20, డిసెంబర్ 2009, ఆదివారం

కొత్త కోడలు



అత్త, కోడల్ని బాధ పెడుతోందా! లేకపోతే, అత్తే, కోడలి ద్వారా బాధ పడుతోందా! కోడల్ని అత్త బాధ పెడితే చర్య తీసుకోటానికి ఎన్నో చట్టాలున్నాయి. మరి కోడలు అత్తని బాధ పెడితే అత్తకి రక్షణ గా ఏమన్నా చట్టాలున్నాయా?

బాధలు పడుతున్న కోడల్ని మాత్రమే సంఘం గమనిస్తోందా! మరి అత్త, కష్టాలెందుకు గమనించటం లేదు.
అంటే, శక్తి ఉన్న కోడళ్ళు తమ బలాన్ని చూపించుకుంటున్నారా? ముసలి వారైన అత్తలు బలహీనులు కాబట్టి బయట పడటం లేదా? కోడళ్ళు బయట పడ్డంతగా అత్తల కష్టాలు తెలియక ఫోవటానికి కారణ మేంటి? కోడళ్ళు అత్తింటికి రావటం తోటే ఒక ధృఢ మైన ధ్యేయం తోటి ఒస్తున్నారు. రాగానే అత్తని దూరం చేసి, భర్తను కొంగున కట్టి ఆడిస్తున్నారు. కాబట్టి అత్తేమి చేయలేక పోతో౦దని ఒక అభిప్రాయం. కొడుకు మీది అభిమానంతో అత్త అన్ని బాధలు భరిస్తోంది అంటారా!

దీనికి విరుద్ధం గా కోడళ్ళ అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అత్తల పెళ్ళిళ్ళ కాలం నాటి పరిస్థితులు వేరు. వారు ఈ కాలం యువతుల లాగా పూర్తి స్వేచ్చ లో లేరు. ఇప్పటి సౌఖ్యాలు కూడా వారికి అందుబాటులో లేవు. కనుక తన కళ్ళ ముందు కోడలు ఆధునిక జీవితం గడపటం భరించ లేక అసూయ తో సమస్యలు సృస్టిస్తారు అన్నది వారి వాదన.

మరి అత్తా, కోడళ్ళ మధ్య కుమారుని బాధ్యత ఏమన్నా ఉందా? ఇద్దర్నీ పట్టించుకోకుండా అలాగే ఒదిలేయాల? లేకపోతే ఇద్దరి సమన్వయానికి పాటు పడాల్సిన బాధ్యత కుమారునికేమైనా ఉందా? ఇది ఆడవాళ్ళ సమస్య, తనకేమి సంబంధం లేదు అనుకోని, తాను మాత్రం ఇద్దరితో మంచిగా ఉంటే సరిపోతుందా!

ఆడ దానికి ఆడదే శతృవు...అన్న మాట నిజమేనా? ఒకవేళ ఇది నిజమే అయితే అలా అనుకోవటానికి బలమైన కారణాలేమిటి? అత్తా ఒకింటి కోడలేగా! ఒకవేళ తన అత్తతో అభిప్రాయ భేధాలు ఉండి ఉంటే, ఆ అనుభవం తో తన కోడలి పట్ల ప్రేమ, అభిమానాన్ని చూపిస్తున్న అత్తలు కూడా ఉన్నారు. దీన్ని కోడలు అలుసుగా తీసుకొని తానే అజమాయిషీ చేస్తు, అత్తను అవమానిస్తూ ఉంటే...అప్పుడు ఆ అత్త గతి ఏమిటి? అప్పుడు అత్త దగ్గిర, ఇప్పుడు ఈ కోడలి దగ్గిర రెండు వైపులా అసహాయతను ఎదుర్కొన్న వారి పరిస్థితి ఇంక అంతేనా!

ఎన్ని యుగాలు గడిచినా ఈ అత్తా, కోడళ్ళ సమస్య అంతం లేనిదేనా? ఈ సమస్యకు పేదా, గొప్ప అన్న తారతమ్యమే లేదే! దీనికి పరిష్కారమే లేదా? ఆధునిక సంఘం లో చదువుకొని, ఉద్యాగాలు చేస్తున్న అత్తా, కోడళ్ళ మధ్య కూడా ఇంకా కొనసాగుతున్న ఈ సమస్యలకి కట్నమా, స్వార్ధమా, అహంకారమా, భయమా, నిస్సహాయతా, ఆర్ధిక స్వేచ్చా ఏవిటి కారణం?

వీటన్నిటికి అతీత౦గా అత్తా, కోడళ్ళిద్దరూ హాయిగా నవ్వుతూ, తుళ్ళుతూ, స్నేహితుల్లా, ఇద్దరూ కాలేజ్ అమ్మాయిల్లా చెట్టాపట్టాలేస్కోని తిరిగేస్తూ ఉంటే... ఆ ఇంటి మొగవాళ్ళే అది తట్టుకోలేక, కుళ్ళుకునే రోజులొస్తే ఎంత బాగుంటుందో కదూ! ఇలాంటి బ్రమ్హాండమైన మార్పే గనుక ఒస్తే, ఇంక తండ్రీ కొడుకుల మధ్య పోటీ ఒస్తుందేమొ!!!

అసలు ఇన్ని ఆలోచనలు రావటానికి నాకొక కారణం ఉంది. ఇప్పుడే ఈ ఆలోచనలు ఎందుకొచ్చాయి అంటారా! ఉందండి...బలమైన కారణమే ఉంది. రోజూ ఎన్నో రకాల అత్తాకోడళ్ళను చూస్తున్నాను. మరి రేపు నేనెలా ఉంటానో?

కోడల్ని పీడించే అత్త లాగా ఉంటానా?

లేకపోతే కోడలి చేతిలో ఒక నిస్సహాయ అత్త లాగా ఉండి పోతానా?

మావాడు ఇంకా చదువుకుంటున్నాడు. చదువు పూర్తి కావాలి. మంచి ఉద్యోగం దొరకాలి. చక్కటి అమ్మాయి దొరకాలి. అప్పుడు కదా వాడి పెళ్ళి. వాడే అమ్మయిని చూసుకుంటాడో, లేకపోతే నేను చూసే అమ్మాయిని ఇష్టపడతాడో! ఇప్పుడేమి చెప్పలేను కదా! ఒకవేళ వాడే అమ్మాయిని చూసుకుంటే ఏభాష పిల్లో ముందే కనుక్కొని, ఆ భాషకి సంబంధించిన 30 రోజులలో ఫలానా భాష నేర్చుకోండి అనే బుక్ కొనుక్కొని, ఆ భాష నేర్చుకొని, నా కోడలితో స్నేహానికి సిద్ధమై పోదామనే నా కోరిక.

నా దృష్టి లో కోడలు, అత్తా ఇద్దరూ కోడళ్ళే. ఇద్దరి జీవితాలు కొత్త కోడలిగానే మొదలవుతుంది.

అలా ఊహించుకుంటే నా మదిలో మెదిలిన భావాలివి:
కొత్త కోడలు

పుట్టింటి పెరటి నుండి పెకిలింపబడి
అత్తింటి తోటలో నాటబడిన
లేత గులాబి మొక్క కొత్త కోడలు!
కొన్ని మొక్కలు ఎండిపోతాయి ఆదిలోనే!
అనురాగపు నీరు లేక
ఆత్మీయతా బంధం లేక
మరికొన్ని మొక్కలు చచ్చి బ్రతుకుతాయి
బ్రతుకులో నిలదొక్కుకుంటాయి
బ్రతక నేర్చిన మొక్కలు కొన్ని
వసి వాడకుండానే పైకెదిగిపోతాయి
ఎవరెన్ని బాధలు పెట్టినా
భర్త ప్రేమ ఉంటే చాలనుకుంటుంది వెర్రిబాగుల్ది
అతను కలలో రాకుమారుడు కావద్దని
మనీ మనిషి కావద్దని
మామూలు మనిషి గా
అందమైన స్నేహ బంధం తో
తన దరి చేరాలని
ఆ ఆనందానుభూతికై
ఎంతటి త్యాగానికైన సిధ్ధమౌతుంది
ఈ కోడలే ఒక పరిపూర్ణ స్త్రీ!!!

(ఆలాయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి)

ఒక స్త్రీ కి కొండంత అండగా నిలిచేది కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలు. అవి పుష్టిగా పొందిన స్త్రీ అందరికి కల్పతరువే అవుతుంది.
ఏదీ తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి...
బాధల్ని నిన్ను బాధించకుండా సాగిపోనివ్వాలి....
అచ౦చలమైన ధ్రుఢస౦కల్ప౦తో విజయాన్ని సాధి౦చవచ్చు కదూ!!!


************************************************************************************

21 కామెంట్‌లు:

cartheek చెప్పారు...

ఆడ దానికి ఆడదే శతృవు...అన్న మాట నిజమేనా
ఇది చాల వరకు నిజమే అక్క, నెనైయితె పరిపూర్ణంగా ఎకీభవిస్తాను ఈ వాక్యంతొ...

చిన్నది కాబట్టి కచ్చితంగా అత్తను గౌరవించి తీరాలి, అలాగె అత్తా కొదలిని గౌరవించి తీరాలి ఇది సాద్యమవ్వలీ అంటె ఒకె ఒక్క మార్గం "వరకట్నం తీఎసుకొకుండా తన కొదుక్కి వివాహం చెయాలి నెటి.మెటి అత్తలు...

good post for discussion continue
i will be back again.. Any questions on my comment please shoot me with your Questions...

cartheek చెప్పారు...

అక్క! క్షమించాలి పై కామెంట్ లో తప్పులున్నందుకే మళ్లీ రాస్తున్నాను.
"ఆడ దానికి ఆడదే శతృవు...అన్న మాట నిజమేనా?"
ఇది చాలా వరకు నిజమే, నేను ఈ వాక్యంతో ఏకీభవిస్తాను.

ఇక పోతే అత్తా కోడళ్ళు కచ్చితంగా పరస్పర గౌరవభావంతో మెలగాలి.
ఇది సాద్యమవ్వాలి అంటే ఒకే ఒక్క ఒక బ్రహ్మాస్త్రం నేటి మేటి అత్తలు అందరూ కట్నం తీసుకోకుండా తమ కొడుకులకి పెళ్లి చేయాలి..
ఇటు వంటి వాటికి ఒప్పుకోలేని నేటి మేటి అత్తలేవరైనా,కొడుకుని అమ్ముకొని కచ్చితంగా కోడలి కాలు కింద బ్రతకాల్సిందే ఈ రోజుల్లో...

అత్తల కాళ్ళ కింద బ్రతికే కోడళ్ళ రోజులు చాలా వరకు పోయాయి,ఇప్పుడు కోడలి కాలి కింద బ్రతికే అత్తల జాబితా పెరుగిపోతుంది ..
అందుకే ఈ మద్య కొత్తగా " కోడళ్ళ బాధితుల సంఘం " ఒకటి ఆవిర్భవించింది.... అత్తల కోసం.
కట్నం తీసుకునే అత్తలందరూ దీనిలో చేరడానికి సిద్దపడాలి.. తప్పదు మరి.

sunita చెప్పారు...

BaagunnadanDi.

మురళి చెప్పారు...

కే.యెన్. మల్లీశ్వరి రాసిన 'సహయోగం' కథ చదివారా? ఇదే పాయింట్.. బాగుంది మీ టపా..

swapna@kalalaprapancham చెప్పారు...

ఇపుడు పరిస్థితులు అంత తారుమారు అయ్యాయి.
అప్పట్లో ఒక 99% గయ్యాళి అత్తలు ఉంటె ఇపుడు మహా అంటే 1% ఉన్నారేమో అలాగా.
ఇపుడు కోడళ్ళు ఇలా గయ్యల్లగా తగలడ్డారు.
కోడలికి చాకిరీ చేసి పెడుతున్నారు వాళ్ళు మాత్రం దర్జగ్గా కాలు మిద కాలు వేసుకున్తునారు . కుటుంబాలని కూడా విడదీస్తునారు. భర్తని కొంగుకు చుట్టేసుకున్తునారు ఈ మద్య కోడల్లంత.
ఏమి అనలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఈ మద్య అత్తలు. నేను కూడా ఇదవరికి దిని మీదనే ఒక టపా రాసాను.
మా అమ్మ నే ఉంది ఉదాహరణికి.

శిశిర చెప్పారు...

చాలా బాగుంది జయ గారు మీరు తీసుకున్న అంశం. నేననుకోవడం ఇది అత్త, కోడలు అనే బాధవ్యం లేదా హోదాల మధ్య సమస్య కాదు, రెండు వ్యక్తిత్వాల మధ్య సమస్య అని. ఈ బంధం వారి వారి వ్యక్తిత్వం,సంస్కారాల మీద ఆధారపడి ఉంటుందని. ఎందుకంటే కన్న కూతురినే ఒక సో కాల్డ్ అత్తగారిలా సాధించి, రాచి రంపానపెట్టిన స్త్రీని, అలాగే అత్తా కోడళ్ళయినా తల్లీబిడ్డలా అనిపించే ఒక అత్తా కోడళ్ళ జంటనీ చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగాన్నేను.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

అత్త ఎందుకు కోడల్ని సాదిస్తుంది? అని ప్రశ్నించుకుంటే చాలా విషయాలు కనిపిస్తాయి...
౧) ముందుగా చెప్పాల్సింది తనలో మొదలైన అభద్రత గురించి..ప్రతీ అమ్మ తన కొడుకు కోడలి కారణంగా ఎక్కడ తనకు దూరమవుతాడో అన్న అభద్రతకు లోనవుతుంది...ఇది తెలుసుకోకుండా కొడుకు తల్లిని వదిలి పెళ్ళాంతో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతుంటే అభద్రతకు తోడు అసూయ కూడా Add అవుతుంది. నాకు తెలిసి కొడుకు,కోడలు ఆ భావాన్ని తనలో పోగొట్టగలిగితే కొంత వరకు తను మామూలుగానే ఉంటుంది.
౨)పద్దతులు..ఎక్కడో పుట్టి పెరిగిన అమ్మాయి ఇక్కడకు వచ్చి మెట్టినింట తూ.చా తప్పకుండా వీళ్ళవే పాటించాలని కోరుకోవటం...చాలా సమస్యలకు ఇదే పెద్ద కారణం..మీకు తెలుసా పలాన గిన్నె మీద పలానా మూత మాత్రమే పెట్టకపోతే చిందులు తొక్కే అత్తగార్లు కోకొల్లలు..

౩)కొడుకు చాలీ చాలని జీతంతో ఉండి తండ్రి సంపాదన మీద సంసారం లాగిస్తున్నప్పుడు కోడలి మీద విపరీతమైన ఆదిపత్యంని ప్రదర్శించాలనుకోవటం..

ఇంకా చాలానే ఉన్నాయి...

మరి కోడలు అత్తని ఎందుకు సాదిస్తుంది..
౧) తనకు నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వకుండా ప్రతీ దానిలో వేలు పెట్టడానికి అత్తగారు ప్రయత్నించటం..ఇలాంటి చిన్న చిన్న సంఘటనల వల్ల ఏర్పడిన వ్యతిరేక భావనల వల్ల ఆవిడంటేనే ఓ రకమైన చులకన భావం ఏర్పడిపోతుంది.

౨) పుట్టింట్లో ఎటువంటి భాద్యత తెలీకుండా పెరిగిన వారు మెట్టినింట అత్తగారిని భాద్యతగా చూసుకోవల్సిరావటాన్ని భరించలేకపోవటం..

౨) కొంతమంది అత్తగార్లు కోడలితో ప్రతీదానికీ అర్దం పర్ధం లేకుండ పోటీ పడుతుంటారు...

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో...నా పరిశీలనమేరకు ఇవి తెలుసుకున్నాను...నాకు తెలిసి ఇప్పటికీ అత్తగారి వల్ల భాదలు పడుతున్న మహిళల శాతమే ఎక్కువ ఉంటుందనుకుంటున్నా(ముఖ్యంగా మద్య,దిగువ మద్య తరగతి కుటుంబాల్లో)....

శారద చెప్పారు...

ఈ విషయంలో ఇంకా ఏ మాత్రం విశ్లేషించకుండా వదిలేసి ఏకపక్షంగా" కోడళ్ళంతా దుర్మార్గులు" అని నిర్ధారించేసే విషయాలు చాలా వున్నాయి.
అ) కిందటి తరం కోడలికీ ఈ తరం కోడలికీ దైనందిన జీవితంలో మార్పులేమైనా వున్నాయా? ఆనాడు కోడళ్ళు ఎదుర్కొన్న వత్తిళ్ళేమిటి, ఈ నాటి కోడలి మీద వున్న ఎక్స్పెక్టేషన్స్ (ఇంటా బయటా) ఏమిటి? రెండిటికీ తేడాలేమైనా వున్నాయా? నమ్మండి, ఈ విషయం ఆలోచిస్తే కళ్ళు తిరుగుతాయి.

ఆ)అసలు కోడలికీ ఆమె పుట్టింటికీ సంబంధమూ బాంధవ్యామూ ఎలా వున్నాయి? అత్తగార్రింట్లో ఆమె తల్లితండ్రులకీ అన్న దమ్ములకీ దక్కుతున్న మర్యాదా గౌరవాలేలా వున్నాయి? దాన్ని గురిని ఆమె ఆలోచనలేమిటి? ఎందుకంటే కోడలేదో ఆకాశం నించి వూడి పడలేదు కదా. పెళ్ళికి ముందర ఎన్నోయేళ్ళ అనుబంధాలన్నీ వొదులుకుని ఆమే వొచ్చింది. ఆ అనుబంధాలని అత్తవారింట్లో ఎలా గౌరవిస్తున్నారు?
ఇ) కోడుకుల పాత్ర ఏమిటి? పాతికేళ్ళు పెంచి పెద్ద చేసిన తల్లి తండ్రులని కొత్తగా వచ్చిన భార్య "అవమానిస్తుంటే", "తనని కొంగున ముడేసుకోవాలని" చూస్తుంటే అర్ధం చేసుకుని ఆపేంత తెలివితేటలూ చాక చక్యం లేకుండా ఎందుకు ఎలా వున్నారు? "మీ ఆమ్మా నాన్నల్ని ఆశ్రమం లో చేర్పిద్దాం. వాళ్ళిద్దరూ వుంటే నాకు ఇబ్బంది" అన్నప్పుడు దాన్ని అడ్డుకోకుండా నిస్సహాయంగా చూసే కొడుకులని చూస్తే అందరికీ గుండె ద్రవిస్తుందేమో కాని నాకైతే ఒళ్ళు మండుతుంది. అక్కడ కోడలి గయ్యాళితనం కన్నా కొడుకు "ఏ ఎండకా గొడుకు పట్టే" బుధ్ధే బయటపడుతుంది.(ఒట్టేసి చెప్తున్నా, అలాంటి కోడళ్ళని నేను కథల్లో సినిమాల్లో తప్ప ఎక్కడా చూడలేదు, but perhaps I am mistaken!)
ఈ) ఇప్పుడూ ఇరవైల్లో వుండి పెళ్ళి చేసుకుంటున్న అమ్మాయిల సంగతేమో కానీ ఒక ఇరవై యేళ్ళ కింద పెళ్ళి చేసుకుని (ఇప్పుడు నలభైల్లోకొచ్చిన) స్త్రీలూ, (ముఖ్యంగా విద్యాధికులు) కొంచెం ఇబ్బందికరమైన వాతావరణాన్నే ఎదుర్కొన్నారు. మరి ఇప్పుడు ఆ నలభైల్లోకొచ్చిన స్త్రీలే డెభ్భైల్లో కొచ్చిన అత్తా మామల్ని చూసుకుంటున్నారు. మరి వాళ్ళ మానసిక పరిస్థితి ఏమిటి?

అన్ని సమస్యల్లాగే ఈ సమస్యకీ ఎన్నో కోణాలూ ఇంకా ఎన్నో పర్స్పెక్టివ్సూ వున్నాయి. కానీ సాహిత్యం (కథలైనా, సినిమా సాహిత్యమైనా) అన్ని కోణాలనీ విశ్లేషిస్తుందని నాకైతే అనిపించటం లేదు.

caర్తీక్ చెప్పారు...

http://tammunililalu.blogspot.com/

భావన చెప్పారు...

చాలా మంచి టాపిక్ తీసుకున్నారు జయా కాని మీరు ఒక్క బాధ పడుతున్న అత్త గార్ల పక్షం లో రాశేరేమో.. శిశిర అన్నట్లు ఇది రెండు వ్యక్తిత్వాల మధ్య జరిగే అంతః సంఘర్షణ. మీరు రాసిన కవిత చాలా బాగుంది.ఈ నూక్లియర్ కుటుంబాల మధ్య వచ్చే కొత్త కోడళ్ళ అత్త ల బాంధవ్యాలు ఎలా వుంటాయో మనం అత్తల మయ్యే వరకు వేచి చూడాలి. :-) మర్చి పోకుండా అప్పుడు చెప్పుకుందాము మన అనుభవాలు. నేను అదే ఎదురు చూస్తున్నా మనం ఎలా వుంటామా అప్పటికి అని. :-)

జయ చెప్పారు...

కార్తిక్ గారు,
సునిత గారు,
మురళి గారు,
స్వప్న గారు,
శిశిర గారు,
శేఖర్ గారు,
శారద గారు,
భావన గారు,
మీ అందరి స్పందనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

మాలా కుమార్ చెప్పారు...

jaya,

bhavana ,

best of luck .

తృష్ణ చెప్పారు...

"ఒకవేళ వాడే అమ్మాయిని చూసుకుంటే ఏభాష పిల్లో ముందే కనుక్కొని, ఆ భాషకి సంబంధించిన 30 రోజులలో ఫలానా భాష నేర్చుకోండి అనే బుక్ కొనుక్కొని, ఆ భాష నేర్చుకొని, నా కోడలితో స్నేహానికి సిద్ధమై పోదామనే నా కోరిక."
very nice idea...

శ్రీలలిత చెప్పారు...

జయా,
మీరు వ్రాసిన కవిత చాలా బాగుంది. ఇక టాపిక్ చాలా మంచిది తీసుకున్నారు. నాకు తెలిసున్నంతవరకు కుటుంబంలో నైనా, వర్క్ ప్లేస్ లోనైనా, ఆడవాళ్ళైనా, మగ వాళ్ళైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా బలవంతుడు బలహీనుడి మీద అధికారం చలాయిస్తాడు.. అని. కాని బాస్-ఎంప్లాయీ, అత్తా-కోడలూ ఇలాంటి వాళ్ళని ఉదాహరణలుగా ఎందుకు తీసుకున్నారంటే సంఘంలో వాళ్ళిద్దరూ కలిసి మెలిసి సంతోషంగా ఉండలేరు అనే అభిప్రాయం ఏర్పడిపోవడం వల్ల. రోజులు మారుతున్నా, స్వభావాలు మారుతున్నా వాళ్ళిద్దరి మధ్య సయోధ్య ఉండదనే అందరూ అనుకుంటారు. అలాగ మధ్యలో పుల్లలు పెట్టాలనె చాలామంది చూస్తారు. కాని మీ ప్రణాళిక నాకు చాలా నచ్చింది. అదే.. ముఫ్ఫై రోజుల్లో మరో భాష నేర్చుకోవడం. సపోస్..ఫర్ సపోస్.. నేనే మీ ఇద్దరికీ మధ్య గొడవ పెట్టేననుకోండి..అదేనండీ.. మీరే ఎందుకు కోడలి భాష నేర్చుకోవడం... ఆ అమ్మాయే మనింటి కొచ్చింది కనుక మన భాష ఆమే నేర్చుకోవాలి కదా.. అని .. అప్పుడేం చేస్తారు? ( బాబోయ్.. నన్నిప్పుడే తరిమేస్తారేమో.. సర్దా కన్నానండీ బాబూ..)
అన్నింటి కన్న బెస్ట్ సొల్యూషన్ చెప్పనా..
పెళ్ళికి జాతకాలు చూపించేటప్పుడు వధూ వరుల జాతకాలు కాకుండా అత్తా కొడళ్ళ జాతకాలకి పొంతన కుదిరిందో లేదో చూపించుకోవాలన్నమాట.. ఎలా ఉంది అవిడియా...

జయ చెప్పారు...

అక్కా, తృష్ణ గారు, థాంక్యూ

శ్రీ లలిత గారు మీ అయిడియా బాగుందండి. నేనెప్పుడు ఎవ్వరితో పోట్లాడను గాక పొట్లాడను. కాబట్టి మీరేమి గొడవలు పెట్టలేరు లెండి.

cartheek చెప్పారు...

jaya akka nannu kshaminchandni.

జయ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
జయ చెప్పారు...

Leave it Kartik, dosn't matter.

అజ్ఞాత చెప్పారు...

జయ గారు సమస్య అత్త,కొదళ్ళ వల్లె కాదు భర్తల వల్ల కూడా. అంటె, బయత ఎందరికో సమధానం చెప్పే మగవాడు ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళకు సమాధానం చెప్పుకునే చాకచక్యం కలిగి కూడా ఉపయొగించుకోడు. అందుకె సగం గొడవలు మొదలయ్యేది.
మీ బ్లాగులు, ప్రొఫైల్ చూసాను చాల బాగున్నై మీ ఆలోచనలు, భావాలు. మీరు మంచి కోడలని తెలుస్తోంది మంచి అత్తగారు కూడా కాగలరనిపిస్తొంది.నా బ్లాగును చూసినందుకు ధన్యవాదాలు

జయ చెప్పారు...

మనోశ్రీ గారు థాంక్యూ. భర్తలు, తల్లికి భార్యకి ఇవ్వవలసిన ప్రాముఖ్యత సక్రమంగా ఇచ్చినంత కాలం ఏ సమస్యలు రావండి.
నేనేమి మంచి కొడల్ని కాదండొయ్. మా అత్తగారితో నేను చాలనే పొట్లాడుతాను:)

valli చెప్పారు...

నా పేరు వల్లి మేము hyderabad లో వుంటాము మా అమ్మా అన్నయ్యా అందరూ కలిసి ఒకే ఇంట్లో వుంటున్నారు.అత్త కొడళ్లు ఇద్దరికే ఒక్క క్షణం పడదు ఒకరినొకరు దేప్పుకోవడం,ఒకరిమీద ఒకరు పక్కింటి వాళ్లకి చాడీలు చెప్పడం ఆ అమ్మాయికి వాళ్లు మీ అత్తగారు ఇలా అన్నారని చెప్పడం ఆవిడ కోపంతో ఎపనీ చెయ్యక అస్టమానూ పుట్టింటికి వెళ్లడం ఇలా జరుగుతోంది ఈ సమస్యకు పరిష్కారం లేదా

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner