28, నవంబర్ 2009, శనివారం

మది దోచిన పాండురంగడు...

నాలోని నవరసాలు - శాంతం


మచిలీపట్ణం వెళ్ళాము . . . మా అమ్మ, పిన్ని, అక్కా, నేను కలిసి.

ఊరంత దాటాక . . . ఊరిచివర . . . అదిగో . . . అక్కడ, నాకు చాలా నచ్చింది . . . కావాల్సింది కనిపించింది . . .
అదే, పాండురంగని గుడి . . . . నా మది దోచిన దేవాలయం.

దూరం నుంచి గుడి గుమ్మాలు . . . రా . . . రమ్మని పిలిచాయి.

మెల్లగా . . . అతి మెల్లగా, ప్రవేశ ద్వారం చేరుకున్నాను.

నిలువెల్లా, పచ్చటి గుమ్మాలు . . . దేవుడి ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంది.

ప్రతి రోజు పసుపు రాసి, బొట్టు పెట్టి అలంకారం చేస్తారనుకుంటా...ఆ రోజేదో పండుగ లాగానే తోరణాలు కూడా కట్టారు. అవును దేవుని గుడి లో రోజూ పండుగే కదా!
ఆ నిలువెత్తుటి ప్రాకారపు గోడలు, అంద మైన, కళ కళ లాడుతున్న ఆ గుమ్మం మీద నా తల అనించి...రెండు చేతులతోటి, కళ్ళ కద్దుకొని దండం పెట్టుకున్నాను.

గుమ్మం దాటి కాలు లోపలికి పెట్టగానే, అది బృందావనమా అనిపించి మైమరచి, పరవశించాను.

"డోలారె..డోలారె..ఢం... ఈ జగమంతా బృదావనం..." మనసూగి పోయింది.
ఒక్క సారిగా చల్లటి పిల్ల తెమ్మరలు నన్ను తాకి, ఎటో వెళ్ళిపోయాయి. ఆ చల్లటి పిల్లగాలి వెంటే తిరిగిన నాకళ్ళకు రెండువైపులా విశాలమైన దేవాలయం కనిపించింది.

ఎంతో విశాలంగా ఉంది. లోపల ప్రాకారం చుట్టూ అన్ని దేవతల గుళ్ళు ఉన్నాయి. కుడి వైపున సహస్ర లింగేశ్వరుని గుడి, ఎడమ వైపున లక్ష్మీ దేవి గుడి కనిపించింది.

ఎదురుగా . . . దూరంగా అశ్వద్థ వృక్షం కనిపించింది. దాని కానుకోనే పున్నాగ చెట్టు కూడా ఉంది. దూరం నుంచే ఎంతో అందంగా కనిపించి, నా కాళ్ళు ముందుగా అటువైపే నడిచాయి. దగ్గరికి చేరుతూఉంటే కింద నేలంతా పరుచుకొని, ఎంతో అందమైన పున్నాగపూలు కనిపించాయి. తెల్లటి, మెత్తటి వెల్వెట్ తివాచీ పరచినట్లు నా కాళ్ళు ఆ మెత్తదనంలో కరిగిపోయాయి. ఆ పూల సువాసనలు గాలిలో తేలుతూ చుట్టూ వ్యాపించి ముందు మా దగ్గరికి రావూ . . . అని నన్ను పిలిచినట్లే అనిపించింది. ఆగలేక అక్కడికే ముందుగా వెళ్ళాను. అక్కడ ఒక అందమైన పుష్కరిణి, చెట్టుకిందనే చిన్న గుడిలో శివలింగం ఉంది. ఆ కోనేరు దగ్గిర మెట్లమీద కూచున్నాను. ఆ కోనేరుకి రెండో వైపు గాలికి మెల్లగా తలూపుతున్న పొగడ చెట్టు కూడా కనిపించింది. అబ్బ ఎంత ఎందంగా ఉంది ఈ దృశ్యం అనిపించింది.
కిందపడ్డ ఆ పూల సువాసనలు ఎంతో హాయిగా మత్తుకొలుపుతున్నాయి.

వాడిపోతానని తెలిసినా వికసించక మానదు కదా పుష్పం . . .

ఏదో ఆలోచనలో మునిగిన నేను, అప్పుడే ఒచ్చి నా ఒడిలో పడుతున్న పున్నాగ పువ్వును గమనించాను. ఎందుకో నాకే తెలియ కుండా ఆ చిన్ని పువ్వు కింద పడిపోకుండా నా చేయి చాపి ఒడుపుగా పట్టుకున్నాను. ఎంత ముద్దుగా ఉందో ఈ బుజ్జితల్లి . . . నన్ను స్వామి దగ్గరికి చేర్చవూ...అని నన్నడుగుతున్నట్లే అనిపించింది . . . ఒక్క క్షణం కూడా ఆలష్యం చేయకుండా అక్కడే ఉన్న పరమశివుడిగుడి దగ్గరికి వెళ్ళి , మోకాలిమీద కూర్చోని . . . నా రెండు చేతులూ ముందుకు చాచి ఆ చిన్నారిని స్వామి ఒడిలో భద్రంగా ఉంచాను . . . ఆ బుజ్జితల్లి తప్పకుండా ఎంతో సంతోషించి ఉంటుంది అనిపించింది . . .

నన్ను నీవు నాటినప్పుడు
నాకు జన్మ నిచ్చిన తల్లి వనుకున్నాను
నాకు నీరు పోసి పెంచినపుడు
నా మేలు కోరే తండ్రి వనుకున్నాను
నేనొక పూవు పూయగానే
నువ్వు సంతోషిస్తావనుకున్నాను
తీరా నువ్వు ఆ పువ్వును కోసి నప్పుడు
నేను కొంత కృంగిపోయాను
కానీ ఆ పువ్వును భగవంతుని
పాదాల చెంత ఉంచినపుడు
నేనెంతో సంతోషించాను
చివరకు నా జన్మ సార్ధకమైనందుకు
నేను మరీ మరీ ఆనందించాను . . . .
నేనెప్పుడో రాసుకున్న ఈ కవిత గుర్తొచ్చి, ఒక్కసారిగా తలెత్తి ఆ పున్నాగ చెట్టును చూశాను. ఆ పున్నాగ తల్లి తన బిడ్డ జన్మ సాఫల్య మయింది, అని సంబరపడినట్లే అనిపించింది నాకు. అవును . . . నీ ఆలోచన నిజమే . . . అన్నట్లు ఇంకా కొన్ని పున్నాగ పూలు నా మీద జలజలా రాలాయి. ఆ పూలన్నీ భద్రంగా ఏరుకున్నాను. ఈ సారి ఆ పూలను నా ఒళ్ళోనే పెట్టుకొని చూస్తూ ఉండిపోయాను .

ఈ పూలను నేను రోజూ చూస్తూనే ఉంటాను. అయినా ఆ స్వచ్చమైన, ప్రశాంత వాతావరణంలో, ఆ గుడి ముందు చెట్టుకింద, కొలను పక్కనే కూచున్న నాకు . . . ఆ పూలలో ఎన్నో కొత్త కొత్త అందాలు కనిపించాయి . . . ఈ పున్నాగ పూలు ఇంత అందమైనవా . . . అని మొదటిసారిగా అనిపించి, దోసిట్లో పూలను అలాగే నా ముఖనికి దగ్గిరిగా తీసుకున్నాను . . . నా కళ్ళని ఆ మెత్తటి పూల మీద అనించాను . . . లోకమే మరిచిపోయాను . . .

తలెత్తిన నాకు దూరంగా పొగడ చెట్టు కనిపించి, నా దగ్గరికి రావా అనిపిలిచినట్లే అనిపించింది . . . ఈ రెండు చెట్లను ఒక్క చోట నేనెప్పుడూ చూడలేదు. పున్నాగ పూలను, చెట్టునుంచి రాలిన రావి అకులను ఏరి అందులో ఉంచి స్వామి దగ్గిర అందంగా అలంకరించి . . . పొగడమ్మ దగ్గరికి బయలుదేరాను. దూరం నుంచే ఆ పూలు రాలుతూ కనిపిస్తున్నాయి. చిన్ని చిన్ని, అందమైన ఆ పుష్పాలు చేతిలోకి ఏరుకొన్నాను. నా చేతినిండా బంగారం కుప్ప పోసినట్లే అనిపంచింది. కాంతులీనుతున్న ఆ పుష్పాలను మైమరచి మరీ చూశాను. ఆ చిన్ని పూల మదిలో రాగాలు వింటూ తరించిపోయాను.

ఇంతలో మా పిన్ని పిలిచింది. ఎందుకలా చెట్ల కింద తిరుగుతున్నావు, ఇంక గుళ్ళోకి రావా? ఇక్కడ సహస్ర లింగాల తోటి శివాలయం ఉంది. చూద్దువుగాని రా, అని. మెల్లగా వాళ్ళదగ్గిరికి చేరుకున్నాను. ఈ గుడి చాలా బాగుంది, పిన్ని...అన్నాను. లోపల ఇంకా బాగుంటుంది చూద్దువుగాని రా, అని తీసుకెళ్ళింది. ఆ గుళ్ళోకి పోగానే ఒక శివలింగం కనిపించింది. ఈ శివలింగమంతా కూడా ఇంకా చిన్న చిన్న శివలింగాలతోటి అమర్చిఉంది. చుట్టూ నాలుగు వైపులా భక్తులు ప్రతిష్టించి పూజలు చేసుకున్న వెయ్యి లింగాలు ఉన్నాయి. ఎవరైనా అక్కడ శివలింగం పెట్టి పూజించి, సంవత్సరమంతా కూడా అర్చనలు చేయించొచ్చు. ఆ శివలింగం కిందకూడా ఇంకా చాలా శివలింగాలున్నాయని పూజారి చెప్పారు. అక్కడ భక్తితో పూజించి, తీర్థం తీసుకొని బయటికి ఒచ్చి అక్కడి మంటపం లో కూర్చున్నాము. ఆ మంటపం నుంచి దూరంగా కొండలు, పెద్ద పెద్ద తాటిచెట్లు, ఆకాశంలో కదులుతున్న నీలి మబ్బులు మళ్ళీ మనసును ఉయ్యాల లూపేసాయి.

ఇంకా మనం గర్భగుడిలోకి పోలేదు కదా . . . పాండురంగణ్ణి చూడాలి కదా...పండరీపురంలో పాండురంగడే నాకు గుర్తుకొస్తున్నాడు..ఎప్పుడు చూద్దాం పిన్ని, అనడిగింది మా అక్క. ఇదిగో పోదాం పదండి... అని బయలు దేరింది మా పిన్ని.

నరసిమ్హా చారిగారు, 1888 లో ఈ గుడిని కట్టించారుట. లోపల ఆయన, ఆయన భార్య విగ్రహాలు పెట్టారు. ఆయన జీవిత చరిత్ర కూడా ఉంది. ఆయన యజ్ఞం చేయిస్తున్న ఫొటో కూడా ఉంది. లోపల అయిదారుగురు మించి జనం లేరు. చాలా ప్రశాంతంగా ఉంది. నల్లటి రాతి స్థంభాలు చక్కటి శిల్పకళతో చాలా ప్రత్యేకంగా కనిపించాయి. ఇక్కడ గర్భ గుడిలో దేవుని దగ్గరిదాకా పోనిస్తున్నారు. అంతలోపలికి వెళ్ళి దేవుని ఎదురుగ్గా, అంత దగ్గిరిగా నుంచునే అవకాశం వొచ్చింది.

అంత ఆకర్షవంతమైన ఆ నల్లనయ్య విగ్రహం, తేజోవంతమైన ఆ కళ్ళు, అందమైన పూలదండల అలంకారం నన్నక్కడినుండి కదలనివ్వలేదు. నా చేతిలో ఉన్న పొగడపూలను ఆ పాండురంగని పాదాల మీద పోస్తూ...నా శిరస్సు కూడా...ఆ దేవుని పాదాల మీద ఉంచాను. రెండు చేతులతోటి ఆ చల్లనయ్య ను శ్పృజించి పరవశించిపోయాను. ఆ దివ్యమంగళ రూపం వొదిలి రాలేక పోయాను. పదే పదే చూసుకుంటూ అక్కడే చాలా సేపు కూర్చున్నాము.

"నల్లనివాడా, నే గొల్ల కన్నెనోయ్..పిల్లన గ్రోవూదుమూ...
నా యుల్లము రంజిల్లగా ... వలపే నా నెచ్చెలియై...తోడి తెచ్చె నీ దరికీనాడు...పండిన నోములూ...
నీ తీయని పాటలకై రేతిరి ఒంటిగ ఒచ్చితినే. . .నా మనసు . . . తనువూ . . . ఈ మనికే నీదికదా. . . పిల్లనగ్రోవూదుము . . .నా యుల్లము రంజిల్లగా . . . నల్లని వాడా . . .
ఆకశాన మబ్బులనీ . . . చీకటులే మూసెననీ . . . నేనెరుంగనైతిని . . . నీ తలపే వెలుంగాయె..
పిల్లన గ్రోవూదుము . . . నా యుల్లము రంజిల్లగా . . .
అక్కడే కూర్చోని, మైమరుపుతో, ఆ స్వామిని చూసుకుంటూ లోలోనే పాడుకున్నాను . . . ఈ పాట.

కృష్ణా! నీ పేరు తలచినా చాలు. యెదలో పొంగు శతకోటి యమునా తరంగాలు ...గోపాలా...నందబాలా... ఏమిటీ పరవశం ... నేనెవరినో పూర్తిగా మరచిపోయాను.

మనసెంత ప్రశాంతంగా ఉంది. నమ్మలేని శాంతం. నిజమేనా......


ఇక్కడ ఎంత తాదాత్మ్యత... దివ్యధామం...ఈ పుణ్యక్షేత్రం...ఇక్కడి పాండురంగణ్ణి...అందరూ చూసి తరించాల్సిందే!

***************************************************************************


16 కామెంట్‌లు:

మాలా కుమార్ చెప్పారు...

పండరీపురము లోని , పాండురంగని మళ్ళీ అంత దూరం పోయి చూడ లేమనుకుంటే , సీత , బందరు పాండురగని గుడి గురించి చెప్పినప్పటినుండే చూడాలని చాలా అనుకున్నాను . ఆ పైన భావన ఓ తెగ వూరించారు . ఇన్నాళ్ళకు ఆ పాండురంగడు కరుణించాడు .

భావనా మీ పాండురంగడి గుడి మాకు తెగ నచ్చేసింది .

SRRao చెప్పారు...

బందరు పాండురంగణ్ణి చూసి చాలా కాలమయింది. మళ్ళీ ఒకసారి చూపించేసారు. మీ కవిత బాగుంది,అభినందనలు జయ గారూ !

sunita చెప్పారు...

మీ పోస్ట్ చదివాకా నాకూ ఓసారి పాండురంగని గుడి చూడాలనిపిస్తుంది.

భావన చెప్పారు...

జయా...Thank You Thank You very much my dear. ఒక్క సారి మా పాండురంగడి ని మళ్ళీ నా కళ్ళ ముందు సాష్కాత్కరించావు. ఏన్ని వందల వేల సార్లు ధన్య వాదాలు చెప్పినా రుణం తీరదు. అవును మా పాండు రంగడి గుడి లో ఏమిటో ఇది అని చెప్పలేని ప్రశాంతత. జయ చెప్పిన ఆ పెద్ద గడపే ఒక వేరే ప్రపంచంలోకి తీసుకువెళుతున్నట్లు వుంటుంది. అమ్మయ్య మీకిప్పుడూ అర్ధం అయ్యిందా ఆ పున్నాగ బొగడ చెట్ల మహిమాన్వితం. నేను ఆ గుడికి వెళితే ఆ చెట్ల కిందే కనీసం ఒక రెండు గంటలు కూర్చునే దానిని. చుట్టూరా ఆ దేవుళ్ళందరిని ఒక్కొక్క రిని పేరు పేరు నా పలకరించి ఒక్కొరికి కూసిని పున్నాగ పూలను పోసి దండం పెట్టూకుని ఆ పెద్ద రావి చెట్టుకింద శివుడిని తనివి తీరా పలకరించి లోపలకు వెళితే అబ్బా ఎందుకులే జయ అధ్బుతం గా వర్ణించేసారు కదా ఇంక నేను ప్రత్యేకం చెప్పేదేమి వుంది. బయటకు రాగానే ఆ పెద్ద మంటపం లో కూర్చుని దూరం గా చెట్ల వెనుక అయ్యే చద్రోదయం చూస్తే... మాల గారు నా భావుకతలు వూపిరులద్దుకున్న ప్రాంగణం అదే నండి అక్కడి నుంచి ఓపిక వుంటే బీచ్ కు నడి చి వెళ్ళి దారి లో మొగలి పొదల ను పలకరిస్తూ, చేపల వాసనలనూ ఆఘ్రాణిస్తూ వెళ్ళి ఇక సముద్రుడును పలకరిస్తే చాలు రాయి కైన వచ్చు కవితాపులకలు.. నిజం. చాలా చాలా ధన్యవాదాలు ఇద్దరికి. జయ మీ కవితలు ఎంతో బాగున్నాయి మళ్ళీ వచ్చి కవిత మీద కామెంట్ వేస్తాను. :-)

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

మంచి దర్శనం చేయించారు ధన్యవాదాలు
"ఆ పాండురంగని పాదాల మీద పోస్తూ...నా శిరస్సు కూడా...ఆ దేవుని పాదాల మీద ఉంచాను. రెండు చేతులతోటి ఆ చల్లనయ్య ను శ్పృజించి పరవశించిపోయాను." అలా స్వామిని తాకనిస్తారా అక్కడ?

భావన చెప్పారు...

అవునండి విజయ్ మోహన్ గారు అప్పుడు కొంచం పటిక బెల్లం ప్రసాదం గా కూడా పెడతారు జయ, మాల తెచ్చుకోలేదా ఆ ప్రసాదం?

మురళి చెప్పారు...

గుడికి తీసుకెళ్ళి పోయారు, నిజంగానే..

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

మీ అనుభవాలు వ్యక్తీకరించిన విధానం చాలా బాగుందండీ...మొదట Title చూసి మీరు పాండురంగడు(బాలయ్యది) సినిమా గురించి రాసారేమో అనుకున్నానండీ...ఆ సినిమా మదిదోచటం ఎంటబ్బా..అనుకుంటూ చదివాను..:-)

జయ చెప్పారు...

అక్కా, మళ్ళీ తీసుకుపోయినా ఒస్తాను.

రావ్ గారు, అయితే వెంటనే ఒకసారి వెళ్ళి చూసేసి రండి. మీ అనుభవాలు కూడా మాతో పంచుకోవాలి మరి. ధన్యవాదాలు.

మాలా కుమార్ చెప్పారు...

భావనా ,
పటిక బెల్లం తెచ్చుకున్నామండి .

జయ చెప్పారు...

సునీత గారు, ఆలస్యం చేయకండి. నేను చెప్పింది నిజం. ఈ లోకంలోనుంచి బయటకు ఒచ్చి, ఆ లోకంలో అడుగు పెట్టండి. అక్కడే ఉండిపోదాం అనిపిస్తుంది.

జయ చెప్పారు...

భావనా! అంత ఇష్టమా ఈ దేవాలయమంటే! నాకుతెలియదు. అయితే అనుకోకుండానే, మీ మది దోచేసానన్నమాట. అక్కడ పూజారి నా చేతిలో ఒక సువర్ణ గన్నేరు పువ్వు ఉంచారు. మా అక్క పటికబెల్లం ప్రసాదం పెట్టింది. ఏవిటో నేనైతే ఏవీ పెట్టలేదు. స్వామిని తేరిపార చూసుకుంటూ, తెల్లబోయి అక్కడే కూచున్నాను అంతే. ఎదురుగుండా ఆంజనేయ స్వామిని కూడా చూసాము. బీచ్ కి కూడా వెళ్ళాము, కాని నడిచి వెళ్ళలేదు, మొగలిపొదలను కూడా చూడలేదు. పోతే చేపల వాసన నాకస్సలిష్టం లేదు. దారిలో ఉన్న గుడిలో 12 బావుల లో ఉన్న వివిధ నదుల నీళ్ళను నెత్తిమీద చిలకరించుకున్నాను. అప్పుడే వర్షం కూడా ఒచ్చింది. ఆ వర్షంలో తడుస్తూ ఒక్కొక్క బావిదగ్గిర తిరుగుతుంటే కలిగిన ఆ ఆనందం కూడా అపురూపమే.నాతో పాటే మా పిన్ని, డ్రైవర్ కూడా తడిసారు. మా అమ్మకు ఓపిక లేదు. మా అక్కకేమొ జలుబు చేస్తుంది. అందుకే ఇస్ఠమే అయినా, పాపం భయపడుతుంది.
నల్లనివాడా! పాట రావు బాలసరస్వతీ దేవి పాడిన పాట. ఆ పాట నాకు చాలా ఇష్టం. ఒకసారి అది పాడితే నాకు ఫస్ట్ ప్రైజ్ కూడా ఇచ్చారు.

జయ చెప్పారు...

అవునండి విజయ్ మోహన్ గారు. ఇక్కడ దేవుని దగ్గరికి వెళ్ళవచ్చు. రష్ లేకపోతే మనం ఎంత సేపు ఉన్నా, ఎలా పూజ చేసుకున్న అభ్యంతర పెట్టరు. పండరీపురం లో కూడా దేవుని దాకా వెళ్ళచ్చు. కాకపోతే తిరుపతి లో లాగా తరిమేస్తూ ఉంటారు. ఇంతటి ప్రశాంతత ఉండదు. అక్కడ కనీసం ఆకాశమన్నా మనకు కనిపించదు.

జయ చెప్పారు...

అయ్యో మురళిగారు, నేనేదో తీసుకెళ్ళిపోయానని, ఊహిస్తూ కూచోకండి. స్వయంగా, చక్కగా మీ ఫామిలీ తో పోయిరండి. ఆ అనుభవమే వేరు. మీ భావాలు కూడా మాతో పంచుకోవచ్చు కదా!

శేఖర్ గారు, మిమ్మల్ని మిస్లీడ్ చేసేసానన్నమాట. పోన్లెండి. ఇప్పుడు చూసిరండి. మీరే ఎన్నో కబుర్లు చెప్తారు.

భావన చెప్పారు...

వో నేను ఒక సారి పెద్ద వర్ణనతో పాండు రంగడి గుడిని చెప్పేను మీరు చదవలేదా? ప్రమదా వనం మైల్స్ లో అనుకుంటా. నాకు చాలా ఇష్టం ఆ గుడంటే. అవును ఆ నల్లనయ్య ను చూస్తే మతి కూడా పని చెయ్యదు ఒక్కోసారి. అబ్బ చెపుతుంటేనే పులకరింత లొస్తున్నాయి, చిరు జల్లు లో తడుస్తూ, పైన నీళ్ళు చిలకరించుకుంటు.. అహ.. అవునా పాట బాగుంది.. నీ పేరు తలచినా చాలు ఎద లో పొంగు శత కోటి యమునా తరంగాలు. ఎంత లలితమైన భావం కదు.
ఎవరికైనా చేపల నీచు వాసన అలా ఎండ పెడూతుంటే బాగుంటుందేమిటి, మీరు మరీను అంటే నా వుద్దేశం నడిచి వెళ్ళేప్పుడూ మొగలి వాసన లెట్లానో ఈ చేపల వాసనలను పీల్చటం కూడా అనివార్యం, అందుకని అన్నా అన్నమాట. ఏండా కాలం సాయింత్రమైతే అప్పుడప్పుడు మల్లె పూల సుగంధాలు కూడా.. ఆ సరుగుడు తోట ల ఈల ల లో వూళ ల లో ఆ సుగంధాన్ని కలిపి సముద్రుడు వుప్పు ను తన వునికి గా మనపై అద్దుతుంటే.. అబ్బ ఎందుకు లెండి.. ప్చ్... కన్న తల్లి పుట్టినూరు... లేనే లేదు ఈ రెండిటికి ఇల లో సాటి.

జయ చెప్పారు...

భావనా! మీకు మళ్ళీ ఒకసారి మీ ఊరిని గుర్తుతెచ్చానన్నమాట. అవునులెండి, సొంత ఊరు కి ఉన్న ప్రత్యేకత అదే. ఉన్న ఒక్కరోజులోనే నాకు చాలా ఆహ్లాదంగా అనిపించింది. మళ్ళీ తొందరలోనే వెళ్ళి ఒకసారి మీ ఊరు చూసుకొని రండి.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner