25, నవంబర్ 2009, బుధవారం

'గడప దాటని మా ఓటు'

ఈ సారి గ్రేటర్ ఎలెక్షన్స్ లో ఎలాగైనా ఓట్ చేయాలి అనుకున్నాను. కాని అనుకోకుండా, విజయవాడ, బందర్ వెళ్ళాల్సి వొచ్చింది. ఎలక్షన్ టైం కి నేను ఉండను. అయ్యో! అనిపించింది.

ఈ లోపల మా పనమ్మాయి, సుజాత ఒచ్చింది. నాకు వెంటనే, ఫ్లాష్ వెలిగింది. కనీసం, సుజాత ను ఓటు వేయమని చెప్పాలి అనుకున్నాను. వెంటనే సుజాత ని పిలిచి నీకు ఓటు కార్డ్ ఉందా అనడిగాను.
ఉన్నదమ్మా! నేను ఓటు ఏస్తను కదా, ఈ సారి అంది.

మంచిది, సుజాత..ఎవరికి వేస్తావు...అని అడిగాను.

నేను కాంగ్రేసు కి ఏస్తనమ్మా...అంది వెంటనే.

ఏ..ఎందుకు? అని వెంటనే అడిగాను.

అవునమ్మా..పరిపాలనలో ఉన్నోళ్ళకే ఓటు ఎయ్యాలె...అప్పుడే మనకి మంచిగైతది...అంది.

నేను ఊరుకోకుండా..ఎందుకలాగా! అనడిగాను.
అవునమ్మా! వాళ్ళు సగం డబ్బు తిన్నా...మిగతాది మా అసుమంటోళ్ళకు ఖర్చు పెడతరు...అదే, వెరే ఓళ్ళకు ఏస్తే, ఓటు దండగే...అండ్ల మాకేటొస్తది...అంది.

ఎంత జీవిత సత్యం చెప్పావు సుజాతా...నా కళ్ళు తెరిపించావు, అనుకున్నాను. అంటే దానికర్ధం..ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే దానికే ఓటు వేయాలన్నమాట...

నేను ఇంక ఏదో వేరే పార్టీకి వేద్దామనుకుంటున్నాను..కొత్త పరిపాలన లో ఏమన్నా బాగుంటుందేమో! అని నా ఆశ.

సరే, సుజాత, మీ ఆయనతో వెళ్ళి ఇద్దరూ ఓటేయండి, లేకపోతే మీ ఓట్లు వేరే ఎవరో వేసేస్తారు, అన్నాను.

మా ఆయన కూడా ఉండడమ్మా, అయ్య వెంట బయటకెల్తున్నడు, మా చింటు గాడిని తీసుకెల్తా...అంది.

సరే మర్చి పోకు, ఇంట్లో అందరూ జాగ్రత్త..అని చెప్పి నేను ఊరికెళ్ళిపోయాను.

తిరిగి రాంగానే సుజాతని అడిగాను ఓటేసావా! అని...

లేదమ్మా..చింటుగాడితోటి పెద్ద గొడవైపోయింది...అంది.

అదేంటి..వాడితో గొడవేముంది? నీ ఓటుకి వాడేమడ్డం ఒచ్చాడు? అన్నాన్నేను.

తను చెప్పింది వింటే..నిజంగా నేను నమ్మలేక పోయాను...

మా ఇంటికి దగ్గిర ఉన్న స్కూల్ లోనే మా ఓటింగ్ సెంటర్. పిల్లగాడిని తోడుతీసుకొని స్కూల్ కి వెళ్ళింది. ఆ స్కూల్లోనే మా వాడు కూడా చదువుతున్నాడు. తన స్కూళ్ళో అంతమంది, అన్ని రూం ల ముందు లైన్లల్లో నించోడం చూసి వాడికి చాలా ఉత్సాహం వొచ్చేసింది.

వాడికి ఓటు గురించి బాగానే తెలుసు. ప్రతిరోజు అన్ని పార్టీల ప్రచారాలు చక్కగా ఫాలో అవుతున్నాడు. ఎన్నో పాటలు కూడా నేర్చుకున్నాడు. వెంటనే గొంతెత్తి, గట్టిగా పాడ్డం మొదలుపెట్టాడు. వాడికి బాగా ఒచ్చిన పాట ఒకటుంది. మా ఇంటిచుట్టూ రోజూ ఇదే హోరు ఉండేది. వాడూ రోజూ ఈ పాటలు పాడుతూఉంటే, నేను కూడా సరదాగా వినేదాన్ని. ఆ రోజు ఎక్కడా పాట పాడే అవకాశం వాడికి రాలేదు. రోజూ ప్రచార రధం వెంట వొచ్చే పిల్లలకు రధం లోని వాళ్ళు చాక్లెట్లు ఇచ్చే వారు. ఇప్పుడుకూడా అక్కడున్నవాళ్ళు చాక్లెట్లు ఇస్తారనుకున్నాడేమో! ఇంక, హుషారుగా పాటందుకున్నాడు. వాడి గొంతుకూడా చాలా బాగుంటుంది.

ఆ పాటేంటో తెలుశా!
"మరసిపోయి ఓటేస్తే తమ్ముడూ!
మనల ఏట్ల ముంచుతారురా తమ్ముడూ..
ఇది మోసాలా కాంగిరేసు తమ్ముడూ...
పదవి కోసం గడ్డి తింటదిరా, తమ్ముడూ...
ఇసుంట రమ్మంటే... ఇల్లంతా నాదంటదిరా, తమ్ముడూ..." ఇలా ఈ పాట ఇంకా చాలా ఉంది.

రోజు మా ఇంటి చుట్టూ తిరిగే ప్రచార రధాల వెంట తిరిగి, తిరిగీ వాడు ఈ పాట చాలా బాగా నేర్చుకున్నాడు. ఆ స్కూళ్ళో ఈ పాటే గట్టిగా పాడడం మొదలుపెట్టాడు. దానితోటి, చాలా మంది వీడి చుట్టూ చేరారు. అక్కడే ఉన్న పార్టీ ఏజెంట్స్ కూడా ఒచ్చేసారు. అన్ని పార్టీల ఏజెంట్స్ సంతోషించినా...కాంగ్రేస్ ఏజెంట్ కి చాలా కోపంకోపం వొచ్చింది.

ఆ కాంగ్రేస్ ఏజెంట్ చాలా కోపం తోటి, పోలింగ్ అయితోంటే, ఇప్పుడు నువ్వు ఇక్కడ ప్రచారం చేస్తావా? అలా చేయకూడదని తెలీదా? ఎవరు పంపారు నిన్ను, పేరు చెప్పు? అని చింటుగాడిని పట్టుకొని దులిపేసాడు.

మా సుజాత చాలా భయపడిపోయి, వానికేం తెలియదయ్యా..ఊరికే అట్ల పాడిండు..అంతే..అంది.

ఊరికే ఎట్లా పాడతాడు..పద పోలిస్ స్టేషన్ కి అన్నాడు..ఆ ఏజెంట్. మిగతా ఏజెంట్లు ఎందుకయ్యా..అట్లా గొడవ పెడ్తావు...చిన్న పిల్లగాడు..ఊరుకో..అని అడ్డం పడి, ఆ ఏజెంట్ ని శాంతింప చేసారు.

మా సుజాత బ్రతుకు జీవుడా అనుకొని...వెళ్ళి మళ్ళీ లైన్లో నుంచుంది. ఇంక అయిదునిముషాల్లో..వీళ్ళు లోపలికి వెల్తారనగా..అక్కడున్న అభ్యర్ధుల పోస్టర్ వీడి కంట పడింది. అందులో ఉన్న లోకసత్త జెండా వీడికి చాలా పరిచయమే. ఆ పార్టీ ప్రచార రధం వెనకాల కూడా తిరుగుతూనే ఉండే వాడు. వాళ్ళదగ్గిర కూడా ఒక పాట నేర్చుకున్నాడు. లోకసత్తా జెండా చూడంగానే వాడి కళ్ళు మిళమిళా మెరిసిపోయాయి. వీళ్ళ దగ్గిర నేర్చుకున్న పాట వాడి ఫేవరెట్ సాంగ్. ఆ పాట చాలా రాగయుక్తంగా పాడుతాడు వాడు. వాళ్ళ దగ్గిర నేర్చుకున్న పాట గట్టిగా, ఎంతో పరవశంతో, ఆవేశంగా, జనరంజకంగా, అక్కడి జెండా చింపి మరీ చేతిలో పట్టుకొని..ఊపుకుంటూ... పాడడం మొదలు పెట్టాడు.

"ఏమి ప్రభుత్వం ఇది ఓరి నాయనో!
దీనికెట్ల పెట్టేది నిప్పు నాయనో!
ఎన్నాళ్ళీ అన్యాయం..అవినీతి...అక్రమం".....అంటూ, ఊగిపోతూ డాన్స్ కూడా మొదలుపెట్టాడు.

ఈ సారి ఏజెంట్స్ తో పాటు, పోలీసులు కూడా ఒచ్చేసారు. వాడిని పట్టుకొని గట్టిగా గదమాయించి, ప్రశ్నల మీద ప్రశ్నలు మొదలుపెట్టారు. వాడు అంతకంటే ధైర్యంగా..నాకింకా చాలా పాటలొచ్చు...అని మళ్ళీ, ఇంకో పాట అందుకున్నాడు.

పోలీసులు, మా సుజాతని నువ్వు దేనికొచ్చావు..నిజం చెప్పు...లేకపోతే ఇప్పుడే మీ ఇద్దరిని పోలీస్ స్టేషన్ లో పెడ్తాము...పదండి..మీరు ఎక్కడుంటున్నారు...ఏమి చేస్తున్నారు...మీ ఆయనెవరు...ఏ పార్టీ వాళ్ళు పంపారు మిమ్మల్ని ...చిన్న పిల్లలతోటి ప్రచారం చేయిస్తారా. ఇది పెద్ద నేరం తెలుసా? నీ కు పెద్ద శిక్ష పడుతుంది...లాఠీ తగిలితే గాని మీకు తెలిసిరాదు...ఒకసారి చెప్పితే అర్ధంకాదా! అని లాఠీ తీసుకొని ఒచ్చారు.

అసలే అడుగడుగునా బందోబస్తుతో, అతి జాగ్రత్తల తో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇంక అక్కడనుంచి బయట పడటానికి, మా సుజాత వాళ్ళను అన్నిరకాలుగా బతిమలాడుకొని...మా ఇంటి అడ్రస్ ఇచ్చిందిట. అప్పుడే అనుకోకుండా..అక్కడికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి చెకింగ్ కి రావటం తోటి...పోలీసులంతా అటువైపు వెళ్ళిపోయారు.

సమయం చూసుకొని, మా సుజాత...చింటుగాడి చేయిపట్టుకొని...బరబరా ఈడ్చుకుంటూ ఇంటి కొచ్చి పడింది... మా అత్తగారికి చెప్పి భయంతోటి ఏడవడం మొదలుపెట్టింది. మా అత్తగారు, తనకి కాస్త ధైర్యం చెప్పి, అయ్య ఒచ్చాక చూద్దంలే..అని ఓదార్చారు. ఇంక చింటుగాడికేమొ...చాలా పెద్ద క్లాసే పీకారు.

మా అత్తగారికి అసలే ఒంట్లో బాగుండక ఈ సారి ఇష్టం లేకపోయిన ...మా బలవంతంతోటి ఓటు వేయకుండా, ఇంట్లో ఉండి పోయారు. ఇప్పుడు వీడి గొడవతోటి, పోలీసులు ఎక్కడ మా ఇంటిమీదికొస్తారో అని మా అత్తగారు కూడా చాలా భయపడిపోయారు.

దీని మూలంగా మొత్తానికి...మా సుజాత కూడా ఓటు వేయలేదు.

ఇందుఫలితంగా జరిగిందేంటయ్యా అంటే...అధికార పార్టీకి కాని, అనధికార పార్టీకి కాని మా ఇంట్లోనుంచి ఒక్క ఓటు కూడా పడలేదు.

మా ఓట్లు మా గడప దాటలేదు....

మా ఓట్లు వేరే ఎవరైనా వాళ్ళకిష్టమైన పార్టీల కేసుకున్నారేమో...అదికూడా మాకు తెలియదు.



************************************************************************************

17 కామెంట్‌లు:

Megastar చెప్పారు...

Mee votu gadapa daati bayataku rakapoyina mee anubhavam bayataku vachhindi

సుభద్ర చెప్పారు...

హామ్మా చి౦టూ...అలా చేశాడా!!!పాప౦ కా౦గ్రేస్ ఓ ఓటు పోగోట్టుకు౦దన్న మాటా...

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

ఒక పక్క మీరు చెప్పిందంతా కళ్ళముందు కనపడుతుంటే చాలా నవ్వొచ్చింది నాకు...పాపం సుజాత...మొత్తానికి కాంగీయులకి ఓటు వెయ్యకుండానే వచ్చేసిందన్నమాట...
ఆవిడ లాజిక్ భలే ఉంది..:)
ఇది వరకు మా వంట ఆవిడని(ముసలావిడ) నువ్వు కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేస్తున్నావు అని అడిగితే ఇందిరమ్మ ఉన్నప్పుడు నుండి హస్తంకే వేస్తున్నాను..అందుకే ఇప్పుడు కూడా అని సింపుల్ గా చెప్పేసింది.

sunita చెప్పారు...

చింటూ గాడి పాటకు జై.మనకు ఇన్సిడెంటల్ కామెడీగా అనిపించినా పాపం మీ సుజాత బాగానే అవస్త పడి ఉంటుంది.

శిశిర చెప్పారు...

"పరిపాలనలో ఉన్నోళ్ళకే ఓటు ఎయ్యాలె...అప్పుడే మనకి మంచిగైతది".
"వాళ్ళు సగం డబ్బు తిన్నా...మిగతాది మా అసుమంటోళ్ళకు ఖర్చు పెడతరు...అదే, వెరే ఓళ్ళకు ఏస్తే, ఓటు దండగే".

:) నిజమేనేమో. ముఖ్యంగా స్థానిక ఎన్నికలలో.

భావన చెప్పారు...

హ హ హ మొత్తానికి మీ పాట గాడు ఒక వోటు కాంగ్రెస్ కు పడకుండా చేసేడు ఐతే.. మా వూరు వెళ్ళేరా... బాగుందా?

శివ చెరువు చెప్పారు...

మా ఇంట్లో కూడా ఓటు గడప దాటలేదు..

జయ చెప్పారు...

శరత్ గారు, మీ ఓట్లన్నీ పడ్డట్లున్నాయ్..అందుకే నవ్వేస్తున్నారు.

హేమంత్ గారు, ఓటు సంగతేమో గాని అనుభవాలు పంచుకుంటే మంచిదే కదా!

జయ చెప్పారు...

అవును సుభద్ర గారు. మా సుజాత ఇప్పటికీ వాడిని సాధిస్తునే ఉంది. ఆమే కోపం ఇంకా తీరటమే లేదు.

శేఖర్ గారు, మా సుజాత ఓటు వేయలేక పోయినా...కాంగ్రెస్ విజయాన్ని తెలుసుకొని సంతోషిస్తోంది. తన ఓటు కలవలేదే అని ఇంకా దిగులు పడుతూనే ఉంది. ఇంక కొడుకుని ఎక్కడికీ తీసుకుపోదుట.

జయ చెప్పారు...

అవునండి సునీత గారు, వాడు ఎన్ని పాటలు నేర్చుకున్నాడో! ఎంత స్పష్టంగా పాడుతాడో...నాకెంతో ఆశ్చర్యమేస్తుంది...వాడిని ఇంకో దారిలోకి తీసుకొచ్చి సంగీతం నేర్పించమని చెప్తున్నాను.

శిశిరా..వాళ్ళెప్పుడు లాజికల్ గా ఆలోచిస్తారు. తన ఓటు కాంగ్రెస్ కు పడనందుకు ఇప్పటికీ మా సుజాత చిర్రుబుర్రు లాడుతూనే ఉంది.

జయ చెప్పారు...

హాయ్ భావనా! మా పాటగాడి పని రోజుకొక రకంగా పట్టిస్తోంది మా సుజాత. ఆమె కోపం ఎంతకీ తీరటం లేదు.
యా..యా..మీ ఊరికి వెళ్ళాను...ముచ్చట్లు కూడా చెప్తాను....:)



అయ్యో!!! శివచెరువు గారు...ఎందుకండీ మీ ఓట్లని గడప దాటనియ్యలేదు?

మాలా కుమార్ చెప్పారు...

మొత్తనికి మీ చింటూగాడు భలే పని చేసాడు .
వోటు టైం కల్లా రాలేదని , నా వోట్ వేస్ట్ అయ్యిందని మీ బావగారు చిర్రు ,బుర్రు .

మురళి చెప్పారు...

బాగుందండీ మీ చింటూ చేసిన పని.. కోడిగుడ్డు కి షేవింగ్ చేస్తున్నానుకోక పొతే, అసలు పోలింగ్ శాతమే చాలా తక్కువ ఉందని పేపర్లు టీవీలు చెబుతుంటే మీరేమో ఓ పొడవైన క్యూ ని మా కళ్ళముందు ఉంచారు.. మొత్తానికి మీ ప్రాంతం వాళ్లకి ప్రజాస్వామ్యం మీద మక్కువ ఎక్కువ అనుకుంటానండి..

జయ చెప్పారు...

అక్కా, నిజంగానే, వాడిని పట్టతరం కాకుండా ఉన్నాడు. వాడ్ని హాస్టల్ లో చేర్పించేయ మన్నాను.

జయ చెప్పారు...

అవునండి మురళి గారు. ఊరిమొత్తం మీద పోలింగ్ శాతం తక్కువే కావచ్చు. కాని ఒక చిన్న స్కూల్ లో రెండు రూం ల ముందు ఓ యాభై, అరవై మంది ఉన్నా ఎక్కువగానే కనిపిస్తారు కదా! నేను పనిచేసే కాలేజ్ లో కూడా ఆ రోజు రష్ ఎక్కువేఉందని విన్నాను.

మా ఊరు చెప్పారు...

చింటూ చుక్కలు చూపించాడు కదా
హహహః

జయ చెప్పారు...

మా ఊరు గారు, చుక్కలా ఇంకేమన్నానా...విన్న నా కళ్ళే గింగిరాలు తిరిగి పోతేను...

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner