అతను ఆమె ఇంతలో ఈమె
రెండు రోజుల క్రితమే చూశానండి ఈ సినిమా. బహుశా: రేపో, ఎల్లుండో ఈ సినిమా వెళ్ళిపోవచ్చుకూడా. ఏం చేయను, అందరూ చూసేసారు. ఇప్పటిదాకా నాకు వీలవ్వలేదు. అయినా సరే, నేను చూసాను కాబట్టి ఈ సినిమా గురించి రాస్తాను.
ఇ౦కా ఎవరైనా చూడని వాళ్ళు ఉ౦టారులె౦డి. ఇది వాళ్ళ కోసమన్న మాట. ఒకవేళ చాలా రోజుల క్రితం చూసిఉంటే కొంచెం గుర్తు చేసుకోవచ్చని, నా ఉద్దేశం.
ముఖ్యంగా ఈ సినిమా మొదటి భాగం లో నాకు రెండు సినిమాలు గుర్తుకొచ్చాయి. అవేంటంటే, రాజేంద్ర ప్రసాద్, యమున నటించిన చాదస్తపు మొగుడు. రెండవది నాగార్జున, రమ్యకృష్ణ నటించిన చంద్రలేఖ.
బామ్మా, మనవళ్ళ చేజింగ్ తోటి ఈ సినిమా మొదలవుతుంది. చంద్రం (శ్రీకాంత్) వాళ్ళ బామ్మ (తెలంగాణ శకుంతల) కి చాలా దేశభక్తి. దేశనాయకుల పుట్టిన రోజులకి వాళ్ళ వేషాలు వేసి ఫొటోలు తీయిస్తూ ఉంటుంది వాళ్ళ బామ్మ. అప్పటికే గోడ మీద చంద్రం ఫొటోలు వివిధ దేశనాయకుల వేషాలలో తగిలించి ఉంటాయి. ఆ రోజు గాంధీ పుట్టిన రోజు. గాంధీ వేషం వేయటానికి, గుండు చేయాలిగా మరి. అందుకే బామ్మ, మనవడి వెంట పరుగులు తీస్తూ ఉంటుంది. వొచ్చే వేమన పుట్టిన రోజుకి వేమన వేషంలో కూడా ఫొటో తీయిస్తానని అంటుంది కూడా. చివరికి మనవడు తప్పించుకొని మంగలి వాడే గుండు గీసుకొని, గాంధీ లాగా అహింస ప్రచారానికి వెళ్ళిపోతాడు. ఇటువంటి కొన్ని తమాషా సంఘటనలు మనల్ని బాగానే నవ్విస్తాయి.
చంద్రం, కల్యాణి (మీరా జాస్మిన్) లది అన్యోన్య జంట. 'మేడ్ ఫర్ ఈచ్ అదర్ ' లాగా ఉంటారు. వాళ్ళ ఫామిలీ ఫ్రెండ్ కృష్ణ భగవాన్. పని దొరకని ఒక ప్లీడర్. ఈ సినిమా లో కొంచెం కీలక మైన పాత్రే.. చంద్రం శ్రీ కల్పనా డ్రైవింగ్ కంపెనీ లో ఒక కాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు.
ఈ ఇద్దరు దంపతులకి సంతానం లేదు. తనతోటి ఇతర డ్రైవర్ల పిల్లలు ఎప్పుడూ ఇతని ఇంట్లోనే ఆడుకుంటూ ఉంటారు. అంతేకాకుండా,అ పిల్లల ఫీజులు, బర్త్ డే ఫంక్షన్ ల వంటివి తన ఖర్చుతోటే చేస్తూ ఉంటాడు.
ఈ సినిమాలో స్త్రీలకి నచ్చే కొన్ని రమ్యమైన దృశ్యాలు కూడా ఉన్నాయి. చంద్రం మెడపట్టుకొని నొప్పితోటి ఇంటికి వొచ్చినప్పుడు అతని భార్య, ఎదురు కాళ్ళతో పుట్టిన వాళ్ళు, పాదం తోటి మెడ మీద మెల్లగా రాస్తే ఆ నొప్పి పోతుందని, అతని మెడ మీద తన పాదం తోటి రాస్తుంది. ఈ విషయం నేనెక్కడో చదివాను కూడా. కల్యాణి పిల్లలు కలగాలని గుడి మెట్లకు పూజ చేస్తూ ఒక్కొక్క మెట్టే ఎండలో ఎక్కుతున్నప్పుడు, తన షర్ట్ విప్పి ఆమెకి గొడుగులాగా పట్టి తోడుగా చివరి దాకా వెల్తాడు. ఇలాంటి కొన్ని దృశ్యాలు బాగానే ఆకర్షిస్తాయి.
బ్రమ్హానందం, కోవై సరళల హాస్యం కొన్ని చోట్ల శ్రుతి మించినా, కొంతమేర బాగానే అనిపిస్తుంది. కోవై సరళ తండ్రి తన ముగ్గురు భార్యలు లేచిపోయిన సందర్భంగా, తన కూతురికి మొగవాళ్ళే కనిపించకుండా, కళ్ళకు గంతలు కట్టి పెంచుతాడు. మొదటిసారిగా చూసిన భర్త మొహమే ఆమెకి అందరిలో కనిపించటమే ఈ సినిమా లోని కామెడీ.
చంద్రం భార్య గర్భవతి అవుతుంది. ఆమెకి గుండెజబ్బు ఉందని, ఆపరేషన్ కి కొన్ని లక్షలు కావాలని చెప్పట౦తో కథ మలుపుతిరుగుతుంది. అప్పటివరకు సరదాగా సాగే సినిమాలో కొంత గంభీరత చోటుచేసుకుంటుంది.
అనుకోకుండా రైలు పట్టాల మీద మరణించిన స్త్రీ, ఆమె దగ్గిర ఉన్న బాగ్ లో లక్షల డబ్బు, ఆమె ఫొటో ఇతని కంట పడుతాయి. అదంతా పోలీసుల కప్పచెప్పిన చంద్రం, తరువాత తన స్నేహితుడి బలవంతంతో ఆమె తన భార్యేనని పోలీస్ ఆఫీసర్ కి చెప్పి, అతనికి కొంత లంచమిచ్చి మిగతాడబ్బు తన భార్య ఆపరేషన్ కోసం కడుతాడు. మర్నాడు పేపర్ లో ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆ స్త్రీ ఫొటో వొస్తుంది. ఆమె ఒక గొప్ప ధనికుని కుమార్తె రమ్య (సదా). ఆమె తండ్రి (తనికెళ్ళ భరణి) ఆ వార్తతో, గుండె పోటు వొచ్చి ఆసుపత్రిలో చేరుతాడు. మళ్ళీ స్నేహితుడి ప్రోద్భలంతో, తానే అల్లుడినని చెప్పి అతనికి సేవలు చేస్తాడు చంద్రం.
అప్పుడే చనిపోయిందనుకున్న రమ్య తిరిగి ఒస్తుంది. కాని చంద్రం తన భర్త కాదని చెప్పకుండా, అతను తన భర్తలాగానే ప్రవర్తిస్తుంది. ఎందుకని?
తనభర్త ప్రేమ క్రమంగా తరిగిపోతొందని భయపడుతుంది కల్యాణి. తన శీమంతానికి రాని భర్త ఎక్కడున్నాడో తెలుసుకొని అక్కడికి వెల్తుంది. కాని అక్కడ తన భర్తని ఇంకో స్త్రీ తో చూసికూడా, అతనిని ఏమీ అనకుండా, అతడు తన భర్త కాదని తాను పొరపడ్డానని చెప్పుతుంది. ఎందుకని?
పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ తరువాతి కథలో కొంత ముఖ్య పాత్రే నిర్వహిస్తాడు. కథ మలుపుకి అతను ఎలా కారణమవుతాడు?
ఇందులో ఒక జేంస్ బాండ్ 000 కూడా ఉన్నాడు. అతని పరిశోధనలు చంద్రం కి ఏమన్నా సహకరించాయా?
కథను క్లైమాక్స్ కి తీసుకెళ్ళే మతిమరుపు ఆలీ కూడా ఇందులో ఉన్నాడు. అతడు చెప్పిన రహస్యమేమిటి?
రమ్య ఫ్లాష్ బాక్ ఏంటి? కల్యాణి భవిష్యత్తు ఏంటి?
ఇవన్నీ వెండితెర మీద చూడాల్సిందే!
ఎందుకూ పనికిరాని రఘుబాబు పాత్ర కూడా ఇందులో ఉంది.
ఈ సినిమాలో అడుగడుగునా ఇంతవరకు వొచ్చిన అనేక సినిమాల్లోని పాటలు బాక్ గ్రౌండ్లో అప్పుడప్పుడూ వొస్తూఉంటాయి. ముఖ్యంగా హృదయమెక్కడున్నది అన్న పాట చాలా సార్లు ఒస్తుంది.
"ఎంత నరకం ఎంత నరకం నా కళ్ళ ముందు నువ్వుంటే ఎంత నరకం" అనే పాట చాలా బాగుంది. "అచ్చట...ఇచ్చట..." అన్న ఇంకో పాట కూడా వినటానికి బాగానే ఉంది.
ఈ సినిమాలో మీరా జాస్మిన్ బొద్దుగా లేకుండా, ముద్దుగా ఉంది. సదా తన పాత్రలో ఎటువంటి భావాలు సరిగ్గా పలికించలేక పోయింది. శ్రీకాంత్ బాగానే ఉన్నాడు. సినిమా లొ ఒక క్లబ్ డాన్స్ ఉన్నా, అన్ని సినిమాల కన్నా, చాలా నీట్ గా ఉ౦దని చెప్పొచ్చు. అ౦దరు కలిసి చూడొచ్చు.
స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎన్. శ్రీనివాస రెడ్డి. బాగానే ఉంది. స౦గీత౦ ఎమ్.ఎమ్. శ్రీలక్ష్మి
*********************************************************
16 కామెంట్‌లు:
జయగారూ,
అచ్చం ఒక సినిమా జర్నలిస్ట్ సినిమా సమీక్ష ఎలా రాస్తాడో అలా రాసేరండీ... ఇది చదివాక సినిమా చూడబుధ్ధి అవుతోంది.
బాబోయ్...నాకీ ఇద్దరు హీరోలు...ఒక హీరోయిన్, ఇద్దరు హీరోయిన్లు..ఒక హీరో..ఉండేముక్కోణపు సినిమాలంటే భయమండీ...ఎంత మంచివయినా అస్సలు చూడను...మీ ఓపికకు జోహార్లు.
అరె ఈ సినిమా బాగుంటుందా ? నాకు తెలీలేదే . వుందా ? పోయిందా?
సినిమా బాగానే ఉంటుందండి శ్రీలలిత గారు. ఇప్పుడొచ్చే గందరగోళ సినిమాల్లో ఇది నయమే. నేను కూడా ఒక రివ్యూ రాయాలని ఒక చిన్న ప్రయత్నం చేసాను. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
ఓపిక దేముంది లెండి తృష్ణ గారు. మా స్టూడెంట్స్ నాకు చాలా ఓపిక ఉందంటారు. దానిదేముందండి, మీకు నచ్చింది నాకు నచ్చక పోవచ్చు. ఎంతమంది హీరోలు, ఎంతమంది హీరోయిన్లు అన్నది నేను పట్టించుకోనండి. సినిమా ఎలా ఉంది అని అన్ని అంశాలలో గమనిస్తూ పోతాను అంతే.
సినిమా బాగానే ఉంటుందక్కా. బహుశా ఇంకా కొన్ని రోజులుండచ్చు. కొట్లాటలూ, చంపుకోటాలు లేకుండా ఒక ఫామిలీ టైప్ మూవీ అంతే. త్రికోణం కూడా కాదు. సరదాగా చూసేయొచ్చు.
ఈ సినిమాకి మొదట అతడు ఆమె ఇతడు ఈమె టైటిల్ అనుకున్నరు. తర్వాత అతడు ఆమె ఇంతలో ఈమె గా మార్చేసారు.
మీరు చెప్పిన కధని బట్టీ రెండో టైటిలే ఈ కధకి నప్పిందనిపిస్తుంది. జయగారు మీరు శ్రీకాంత్ ఫేనా.....
మెడనెప్పి కాలితో తన్నితే పోతుందా ? ఏంటి నిజమే ? భలే ఐడియా ఇచ్చారే....!
నా మిత్రుడొకాయన 'సినిమా నీచంగా ఉంది' అని చెప్పాడండీ. 'నవతరంగం' రివ్యూ కూడా ఇంచుమించు అలాంటి అర్ధం వచ్చేలాగే ఉంది.. మీకు నచ్చిందంటే మీరు సొట్ట గడ్డం శ్రీకాంత్ వీరాభిమాని అయిఉంటారు.. రైట్? 'తారక రాముడు' చూశారా? ..అన్నట్టు మీరు రివ్యూ రాసిన విధానం బాగుంది.. ఇలాగే కొనసాగించండి..
లలిత గారు ఈ సినిమాలో సరదా సన్నివేశాలు ఉన్నాయి. అంతే. కాలితో మెడమీద రాయాలి, తన్నటం కాదు. అలా చేసేరు కొంపదీసి.
మురళి గారు, నేను శ్రీకాంత్ వీరాభిమానిని ఎంతమాత్రం కాదు. ఈ సినిమాలో వరుసపెట్టి సరదా సన్నివేశాలు రావటంతో శ్రీకాంత్ గురించిన ఆలోచన రాదు. తారకరాముడు నేను చూడలేదు. స్వరాభిషేకం లో నాకు శ్రీకాంత్ బాగానే అనిపించాడు. నేను సినిమా చూసి కూడా చాలా రోజులే అయింది. గందరగోళం సినిమాలు, ఫైటింగుల కంటే ఇది బాగానే అనిపించింది. ఇంక పోతే, వేరే రివ్యూ లేవి చదవలేదు. నేను రాసిన విధానం నచ్చినందుకు థాంక్స్.
బాబోయ్....
మళ్ళీ డబల్ హీరోయిన్ సెంటిమెంటా..
కొత్త సీసాలో పాత మందేగా..ఏం చూడ బుధ్ధవుతుంది.
శ్రీనిక గారు, నేనొక రివ్యూ రాయటం నేర్చుకోటానికి, నేను చూసిన సినిమా మీద ఇలా ప్రయోగం చేసానండి.
అక్క మీరు చెప్పిన తీరు బాగుంది..
కాని
నేను ఇలా ఇద్దరు పెళ్ళాలు ఇద్దరు మొగుళ్ళు సినిమాలు ఇష్టపడను..
అందులో ఏదో కమర్షియల్ గా తీసే సినిమాలు అస్సలు వెళ్ళను...
అక్క మీరు చెప్పిన తీరు బాగుంది..
కాని
నేను ఇలా ఇద్దరు పెళ్ళాలు ఇద్దరు మొగుళ్ళు సినిమాలు ఇష్టపడను..
అందులో ఏదో కమర్షియల్ గా తీసే సినిమాలు అస్సలు వెళ్ళను...
జయ గారు, సంగీతం ఎం. ఎం. శ్రీలక్ష్మి కాదండీ ఎం. ఎం. శ్రీ లేఖ మీకు ఈ సినిమా నచ్చి వరుడు నచ్చలేదంటే వరుడు ఎలా ఉంటా డోనని భయంగా వుంది అల్లు అర్జున్ సినిమా ఎలాంటిది అయినా బాగుంటుంది అంటారు . అందుకే వరుడు అలా వుంటుంది అంటే నమ్మ బుద్ధి కావటం లేదు. మీ హెచ్చరిక అందరూ వింటే సంతోషమే . ఏమైనా గానీ మీ రివ్యూ లకు థాంక్సు లు . మరిన్ని మంచి పోస్టులు, రివ్యూ లకై ఎదురు చూస్తుంటాను.
సారీ ప్రభాకర్ రెడ్డిగారు, ఏమనుకోకండి, మీ కామెంట్ చాలా లేట్ గా ఇప్పుడు చూసాను. థాంక్స్. అవునండి పేరేదొ తప్పుగా రాస్తున్నాను అని అప్పుడనిపించింది. కాని సరిగ్గా గుర్తురాలేదు:)
కామెంట్‌ను పోస్ట్ చేయండి