6, నవంబర్ 2009, శుక్రవారం

ఎవరైనా చూశారా బాబూ!

ఎవరైనా చూశారా బాబూ! ఇది మా అత్తగారి డైలాగ్. రోజుకు కనీసం అయిదారుసార్లన్నా ఉపయోగించే మోస్ట్ పాపులర్ డైలాగ్ ఇది. మా చుట్ట పక్కా లందరికీ కూడా వెల్ నోటెడ్ డైలాగ్ ఇది.


ఆవిడ దగ్గిర ఒక అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది. చాలా రెగ్యులర్ గా పంక్యుయల్ గా మైంటైన్ చేస్తారు. మా అత్తగారి కున్నంత టైం సెన్స్ మీ కెవ్వరికీ లేదని నేను నొక్కి వక్కాణించి మరీ చెప్పగలను. ఎవరు ఇంట్లొనుంచి బయటికి వెల్తున్నా, ఏ టైం లోనైనా సరే ఆవిడ దగ్గిర రిజిస్ట్రేషన్ చేయించుకున్న తరువాతనే వెళ్ళాల్సి ఉంటుంది. అలా మా ఆత్తగారు మా అందరికి ఆజ్ఞలు జారీ చేసారు. బయటకు వెళ్ళే ముందు ఇంటికి ఏ టైం కి తిరిగి ఒస్తామో తప్పకుండా చెప్పే వెళ్ళాలన్నమాట. ఆ టైం అక్కడ రిజిస్టర్ అయిపోతుంది. అది ఆవిడ రిజిస్టర్. ఏ ఒక్కళ్ళైనా అన్న టైం కి రాకపోయారో, ఇంక అంతే సంగతులు...

ఇరవైనాలుగ్గంటలు, మా మామగారు మా అత్తగారి ఎదురుగ్గా కూచోవాల్సిందే. ఊరికే ఇంట్లో కూచోలేక బయటికి వెల్దామంటే, అత్తగారి యక్ష ప్రశ్నలకి సమాధానాలు చెప్పి అనుమతితో మాత్రమే వెళ్ళాల్సిఉంటుంది. ఒకసారి, ఇలాగే కాస్త బయటి ప్రపంచం చూడొచ్చు కదాని, బాంక్ కి వెల్తున్నానని, అరగంటలొ ఒస్తానని, అతికష్టం మీద పర్మిషన్ తీసుకొని బయటికి వెళ్ళారు. మా అత్తగారు అరగంట సేపు చాలా ఓపిగ్గానే ఎదురు చూసారు పాపం. కాని, అరగంట అయిపోయిన నిముషం నుంచి గాభరా మొదలు. ఏమైందో ఇంకా రాలేదు అని ఇంట్లో అందర్ని అడగటం మొదలు పెట్టారు. అక్కడే చదువుకుంటున్న మా వాడ్ని అడిగారు, ఏడిరా తాతయ్య ఇంకా రాలేదు అని. వొస్తారులే నానీ (మా అత్తగారి వైపు వాళ్ళు ఎందుకో మరి, బామ్మ ని నానీ అంటారు), నువ్వు కాసేపు టి.వి. చూసుకో అన్నాడు వాడు. ఆ తరువాత అయిదునిముషాలాగి నన్నడిగారు. ఏమైంది ఇంకా రాలేదు, మీ మామగారు అని. కాసేపు అలా తిరిగొస్తారులే అత్తయ్యా! మీరు ఖంగారు పడకండి అని సద్ది చెప్పటానికి ప్రయత్నించాను. కాసేపు మౌనంగా అలాగే కూర్చున్నారు. తరువాత మెల్లిగా మైన్ గేట్ దాకా వెళ్ళి అటూ ఇటూ చూడటం మొదలు పెట్టారు. సరె, ఖంగారు సహజమే అనుకొని నా పనిలో పడ్డాను. కొంచెం సేపయ్యాక మా మామగారు వొచ్చారు. ఏంటండీ ఇంత సేపు వెళ్ళిపోయారు, అత్తయ్య ఒకటే ఖంగారు పడుతున్నారు, కనిపించారా లేదా ఇంతకీ! అని అడిగాను. ఏం లేదమ్మా, మా ఫ్రెండ్ కనిపించాడు. నాలుగు కబుర్లేసుకొని వొచ్చాను. ఇంతకీ ఏదీ మీ అత్తయ్యా, అని అడిగారు.
అవునూ...ఏరీ మా అత్తయ్యగారు. ఇద్దరమూ ఇల్లంతా వెతికాము. ఎక్కడా కనిపించ లేదు. ఏమయిపోయారో, మాకేమి అర్ధం కాలేదు. ఇందాకనే, గేట్ దగ్గిర చూసాను కదా అనుకున్నాను. ఇంక లాభం లేదని, మేమిద్దరం మా అత్తగారి కోసం చూస్తూ బయట రోడ్ మీదకి వొచ్చాం. అక్కడా కనిపించలేదు. మా మామగారు రాలేదని వెతుక్కుంటూ వెళ్ళారేమొ, అని నాకు అనుమానం వొచ్చింది. మా మామగారు వెల్తానని చెప్పిన బాంక్ మా ఇంటికి దగ్గిరే. అక్కడికేమైనా వెళ్ళారేమో, అని అనుమానం వొచ్చి అటువైపు వెళ్ళాము. ఆ బాంక్ దగ్గిర పది, పదిహేను మంది పోగై ఉన్నారు. మా అత్తగారి కేమన్నా అయిందేమో, అని భయం వేసింది. దగ్గరికి వెళ్ళి చూస్తే, ఆ గుంపు మధ్యలో మా అత్తగారు కనిపించారు. ఒక ముసలాయన వొచ్చాడు ఇక్కడికి, మీరెవరైనా చూశారా బాబూ! ఇక్కడేమైనా ఆక్సిడెంట్ అయిందా! అని అడుగుతున్నారు. వాళ్ళందర్నీ తప్పించుకొని, మా అత్తగార్ని తీసుకొని ఇంటికొచ్చేసాము. వెనకనుంచి, ఎందుకమ్మా ముసలామెని ఇబ్బంది పెడ్తారు, ఈ వయసులో అంటున్నారెవరో.
ఇంక మా వాడైతే ఎప్పుడూ చెప్పకుండానే పారిపోటానికి ప్రయత్నిస్తాడు. అయినా అది వాడి తరం కాదు. ఒకసారి వాడు ఇప్పుడే ఒస్తాను నాని అని బయటికి పోబోయాడు. ఏ టైంకొస్తావురా! అని వెంట బడ్డారు. పదినిముషాల్లో ఒస్తాన్లే అని వాడెళ్ళిపోయాడు. పదినిముషాలు గడిచి పోయాయి. ఊహూ... మావాడు రాలేదు. ఇంకేముంది, రోడ్ మీద ప్రయాణం మొదలైంది. వాడు, ఆవిడకి ఎంతకీ కనిపించలేదు. ఎక్కడ వెతకాలో అర్ధం కాలేదు. అవిడ దగ్గిర ఒక సెల్ ఫోన్ కూడా ఉంది. ఎవ్వరికి ఫోన్ చేసినా, ఆవిడకి కావాల్సినట్లుగా స్పందించరని అవిడ అనుమానం. నామీద మాత్రం కొంచెం నమ్మకమే! ఇంక నాకు ఫోన్ వొచ్చేసింది. నేనేమడుగుతున్నది వినిపించుకోకుండా, పిల్లవాడు కనిపించట్లేదు తొందరగా ఇంటికి రా అని ఫోన్ పెట్టేసారు. ఏమైంది అర్ధం గాక, ఇంటికి పోక పోతే మా అత్తగారు ఏదొ గందరగోళం చేసేస్తారు అన్న అనుమానం తో తొందరగా ఇంటికి ఒచ్చేసాను. మా ఇంటిముందు రోడ్ కి ఆ చివర కనిపించారు మా అత్తగారు. దగ్గరికెళ్ళాను. అక్కడెవరినొ అడుగుతున్నారు, బాబూ, మీ రెవరైనా చూసారా! ఒక అబ్బాయిని, చిన్న పిల్లవాడు,ఇంతెత్తు ఉంటాడు అని తన తలపైకి చేతులెత్తి చూపిస్తున్నారు. నాకు విషయం అర్ధమైపోయి, ఆవిడని తీసుకొని ఇంటికొచ్చేసాను. మావాడు అప్పుడే లోపలికి పోతూ కనిపించాడు. ఏంటమ్మా, ఇప్పుడింటికి ఒస్తున్నావు, ఏమైనా స్ట్రైక్ మొదలు పెట్టారా! ఏంటి అంటు, ఇంతలోనే వాళ్ళ నానీ ని చూసి, అదేంటి మీరిద్దరెక్కడికెళ్ళారు అని అడిగాడు. వాళ్ళిద్దర్ని, ఒకళ్ళకొకళ్ళని ఒదిలేసి, తిరిగి చూడకుండా కాలేజ్ కెళ్ళిపోయాను.

ఈ ప్రభావం ఒకసారి నా మీద కూడా పడింది. మేము కాలేజ్ నుంచి వారం రోజులు కర్నాటకా టూర్ వెళ్ళాం. ఎప్పుడొస్తానో, చాలా వివరంగా చెప్పి మరీ వెళ్ళాను. మైసూర్ లో అనుకోకుండా మాకు కొంచెం లేట్ అయింది. నేను వెంటనే ఇంటికి ఫోన్ చేసి, ఇవాళ రాత్రికి బయలు దేరి రేపు పొద్దున్నే ఆరుగంటల కల్లా వొస్తాము అని ఫోన్ ఎత్తిన మా మామగారికి చెప్పాను. ఆయన సరే జాగ్రత్తగా రండీ అని ఫోన్ పెట్టేసారు. అనుకున్నట్లుగా మర్నాడు పొద్దునే చేరుకోలేక పోయాము. పిల్లలు శ్రీరంగపట్నం కూడా పోదాం మేడం అని మమ్మల్ని బతిమాలుకున్నారు. సర్లే ఇంకొక్క పూట ఎక్కువవుతుంది అంతేకదా! అని అటెళ్ళాము. అంటే మర్నాడు పొద్దున్న చేరుకోవాల్సిన వాళ్ళం సాయంత్రానికి చేరుకుంటామన్నమాట. ఎవరు ఎక్కడికి ఫోన్ చేయాలన్న సిగ్నల్స్ సరిగ్గా దొరక లేదు. వొస్తూ రిటర్న్ లో మాత్రం కష్టం మీద మా ప్రిన్సిపల్ ని కాంటాక్ట్ చేసి, సాయంత్రానికల్లా వొస్తున్నామని చెప్పాము. రాత్రి కల్లా కాలేజ్కి చేరుకొని పిల్లల్ని అందరిని పంపించేసి, మేము కూడా వెళ్ళిపోయాం.

మా అత్తగారి గురించి కొంచెం అనుమానంగానే ఇంటికి వెళ్ళాను. కాని మా అత్తగారు చాలా ప్రశాంతంగా ఎంతో మామూలుగా, ఏ మాత్రం గాభరా లేకుండా, సరదాగా మా టూర్ వివరాలు కనుక్కున్నారు. నేను ఎందుకాలస్యమైందో చెప్తున్నా కూడా, ఏమాత్రం పట్టించుకోలేదు. హమ్మయ్యా! పొద్దున్నొస్తానని సాయంత్రం వొచ్చినందుకు ఏం గొడవ జరగలేదులే అనుకొని సంతోషించాను. కాని "ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్" అని అప్పుడు పాపం నాకు తెలియదు. ఆ సంగతి మర్నాడు కాలేజ్ కెళ్ళాక తెలిసిందన్నమాట.

అదెలాగంటే, కాలేజ్కెళ్ళాక ప్రిన్సిపల్ ని కలవాలి కాబట్టి వెళ్ళాం. ఇంక అందరం వెళ్ళిపోతుంటే మా ప్రిన్సిపల్ నన్ను మాత్రం అయిదునిముషాలు ఆగమన్నారు. అందరు వెళ్ళిపోయారు. నేనుమాత్రం అక్కడే ఉన్నాను. అప్పుడు ప్రిన్సిపల్ నాకు బుద్ధి చెప్పటం మొదలు పెట్టారు. ఎవరైనా ఇంట్లో చెప్పకుండా అలా పోతారా, పాపం మీ అత్తగారు నిన్న నా దగ్గిర కూచోని ఒకటే గాభరా పడ్డారు. పెద్దావిడని అలా ఇబ్బందిపెట్టొచ్చా...అన్నీ వివరంగా చెప్పొద్దు...పాపం చాలా గాభరా పడ్డారు... ఇంకా ఏవిటేవిటో చెప్తూనే ఉన్నారు... మన అటెండర్ ని తోడిచ్చి ఇంటికి పంపించాల్సి వొచ్చింది...అన్నారు. అప్పుడర్ధమైంది నాకు...ఇంట్లో ఎందుకంత ప్రశాంతంగా ఉందో...నన్నేమడగకుండా ఎందుకు వొదిలేశారో.... మా ప్రిన్సిపల్ కి నా సంజాయిషీలన్నీ చెప్పుకొని, మెల్లగా అక్కడినుంచి బయటపడ్డాను.

ఇల్లెప్పుడూ కాలేజి కి దగ్గరగా ఉండకూడదు అనుకున్నాను. ఎప్పుడూ, మా ఇల్లు కాలేజి దగ్గరని మా కొలీగ్స్ కుళ్ళుకుంటుంటే సంతోషించేదాన్ని. దీనితో, డిజడ్వాంటేజెస్ కూడా అర్ధమైపోయినై. ఇంకాతర్వాత, ప్రతి అయిదునిముషాల కొకరు నాదగ్గరికొచ్చి నాకు ఎంత గడ్డిపెట్టారో నేను మీకు చెప్పకపోవటమే మంచిదిలెండి. ఈపాటికి మీ కర్ధమై పోయుంటుంది. మా అత్తగారు, ఆ క్రితం రోజు మా కాలేజ్ కొచ్చి ప్రతిఒక్కరినీ... ఎవరైనా చూశారా, బాబూ!...అని అడిగారని.

ఇంకాపేయడమే మంచిది. ఎందుకంటే..ఇలా చెప్పుతూ పోతే నేను వాల్మీకి కన్నా పెద్ద ఉద్గ్రంధమే రాసేయొచ్చు!!!
అదండీ! మా అత్తగారి సమయపాలన!!!
రేపెప్పుడైనా ...మీలో ఎవరినైనా మా అత్తగారు మా ఇంట్లోవాళ్ళు ఎవరి గురించైనా ....ఎవరైనా చూశారా! బాబూ!!! అని అడగొచ్చు. అప్పుడు మీరుమాత్రం గాభరా పడకండే....

**************************************************************

32 కామెంట్‌లు:

శ్రీనివాస్ చెప్పారు...

:)

విజయ క్రాంతి చెప్పారు...

బావుందండి ...మరి మీ అత్తగారికి కంప్యూటర్ లో బ్లాగ్స్ చదవటం వచ్చా ? ... చదివితే గొడవలైపోవూ ?
;-)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

అయ్యో పాపం...ఆవిడ మీద చాలా జాలికలిగింది జయగారు.
ముందు నుండి ఇంతేనా లేక వయసు పైబడిన తర్వాత ఇలా చేస్తున్నారా? నాకర్దమైంది ఏంటంటే ఆవిడ చెప్పిన టైం కి ఎవరైనా రాకపోతే నెగటివ్ ఆలోచనలతో కంగారుపడటం వల్ల ఈ పరిణామాలు జరుగుతున్నాయని.

SRRao చెప్పారు...

జయ గారూ !
అలాంటి అత్తగారున్నందుకు మీరు సంతోషిస్తున్నారో , ఆవిడ చాదస్తానికి విచాదిస్తున్నారో తెలియదు గానీ ఒకటి మాత్రం నిజం. ఆవిడకు మీ అందరి మీద ఉన్న ప్రేమాభిమానాలే దీనికి కారణం. కాకపోతే ఆవిడకి అతిగా ఆందోళన చెందే, అతిగా స్పందించే మనస్తత్వం ఉన్నట్లుంది. దీనివలన ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీకు తెలియదని కాదు.

తృష్ణ చెప్పారు...

:) :)

భావన చెప్పారు...

హి హి హి హ హ హ జయ జయ మీ అత్త గారిని ఆ డైలాగ్ కాపీ రైట్స్ నాకు కూడా ఇమ్మనవా నాకు తెగ నచ్చింది.. సంతోషం సినిమాలో "ఇప్పుడే వస్తాను" అంటే "ఇప్పుడే అంటే" అని ఈ మాదిరే సంభాషణ వుంటూంది నాగార్జున బ్రహ్మానందం కు. అది గుర్తు వచ్చింది. అంటే మీ అత్త గారిని చిన్నబుచ్చాలని కాదు. వూరికే అలా నవ్వు వచ్చింది. మా అక్క వాళ్ళ అత్త గారు కూడా అంతే, ఆమెకు ఇష్టం లేదనుకో బయటకు వెళ్ళటం (ఆమె కు 90% ఇష్టం వుండదు) 'అది కాదయ్యా చంటి' అంటారు వెంటనే అందరం ఒక్క సారి టుయ్ మని తల తిప్పి మా బావ గారి వైపు కళ్ళు మిటకరించి చూస్తాము మా బావ గారు రంగం లోకి దిగి అది కాదమ్మా ఇప్పుడే వచ్చేస్తాము కదా ఏమి భయం వుండదు మార్క్ డైలాగులతో నచ్చ చేపుతారు అంత సేపు మేమందరం మా అక్క తో సహా జంధ్యాల సినిమా టైపు లో తుయ్ తుయ్ మని కళ్ళూ మాత్రం అటు ఇటు తిప్పుతు సినిమా చూస్తాము. అబ్బ I miss that life అనుభందాలతో కూడిన విసుగు కాని విసుగు కాదది అంతఃసూత్రమైన ప్రేమ కాదనలేము కదా అనలేము... బాబు ఇక్కడ ఒక అమ్మాయుండాలి చూసేరా. వెతకాటానికి వెళుతున్నా బాబు.. :-) :-)

జయ చెప్పారు...

శ్రీనివాస్ గారు అలా నవ్వకండి. మీకు కూడా ఇలాంటి "కష్టాలు" రాకపోవు.

విజయమోహన్ గారు మీరుకూడా నవ్వేసారా...చూసుకుందాం లెండి!!!

జయ చెప్పారు...

రావ్ గారు, ఆవిడ మొదటినుంచి అంతే. వాళ్ళ పిల్లలు చిన్నప్పుడు ఎక్కడికి పోయినా అదే భయం. ఆవిడది మా అందరికన్నా చాల గట్టి ఆరోగ్యం. అటువంటి భయం ఏమీ లేదులెండి. అందరూ చెప్పుతూనే ఉంటారు. అయినా అవిడది అదోరకమైన "భయం ఫోబియా" అంతే.

జయ చెప్పారు...

శేఖర్ గారు, ఆవిడకి మా అందరి మీద ప్రేమతో కూడిన అభిమానంతో వొచ్చిన భయం వల్ల ఆ గాభరా. అంతే.

జయ చెప్పారు...

తృష్ణా మేడం, నవ్విన నాప చేనే పండును...కదా!

నిజమే భావనా, మీరు చెప్పాక సంతోషం సినిమా నాకు కూడా గుర్తుకొచ్చింది. ఇంక పేటెంట్ విషయం మీ ఇష్టం. ఆవిడకి వెళ్ళటం ఇష్టం లేకపోవటం కాదు గాని, అన్న టైం కి రాకపోతే మాత్రం ఇల్లు ఉండే చోట పందిరి పడిపోతుందన్నమాట....

మాలా కుమార్ చెప్పారు...

మీ అత్తగారితో నాకూ అనుభవమే ! అందుకే ఇంటికి చేరగానే చేరాను అని ఫోన్ చేసి చెబుతాను !
ఇక అమ్మతో అయితే చెప్పనక్కరలేదు . నా షాపింగ్ లన్ని అక్కడే . చివరకు నాకు కూరలు కూడ నల్లకుంట మార్కెట్లోనే నచ్చుతాయి .( అది నా చాదస్తము ) . అన్ని చేసుకొని ,ఇంటికి చేరేసరికి , బాల్కనీ లో మీ బావగారు , బిపు , గేట్ దగ్గర శారద ఎక్కడికెళ్ళావు ? మీ అమ్మ పది సార్లు ఫొన్ చేసింది అని ప్రశ్నలు .ఇక షాప్పింగ్ కి వేరే రోజు కేటాయించి , అమ్మదగ్గర నుండి డైరక్ట్ గా ఇంటికి వెళ్ళటము మొదలుపెట్టాను . అప్పటికీ ఎన్నోసార్లు చెప్పాను , నేనేమీ ప్రవరాఖ్యుడి లాగా కాళ్ళకు పసరుపూసుకోలేదు కదా , ఆటోలో విద్యానగర్ నుండి , శ్రీనగర్ కాలనీ కి వెళ్ళాలంటే ,దారి అంతా ఖాళీ వున్న కనీసము 45 నిమిషాలు పడుతుంది , వెళ్ళగానే ఫోన్ చేస్తాను గాబరాపడకు అని . అయినా అంతే ! సంతోష పడాలో , బాధ పడాలో తెలీని పరిస్తితి .

మురళి చెప్పారు...

ముందు నవ్వొచ్చినా.. తర్వాత ఆలోచనలో పడ్డానండి.. యెంతో ప్రేమ లేకపొతే అలా చేయరు కదా... నిజమే మీ ఇబ్బందులు మీవి.. టపా మాత్రం చాలా బాగుందండి..
@భావన: సీన్ కళ్ళకు కట్టారు..
@మాలాకుమార్: :-) :-)

సిరిసిరిమువ్వ చెప్పారు...

కొంతమంది అంతేనండి..బయటికి వెళ్ళినవాళ్లు చెప్పిన టైముకి రాలేదో..ఇంట్లోవాళ్లం అయిపోయామే! మా నాన్నగారు కూడా అంతే..
ఇక నుండి మీరంతా రావచ్చు అనుకున్న టైముకి ఓ మూడు నాలుగు గంటలు తరువాత చెప్పండి...పాపం ఆవిడకి కాస్త కంగారు తగ్గుతుంది.

మేము కూడా మా నాయనమ్మని నానీ అనే వాళ్లం..మా చిన్నప్పుడు మా ఇంటికి ఓ అత్తరు సాయిబు వచ్చేవాడు..అతనే మాకు అలా పిలవటం అలవాటు చేసాడు. మమ్ముల్ని చూసి ఇప్పుడు మా చుట్టాలల్లో చాలామంది అలానే పిలుస్తున్నారు.

జయ చెప్పారు...

అక్కా, ఇంక నీకు ప్రత్యేకంగా చెప్పేదేముంది. టైంటేబల్ ఇవ్వటం, బెల్ కొట్టం గానే రావటం...అలవాటై పోయింది...ఇది అంతే ఇంక...

జయ చెప్పారు...

మురళిగారు, ఇంత భారమైన ప్రేమ ఎలా గైనా భరించక తప్పదు...ఎవరండీ..ఈ రోజుల్లో ఒకరిగురించి పట్టించుకునే వాళ్ళు.

జయ చెప్పారు...

సిరిసిరిమువ్వ గారు, మీ సలహా కూడా ప్రమాదమే...అన్నేసి గంటలు ఆలస్యంగా చెప్పితే, ఏ రాత్రో అయిపోతుందని ఇంక అస్సలు కదలనియ్యరు.
కనీసం ఇంటికొకళ్ళైనా ఇలాంటివాళ్ళు ఉంటారన్నది నాకిప్పుడు బాగా అర్ధమైంది...

జయ చెప్పారు...

విజయక్రాంతి గారు, మా అత్తగారు ఆ రోజుల్లోనే ఇంగ్లీష్ మీడియంలో తన ఎనిమిదవ ఏట వరకు చదువుకున్నానని ఎప్పుడూ చెప్పుతూఉంటారు. ఎన్నో క్లాసో తెలియదు. అధునిక పరిజ్ఞానం కూడా బాగానే ఉంది. కాకపోతే బ్లాగుల గురించి ఇంకా తెలియదు. ఏమీ అనకపోవచ్చు అని నా ఉద్దేశం.

Apparao చెప్పారు...

మీ అత్తగారి ప్రేమ ఆప్యాయత లను సహృదయం తో అర్ధం చేసుకుంటే బాగుంటుంది కాని చాదస్తం అనుకుంటే మాత్రం కష్టం.
ఎంతైనా మీరు అదృష్ట వంతులు, అంత మంచి అత్తగారు దొరికినందుకు.
మంచి భావ వ్యక్తీ కరణ ఉంది మీలో.

జయ చెప్పారు...

అప్పారావ్ గారు, మా అత్తగారిగురించి తెలుసుకాబట్టే, ఆ ప్రేమ కోసమే భరిస్తున్నాం. నిజానికి ఇందులో ఆవిడే కాని మేము పడ్డ గొప్ప ఇబ్బందులేం లేవు. రేపు నేను కూడా అంతేనేమో!

కొత్త పాళీ చెప్పారు...

తల్లి మనసు అలాగే ఉంటుంది మరి!
నా కాలేజి టైములో మా అమ్మ ఇలాంటీ ప్రశ్నలు వేస్తే విసుక్కునే వాణ్ణి. ఇప్పుడు మా పిల్లలు సొంతంగా బయటికి వెల్తుంటే నేనూ అదే ప్రశ్నలు వేస్తున్నా!

cartheek చెప్పారు...

akka bavundandi....

:):):):)

జయ చెప్పారు...

కొత్తపాళీ గారు, కరెక్ట్ గా చెప్పారు. ఎవరికైనా ఆ భయం సహజమే. వీలైనంతమటుకు ధైర్యం చెప్పటమే. ఏదో విధంగా దారి మళ్ళించి కబురుల్లోకి లాగటమే. నేను అదేపని చేస్తాను. మనసులో నాకు కూడా వాళ్ళు వొచ్చే వరకు భయంగానే ఉంటుంది కదా మరి.

జయ చెప్పారు...

కార్తీక్, మీ అమ్మగారు కూడా మీ కోసం ఇలాగే ఎదురుచూస్తారనుకుంటా...కదూ!

cartheek చెప్పారు...

జయక్క అవునండి.....
భలే కరెక్ట్ గా చెప్పారే :) :)

విశ్వ ప్రేమికుడు చెప్పారు...

మా అమ్మ గారు గంటకి రెండు ఫోనులు చేస్తారు. నేను కూడా ఎక్కడికి వెళ్తున్నానో, ఎప్పుడు వస్తానో అన్నీ చెప్పే వెల్తాను. అయినా ఫోన్ ఆన్సర్ చెయ్యలేదో ఇక ఇంటికి వచ్చిన తరువాత అంతే...

నాకు ఇబ్బంది అయినా..., అమ్మ ప్రేమని తలుచుకుని ఆనందిస్తుంటాను.

జయ చెప్పారు...

విశ్వప్రేమికుడైన మీకు ఇప్పుడు అర్ధమయిందనుకుంటాను, విశ్వం లో అన్నిటికన్నా విలువైంది మాతృప్రేమ అని. ఏమంటారు!

sreenika చెప్పారు...

పాపం...ఆవిడది చాదస్తం కాదండి..మీమీద ప్రేమ,ఆప్యాయతా ఆవిడకి ఆందోళనని తెప్పిస్తుంది. మా అమ్మగారు కూడా అంతే...నలుగురు అన్నదమ్ములు ఒకే చోట ఉండాలని ఎన్నో కలలు కనేవారు.కాని అన్నయ్యలందరూ ఉద్యోగరీత్యా వేరయ్యారు.
ఒక్ ఐడియా..ఆవిడకి ఒక సెల్ ఫోన్ కొనివ్వండి. సమస్య కొంత వీజీ అవుతుంది.

జయ చెప్పారు...

శ్రీనిక గారు, సెల్ ఫోన్ ఉందిగా....ఈ ప్రేమ అంతే! రేపు మీకే అర్ధమౌతుందిలెండి.

శిశిర చెప్పారు...

చాలా బాగా రాశారండీ. ఇది మాకు కూడా అనుభవమే. మా ముగ్గురిలో ఎవరు టైముకి ఇంటికి రాకపోయినా అమ్మ పనైపోయేది పాపం. తాతగారు "అమ్మా, పిల్లలింకా రాలేదే" అని అడిగితే "వచ్చేస్తారు నాన్నగారూ,కంగారుపడకండి" అని అమ్మ అనేది. ఐనా ఆయన నడవలేకపోయినా తూలుకుంటూ బయటకు వచ్చి చప్టా మీద కూర్చుని మేము వచ్చేవరకు ఎదురు చూస్తూ ఉండేవారు.ఈ ఎపిసోడ్ అంతా అహింసాత్మకమే.

అమ్మమ్మ దగ్గరికి వచ్చాప్పటికే సీను మారిపోయేది. నా మనుమలేమైపోయారు? ఇంకా ఎందుకు రాలేదు? నువ్వసలు తల్లివేనా? నీది రాతి గుండె(?) ఇంకా ఇంకా చాలా....ఆవిడ తినేది కాదు. అమ్మని తిననిచ్చేది కాదు. అమ్మకి మేము రాలేదు అన్న టెన్షన్ కన్నా ఈవిడ బాధ పడలేకపోయేది. పాపం.
అప్పుడు ఏమనిపించినా కాని ఇప్పుడు వాళ్ళు లేని లోటు తెలిసొస్తూంది.

జయ చెప్పారు...

శిశిర గారు, అదేనండి మరి అభిమానం అంటే. కావాలనుకున్నా దొరకాలి కదా! ఉన్నప్పుడు దాని విలువ మనకు తెలియదు. ఎప్పటికైనా, అవి మన తీపి గుర్తుల్లో మిగిలిపోతాయి. కాదంటారా!

శిశిర చెప్పారు...

అవునండీ. మనిషి జీవితమే జ్ఞాపకాల సమాహారం.

జయ చెప్పారు...

Yes, Sisira, you are correct.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner