నితత్వం. సమయానుకూలంగా కొంచెం కొంచెం బయట పడుతూ ఉంటుందన్నమాట. ధన్యవాదాలు.

సృజన గారు, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

జయ చెప్పారు...

పుష్పవిలాపం ఇవాళ కొత్తగా వినాలా తృష్ణా! అది ఒక రోజుతో ముగిసిపోయే విలాపమా! ఏ పూవు నైనా చెట్టు మీదనుంచి కోయాలంటే ఎంత బాధగా ఉంటుందో ...స్త్రీల విలాపం కూడా పుష్ప విలాపం వంటిదే కదా... పూలబాసలు ఒక్క ఎంకికే ఏంటి హృదయమున్న ప్రతిఒక్కరికీ తెలుసు కదా!
అవునూ...నా చిత్రలేఖనాలు నచ్చలేదా! అందంగా లేవా? అస్సలేం బాలేవా?

జయ చెప్పారు...

విజయ్ మోహన్ గారు చాలా థాంక్స్. మీరు వేసే బొమ్మలు, ఫొటోలు చాలా బాగుంటాయి. నాకు కూడా కంప్యూటర్లో బొమ్మలువేయటం నేర్చుకోవాలని ఉంది.

జయ చెప్పారు...

నేస్తం గారు ధన్యవాదాలు. ఏవిటో! జాజిపూలు మళ్ళీ ఎప్పుడు పూస్తాయో! బుట్టనిండా కోసుకుందామని, నేను చూస్తున్నాను.

cartheek చెప్పారు...

బాగుంది జయ అక్క...............
ఒక్క రోజు జీవితమే అయినా ఎందరి మనసులో దొచుకునే పువ్వు మనసు ఎంత గొప్పదో కదా!

భావన చెప్పారు...

గులాబి పూల తోట లో పూరేకు పాడు పాటలో ని అవేదన, అనురాగం రెండు బాగా అర్ధం చేసుకున్నారు, ప్రతిధ్వనింప చేసేరు జయా ఇంక మీకు ప్రత్యేకం గా కవితలెందుకు మీరే ఒక రాగమయ్యి ధ్వనిస్తుంటే..

మురళి చెప్పారు...

nice expression.. good one..

జయ చెప్పారు...

బాగాచెప్పావ్ కార్తీక్. థాంక్యూ.

థాంక్యూ భావనా! కొంచెం పొగడ్త ఎక్కువైనట్లుంది కదూ. ఒద్దబ్బా! అంతపొగడొద్దు.

మురళి గారు. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
anagha చెప్పారు...

నాకు గులాబిలంటే ప్రాణం ,కళ్ళు ఆర్పకుండా వాటిని చూస్తాను .ముఖ్యంగా ఎల్లో గులాబీ అంటే మరి మరి ఇష్టం .మీ బ్లాగ్ పేరు పక్కన ఉన్న గులాబి అందంగా ఉంటుంది .దాన్ని అప్పుడప్పుడు చూస్తుంటాను .

మరువం ఉష చెప్పారు...

ఎందుకే వెఱ్ఱిపూవు నవ్వేవు ఈ ఇల మరిచి
నవ్వే నీవు నలిగేవు నాల్గు ఘడియల్లో
************
నీవు పెంచిన ఈ పూల వనాన పూచిన ఓ పిచ్చిపూవును
నా మధురిమ నిను చేరేలోపే వసివాడిపోతానేమో.
************
జయ, నా 11-13 ప్రాయాల్లో [అప్పటికి నా భావాలే కానీ ఎవరి రచనలు చదివి ఎరుగని వయసు] నేను వ్రాసుకున్న పూల కవితలివి. తర్వాత చాలా వ్రాసుకున్నా, అలా తొలిస్పందనల గుర్తుగా కొంచం ప్రత్యేకం అవి నాకు. మీ కవిత వాటిని మరోసారి నా మానసం నుండి వెలికితెచ్చింది.

జయ చెప్పారు...

థాంక్యూ అనఘా, నిజంగా గులాబీలు ఎంత బాగుంటాయో కదా! నా గులాబీ నాకు కూడా చాలా ఇష్టం. గులాబి లాంటి మనసంటే ఇంకా ఇష్టం.

జయ చెప్పారు...

ఉషా, పసితనం లోని భావాలు ఎంత నిష్కల్మషమో కదా! జీవితమంతా మనతోటే ఉంటాయి. ఎంత చక్కటి కవితో...కవితలు మనసుకు ప్రతిబింబాలు....మీ మనసు సౌకుమార్యాన్ని నేను గుర్తించ గలుగుతున్నాను.

veera murthy (satya) చెప్పారు...

కొమల భావాలని హృద్యంగా పలి కించారు...

పూవులు సుకుమారులె కాదు
ప్రతిసృస్తికి దర్పనాలు కూడా..

ఫలాలనివ్వడం పూవుల పని
సహాయ పడడం తుమ్మెద పని...


అందుకే అమ్మవారిని(లక్ష్మీ దేవిని) కమలం తో (పూవుతో) పొలుస్తారు ..
కమల కొమల గర్భ గౌరి అంటారు....

[ మాతర్నమామి కమలే కమలాయ తాక్షి ...
శ్రీ విష్ణు హృత్కమల వాసినీ విశ్వ మాతః
శ్ఖీరోదజే కమల కొమల గర్భ గౌరీ
లక్ష్మీం ప్రసీద సతతం నమతాం శరన్యే !]

కొమలత్వాన్ని గాయ పరచకుండా
మధువులు దొయడం , తుమ్మెదలకి తెలుసు...

కర్కశంగా విరిచి - మలిచి
ముడుచు కొవడమే మనకి తెలుసు...

ఎది ఎమైనా...

సర్వకాల సర్వావస్తలలో

కమలం లాంటి కొమల హృదయ మున్న స్ర్తీ మూర్తులకి

శిరస్సు వంచి
నమస్కరిద్దాం...


---satya

జయ చెప్పారు...

సత్య గారు. చాలా బాగా చెప్పారండి. ధన్యవాదాలు.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner