15, డిసెంబర్ 2009, మంగళవారం

'లజ్జ ' ...

'లజ్జ ' - తస్లీమా నస్రిన్

బాంగ్లాదేశ్ లో ఎన్నో పురష్కారలు అందుకున్న తస్లీమా నస్రిన్ , బాంగ్లాదేశ్ లోని మెమైన్ సింగ్ నగరంలో జన్మించి, అక్కడే వైద్యవిద్యనభ్యసించి, డాక్టర్ గా పనిచేశారు.
బాంగ్లాదేశ్ లో జరిగిన మత చాందసత్వం యొక్క వికృతరూపం, మానవత్వాన్ని ఎలా మంట కలుపుతుందో ఈ నవలలో రచయిత్రి వివరించారు. పదమూడు రోజుల్లో జరిగిన అనేక సంఘటనల సమాహార రూపమే ఈ నవల 'లజ్జ '. కేవలం ఏడు రోజులల్లో ఈ నవల పూర్తి చేశారు. అయోధ్యలో 1992, డిసెంబర్ 6 న బాబ్రీ మసీద్ విధ్వంసం జరిగిన వెంటనే ఈ గ్రంధం రాశారు. బాంగ్లాదేశ్ లో అధిక సంఖ్యాకులైన ముస్లిం లు హిందువులని హింసించటం ఇందులోని కాథా వస్తువు. ఇది రాసినందుకే ముస్లిం మత ఛా౦దసవాదులు తస్లీమా నస్రీన్ కు మరణదండన విధిస్తూ 'ఫట్వా ' జారీ చేశారు. 1993 సెప్టెంబర్ లో బాంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ నవలను నిషేధించింది. నస్రీన్ కు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. ఈమెను చంపిన వారికి బహుమతిని కూడా ప్రకటించింది. ఢాకా నగర వీధుల్లో ఈమెకు వ్యతిరేక౦గా ప్రదర్శనలు కూడా జరిగాయి. దీన్ని నిషేధించటానికి ప్రభుత్వం ఇది మత సామరస్యాన్ని చెడగొడుతూ ఉందన్న కుంటిసాకును చూపించింది. "మన లక్షల ప్రాణాలను బలిచేసి పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం సంపాదించుకున్నాం. మత అతివాదానికి మనం దాసోహమంటే ఆ త్యాగాలకు అర్ధమే లేకుండా పోతుంది. నా అందమైన దేశాన్ని కాపాడుకోవటం నా బాధ్యత, నా హక్కుల్ని రక్షించుకోటానికి నాతో సహకరించమని" దేశ ప్రజల్ని కోరుకున్నారు ఈ రచయిత్రి.లౌకిక వాదులు ఒకరి కొకరు చేతులు కలిపి నప్పుడు మాత్రమే మత దురహంకార శక్తుల్ని ఆపటానికి వీలౌతుందని, మత దురహంకార జాడ్యం ప్రపంచమంతా ఉందని, దానికివ్యతిరేకంగా పోరాడాలని వివరించారు.

ఈ నవలలొ కాలక్రమం లోని ఎన్నో సంఘటనలను తీసుకున్నారు. 1947 తరువాత తూర్పు బెంగాల్, పాకిస్తాన్లో భాగమయ్యింది. తూర్పు బెంగాల్ లో బెంగాల్ ను జాతీయ భాషగా మార్చమని ఉద్యమం ప్రారంభమయ్యింది. పాకిస్తాన్ నియంత్రుత్వ పాలనకు వ్యతిరేకంగా తూర్పు పాకిస్తాన్ లో ప్రజల తిరుగుబాటు మొదలయ్యింది. 1971 లో బాంగ్లాదేశ్ స్వతంత్ర దేశం గా అవతరించింది. 1978 లో లౌకిక తత్వాన్ని ప్రధాన సూత్రంగా స్వీకరించిన బాంగ్లాదేశ్ రాజ్యాంగ చట్టంలో మార్పు చేసి, ఇస్లాం ను జాతీయ మతం గా ప్రకటించింది. బాబ్రీ మసీద్ విధ్వంసం కారణం గా బ్లాంగ్లాదేశ్ లో మత కల్లోలాలు చెలరేగి, అల్ప సంఖ్యాక మతస్తుల మీద విపరీతమైన దౌర్జన్య కాండ మొదలైంది. ఆ దౌర్జన్య కాండే, ఈ నవల లోని ప్రధాన కథ.

ఇది నవల కాబట్టి ఇందులోని పాత్రలన్నీ కేవలం కల్పితాలు అని రచయిత్రి చెప్పినప్పటికీ, అక్కడ జరిగిన ప్రత్యక్ష దౌర్జన్య మారణ హోమానికి ఇందులోని పాత్రలు ఉదాహరణలే. ఈ కథ ప్రధానంగా, బాంగ్లా దేశ్ లో పుట్టి పెరిగిన ఒక హిందూ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. డా. సుధామయ్ దత్, అతని భార్య కిరణ్మయి, వారి పిల్లలు సురంజన్, మాయా, మొమైన్ సింగ్ నగరం నుంచి బాంగ్లాదేశ్, పాకిస్తాన్ పోరాట సమయంలో, ఎందరో హిందువులు భారత దేశం వలస పోయినప్పటికి జన్మ భూమి మీది ప్రేమతో దేశ రాజధాని ఢాకాకి తన ఆస్తులను తెగనమ్ముకొని వొచ్చి ఇక్కడే స్తిరపడుతాడు. చుట్టూ ఉన్న అనేక పేద ముస్లిం సోదరులకు ఉచిత వైద్యం కూడా చేస్తూ ఉంటాడు.వీరికి ఎందరో ముస్లిం స్నేహితులు కూడా ఉన్నారు. కిరణ్మయి కి సంగీతమంటే చాలా ప్రేమ. భర్త ప్రోత్సాహం తో నేర్చుకొని ప్రోగ్రాములు కూడా ఇచ్చేది. కాని ముస్లిం లు ఈమె వేదికల మీద పాడటం నిరసిస్తూ, ముస్లిం స్త్రీలను కూడా మార్చేస్తుందని తీవ్రంగా విమర్శిస్తారు. దానితో కిరణ్మయి తనకి ఎంతో ఇష్టమైన సంగీతాన్ని ఒదిలేసి ఇంట్లోనే ఉండిపోతుంది. కొడుకు సురంజన్ కి ఏ మతం మీదా నమ్మకం లేదు. పూర్తి అభ్యుదయవాదాలు కలవాడు. ఎం.ఎస్.సి. చదివినప్పటికీ కేవలం హిందువు అనే కారణం తో ఇతని కన్న తక్కువ చదివిన వారికి ఉద్యోగాలు లభిస్తాయి కాని ఇతనికి చిన్న ఉద్యోగం కూడా లభించదు. ముస్లిం యువతి పర్వీన్ ను ప్రేమిస్తాడు. కాని మతం మార్చుకుంటేనే ఆమె పెద్దలు వివాహానికి అంగీకరిస్తారు. మతం మీద ఆధార పడిన వివాహం తనకి వొద్దని అంగీకరించడు. ఇతని చెల్లెలు ట్యూషన్ ల ద్వారాకొంత డబ్బుని సంపాదించుకుంటూ ఉంటుంది. అవసరమైనప్పుడు అన్నకు సహాయం చేస్తూ ఉంటుంది.

మాయకి, భారత దేశ విభజన, 1971 బంగ్లాదేశ విభజన, అంతకు ముందు జరిగిన అల్లరులు ఏవి ఆమెకి తెలియదు. ఆవిడకు బుద్ధి తెలిశాక అర్ధమయిందల్లా, బాంగ్లాదేశ్ లో అధికార మతం ఇస్లాం అని, తాము అల్పసంఖ్యాకులైన హిందువులని, కాబట్టి తాము ఆ దేశం లోని వ్యవస్తతో తరచుగా సర్దుబాట్లు చేసుకోక తప్పదని. ఆమె వయసు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. 1990 లో జరిగిన అల్లరులు ఆమెకి తెలుసు. తన ప్రాణాన్ని రక్షించుకోవాల్సిన జ్ఞానాని ఇచ్చింది. బాబ్రీ మసీదు కారణం గా ఢాకాలొ తీవ్రమైన అల్లరులు చెలరేగాయి. ఇప్పటి ఈ గొడవాలతో హిందువులు గుంపులు గుంపులు గా భారత దేశానికి పారిపోతున్నారు. కాని సుధామయ్ మనసు అందుకు అంగీకరించలేదు. మాయ తన కుటుంబమంతా కూడా ముస్లిం స్నేహితుల దగ్గిర తలదాచుకుందామని అడుగుతుంది. దానికి కూడా అంగీకరించడు. సురంజన్ ఏమైనా దారిచూపిస్తాడేమో అని ఎదురుచూస్తుంది. కాని అతనిలో కూడా చలనం లేక పోవటం తో తాను మాత్రమే ముస్లిం స్నేహితుల ఇంటికి వెళ్ళిపోతుంది. త౦డ్రికి పక్షవాత౦ రావట౦తో, తన రక్షణ మరచి, త౦డ్రి కోస౦ ఇ౦టికి ఒచ్చేస్తు౦ది.

సురంజన్ తన మిత్రులందరి ఇళ్ళకి తిరుగుతూ వాళ్ళను పరామర్శిస్తూ ఉంటాడు. దారిలో జరుగుతున్న ఎన్నో విధ్వంస కాండలు గమనిస్తూ ఉంటాడు. ఢాకా లో ఉన్న దేవాలయాలు నేల మట్టం అయిపోయాయి. హిందువుల ఆస్థులు కొల్లగొట్టారు. స్త్రీలను ఎత్తుకు పోతున్నారు. ఊరంతా శిధిలాలతో నిండి పోయింది. కొంతమంది హిందువులు మాత్రం వాళ్ళ ముస్లిం స్నేహితుల ఇళ్ళల్లో రహస్యంగా తలదాచుకుంటున్నారు.

ఇవన్నీ గమనించిన సురంజన్ తీవ్ర మైన ఆవేశానికి లోనౌతాడు. "ఒక మసీదును కూలదోస్తే వారికంత కోపం వొచ్చింది కదా, దేవాలయాలను కూలదోస్తే హిందువులకు కోపం ఒస్తుందని వారికి అర్ధం కాదా! వందలాది దేవాలయాలు కూల దోయాలా! ఇస్లాం మతం శాంతిని కాదా బోధించేది?" అని ఈ ముస్లిం రచయిత్రి సురంజన్ తోటి ధైర్యంగా పలికించింది.

ఇంట్లో తినటానికి కూడా ఏమి లేక, భర్త ఆరోగ్యం ఉన్నట్లుండి పాడైపోయినా, ఇల్లు ఒదిలిపోలేని నిస్సహాయ స్థితిలో " ముస్లిం లకు మాత్రమే బాధపడే హక్కు, కోపం తెచ్చుకునే హక్కులున్నాయా?" అని కిరణ్మయి తోటి అనిపించ గలిగింది ఈ రచయిత్రి. ఊరందరినీ పరామర్శిస్తూ తిరిగే సురంజన్ ఒక రోజు తన ఇంట్లోనే విధ్వంసాన్ని చూస్తాడు. చెల్లి ఇంట్లో లేక పోవటాన్ని గమనిస్తాడు. ఏ౦ జరిగి౦దో ఊహి౦చి, తీవ్రమనస్తాపంతో జీవాచ్చవాల్లా పడి ఉన్న తల్లితండ్రులని ఓదార్చలేక పోతాడు. మానసిక క్షోభతో తానుకూడా మతదురహంకారిగా, విప్లవవాదిగా మారిపోయి ముస్లింల అంతం చూడాలని నిర్ణయించుకుంటాడు. చివరికి ఈ కుటు౦బ నిర్ణయ౦ ఏవిటి?

ఈ రచయిత్రి కొన్నిఇతర విమర్శలను కూడా గుప్పించింది. బాబ్రీ మసీద్ ధ్వంసం కన్నా ముందుగానే బాంగ్లాదేశ్ లో హిందువులను హింసించటం మొదలయింది, కాని వీళ్ళు బాంగ్లాదేశ్ ని మతసామరస్య దేశమని నమ్ముతారు. అది నిజ౦ కాదని, హి౦దువుల విధ్వ౦సాన్ని, లెఖ్ఖలేనన్ని ఉదాహరణలతో ఈ నవలలోనే వరుస పెట్టి చూపించింది.

టి.వీల్లో దేవాలయాల విధ్వ౦స౦ చూపి౦చకపోవట౦ తీవ్ర౦గా వ్యతిరేకి౦చి౦ది. భారతదేశ౦లో ఎన్నో మతకలహాలు జరిగినప్పటికీ, ముస్లి౦లు, దేశ౦ ఒదిలిపోలేదు. అదే బా౦గ్లాదేశ్ లో హి౦దువులు పారిపోతున్నారని తీవ్ర౦గా విమర్శి౦చి౦ది. బ౦గ్లాదేశ్ ను౦చి వెళ్ళిపోయిన హి౦దువుల ఆస్థిని "శత్రువుల ఆస్థిగా" ప్రకటి౦చి ప్రభుత్వ౦ ఆక్రమి౦చి౦ది. అదే భారత దేశ౦లో ప్రభుత్వ౦ కనీస౦ ఆ భూములను సర్వే కూడా చేయి౦చలేదు, అని రె౦డు దేశాల మధ్య ఉన్న లౌకికత్వాన్ని ఎత్తి చూపి౦చి౦ది.

బాంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారతదేశం లోని ముస్లిం ల కోసం మత సామరస్యాన్ని వహించమని ప్రజలని కోరి౦ది. అదే బంగ్లాదేశ్ లో పౌరులైన హిందువుల క్షేమం గురించిన ఆలోచన లేదా? భారత దేశం లోని ముస్లింల గురించి ఎందుకు ఆందోళన? ఎంతో గుండెధైర్యంతో ప్రశ్నించగలిగింది ఈ రచయిత్రి.

ఈ నవలకు ఒక ముగింపు, సస్పెన్స్, కొసమెరుపులంటూ ఏమి లేవు. మొదట ఎలా ప్రారంభమవుతుందో, చివరివరకు అలాగే కొనసాగుతుంది. ఇంకా ఎన్నో పాత్రలు బాంగ్లాదేశ్ లో హిందువులనుభవించిన కడగండ్లకు ఉదాహరణగా మన కళ్ళ ముందు నిలుస్తాయి. అలా చదువుకుంటూ వెళ్ళిపోవాల్సిందే.

అడుగడుగునా ఈ రచయిత్రి తెలిపిన నగ్నసత్యాలే చివరికి ఈమెని తన మాతృభూమి నుంచి ప్రాణాలరచేతబట్టుకొని భారతదేశం పారిపోయేలా చేసింది. భారతదేశం లోని ముస్లిం లు కూడా ఈమెని చాలా తీవ్రంగా అవమానించారు. చివరికి భారత దేశం కూడా వొదిలివేయవలసివొచ్చింది. రహస్యజీవనాన్ని గడపవలసిన అగత్యం ఏర్పడింది. ప్రస్తుతం ఈ రచయిత్రి ఎక్కడెక్కడో ఉన్నట్లుగా చెప్తారు కాని, నిజానికి ఎక్కడుందో సరి అయిన ఆధారాలు మాత్రం లేవు. మతసామరస్య౦ కోస౦ పోరాడితే ఇదా ఫలిత౦!

ఈ గ్ర౦ధాన్ని భారత ఉపఖ౦డ౦ లోని ప్రజలకి అ౦కిత౦ చేసి౦ది ఈ రచయిత్రి. మత అతివాదానికి లోనుకావద్దని వేడుకు౦టు౦ది. "లజ్జ" మన సామూహిక పరాజయానికి ఒక సాక్ష్య౦.

వల్ల౦పాటి వె౦కటసుబ్బయ్య దీనిని తెలుగు లో అనువది౦చారు.
దీని వెల రూ. 80, విశాలా౦ధ్ర పబ్లిషి౦గ్ హౌజ్, హైదరాబాద్ లో ప్రతులు లభ్యమవుతాయి.
2008 లో, 1000 ప్రతులను మాత్రమే ముద్రి౦చారు.


**********************************************************************************************

21 వ్యాఖ్యలు:

Praveen Communications చెప్పారు...

http://blogzine.sahityaavalokanam.gen.in/2009/12/blog-post_08.html

Praveen Communications చెప్పారు...

దీనినే గతితార్కిక ముస్లిం వాదం అంటారు. వృత్తి రిత్యా మేము అన్ని ఊర్లు తిరగడం ఆశ్చర్య కరం కాదు. కాని మాకు పదహారు వందల కిలోమీటర్ల దూరం లో బంగ్లాదేశ్ లో జరిగిన విషయాల వల్ల నాకేం వోరగదు. ఎబివిపి గూండాల కన్నా ముస్లిం చాందస వాదులేమి చెడ్డవారు కాదు. వారు కూడా వెళ్ళిపోగానే షాపులు తెరవచ్చు

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

సెలవులను చాలా చక్కగా వాడుకుంటున్నట్టున్నారు...ఆ మధ్య తస్లీమా హైదరాబాద్ వచ్చినప్పుడు చాలా గొడవలు కూడా జరిగాయి. బాగా రాసారు.

sunita చెప్పారు...

చాలా చక్కటి సమీక్ష వ్రాసారు. దగ్గర దగ్గర ఓ పది సంవత్సరాల క్రితం ఈ పుస్తకం నేను ఇంగిలీషులోనే చదివానండి. తెలుగు అనువాదం ఉన్నట్లు తెలియదు. ఇప్పటికీ ఏదైనా పార్టీలో చేపలు, పప్పు కూర మెను లో ఉంటే నాకు లజ్జ లో అమ్మాయిని అపహరించినప్పుడు ఆమె చేతిలో తండ్రికోసమని కలిపిన పప్పూ చేపల ఆహారం గుర్తుకోస్తుంది. ఎందుకంటే ఆ ఆహారం తాలూకా గుర్తులు అన్నకు పట్టిస్తాయి. చెల్లి ఇంట్లో లేదని. మంచి పుస్త్కం గుర్తు చేసారు. ధన్యవాదాలు.

cartheek చెప్పారు...

హు... అంతే అక్క నిజం నిర్భయంగా రాస్తే ఏ దేశంలోనైనా ఇదే శిక్ష విదిస్తారు..
మన దేశం అయినా అంతే మరి....

Kalpana Rentala చెప్పారు...

జయా,

మంచి పుస్తకాన్ని సమీక్షించారు. కాని ఒక చిన్న ప్రశ్న, వల్లంపాటి తెలుగు అనువాదం నేను చదవలేదు కాని ఇంగ్లీష్ పుస్తకం లో పాత్రల సంఘటనలు ముందుకు వెనక్కు వెళుతూ కొంచెం ఇబ్బంది పెట్టలేదా? సైలి గురించికాదు...సంఘటనల గురించి..నెను చదివి చాల కాలమైంది. అలా వున్నట్లు నాకు గుర్తు. లేకపోతే నేనే సరిగ్గ చదవలేదేమొ మరి... What do you say?

శిశిర చెప్పారు...

ఈ మధ్యనే ఈ పుస్తకం కొన్నాను. ఇంకా చదవడం మొదలుపెట్టలేదు. మీ సమీక్ష చదివాక తొందరగా ఆ పుస్తకం చదవాలనిపిస్తూంది.

జయ చెప్పారు...

ప్రవీన్ గారు. థాంక్యూ. మీరు ఇచ్చిన లింక్ చూసానండి. మంచి విశ్లేషణ. ఏవిటో నండి. ఇవన్ని ఎన్నో రకాల సమస్యలు.


శేఖర్ గారు థాంక్యూ. ఏ మతమైనా, స్త్రీలను అలా అవమానిస్తుంటే, బాధగా అనిపిస్తుంది. ఎప్పుడైనా, సంస్కారానికి పెద్ద పీటే వేయాలి కదండి. అప్పుడు చూసిన టి.వి. న్యూస్ క్లిప్పింగ్స్ ఇప్పటికీ నాకు కళ్ళకు కట్టినట్లే ఉందండి.

జయ చెప్పారు...

సునిత గారు ధన్యవాదాలు. తెలుగు అనువాదం సంవత్సరం క్రితం వొచ్చింది. అవునండి, మాయను తలుచుకుంటే, ఒక అసహాయ స్త్రీ, తన భద్రత కూడా ఒదిలి తన కుటుంబం కోసం వొచ్చి అలా బలవటం మనసును మెలిపెట్టేస్తుంది. తనని రక్షించ లేని తండ్రికి సేవలు చేసుకున్న ఆమె త్యాగం చాలా గొప్పది. తనకి ఏమాత్రం పనికి రాని అన్నకి ఎన్నో విధాల తన సహకారాన్ని అందించింది. స్త్రీ నిస్వార్ధ వ్యక్తిత్వానికి ఆమె ప్రతీక. ఒక సామాన్య స్త్రీ.

జయ చెప్పారు...

కార్తీక్ థాంక్యూ. యుగాలు గడిచినా "స్వచ్చ" మైన సంఘం మాత్రం కనిపించటం లేదు.


కల్పన గారు ధన్యవాదాలండి. ఈ పుస్తకం చివరి వరకు ఏకబిగిన చదివిస్తుంది. కాక పోతే రచయిత్రి వరుసపెట్టి ఎన్నో ఉదాహరణలను పొందుపరుస్తూ పోవటం తో, అవి కొంత తికమక పెడతాయి. మధ్యలో అప్పుడప్పుడూ కొంత ఫ్లాష్ బాక్ కూడా చోటు చేసుకోవటం తో కొంచెం కన్ ఫ్యూజన్ కలుగుతుంది. తెలుగు వర్షన్ లో ఎటువంటి మార్పులు చేయకుండా యధాతధం గా అనువదించారు.

జయ చెప్పారు...

ఫరువాలేదులే శిశిర, నేను చదివింది కూడా ఇప్పుడే. ఇంతకాలం అబ్బా! ఈ మత కలహాలు ఏం చదువుతాం లే అని పెద్దగా పట్టించుకోలేదు. కాని, ముఖ్యంగా ఈ రచయిత్రి మీద ఒచ్చిన విమర్శలు నన్ను ఈ బుక్ చదివించాయి. ఇంకేం బుక్ ఉందిగా, చదివేసేయండి.

మురళి చెప్పారు...

పుస్తకం చదువుతున్నాం అనిపించదు.. ఒక డాక్యుమెంటరీ చూస్తున్న భావన కలుగుతుంది.. బాగుందండీ పరిచయం..

SATHYA చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
జయ చెప్పారు...

అవునండి మురళి గారు, నాకయితే ఎన్నో నిజ జీవితాలే కళ్ళముందు కదలాడాయి. థాంక్యూ.

భావన చెప్పారు...

మంచి పరిచయం. నేను తెలుగు లో చదవలేదు.. ఇంగ్లీష్ లో చదివేను..కొంచెం డాక్యుమెంటరీ లా వుంటుంది కాని చదివేక కూడా హాంట్ చేస్తూనే వుంటాయి ఆ అనుభవాలు మనవి కాక పోయినా. మంచి పరిచయం బాగా వివరించారు.

జయ చెప్పారు...

ఎవరి అనుభవాలైన అవి మనసును హత్తుకుంటాయి కదా భావనా. నిజమే, డాక్యుమెంటరీ లాగానే ఉంటుంది. కాని అంత సమాచారం ఇంకెక్కడా కూడా దొరకదు. ఈ రచన తరువాతనే బాంగ్లాదేశ్ ప్రభుత్వం తస్లీమ చూపించిన గవర్నమెంట్ రికార్డుల ఆధారాలన్నీ తగులపెట్టేసిందిట.

మాలా కుమార్ చెప్పారు...

నేను బోర్ గా వుంటుందేమోనని చదవలేదు . నువ్వు వ్రాసాక చదవాలనిపిస్తోంది .
బంగ్లాదేశ్ లో ఇబ్బంది పడిన హిందూ కుటుంబాల వారిని , సిలీగురి లో వుండగా కలిసాను . వారిది ఒక్కొక్కరిది ఒక్కో గాధ ! ముఖ్యముగా అక్కడి గుండాల నుండి తప్పించుకొని వచ్చిన అమ్మాయిల గాధ మరీ హృదయ విదారకము . అవన్నీ గుర్తొచ్చాయి .

సవ్వడి చెప్పారు...

జయ గారు ఒక నవల గురించి పూర్తి అవగాహన కల్పించారు. బంగ్లాదేష్ లో హిందువులపై అల్లర్లు జరుగుతున్నాయని నేను పేపర్లో చాలా సార్లు చదివాను కాని ఇంత ఘోరంగా అని తెలీదు. దీన్ని ఆపే నాధుడే లేడా అనిపిస్తుంది. నిజానికి ఈ కథ చదవాలని అనుకున్నాను కాని ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నాను. అంత దారుణంగా ఉంటే నేను చదవలేను.

జయ చెప్పారు...

సవ్వడి గారు, మీరు చెప్పింది నిజం. ఇంతకాలం నేను ఈ నవల చదవలేక పోవటానికి కారణం, మీరు చెప్పిందే. థాంక్యూ. అయినా సరే, అన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఇతరుల అనుభవిస్తున్న వివిధ సమస్యలు తెలుసుకుంటేనే, దానికి తగ్గట్లు ప్రతిస్పందిస్తేనే అసలైన జీవితం అన్నది నా అభిప్రాయం.

తృష్ణ చెప్పారు...

చాలా బాగా రాసారు. నేనీ పుస్తకం చదవలేదు కానీ మీ పరిచయం బాగుందండీ. మరిన్ని మంచి రివ్యూస్ కోసం ఎదురు చూస్తాం....

జయ చెప్పారు...

థాంక్యూ తృష్ణా.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner