1, నవంబర్ 2009, ఆదివారం

కృష్ణశాస్త్రి పాట

భావకవి దేవులపల్లి శ్రీ కృష్ణ శాస్త్రి జన్మదినం ఈ రోజు. నాకు ఎంతో ఇష్టమైన కవి. ఎన్ని యుగాలైనా మరపురాని కవి. ప్రకృతితో మమేకమైన సౌందర్య పిపాసి. ప్రకృతి తోటే ఆయన స్నేహం.
భావ కవితకు చిరునామా దేవులపల్లి.

ఆయన రచనలు వాడని కుసుమాలు. లాలిత్యం,సరళత మెండుగా కనిపిస్తుంది.
మనుషుల భావోద్వేగాలను, హృదయ స్పందనలను లాలించి పోషించిన వాడు ఈ కవి.

తెలుగు సంస్కృతి, జానపదాలలో అద్భుతమైన పాటల రచన, ఇవి ఎప్పటికీ మరపు రానివి.

ప్రకృతి సొగసును తన పాటల్లో చూపించిన కవి.

ఈయన సాహిత్యం ఎప్పటికీ సువాసనలు వెదజల్లే పూవు వలే ఉంటుంది.

కృష్ణపక్షం, మేఘమాల, అమృతవీణ, ఊర్వశి ... ఈయన ప్రముఖ రచనలు.

షెల్లీ, కీస్, విలియం వర్డ్స్ వర్త్ రచనలతో ఈయన రచనలు పోల్చినప్పటికీ తప్పకుండా తేడా కనిపించే రచనలే కృష్ణశాస్త్రివి.

తెలుగు సినిమా పాటలలో కృష్ణశాస్త్రికి ప్రత్యేక స్థానముంది. ఆ పాటలు నిత్య వెలుగులు విరజిమ్ముతూనే ఉంటాయి.

ప్రకృతిలో వెన్నెల కున్నంత గొప్ప స్థానం అది.
మల్లీశ్వరి తో మొదలయి గోరింటాకు వరకు కొనసాగింది.

చనిపోయి పాతికేళ్ళైనా జీవించే ఉన్న చిరంజీవి.

అందాల మేఘమాలను జాలిగుండెల మేఘమాల గా వర్ణించాడు. మల్లీశ్వరిలో మనసున మల్లెలు పూయించినా, ఏడతానున్నాడో బావా అని వగచినా, ఈ అనుభూతిని మనకు మిగిల్చిన కవి. పిలిచిన బిగువటరా...లో ఎంత సరసమో..
సడిచేయకో గాలి, సడిచేయబోకే...నిదుర చెదిరిందంటె నేనూరుకోనే...అని ప్రకృతినే బెదిరించిన కవి కూడా ఈయనే.

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పువులిమ్మని రెమ్మ రెమ్మకూ.. అని కూడా ప్రశ్నించాడు.

ఇది వెన్నెల మాసమనీ, ఇది మల్లెల వేళయని ఎంతో పరవశించిన రసికుడు.

మావిచిగురు తినగానే కొకిల పలికేనా... ఎంత చక్కటి భావమో!

ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి... అంటూ మమేకమైపోయాడు.

రావమ్మ...మహాలక్ష్మి...రావమ్మా అన్న గీతం సంక్రాంతి సంబరాల ఎన్నో వివరాలను, సంప్రదాయ విశిష్టతలను మనకు అందిస్తుంది.

విరిపానుపుల విరహాన్ని, ప్రేమ లాలిత్యాన్ని కూడా ఎంతో మృదువుగా చూపించాడు. కుశలమా! నీకు కుశలమేనా! మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను అంటూ.

ఆకులో ఆకునై..పూవులో పూవునై.. నునులేత రెమ్మనై.. ఈ అడివి దాగిపోనా.. ఎటులైనా ఇచటనే ఆగిపోనా...అని ఎంతో మంచి లలిత గీతం లో తాను కూడా ప్రకృతిలో ఒక భాగమై పోవాలనే తన కోర్కెను ఎంతబాగా వ్యక్తీకరించాడో!

నాదారి ఎడారి..నాపేరు బికారి.. అని ప్రకృతితో తన ప్రేమను మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నాడు. మనసులోని భావ సంచలనానికి ఇదొక ఉదాహరణ.

నిన్నటిదాకా శిలనైనా..నీ పదము సోకి నే గౌతమి నైనా...అని నిదురించిన కలలను మేల్కొల్పాడు.

గోరింట పూచింది కొమ్మా లేకుండా, మురిపాల అరచేత మొగ్గా తొడిగింది అని మనం ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా, జీవితమంతా పాడుకో గలిగే పాటను ఇచ్చిన మహానుభావుడు.

కొలువైతివా రంగశాయి అని, ఘనా ఘన సుందరా అని భక్తి గీతాలకు కూడా ప్రాణం పోశాడు. కృష్ణ శాస్త్రి భగవంతుని పూజించటంలో తన ప్రత్యేకతను చూపించాడు.

అంతేనా జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి... అని దేశభక్తిని కూడా ప్రభోదించాడు. ఇది ఒక గొప్ప సమైక్యతా గీతం.

ఇది కార్తీక మాసం. మహిళలందరూ ఎంతో భక్తిగా రకరకాల నోములు నోచుకునె పవిత్ర మాసం. "ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం..చేరనీ నీ పాదపీఠం నా ప్రాణ దీపం" అని మహిళలకు ఎప్పటికీ నిలిచి పోయె ఒక కానుకను అందించాడు.

దిగిరాను...దిగిరాను దివినుంచి అన్నాడు....ఆకులతో, అందాల పూలతో, సన్నటి పిల్లగాలితో, ప్రవహించే సెలయేటి నీటితో ఒకటేమిటి సర్వం తానే అయి కనిపించాడు.

దూరాకాశపు వీధుల్లో విహరింప చేస్తూనే ఉంటాయి ఈ రచనలన్నీ కూడా... చిరస్మరణీయుడు.

కృష్ణశాస్త్రి పాట, తెలుగు పూల తోట... నభూతో నభవిష్యతి.....


*********************************************************

16 కామెంట్‌లు:

cartheek చెప్పారు...

జయ ఆక్కా చక్కగా రాసారు.
అవును నేనెప్పుడు అనుకుంటుంటాను .........
అమృతం తాగే అద్రుష్టం మనకు లేక పోయినా
కృష్ణ శాస్త్రి గారి కవితలు చదివితే చాలు అమృతం తగినట్టే అని !

మురళి చెప్పారు...

బాగుందండీ.. చిన్న సవరణ.. "నిన్నటిదాకా శిలనైనా.. నీ పదము సోకి నే 'గౌతమి' నైనా.." ఊర్వశి కాదు..
"నా కొరకు చెమ్మగిలు నయనమ్ము లేదు" ని వదిలేశారేమండీ?

vijaya చెప్పారు...

కృష్ణశాస్త్రి గారిని మల్ళీ కనులముందు నిలిపారు.

ఆయన ఆత్మ మిమ్మల్ని దీవిస్తుంది.

తృష్ణ చెప్పారు...

very very nice post...liked it a lot!!

సుజాత వేల్పూరి చెప్పారు...

కృష్ణ శాస్త్రి కోల్పోయింది చూపు కాదండీ, స్వరం!

సుభద్ర చెప్పారు...

జయగారు,
చాలా చాలా బాగారాశారు..
పాటలు అన్ని మాల కట్టి పెట్టారు ,శాస్త్రి గారు ఎక్కడ ఉన్నా చాలా ఆన౦దపడతారు.
కృష్టశాస్త్రి గారికి గొ౦తు కెన్సర్ వచ్చి లాస్ట్ లో మాట పోయి౦దట!!!సరి చేయ౦డి.

జయ చెప్పారు...

థాంక్యూ కార్తీక్. మీ మాట అక్షరసత్యం.

మురళి గారు, థాంక్యూ వెరీ మచ్. సరిచేసానండి. ఎంతో ఇష్టమైన పాట తీరా నేను రాసేటప్పుడు తప్పు రాసేసాను. ఎన్ని పాటలో వొదిలేసాను. ఏం చేయను చెప్పండి. ఇప్పటికే చాలా పెద్దదైపోయింది కదా.

విజయ్ గారు నేను చేసింది చాలా చిన్న ప్రయత్నం. ఆయన మీద అభిమానంతో తప్పనిసరిగ ఏదైనా రాయాలనిపించి ఈ పని చేసాను. ఆయన గురించి నాకు తెలిసింది ఎంతని.

జయ చెప్పారు...

సుజాత గారు, సుభద్ర గారు థాంక్యూ వెరీ మచ్. తెలిసి కూడా మరచిపోయి కొంచెం కన్ ఫ్యూజ్ అయ్యాను. పాటల ధ్యాసలో ఇది గమనించలేదు. సారీ.

మరువం ఉష చెప్పారు...

జయ, ఉదయాన్నే మనసుకి మంచి విందు. ఇంకా వ్రాయాలనేవుండి వుంటుంది మీకు, ఇంకొంచం వ్రాస్తే బాగుండేది అని నాకనిపించినట్లు. అతిశయోక్తి అని కాదు కానీ నా కవితల్లో ఆయన పోకడలు ఇప్పటికి ముగ్గురు చెప్పారు. ఒకరు "కృష్ణపక్షం" పి డి యెఫ్ పంపారు. మీరు వ్రాసిన పాటలన్ని నా చుట్టూ కోలాటం ఆడుతున్నాయి, నేనూ కాసేపు ఆనంద నర్తనం చేసివస్తాను.

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

మంచి పాటలు గుర్తు చేసారు. బాగుంది.

అవును కృష్ణశాస్త్రి పాట, తెలుగు పూల తోట... నభూతో నభవిష్యతి.....

SRRao చెప్పారు...

జయ గారూ !
కృష్ణశాస్త్రి గారి గురించి నేను రాద్దామనుకున్నాను. సమయం దొరకక రాయలేకపోయానని బాధపడ్డాను. కానీ మీరు, తృష్ణ గారు రాసినవి చూసాక ఆ బధ తీరిపొయింది. ఇంతమంది అభిమానుల్ని పొందిన ఆయన జన్మ ఎంత ధన్యమో అంతటి మహాకవిని పొందిన తెలుగు భాష, తెలుగు జాతి అంతకంటే ఎక్కువ ధన్యం. ఆలస్యమైనా ఆయన అభిమాన మిత్రుల కోసం ఆయనవి కొన్ని అరుదైన ఫొటోలు, ఆయన స్వంత చెతిరాతతో వ్యాఖ్యానం రాసినవి, ఆయన మీద కొందరు ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు నా బ్లాగులో పెడుతున్నాను. చూడండి.

జయ చెప్పారు...

రావ్ గారు మీ కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఎంతో కష్టపడి సంపాదించి ఉంటారు వీటిని. ఇవి చాలా విలువైనవి. అభినందనలు.

జయ చెప్పారు...

ఉషా గారు మీ కవితలు నాకు ఎంతో నచ్చటానికి కారణం మీకిప్పుడు అర్ధమై ఉంటుంది. అవునా! భావుకత, ఆ మమైకత్వం హృదయాంతరాళను కదిలిస్తుంది. అందుకే మీ రచనల్లో నేను కూడా కృష్ణ శాస్త్రి గారిని చూసుకొని ఆనంద పడుతూ ఉంటాను.
కృష్ణ శాస్త్రి గారి గురించి రాయటమన్నది అంత సులభం కాదు. ఎంతరాసినా మిగిలి పోతూనే ఉంటుంది. ఆ అసంత్రుప్తి ఎప్పటికీ తీరనిదే. ఈ పని సాహితీ వేత్తలది. నాలాంటి వాళ్ళు ఏదో ఇసుమంత త్రుప్తి కోసం రాసుకోటమే.

జయ చెప్పారు...

భాస్కర రామి రెడ్డి గారు థాంక్యూ. కృష్ణ శాస్త్రి గారి లోటు నిజంగా ఎవరూ పూడ్చలేనిదేనండి. వారు ఎప్పటికీ చిరంజీవులే.

veera murthy (satya) చెప్పారు...

జయ గారు నమస్కారమండీ!
క్రిష్ణ శాస్త్రి గారి మీద మీ
ఆదరాభిమానాలు నిజంగా
సంధర్భొచితంగా ఉన్నాయి...


కవి కాలనికి చెందని వాడు,
కవి కన్నీటికి అందని వాడు...
కాలం దొచిన జ్ఞాపకాలని,
కష్టించి దోచి పెడతాడు..

కవి బల్ల గుద్ది,ఏ కుండలూ బద్దలు కొట్టడు...
తడి చెక్కిళ్ళని అంబరం తొ అద్ది,
పగిలిన ముక్కలని ఏరి అతుకుతాడు..
కల కాలం బతుకుతాడు...

--సత్య

జయ చెప్పారు...

సత్య గారు, మీరు చెప్పింది ఇంకా ఎంతో బాగుంది.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner