10, డిసెంబర్ 2009, గురువారం

నన్ను మర్చిపోకండేం. ....

"వెన్నెల్లో గోదారి అందం" అన్న పాట ఎంత బాగుంటుందో కదా!  నిజంగానే ఎంతందంగా ఉందో . . . బ్లాగుల్లో గోదావరి అమ్మాయిలు ఏమి రాసినా . . . మా గోదావరి అమ్మాయిలా, ఇంకేమన్నానా . . . అని తెగ మెచ్చుకుంటారు. ఒకసారి మ౦చుపల్లకీ గారు సుభద్రగారిని ఇలాగే మెచ్చుకున్నారు. నాకె౦త కుళ్ళొచ్చేసి౦దో! మరి మమ్మల్ని ఎవరు మెచ్చుకుంటారో ఏవిటో! చిన్నప్పుడు కృష్ణమ్మ ఒళ్ళో పెరిగిన నేను ఆ మమకారం ఎప్పటికీ మరువలేను. పోనీలె౦డి . . . మా అ౦దాలు మావి. పాటలంటే పరిమళం గారు గుర్తొస్తున్నారు. వాళ్ళే హాయిగా ఇంట్లో అంత్యాక్షరి ఆడుకునే వారట. 'మ ' అక్షరం వొస్తే తప్పకుండా...మేడంటే మేడా కాదు . . . పాట పాడుకునే వాళ్ళట. అబ్బ . . . పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది . . . ఇంత చక్కటి భావం ఎంతందంగా ఉంటుందో కదా! ఇటువంటి ఆనందక్షణాలేగా జీవితాన్ని సుందరమయం చేసేది. ఇంత చక్కటి అనుభవాలు జీవితం లో కొన్నున్నా చాలు కదూ!

జాజిపూలు గారు రాసినట్లు నా అంతరాత్మ కూడా డింగుమని ఎగిరొచ్చి మిక్సీ పక్కన కాకున్నా . . . కనీసం కిటికీ అవతలను౦చి తొ౦గి చూసినా బాగుండు. అన్నిరకాల జాజులు కలిపి జాజిపూలు అని పేరుపెట్టుకున్నారుట. ఆ పేరులోని అందమే వేరు. అదేవిటో . . . నాకెప్పుడూ నా అంతరాత్మ ధ్యాసే ఉండదు. ఎప్పుడూ . . . నాక్కూడా కాసేపు నా అంతరాత్మ తో మాట్లాడుకోవాలనిపిస్తోంది . . . అంతరాత్మ ని నిలకడగా ఉంచే ధ్యాసేది? ఇ౦తలోనే నాకు సుభద్ర గారు గుర్తుకొచ్చేశారు. దుబాయ్ లో ఏం షాపింగ్ చేసారో ఏవిటో? బంగారం కొనేసి ఉంటారు. అసలే కేరళ పెళ్ళికూతుళ్ళను చూపించారు. మురళి గారేమొ వివరాలు చెప్పొద్దు అన్నారు . . . మొన్న నెమలిఈకలు చూసాను మురళిగారు . . . అంటే పట్టించుకోలేదు గాని . . . సుభద్ర గారు వివరాలు చెప్పొద్దట . . . ఎందుకబ్బా!!! మురళి గారు అనుభవాలన్నీ ఎ౦తబాగా రాస్తారో! సినిమాల, పుస్తకాల రివ్యూలు చాలా బాగారాస్తారు. నేనూ ఒక సినిమా రివ్యూ రాసాను. ఏ౦ లాభ౦ . . . అట్టర్ ఫ్లాప్. . . :) సునిత గారు రాసిన . . . మీ ఊరినుండి మనుషులు వచ్చారు . . . లో అనుభవాలు తలుచుకు౦టే ఎ౦త బాధనిపి౦చి౦దో. వీళ్ళలాగ అ౦త సున్నిత౦గా రాస్తే నాకు భలే ఇష్టం. తృష్ణ గారు వ్రాసే అనేక అంశాలు కూడా బాగుంటాయి.

ఇలా ఏవేవో ఆలోచించే బదులు మంచి కవిత్వం రాసుకుంటే ఎంత బాగుండు. హాయ్! అనుకుంటూ ఇప్పుడొచ్చిందండోయ్, నా అంతరాత్మ. నాకు టి.వి. కనిపించకుండా...అడ్డంగా టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ తీసి అక్కడ కూచుంది. "ఏవిటీ . . . నువ్వు రాసేది . . . అది పుట్టుకతో ఒచ్చే విద్య. అట్లాంటి పిచ్చి . . . పిచ్చి వేషాలు వేయకు . . . ఉషా, గీతాచార్య, భావన, భాస్కర రామి రెడ్డి గారు, పద్మార్పిత, విశ్వప్రేమికుడు, శ్రీ లలిత గారు, సృజనా రామానుజన్ ...ఇంకా ఎందరో ఉద్ధండులు ఉన్నారు...కనీసం అర్ధం చేసుకొనే శక్తి కూడా లేదు నీకు. అందుకేగా ఎప్పుడూ ఒక్క కామెంట్ కూడా పెట్టలేక, ఆనందంగా చదువుకొని వొచ్చేస్తావ్. నీ చిన్ని తమ్ముడు కార్తీక్ చూడు ఎంతబాగా రాస్తాడో...ముందు వాళ్ళను చూసి నేర్చుకో...నీకేదో కాస్త తెలుగు రాగానే...పండితురాలివనుకోకు. నీకు తెలియని వారు కూడా ఎందరో ఉన్నారు." అని చాలా తీవ్రంగా కసరటం మొదలు పెట్టిందండి. బాబోయ్ , ముందు కొత్తగా వొచ్చిన నా అంతరాత్మ ని తరిమేయక పోతే లాభం లేదు. అమ్మా! తల్లీ! నాకు టి.వి. కనిపించటం లేదు...దయచేసి వెళ్ళిపో...నేను కవిత్వం రాయనులే అని మాటిచ్చి...చాలా తొందరగా అక్కడినుంచి పంపించేసాను.

ఇంక జీవని గారైతే సంఘసేవకే అంకితమైపోయారు. వారు నడిపే విద్యాలయం చిరకాలం వర్ధిల్లాలి. వీలైతే ఒక సారి చూసిరావాలి. సిరిసిరిమువ్వ పేరు ఎంత బాగుందో. అంత మంచిపేరు ఆలోచించటం కూడా కష్టమే...

అవునూ...అంత బాగా బొమ్మలేసే, అబ్రకదబ్రగారు కవిత్వం రాస్తే ఇంకా బాగుంటుంది కదూ ... అని కూడా అనిపించింది. విజయ్ మోహన్ గారు కూడా బొమ్మలు ఎంతబాగా వేస్తారో. వీరు మామూలు వ్యవసాయదారులు కాదు. లలిత గారి, గు౦డె గొల్లుమ౦ది, భలే నవ్వొచ్చి౦దిలే. అమ్మవొడి గారు ఎ౦తబాగా రాస్తారు. బహుశా, ఈవిడ రాయని విషయం అంటూ లేదేమో! శేఖర్ పెదగోపు గారు, ప్రేమ పేరుతొ బ౦దీచేస్తే లో ఎ౦త చక్కటి విశ్లేషణ ఇచ్చారు. లక్ష్మి గారి యాత్రల్లో ఒక్కటన్నా నేను చూసొస్తే బాగుండు. ఏవిటో అన్ని బ్లాగ్ లు తెగ చదివేస్తున్నాను. పీకల దాకా పాతుకుపోయాను. అర్ధమైంది. నేను బ్లాగ్ లు చూడకుండా ఒక్క రోజు కూడా ఇంక ఉండలేను. అసలు శ్రీనిక గారికి ఇన్ని పెళ్ళి కబురులు ఎలా తెలిసాయో! ఒక డాక్టరేట్ ఇయ్యొచ్చు.

ఈ మధ్య చాలా మంది బర్త్ డే లే ఒస్తున్నాయి. కొత్తపాళీ గారి పుట్టిన రోజుకి భావన బ్లాగులో శుభాకాంక్షలు చెప్పాను. వేణు శ్రీకా౦త్ గారిని కూడా విష్ చేసాను. కొత్తబంగారులోకం-తెలుగు కళ గారి చెల్లెలికి కూడా హాపీ బర్త్ డే చెప్పాను. కాని జ్యోతి గారు 'మలక్పేట్ రౌడీ ' గారి పుట్టిన రోజుకి చక్కటి రీమిక్సింగ్ పెట్టినప్పుడు, ఎంతో బాగనిపించినా . . . విష్ చేయాలంటే . . . ఏవిటో భయం వేసింది. ఎందుకులే బతికుంటే బలిసాకు తిని బతకొచ్చు అని అటువైపే పోలేదు. మా అక్క తన బ్లాగ్ లో 'దొంగ గారొచ్చారు ' అని రాసుకున్నప్పుడు . . . అందరికన్నా ముందు ఈ మలక్ పేట్ రౌడీ గారే..'నన్నెవ్వరో పొద్దున్నే తలచుకున్నారు ' అంటూ పలకరించేసారు.

'మనసులో మాట ' సుజాత గారు 'సంస్కార' గురించి ఎంతబాగా రాసారో. ఇలా నేనెప్పటికైనా రాయగలనా...అనుకున్నాను...అకస్మాత్తుగా నా అంతరాత్మ గుర్తుకొచ్చి...ఎక్కడ ధడాల్మని ఒచ్చేస్తుందో...అని ఆ అలోచన అక్కడితో ఆపేసాను. విజయవాడ లో కొత్తపాళీ గారి పుస్తకావిష్కరణ గురించి, ఎస్. ఆర్. రావ్ గారు, చిన్ని గారు ఎంత బాగా వివరించారో...ఈ చిన్ని గారేమో...వాళ్ళవారు ఊరికెల్తేనే దిగులు పడిపోయి కవిత్వం రాసేస్తారు. అయినా ఏమాట కా మాటే లెండి...భలే బాగా రాస్తారు. తన అసలు పేరు చెప్పి కొత్త పాళీ గారికి పరిచయం చేసుకున్నారట. ఆ ఫొటో చూపించమని కొత్తపాళీ గారిని అడగాలి . . . :)

ఈ శిశిర ఏవిటో. . . నా లాగే ఎప్పుడూ . . . ఆ కాలేజ్ తోనే సతమత మయ్యేట్లు౦ది. లీసారే గురి౦చి రాసి౦ది. చాలా అ౦శాలే రాస్తో౦దిలే. హాయిగా చదివేయొచ్చు. ఒక్కసారిగా నా మనసులో కదలాడుతున్న ఈ బ్లాగ్ లన్నీ మాయమై పోయాయి. ఎదురుగుండా టి.వి. లో. . . బ్రేకింగ్ న్యూస్ . . . వొస్తోంది. అయ్య బాబోయ్ . . . హైకోర్ట్ . . . కాలేజ్ శలవలు రద్దు చేసిందట. ఇదెక్కడి గొడవ. ఒక్కసారిగా ఇప్పుడు కాలేజ్ కి వెళ్ళమంటే ఎలా! రేపేమో. . . చలో ఎసెంబ్లీ . . . ఆటోలు, బస్ లు ఉండవు. 144 సెక్షన్ అట. ఫ్లైఓవర్ లన్నీ మూసేస్తారట. హైద్రాబాద్ లోకి బయట ఊరి వాళ్ళని ఎవ్వరినీ రానియ్యరట. యూనివర్సిటీ లో పోలీస్, సైనిక బలగాలు . . . అబ్బో చాలా ఘోరంగా ఉండేటట్లుంది. ఒక పక్క ఐ.జి. అనురాధ ఎవ్వరినీ ఇళ్ళనుంచే బయటకు రావద్దు, మీ పిల్లలని కూడా విద్యాలయాలకు పంపకండి అని చెప్తున్నారు.

అంతా ఒకటే కంఫ్యూజన్. పిల్లలెవరూ రారు. మేము పోయి ఏం చేయాలి. ఎవరన్నా వొచ్చి మా తలలు పగలగొడితే...ఇంతే సంగతులు... ఇంక మిగతా బ్లాగ్ లు తలచు కొనే మూడ్ పూర్తిగా పోయింది. అసలు ఎంత మంది కాలేజ్ కి రాగలుగుతారు. ఏవిటో..ఒకటే గందరగోళం... మా కేమన్నా అయిపోయి...ఇ౦తే స౦గతులు...అయితే మాత్ర౦ నన్ను మర్చిపోక౦డే.... ఎక్కడైనా ఒక కాలేజ్ కనిపిస్తే...నన్ను గుర్తు చేసుకోండేం.


*********************************************************************************

24 కామెంట్‌లు:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

అమ్మో అమ్మో , నన్ను తీసుకెళ్ళి ఏకంగా కవిత్వం వ్రాసే వాళ్ళ సరసన చేర్చేసేరమండి. మనకు తవికలు తప్ప కవితలు రావు. అయినా కనకాంబర ( పూలు కాదండోయ్ )రంగులను కుంచె రెక్కలవెంట జాలువార్చి లిఖించే మీ లేఖనం ముందు మావేపాటివి చెప్పండి. ఓ చిత్రం గీయడానికి మనసులో ఎన్ని భావనలు రేగాలి? మీ సుందర వర్ణచిత్రాల మనసులో మాటలు చెప్పడానికి కవికి భాష సరిపోదు కదండీ.

టపా బాగుంది. నన్ను మర్చిపోనందుకు ధన్యవాదాలు.

Padmarpita చెప్పారు...

ఔరా...ఇది సాద్యమా!!
ఇలా ఎత్తేస్తే మమ్మల్ని...
ఎలా మరిచేది మిమ్మల్ని:):)

మరువం ఉష చెప్పారు...

జయ, ఆనీ సరే గానీ నన్ను కవిత్వం శాఖలో, ఏ రకంగా ఉద్దండుల జాబితాలో ముందు వేసేసారు? :) మరి నా గురువులు, మాస్టార్లు ఏమౌతారు? మీరంతా ఇలా బ్లాగ్ రౌండ్ అప్ ఎలా ఇస్తారబ్బా? మంచి కష్ట సాధ్యమైన పనే సుమీ! అభినందనలు.

cartheek చెప్పారు...

జయక్క మంచి వాళ్లకు ఎప్పుడు మంచే జరుగుతుంది..మనకు ఎటువంటి చెడు జరగదు... అసలు అలా అలోచిన్చద్దు అక్క ....
ఒక రోజు మనం ఒకరికి ఒకరు తారస పడతాము .. నీ చిన్ని తమ్ముడు నువ్వు చూడాలి, మా మంచి అక్కయ్యను నేను చూడాలి...

అగ్గిపుల్ల, కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ , కాదేది కవితకనర్హం అన్నారు మహా కవి శ్రీ శ్రీ .
మీకెందు కలం పట్టండి కవిత్వమదే తన్నుకొస్తుంది....

ఇకపోతే
పద్మర్పిత అక్క కొత్త బ్లాగర్స్ ఎవ్వరినైనా ప్రోత్సహించడంలో ముందుంటారు...
ఎంత బాగా రాస్తారో కవితలు...

మంచు చెప్పారు...

హమ్మో...మీకు చాలా జ్ఞాపకశక్తి వుందే??

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

ఏంటండీ జయగారు ఇది...టపా టైటిల్ చూసి, ఓ రెండు పేరాలు చదివాక ఎందుకో మనసులో కీడు శకించింది నాకు...ఏం జరక్కూడదు అని ముగింపు చదివేవరకు అనుకుంటూనే ఉన్నాను. లక్కీగా నేనూహించింది కాలేదు. ఈ మాత్రానికే మీరిలా భయపడి ఆలోచిస్తే ఎలా? ఏమీకాదు మీకు...దైర్యంగా ఉండండి...బోల్డన్ని పాపాలు చేసే నాయకులే నిండు నూరేళ్ళు ఉంటున్న రోజులివి...ఈ విషయంలో వాళ్ళే మనకు ఆదర్శం.. :-)

శిశిర చెప్పారు...

జయగారు...అయ్యబాబోయ్...ఈ బ్లాగులన్నీ నేనూ చదువుతాను గానీ ఇంతలా గుర్తుంచుకుని రాయడం... నా ఊహకే అందని విషయం. ఒక రెండు, మూడేళ్ళలో నేనూ ప్రయత్నించాలి. :)
ఇంతమంది పెద్ద బ్లాగర్ల మధ్య ఈ చిన్ని బ్లాగరుని కూడా గుర్తుంచుకుని ప్రస్తావించినందుకు బోల్డు ధన్యవాదాలు.

Hima bindu చెప్పారు...

హమ్మో !నేను కూడా కంగారుపడ్డాను శేఖర్ లానే ,యేమికాదు లెండి మీ చిన్ని తమ్ముడు కార్తీక్ చెప్పినట్లు .:):)..బాగా రాసారండి .

మాలా కుమార్ చెప్పారు...

ఏమవుతుంది ? ఏం కాదులే . ఓ నాలుగు రోజులు శెలవ పెట్టేయ్ .
బ్లాగ్ లోకం బాగానే చుట్టావు .

మురళి చెప్పారు...

అనుకోకుండా దొరికిన సెలవుల్లో ఒకటో రెండో పుస్తకాలు చదువుతారనుకున్నా.. (మీ ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉందన్న విషయం మర్చిపోలేదు..) ఇలా బ్లాగులన్నీ చదివి అనాలిసిస్ రాస్తారనుకోలేదు.. రాజకీయ నాయకుల మనుగడకోసం చేస్తున్న పోరాటాల వాళ్ళ సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.. ఇప్పుడు సీన్ తెలంగాణా నుంచి ఆంద్ర కి షిఫ్ట్ అయ్యింది కదా...

మురళి చెప్పారు...

అన్నట్టు 'నెమలి కన్నులు కనిపించాయి' అని మీరు చెప్పినప్పుడు ఎలా స్పందించాలో నాకు అర్ధం కాలేదండీ.. అందుకే అలా...

జయ చెప్పారు...

అయ్యబాబోయ్... రామిరెడ్డి గారు, మీరు రివర్స్ లో వొచ్చేసారేంటి? మీరు ఉపయోగించిన ఈ పదాల్లో ఒక్కటైన ప్రయోగించే శక్తి లేనిదాన్ని. లలితకళల లో ఎక్కువ కాలం నిలిచేది కవిత్వమే అని ఎక్కడో చదివానండి. నా మనసులోని భావనలు బయటికి రావటానికి ఎప్పుడూ తెగ మధనపడిపోతూఉంటాయి. మీ అందమైన రచనలు చదివాక మూగబోతూఉంటై. ఈ విధంగా మిమ్మల్నందరిని తలుచుకుంటే...నాకదే చాలు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

జయ చెప్పారు...

పద్మర్పిత గారు, ఇది ఉన్నమాటేగా. ఎవర్నీ తొందరగా మర్చిపోకూడదు కదూ. అదే మంచి స్నేహం. మీ కవితలే కాదు బొమ్మలు కూడా నాకెంత ఇష్టమో!



ఎంతమాటన్నారు ఉష గారు. మీరు ఉద్ధండుల జాబితా లోకి రారా? అయితే అంతకు మించింది ఇంకేదో ఉండిఉండాలి. అవునా! మీ రచనలు అర్ధం చేసుకునే శక్తే లేని నేను...మీ గురువుల గురించి తెలుసుకోగలనా? నాది చాలా చిన్న ప్రపంచం కదా! మీ మాస్టార్ల గురించి మీరే చెప్పలి...మేం తెలుసుకోవాలి.
ఎప్పుడూ తలుచుకునే వాళ్ళు...అలాగే గుర్తుండి పోతారుకదా! ఇందులో కష్టమేముంది. థాంక్స్.

జయ చెప్పారు...

ఇంత అభిమానించే తమ్ముడున్నప్పుడు నాకేమి కాదులే కార్తీక్. నేను కాస్త పిరికి దాన్ని, అంతే. ఇప్పుడు సీన్ అంధ్రా కి మారిపోయిందని మురళి గారు ధైర్యం చెప్పారుగా. కవిత్వం నేను రాయలేనని నాకర్ధం అయిపోయిందిలే. నా చేతిలో పట్టిన కలం పడిపోతానంటోంది. పర్లేదులే:)




మంచుపల్లకీ గారు, మనల్ని కాకుండా ఎదుటి వాళ్ళను మెచ్చుకున్నప్పుడు జ్ఞాపకశక్తి చాలా బలంగానే ఉంటుంది లెండి. మా గైడ్ ఒకసారి చెప్పారు, మిత్రుల కన్నా శతృవులనే ఎక్కువగా గమనిస్తూ ఉంటాము అని:) అయినా...నా బ్లాగ్ తల్లకిందులయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు...మీరు నా గురించి ఇచ్చిన సమాధానం , సపోర్ట్ మరిచిపోనులెండి.

జయ చెప్పారు...

హాయ్...శేఖర్ గారు, అంత భయపడిపోయారా! నేను కూడా అంతే భయపడిపోయి, చివరిసారిగా...అందరినీ పలకరిద్దామని ఒక చిన్న ప్రయత్నం చేసానన్నమాట. మీ అభిమానానికి ధన్యవాదాలు.


నా దృష్టిలో శిశిర పెద్ద బ్లాగరే. అన్ని బ్లాగులు చదువుతుంటే ...ఏవిటో...అందరితో ప్రత్యక్షంగా కబుర్లేసుకుంటున్నట్లే ఉంటుంది నాకైతే.

జయ చెప్పారు...

అవునండి చిన్ని గారు ఏమి కాలేదు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన రోజులొచ్చినట్లున్నాయ్. జాగ్రత్తండి. మిమ్మల్నందరినీ తలుచుకుంటుంటే ఎంతబాగుంటుందో కదా! ధన్యవాదాలండి.


శలవులు పెట్టాల అక్కా! ఎంతబాగా చెప్తున్నావు. డిసెంబర్ మంత్ అకడమిక్ ఇయర్ లో ఎంతముఖ్యమైందో తెలుసా. నాకెప్పుడూ శలవులు మిగిలిపోతూనే ఉంటై. బ్లాగులన్నీ బాగుంటాయి కదూ.

జయ చెప్పారు...

అలా కొప్పడితే ఎలా మురళిగారు. మంచిమంచి పుస్తకాలు చదవటానికి మీరున్నారుగా. హాయిగా అన్ని బుక్స్ చదివేసి...కొంచెం వివరంగా రివ్యూలు రాసేయండి. అది చాలు కదా నాకు:)

శలవలెక్కడండీ బాబూ! రోజూ ఏవొ మీటింగులు పెడుతూనే ఉన్నారుగా. మిస్ అయిన ఇంటర్నల్ ఎక్జాంస్ ఎప్పుడు పెట్టాలి, మిస్ అయిన వర్కింగ్ డేస్ ఎలా కాంపన్సేట్ చేయాలి అనుకుంటూ...మమ్మల్ని ఇంట్లో ఎక్కడ ఉండనిస్తున్నారు? కాకపోతే కాసేపు ఉండి ఒచ్చేస్తున్నాం అంతే.

ఇటువంటి ఉద్యమాలు ఎక్కడా లేకుండా ఉంటేనే బాగుంటుంది కదండి. అందరూ కలిసి "ఆంధ్రులు" గా కలిసిమెలిసి ఉంటే ఎంత బాగుంటుందో కదా!

అయ్యో నెమలి కన్నులు మీరు పేటెంట్ తీసేసుకున్నారుగా...ఎక్కడ కనపడ్డాయి...ఎలా ఉన్నాయి...చిన్నగా ఉన్నాయా...పెద్దగా ఉన్నాయా...బ్రైట్ గా ఉన్నాయా...డల్ గా ఉన్నాయా...నా కేమన్నా ఇవ్వటానికి వీలవుతుందా? ఇత్యాది వివరాలు కనుక్కోవాలన్నమాట.

సిరిసిరిమువ్వ చెప్పారు...

జయ గారూ, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారా? రేపటినుండి మళ్లీ కాలేజికి వెళ్తారుగా ఇక ఇలాంటి ఆలోచనలు రావు లేండి!

Happy teaching.

జయ చెప్పారు...

సిరిసిరిమువ్వ గారు. ఏం ప్రశాంతమో ఏవిటో...ఆంధ్రా లో మొదలయ్యాయి కదా! దానికి కూడా నాకు టెన్షనే. అయినా మళ్ళీ సోమవరం వరకు కాలేజ్ లు తెరవరట. ఇవాళ వెళ్ళి గోడ ముట్టుకోని తిరుగు టపా లో వొచ్చేసాను.

sreenika చెప్పారు...

హమ్మో...హమ్మో..
ఎంత సాహసం..
ఇన్ని బ్లాగులు చదివేస్తున్నారా?
నాకు డాక్టరేట్ ఇవ్వడమేమిటండి బాబు ?
ఏ తెలుగువాడు చదవలేనన్ని బ్లాగులు
చదివేసినందుకు గాను
మిమ్మల్ని గిన్నిస్ బుక్లో చేర్చెయ్యాల్సిందే...

SRRao చెప్పారు...

జయ గారూ !
మీ బ్లాగులోక సంచారం చాలా బాగుంది.

జయ చెప్పారు...

శ్రీనిక గారు, తప్పదు...మీకు డాక్టరేట్ ఇవ్వాల్సిందే. మీ "పెళ్ళి పుస్తకం" ప్రింట్ చేయిస్తే బాగుంటుంది. నేనంత ఈజీగా గిన్నీస్ బుక్ లోకి ఎక్కను లెండి.


రావ్ గారు, బ్లాగ్ లన్నీ చదువుతుంటే బాగుంటుంది కదూ. మనం చదవాలనే కదా రాసేది. నేనెప్పుడూ ఆశ్చర్య పోతూ ఉంటాను...ఇన్ని రకాల విషయాలు ఎక్కడినుంచి మీరు పోగేస్తారా? అని. మీ దగ్గిర పెద్ద ఆర్క్చాయిస్ ఉందని నా అనుమానం.

తృష్ణ చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
చెప్పాలంటే...... చెప్పారు...

baagaa rasaru tapaa chaakkagaa vundi abhinandanalu

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner